ఎప్పుడో 35 ఏళ్ళ క్రితం స్కైలాబ్ అనే ఓ వ్యామోనౌక అంతరిక్షంలో అదుపు తప్పి, భూమ్మీద కూలిపోయింది. అలా కూలిపోవడానికి ముందు ఆ వ్యోమనౌక కారణంగా సృష్టింపబడ్డ పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడితో ఈ ప్రపంచం అంతం.. అన్న ప్రచారం జరిగింది. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలుగా మారిపోయిన రోజులవి. సరిగ్గా అలాంటి ప్రమాదమే భూమ్మీదకు పొంచి వస్తోంది. అయితే గతంలోలా పుకార్లకు అవకాశం లేదిక్కడ. చిన్నపాటి భయం మాత్రం వుంది. భయం చిన్నదా? పెద్దదా? అన్నదానిపైనా కొంత గందరగోళం వుంది.
రష్యన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకుల్ని మోసుకెళుతూ అంతరిక్షంలో అదుపు తప్పింది. భూమ్మీద నుంచి నౌకకు దిశా నిర్దేశం చేసే వ్యవస్థ ఫెయిల్ అయ్యింది. దాంతో, వ్యోమనౌక అంతరిక్షంలో అదుపు తప్పి, భూమ్మీదకు దూసుకొచ్చేస్తోంది. అత్యంత వేగంగా ఇది భూమ్మీదకు రానుంది. వచ్చే క్రమంలో గాల్లోనే వ్యోమనౌక పేలిపోయే అవకాశాలు ఎక్కువగా వున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా, భూమ్మీద ఎక్కువ భాగం నీరు వుండటంతో, వ్యోమనౌక భూమ్మీద.. అందునా మానవులు నివాసం వున్న చోట్ల పడేందుకు అవకాశాలు తక్కువే. అలాగని పూర్తిగా మానవులకు ప్రమాదం లేదని చెప్పలేం. గాల్లో నౌక పేలిపోకుండా వుంటే అది పడ్డ చోట మాత్రమే ప్రమాదం వుంటుంది. అది కూడా తక్కువ పరిమాణం గల ప్రాంతంలోనే దాని ప్రభావం వుండొచ్చు. అదే నౌక భూ వాతావరణంలోకి ప్రవేశించాక కాస్త ఎక్కువ ఎత్తులో పేలితే మాత్రం ముప్పు పది రెట్లు ఎక్కువ కావొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.
చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. గతంలో ఎన్నోసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల్నీ, వారికి అవసరమయ్యే సరుకుల్ని వ్యోమనౌకలు తీసుకెళ్ళాయి.. వస్తున్నాయి కూడా. కొన్నాళ్ళ క్రితం కొలంబియా వ్యోమనౌక భూమికి తిరిగొస్తూ, గాల్లోనే పేలిపోయిన విషయం విదితమే. ఆ ఘటనలో భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి కల్పనాచావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు దుర్మరణం పాలయ్యారు.
ఇక, రష్యన్ వ్యోమనౌక భూమికి వస్తూ ఎలాంటి ఉపద్రవం మోసుకు రానుందో తెలియాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందేనట.