ఎమ్బీయస్‌: గోడ్సే-36 ‘నైన్‌ అవర్స్‌ టు రామా’6

సాయంత్రం 4.30 గం|| గుప్తా మందిరం చేరడానికి ముందే పోలీసు నాథూ ఎక్కిన టాక్సీని ఆపాడు. 'వాహనాలు వెళ్లనీయటం లేదండి, దిగి నడవాల్సిందే' అన్నాడు. నాథూ నడుస్తూ మందిరం వైపు కాకుండా భవనం వైపు…

సాయంత్రం 4.30 గం|| గుప్తా మందిరం చేరడానికి ముందే పోలీసు నాథూ ఎక్కిన టాక్సీని ఆపాడు. 'వాహనాలు వెళ్లనీయటం లేదండి, దిగి నడవాల్సిందే' అన్నాడు. నాథూ నడుస్తూ మందిరం వైపు కాకుండా భవనం వైపు వెళ్లాడు. అక్కడ అప్పుడే ప్రజలంతా పోగవుతున్నారు. తోటలోకి అడుగుపెట్టగానే నాథూకి సడన్‌గా అప్పటిదాకా వున్న నెర్వస్‌నెస్‌ పోయింది. పొద్దుటి నుంచి ఏ తలుపు తీసినా, ఏ సందు మలుపు తిరిగినా తుపాకీతో పోలీసు ఎదురుపడతాడని వూహిస్తూ వచ్చాడు. ఏ ఉపద్రవం లేకుండా అడంగుకి చేరాడు. గుప్తా భవన్‌ పోర్టికోను తన కళ్లతో చూస్తున్నాడు. 

అతని చూపు సింహద్వారంపై పడింది. తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి పని కానిచ్చేద్దామన్నంత ఉద్రేకం కలిగింది. వద్దు, తన పోర్షన్‌ వచ్చేవరకూ పాత్రధారి వింగ్స్‌లో వేచి వుండాలి అని తనకు తానే చెప్పుకున్నాడు. సర్వంట్‌ క్వార్టర్స్‌ వైపు నడిచాడు. తమకు ఆశ్రయం యిస్తానతని యింట్లోకి తలుపు తట్టకుండానే ప్రవేశించాడు. లోపలున్న ఆప్టే ఎగిరి గంతేశాడు ''నువ్వు క్షేమంగా వున్నావు కదా'' అంటూ. ''ఎందుకుండను?'' అంటూ చికాకుపడ్డాడు నాథూ. తోటమాలి భార్య పెట్టిన టీ తాగుతూ యిద్దరూ కిటికీ దగ్గరకు వచ్చి గాంధీ నడిచి వచ్చే కాలిదారి కేసి చూపు సారించారు.

''ఎంతమంది వున్నారో చూశావా, నాథూ. నాకు భయం వేస్తోంది. వీళ్లంతా మనమీద విరుచుకుపడి ఏ కీలుకా కీలు విరిచేయరూ?'' అన్నాడు ఆప్టే. అతని భయాన్ని గమనించిన నాథూ తుపాకీని అతని పొట్టకు ఒత్తిపెట్టి 'ధైర్యం తెచ్చుకో, లేకపోతే యిది పేలుతుంది' అని బెదిరించాడు. 'ఆ పని చేసేయ్‌, వాళ్ల చేతిలో చావడం కంటె నీ చేతిలో చావడం మేలు' అన్నాడు ఆప్టే దీనంగా. 'నాకు ధైర్యం చాలటం లేదు, నేను నీతో రాలేను. నువ్వు కూడా వెళ్లవద్దంటున్నాను.' అని కూడా అన్నాడు. 

'నువ్వు తప్పించుకోలేవు. కాటక్‌ నిన్ను చీరేస్తాడు' బెదిరించాడు నాథూ. 'నువ్వు నన్ను అసహ్యించుకోకుండా వుంటే అంతే చాలు. అందరూ గాంధీని ఋషితుల్యుడంటున్నారు. మనం చేస్తున్నది తప్పేమో అని సందేహం వస్తోంది, నాథూ, నువ్వూ ఒక్కసారి ఆలోచించి చూడు.' బతిమాలుతున్నాడు ఆప్టే. నాథూకి విపరీతమైన అసహ్యం వేసింది. ఆప్టేను చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ సెంటిమెంటు అడ్డం వచ్చింది. రాణీని చంపడానికీ యిదే సెంటిమెంటు అడ్డుపడింది. అతన్ని అక్కడ వదిలేసి గదిలోంచి బయటకు నడిచాడు. 

xxxxxxxxxxxxxxxx

సాయంత్రం 4.50 గం|| గుప్తా భవన్‌లో పికె ఎంత బతిమాలుతున్నా గాంధీ వినటం లేదు. ''ఏ వివాదాన్నయినా పరిష్కరించగలిగేవి సత్యాహింసలేనని మనం ఉపదేశిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఆచరణలో పెట్టి చూపాలి'' అని చెపుతున్నారు. ఈ వితండ వాదనను పావుగంట నుంచి వినివిని పికె తల వాచిపోయింది. తను ఏం మాట్లాడినా గాంధీ పార్టీని మూసేయడం దగ్గరకే వస్తున్నారు. తన ప్రాణం కాపాడుకోవడం గురించి ఆలోచించడమే లేదు. ఈయన ఆరోపణలు, ఎత్తిపొడుపులు వినలేక పోతున్నమాట నిజమే అయినా గాంధీకి ఏమైనా జరిగితే అన్న ఆలోచనే భయంగా వుంది.

''ఇప్పటికే ఆలస్యమై పోయింది'' అంటూ గాంధీ లేచారు. ఆయనకు సహాయం చేయడానికి యిద్దరు మనవరాళ్లు ముందుకు వచ్చారు. వాళ్ల భుజాల మీద చేతులు వేసి ఆయన ముందుకు నడిచాడు. 

పికె రావడం, లోపల సంప్రదింపులు సాగడం బయట వున్న దాస్‌ గమనించాడు. పికె మళ్లీ వచ్చాడంటే యివాళ్టి దాడి గురించి ఆయనకేదో సంకేతం వచ్చి వుంటుందని గ్రహించాడు. గాంధీకి ఎదురుగా వెళ్లి మళ్లీ ప్రయత్నించాడు ''బాపూ, బయటకు వెళ్లకండి'' అన్నాడు. ''మనం దాని గురించి చర్చ ముగించాం కదా, నాయనా'' అంటూ గాంధీ మెట్లు దిగాడు. విషయం గ్రహించిన గుప్తా కూడా అడ్డుపడబోయాడు, కానీ లాభం లేకపోయింది. ఎవరేం చెప్పినా ఆయన యీ దుర్బలదేహానికి యింత విలువ యివ్వడం దేనికి? సత్యాహింసలే మనకు ఎల్లకాలం దారి చూపి నడిపిస్తాయి అంటున్నాడు. మీరుండి మాకు ఆ వైపు దారి చూపాలి అని వీరంటూ వుంటే నేను ఎల్లకాలం వుండబోతానా? మీ అంతట మీరే ఆ మార్గం వెతుక్కోవాలి అంటూ ముందుకు నడిచాడు.

xxxxxxxxxxxxxxxx

సాయంత్రం 5.00 గం|| కాలిదారిలో గాంధీకోసం వేచి వున్న నాథూ అసహనంగా వున్నాడు. ఇంకా బయటకు రాడేం? తమ పథకం గురించి తెలిసిపోయిందా? లేక లోపల గాంధీ సహజంగానే మరణించాడా? 'అదే జరిగితే తనకు చింతే లేదు. ఇక్కణ్నుంచి యిటే పరుగు పెట్టి రాణి గదికి చేరతాడు, తన చేతుల మీదుగా ఏ పాతకమూ జరగలేదని చెప్తాడు. ఆమె సంతోషిస్తుంది, గురూజీకి నచ్చచెప్పి తను సంఘంలోంచి బయటకు వచ్చేస్తాడు, రాణిని పెళ్లాడతాడు.' 

