మోసేస్తాం.. తొక్కేస్తాం.. కామనే.!

అసలు వీడికి బ్యాటింగ్‌ వచ్చా? అని ఎంతోమంది అనుకున్నారు నిన్నటి బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటగాడు సర్ఫరాజ్‌ రివర్స్‌ స్వీప్‌ చేయబోయి, బ్యాట్‌ వెనుక బాగంతో బంతిని కొట్టినప్పుడు. కామెంటేటర్లు కూడా సెటైర్లు…

అసలు వీడికి బ్యాటింగ్‌ వచ్చా? అని ఎంతోమంది అనుకున్నారు నిన్నటి బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటగాడు సర్ఫరాజ్‌ రివర్స్‌ స్వీప్‌ చేయబోయి, బ్యాట్‌ వెనుక బాగంతో బంతిని కొట్టినప్పుడు. కామెంటేటర్లు కూడా సెటైర్లు పేల్చారు. కానీ, ఆ సెటైర్లు బద్దలయిపోయాయి.. సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌తో. 17 ఏళ్ళ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. వర్షంతో మ్యాచ్‌ రిజల్ట్‌ తేలలేదు. లేదంటే బెంగళూరు మ్యాచ్‌ గెలిచి, సర్ఫరాజ్‌కి ఇంకా పాపులారిటీ వచ్చేది.

కోహ్లీ సహా పలువురు బెంగళూరు ఆటగాళ్ళు సర్ఫరాజ్‌ టాలెంట్‌కి ఫిదా అయిపోయారు. మీడియాలో అయితే సర్ఫరాజ్‌ పేరు చెప్పి జరగాల్సినంత రచ్చా జరుగుతోంది. వారెవా ఏం టాలెంట్‌.. అంటూ మీడియా ఓ రేంజ్‌లో సర్ఫరాజ్‌కి కితాబులిచ్చేస్తోంది. రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయాడు సర్ఫరాజ్‌ ఖాన్‌.

ఐపీఎల్‌లో ఇలాంటి సంచలనాల్ని ఎన్నిటినో చూశాం. ఎంత సంచలనాలు సృష్టించినా, చివరికి వారి టాలెంట్‌ వృధా అయిన సందర్భాలే ఎక్కువ. ఐపీఎల్‌తో చాలామంది స్టార్స్‌ వెలుగులోకి వచ్చారు. అంతే వేగంగా వారు చీకట్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఐపీఎల్‌ పుణ్యమా అని స్టార్లు పుట్టుకొచ్చి, జాతీయ జట్టులో కనీసం స్థానమైనా సంపాదించుకున్నారేమో. ఇప్పుడు ఆ పరిస్థితి కన్పించడంలేదు.

టాలెంట్‌ని తొక్కేయడంలో మన తర్వాతే ఎవరైనా.. అనేంతలా టీమిండియాలో రాజకీయాలు పెచ్చుమీరిపోతున్నాయి. గంభీర్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌సింగ్‌ లాంటోళ్ళకే ఛాన్సులు దక్కని దుస్థితి. ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకున్నా, ఒక్క మ్యాచ్‌లో ఫెయిలయితే ఇక ఆ క్రికెటర్‌ టీమిండియా నుంచి ఔట్‌ అయిపోవాల్సిందే. సర్ఫరాజ్‌ లాంటోళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత బీసీసీఐ పైనే వుంది. కానీ, రాజకీయాలు అందుకు అనుమతించొద్దూ. టాలెంట్‌ ఒక్కటే సరిపోదు, బీసీసీఐ మెప్పు పొందాలి.. అంతకన్నా ముందు కెప్టెన్‌ ధోనీ మనసు గెలవాలి. ఇదీ టీమిండియా ప్రస్తుత పరిస్థితి.