హీరో శక్తికి తోడుగా హీరోయిన్‌కి దైవభక్తి గట్రా వుండాలి. వాటి గురించి భక్తి ప్రధానమైన సినిమాల గురించి చెప్పినపుడు విపులంగా చెపుతాను. కానీ ఆ భక్తి పాలు మరీ ఎక్కువయిపోకూడదు అన్నదానికి ఓ ఉదాహరణగా 'చంద్రహారం' సినిమాను చెప్పుకోవాలి. 'చంద్రహారం' సినిమాలో రామారావు ఓ రాజు. అతని ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. ఆతను ఒక బొమ్మ ఒకటి గీసి ఆ ఊహాసుందరినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కానీ నిజానికి ఆ రూపంలో ఓ అమ్మాయి అప్పటికే వుంది. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకుందామనుకుని కాచుకుని వున్న విలన్ తన అనుచరుణ్ని పంపి ఆ ఊహాసుందరిని చంపేయమంటాడు.
ఇలా వుండగా హీరోగారు తన ఊహాసుందరిని తలుచుకుంటూ పాడిన పాట విని ఓ యక్షకన్య యితన్ని వలచింది. నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో అని వెంటపడింది. ఇతను కాదన్నాడు. దాంతో ఆమె యితని చంద్రహారాన్ని తీసుకుపోయింది. ఫలితంగా యితను నిర్జీవంగా పడిపోయాడు. కానీ మరో యక్షిణి సహాయంతో మళ్లీ జీవించాడు. ఇలా సినిమాలో చాలాసేపు చావుబతుకుల మధ్య కొట్లాడుతూండగా, తన పట్ల యింత ప్రేమ పెంచుకున్న రాజును చూసి ముచ్చటపడి ఆ ఊహాసుందరి యితన్ని పెళ్లి చేసుకుంది. తన పాతివ్రత్య మహిమతో యక్షిణిని ఓడించి, రాజుగారికి ప్రాణగండం తప్పించింది.
ఈ సినిమాలో రామారావు, శ్రీరంజని, సావిత్రి, యస్ వి రంగారావు, రేలంగి, జోగారావు వంటి హేమాహేమీలు నటించారు. పింగళి రచన. ఘంటసాల సంగీతం. ఎచ్‌ఎం రెడ్డి, కెవి రెడ్డిగార్ల వద్ద అసిస్టెంటుగా పనిచేసి, దరిమిలా 'పౌరాణిక బ్రహ్మ'గా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావుకి దర్శకుడిగా ఇది తొలి అవకాశం. పైగా చక్రపాణిగారి సూపర్‌విజన్. సినిమా భారీ సెట్టింగులతో కళకళ లాడిపోతూ వుంటుంది. అసలు పాటల పుస్తకమే రంగుల్లో చేటంత వుంటుంది. ఇంత భారీ సినిమా బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టింది. 'పాతాళభైరవి'ని నెత్తిన పెట్టుకున్న జనం దాని తర్వాత సినిమా ఐన దీన్ని ఛీ కొట్టారు. ఎందుచేత? ఎందుకో చక్రపాణిగారే చెప్పారు – 'సినిమాలో సగం సేపు హీరో పడుక్కుని నిద్రపోతూంటే సినిమా ఎవరు చూస్తారు?' అని. సినిమా ఫెయిలయ్యాక ఆయనకు జ్ఞానోదయం అయింది. హీరోయిన్ ద్వారా ఎంత భక్తి చూపినా, వ్యాంప్ ద్వారా ఎంత రక్తి చూపినా, హీరోద్వారా శక్తి చూపకపోతే సినిమా గతి గుండుసున్నా! హీరో అన్నవాడు కండ చూపాలి, కత్తి తిప్పాలి. విలన్‌లకు బుద్ధి చెప్పాలి. అప్పుడు చిన్నపిల్లవాడికి, శ్రామికుడికి హుషారు. హీరో దీనుడిలా మంచం పడితే, సినిమానూ మంచాన పడుతుంది.
ఒక్కోప్పుడు హీరోకంటె అతని స్నేహితుడు శక్తి ప్రదర్శిస్తాడు. హరనాథ్ హీరోగా నటించిన 'మదన కామరాజు కథ' అనే సినిమాలో మదనకామరాజు అనే అతను యువరాజు. అతని స్నేహితుడు గుణశీలుడు. గురువుగారి కుమార్తెను మదనకామరాజుని వలచి, అతను సోదరిలా భావిస్తున్నానంటే కోపగించి అతని గురించి తండ్రికిి చాడీలు చెప్తుంది. తండ్రి రాజుగారిపై ఆగ్రహాన్ని చూపించి, అతని చేత కొడుకుకి మరణశిక్ష విధింపజేస్తాడు. అతన్ని కష్టాల్లోంచి గట్టెక్కించేది అతని స్నేహితుడు గుణశీలుడే! అందువల్లనే ఆ పాత్రకు కాంతారావు వంటి మేటి హీరోను పెట్టుకున్నారు.
ఇలా చెప్పుకుపోతే చాలా సినిమాలు తేలతాయి. ఎందుకంటే జానపద సినిమా అంటేనే హీరో కత్తి దూయడం. ఈ వర్గానికి చెందిన సినిమాలన్నిటిలోనూ తలమానికం అయిన ఓ సినిమాను గురించి చెప్పుకుంటే ఈ వర్గపు సినిమాల లక్షణాలన్నీ తెలిసిపోతాయి. అందువల్ల 'పాతాళభైరవి' సినిమా గురించి చెప్పుకుందాం. విజయావారు మొదట తీసిన సినిమా 'షావుకారు'. ఔట్ అండ్ ఔట్ చక్రపాణిగారి సినిమా. 1949లో రిలీజయింది. విమర్శకులు మెచ్చుకున్నారు కానీ సినిమా ఆడలేదు. ఇక ఆ జోలికి పోకూడదనుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. 'గుణసుందరి కథ' తీసి జానపద సినిమా నిర్మాణంలో తన చాతుర్యాన్ని చాటుకున్న కెవి రెడ్డిగారికి 'పాతాళభైరవి' అప్పగించారు. అప్పట్లో జానపద సినిమాల హీరో అంటే అక్కినేని నాగేశ్వరరావే! నాగిరెడ్డి ఆయన్ని పెట్టి తీద్దామనుకున్నారు. మాంత్రికుడి పాత్రకు జెమినీవారి 'బాలనాగమ్మ'లో మాంత్రికుడిగా జనాల్ని బెదరగొట్టిన గోవిందరాజుల సుబ్బారావును అనుకున్నారు. అయితే కెవి రెడ్డి హీరోగా రామారావును ఎంచుకున్నారు.
జానపద సినిమాలకు నిఘంటువుగా చెప్పుకోదగ్గ సినిమా యిది. చక్కని చిక్కని కథ, కథనం దీనికి ప్రాణం. రామారావు, రంగారావుల నటన, సంగీతం, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. రాకుమారిని చేపట్టడం అనే లక్ష్యాన్ని కథానాయకుడు తన శక్తితో ఎలా సాధించాడు అన్నదే పాయింటు. కథకు మూలం అల్లావుద్దీన్ అద్భుతదీపం అనిపిస్తుంది. అలాదీన్ కథ తెలియనివారు లేరు. ఓ కుర్రాడు. వాడి వద్దకు బాబాయినంటూ ఓ మాంత్రికుడు వచ్చాడు. ఓ పాతాళగుహలోకి తీసుకుపోయాడు. దీపం పట్టుకురా అన్నాడు. 'ముందు నన్ను బయటకు తీయి' అన్నాడు అలాడీన్. అతన్ని, దీపాన్ని బయటకు తీసుకొచ్చి తర్వాత అలాడీన్ చేతిలో ఓ మిఠాయి పెట్టి, దీపం లాక్కుని పంపేస్తే పోయేది. దీపం విలువేమిటో అలాడీన్‌కి తెలియదుగా! తెలిసినా దాన్ని ఎలా రుద్దాలో ఆ భూతాన్ని ఎలా శాసించాలో తెలియదుగా!
మాంత్రికుడి బుద్ధి పని చేయక, అనవసరంగా అలిగి 'అక్కడే సమాధి అయిపో' అని వెళ్లిపోయాడు. అలాడీన్ ఉంగరంలోని చిన్నభూతం సహాయంతో యింటికి వచ్చేసి, ఆ తర్వాత పెద్దభూతంతో పరిచయం పెంచుకుని, దరిమిలా రాజుగారి కూతుర్ని పెళ్లి చేసేసుకున్నాడు. 'అల్లావుద్దీన్ అద్భుతదీపం' సినిమాగా తీసినపుడు హీరోగా చిన్నపిల్లలను పెట్టి తీయలేదు. నాగేశ్వరరావును పెట్టి ఓ సారి, కమలహాసన్‌ని పెట్టి మలయాళంలో ఓ సారి తీశారు. ముక్కుమొహం తెలియని రాకుమారిని పెళ్లి చేసుకున్నాడంటే కథానాయకుడి పాత్ర పట్ల గౌరవం వుండదని రాకుమారిని ముందే చూసినట్టు, ప్రేమించినట్టు చూపించేశారు. అలావుద్దీన్ పాత్రకు లక్ష్యం లేదు. అతను అద్భుతదీపం గురించి తెలుసుకుని అది ఎలాగైనా సాధించాలని బయలుదేరలేదు. అందువల్ల అలాదీన్ కథకు కాస్త కాశీమజిలీ కథలాటిది కలిపి 'పాతాళభైరవి' కథ తయారుచేశారు. కథ, మాటలు, పాటలు పింగళి అన్నారు. సినిమా అనుసరణ కెవి రెడ్డి, కమలాకర కామేశ్వరరావు అన్నారు.
ఈ తోటరాముడు ఉజ్జయినీ రాజుగారి తోటలో వుంటాడు. తోటలో పూలుకోసి మాలలు కట్టే ముసలిదాని కుమారుడు. అతని అసిస్టెంటు అంజి. ఓ రోజు రాజవీధిలో కొందరు డాన్సు చేస్తూ వుంటే ఉజ్జయిని రాజుగారి బావమరిది రేలంగి వచ్చాడు. మృచ్ఛకటికం రోజుల్నుండి కూడా రాజశ్యాలకుడు అంటే ప్రజలను పీడించే విలనీ ప్లస్ బఫూనరీ అన్నమాట! వినోదానికి పన్నిచ్చుకోవాలని జబర్దస్తీ చేస్తే రామారావు ప్రజల పక్షాన నిలిచి అతన్ని తన్ని పంపించాడు. దానిమీద రాజుగారి వద్ద జరిగిన విచారణలో హీరో తల వంచలేదు. 'తప్పేం చేశాను తల వంచడానికి?' అన్నాడు. ఇదీ హీరోయిజం – అని ప్రేక్షకులే కాదు, రాజూ అనుకున్నాడు. మెచ్చుకుని వదిలేశాడు. తోటరాముడి ఆ సాహసం రాకుమారిని మెప్పించింది. వాళ్లిద్దరూ ప్రేమలో పడి పాట పాడుకున్నారు. తోటరాముడు 'ఎంత ఘాటు ప్రేమయో' అనుకున్నాడు. ప్రేమలో ఘాటేమిటండీ బాబూ? అని అడిగారు విమర్శకులు పింగళిని. 'వాడు మోటు మనిషి. వాడికి తెలిసినది ఘాటుతనమే' అన్నారు పింగళి. ఆ మోటుతనమే తర్వాత తర్వాత రామారావుగారి హాల్‌మార్క్ అయిపోయింది. తెరపై హీరోయిన్‌ను సున్నితంగా పలకరించడం ఆయనకు రాని విద్య. నిజజీవితంలో స్త్రీల పట్ల ఎంత హుందాగానైనా వుండవచ్చు. కానీ తెరమీద మాత్రం ఆయన హీరోయిన్‌ను మోటుగా వాటేసుకోవలసినదే! ఎముకలు విరిగేలా హత్తుకోవలసినదే! అప్పుడే ఆయనకు నేలక్లాసునుండి ఈలలు వస్తాయి. ఇది హర్షించేవారిలో స్త్రీలు కూడా వున్నారు కాబట్టే ఆయన చివరిదాకా అంత బాగా వెలిగారు.
రాకుమారి ప్రేమ మాట ఎలా వున్నా, రాణిగారి తమ్ముడికి ఆమెను పెళ్లాడాలని ఆశ. రాకుమారి వెనకాలే తోటలోకి వెళ్లి పాట పాడుతూంటే ఓ పాము వచ్చింది. ఇతను పారిపోయాడు కానీ చెట్టుమీద దాక్కుని తమాషా చూస్తున్న తోటరాముడు చెట్టుమీదనుండి దూకి పాముకాటునుండి రాకుమారిని రక్షించాడు. సంగతి తెలిసి రాజుగారు జ్యోతిష్కులను సంప్రదించాడు. వారు రాకుమారిని అంత:పురం వదిలి వెళ్లనివ్వద్దన్నారు. ఇక్కడిదాకా భుజబలంతో సాగిన కథ యిక్కణ్నుంచి మంత్రబలాన్ని కూడా ఎదుర్కోవలసివస్తుంది. మాంత్రికుడి ఎంట్రన్స్‌కి లీడ్ జ్యోతిష్కులు సమకూర్చారు. 'అమ్మాయీమణివారి జాతకం చిత్రవిచిత్రాలతో కూడుకుని వుంది. ఇంద్రుడు ఇంద్రజాల మహేంద్రజాలాలను చేస్తున్నాడు.' అని. ఇక్కడ మాంత్రికుడు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)