నాథూ ఆశ భగ్నమైంది. పోర్టికోలో గాంధీ కనబడ్డాడు. ఆయన్ను చూడడానికి ప్రజలు ముందుకుముందుకు తోసుకుని వస్తున్నారు. నాథూ తుపాకీ లోపలినుంచి తీసి తన అరచేతుల మధ్య బిగించుకున్నాడు. చిన్నప్పుడు తను సైన్యంలో చేరాలని యింట్లోంచి పారిపోయాడు. వాళ్లు చేర్చుకోవడానికి నిరాకరించడంతో మళ్లీ యింటికి వెళ్లాల్సి వచ్చింది. తండ్రికి కోపం వచ్చింది. ఇంట్లోకి రానివ్వనన్నాడు. అప్పుడు తను సింహగఢ్‌ కోటకు వెళ్లాడు. ఎత్తయిన బురుజు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఆ రోజు కొండ చివర నిలబడినప్పుడు ఎలాటి అనుభూతులు కలిగాయో, యిప్పుడూ అలాటివే కలిగాయి. 

అడుగు ముందుకు వేశాడు. గాంధీ మొహంలో ముస్లిములను ప్రేమించే దయ్యం కాదు, తన తండ్రే కనబడ్డట్టయింది. 'నువ్వెవరో నాకు తెలియదు, మా నాథూ కావు నువ్వు. దారి తప్పుకో, బాబూ' అన్నట్టు తోచింది. 'కాదు, నేను నాథూనే, నాథూరామ్‌ గోడ్సేనే…' అని తనకు తాను చెప్పుకుంటూ గాంధీ ఎదుట పడి నమస్కరిస్తూ '..ఆలస్యమైంది' అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లు.

'అవును, ఐ యామ్‌ సారీ' అన్నాడు గాంధీ. అంతలోనే నాథూ చేతిలో తుపాకీ చూశాడు. అది పేలగానే 'హే రామ్‌' అంటూ అరిచి పడిపోయాడు.

xxxxxxxxxxxxxxxxx

గాంధీ వెనుక వున్న దాస్‌ బొడ్డులోంచి తుపాకీ తీసి నాథూని కాల్చబోయాడు. కానీ గాంధీ శరీరం అడ్డుపడింది. మరణానంతరం కూడా హింసను అనుమతించలే దాయన. మూడు గుళ్లు కాల్చాక నాథూ తుపాకీ కిందకు పడేశాడు. తలవంచుకుని ఏడ్వసాగాడు. గోపాల్‌ ముందుకు వచ్చి తుపాకీ అతనికి గురిపెట్టాడు తప్ప కాల్చలేదు. అప్పటికే ముండా, బోస్‌ అతని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. 

సరిగ్గా అదే సమయానికి రాణి గుప్తా భవన్‌ తోటలోకి అడుగుపెట్టింది. తుపాకీ చప్పుడు వింటూనే హతాశురాలైంది. పోలీసులు తీసుకుని వెళ్లిపోతున్న నాథూ తన కేసి చూశాడా లేదా అన్నది ఆమెకు తెలియలేదు. నాకు తెలిసిన నాథూ కాదితను అనుకుందామె.

దాస్‌ గాంధీని చేతుల్లో ఎత్తుకుని యింట్లోకి తీసుకెళ్లాడు. ప్రజలంతా నిశ్చేష్టులై నిలబడ్డారు. హింసకు పాల్పడిన తమ పాపాలకు ఆయన పరిహారం చెల్లించాడని పశ్చాత్తాప పడసాగారు. రోదించసాగారు. చీకటి అలుముకుంటోంది. విషాదం ఆవరిస్తోంది. ఒక చిన్న పాపకు ఏం తోచిందో ఏమో పాట అందుకుంది – జనగణమన అధినాయక జయహే! అందరూ ఆమెతో గొంతు కలిపి పాడసాగారు. 

(సశేషం) – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives