తన స్నేహితుడు ఉన్నట్టుండి అంతర్థానమయిపోవడంతో అంజి కంగారు పడ్డాడు. ఇంతలో అతని వద్దకు రెండు భూతాలు తీర్పుకోసం వచ్చాయి. వాటి దగ్గర రెండు వింత వస్తువులు వున్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లగల మాయచెప్పులు, కప్పుకుంటే ఎవరికీ కనబడని మాయ దుప్పటీ. ఏది ఎవరు తీసుకోవాలో తెలియక ఇతన్ని తీర్పు తీర్చమన్నాయి అవి. ఆగండి వీటి మహిమ పరీక్షించి చూస్తాను అంటూ ఆ చెప్పులేసుకుని, ఆ దుప్పటి కప్పుకుని బాలకృష్ణ మాయమయిపోయాడు. అవి లబోదిబో మంటూండగా అతను సరాసరి తన మిత్రుడి దగ్గరకు చేరుకున్నాడు. ఈ సీను చాలా సినిమాల్లో కనబడుతుంది. ఇకపై కథ నడిపించేది అతనే! సదాజపుణ్ని కొట్టి పడేసి, అతనిలాగానే మొహం ముసుగుతో కప్పుకుని సేవకులందరినీ పంపేశాడు. మాయ దుప్పటి సహాయంతో రాముణ్ని రాకుమారి వద్దకు పంపి మాంత్రికుణ్ని బుట్టలో పెట్టమని సలహా చెప్పిస్తాడు. తను మాంత్రికుడి వద్దకు వెళ్లి మంత్రాలన్నీ వున్న గడ్డాన్ని తీయించేస్తాడు. సర్వశక్తి మంతమైన పాతాళభైరవియే వుండగా ఈ గడ్డం ఎందుకు అని లాజిక్. చివరకి మాంత్రికుడు కీచకుడి స్టయిల్లో మోసగింపబడతాడు. రాకుమారి వద్దకు రాగానే రాముడు అతనితో పోట్లాడి చావదంతాడు. పాతాళభైరవి విగ్రహాన్ని అతని చేతిలోంచి ఎగరగొట్టేస్తాడు. అతన్ని శపిద్దామని చూస్తే మాంత్రికుడికి గడ్డం లేదు కదా. అందువల్ల భుజశక్తికే ఇక్కడ ప్రాధాన్యం. దానిలో మన కథానాయకుణ్ని మించిన వారెవరు? అందువల్ల మాంత్రికుడిని బాహాబాహీ యుద్ధంలో చంపేస్తాడు. పాతాళభైరవి విగ్రహాన్ని, రాకుమారిని సాధించుకుని రాజుగార్ని మెప్పించి పెళ్లి చేసుకుంటాడు. కథ కంచికి వెళ్లింది.
ఈ సినిమా తయారయ్యాక విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు ప్రీవ్యూ వేసి కొంతమందికి చూపించారు. వాళ్లు పెదవి విరిచారు. దాంతో నాగిరెడ్డి, చక్రపాణి దిగాలు పడిపోయారు. ఈ సినిమాపై యింత పెట్టుబడి పెట్టేమే అని. కెవి రెడ్డి అప్పుడే ఆఫీసుకి వచ్చి విషయం విన్నారు. వెంటనే విజయవాడకు ఫోన్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ను తిట్టిపోశారు – 'ఎవడ్ని అడిగి ప్రీవ్యూ వేశావ్? నా సినిమా ఊరికే వచ్చిచూసే కాంప్లిమెంటరీ గాళ్లకోసం కాదు, టిక్కెట్టు కొని వచ్చే నేల తరగతి వాడి కోసం.' అని తిట్టి 'ఈ సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా' నని ఛాలెంజ్ చేసారు. ఫిబ్రవరి 1950లో ప్రారంభమైన ఈ సినిమా 1951 మార్చిలో రిలీజైంది. ఆదరణ ఓ మాదిరిగా వుంది. కథ అనవసరంగా సాగదీసి మూడుంపావు గంటలు చేశారన్న మాట వచ్చింది. క్రమంగా అందుకుంది. 13 ప్రింట్లతో రిలీజ్ చేసిన సినిమాకు 11 వారాలు అయ్యేసరికి 69 ప్రింట్లు వేశారు. 10 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. మరో మూడు సెంటర్లలో 90 రోజులాడింది. తెలుగు, తమిళం రెండు వెర్షన్లూ హిట్ కావడంతో జెమినీ వాసన్ హిందీ హక్కులు కొని పాటల్ని తిరిగి రంగుల్లో తీసి హిందీలో రిలీజ్ చేశారు. అదీ బాగా ఆడింది. ఈ సినిమా వచ్చిన 30 యేళ్లకు పద్మాలయావాళ్లు జితేంద్ర, జయప్రదలతో హిందీలో పూర్తి కలర్లో మళ్లీ తీశారు.
ఈ 'పాతాళభైరవి'తో రామారావు తిరుగులేని జానపద హీరోగా నిల్చిపోయారు. హీరోయిన్ మాలతి మాత్రం కనుమరుగైంది. కొన్ని సినిమాల్లో ఎన్టీయార్‌కి తల్లిగా నటించి, చివరికాలంలో దారిద్య్రంలో కన్నుమూశారు. తక్కినవాళ్లందరూ పైకి వచ్చారు. మాంత్రికుడిగా వేసిన రంగారావు, రాజుగా వేసిన సియస్ఆర్, మహారాణిగా వేసిన హేమలత, పాతాళభైరవిగా వేసిన గిరిజ, రేలంగి, బాలకృష్ణ, పద్మనాభం – ఒకరేమిటి? అందరూ బాగా ఎదిగారు. చివరగా చెప్పుకోవలసినదేమిటంటే – శక్తి ప్రధానమైన సినిమాల్లో కథానాయకుడు ఎలా వుండాలో చెప్పే బైబిల్ లాటిది 'పాతాళభైరవి'. ఆబాలగోపాలాన్ని అలరించింది. ఈ సినిమాను ఒక్కసారే చూసినవారు అరుదు.
యుక్తిప్రధాన జానపద చిత్రాలు : ఈ తరహా సినిమాల గురించి మాట్లాడుకోబోయేముందు జానపద సినిమాలు ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకున్నాయి? వాటి మార్కెట్ ఏమిటి? అనే విషయాలపై మాట్లాడతాను. చిన్నపిల్లవాడిగా మీరు ఎటువంటి కథలు ఎంజాయ్ చేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రేమలు, అలకలు, అపార్థాలు, మాట పట్టింపులుతో విడిపోవడాలు – యిలాటి సినిమాలు మీకు నచ్చేవా? త్యాగం చేసే హీరోను చూసి మీరు మురిసిపోయారా? లేదుగా! తనలోని దు:ఖాన్ని మనందరికీ పంచడానికి తాగుబోతై పోయిన హీరోని మీరు మెచ్చుకున్నారా? లేక ప్రజల దు:ఖాన్ని బాపడానికి అవతలివాడు బలవంతుడైనా సరే తలపడినవాడిని మెచ్చుకున్నారా?
సమాధానం మీకూ తెలుసు. యుక్తవయస్సు వచ్చాక హృదయం, ప్రేమ, వాటి గోలా కాస్త మనసుకి ఎక్కుతాయి. అప్పటిదాకా భుజబలంతో అవతలివాణ్ని తన్నేవాడే మన హీరో! జానపద హీరో అలాటివాడు కాబట్టే చిన్నపిల్లలు అలాటి సినిమాలే యిష్టపడతారు. సినిమా అనేది మనకు కుటుంబసమేతంగా వెళ్లే వ్యవహారం. కుటుంబం అంతా సరదాగా ఓ సాయంత్రం వెళదామంటే మన వూళ్లలో ఓ పార్కులు లేవు, బీచ్‌లు లేవు, వున్నా వాటిని మేన్‌టేన్ చేసే దిక్కు లేదు. అందరూ కలిసి సరదాగా వెళ్లేది సినిమా హాలుకే!
అందుకే పండగపూట సాయంత్రం సినిమాహాలు కెళితే మన బంధుమిత్రులందరినీ కుటుంబసభ్యులతో సహా పలకరించవచ్చు. కుటుంబం యావత్తూ సినిమాకు వెళ్లినపుడు పిల్లల మాట చెల్లడంలో ఆశ్చర్యం లేదు. పండగపూటా వాళ్లని శ్యామ్ బెనగల్ సినిమాకో, మృణాల్ సేన్ సినిమాకో తీసుకెళతానంటే వాళ్లు రాగాలెడతారు. వాళ్లకు నచ్చేవి ఇంటలెక్చువల్ సినిమాలు కావు, చిరంజీవి తరహా డిష్యుం డిష్యుం సినిమాలు. తలకాయకు శ్రమ కలిగించని సినిమాలు. మీరూ, మీ ఆవిడా వాళ్ల డిమాండ్‌కి తల వొగ్గుతారు. అందువల్లనే మీరు మమేకం కాలేకపోయినా, పిల్లల కోసం శంకర్‌దాదా ఎంబీబీయస్ రెండు, మూడు సార్లు చూస్తారు.
అప్పట్లో జానపద సినిమాలు యిలాటివే! చిరంజీవి సినిమాలలో డ్రస్సులు తప్పిస్తే ఫార్ములా అంతా జానపదమే కదా! జగదేకవీరుడు, అతిలోక సుందరి టీవీలో వస్తే ఛానెల్ మార్చేయబోతే ఇంట్లో గొడవయిపోతుంది కదా! ఎందుకంటే అది జానపద సినిమా టైపు సోషల్ ఫ్యాంటసీ కనుక! ఈ సినిమాలు పెద్దవాళ్లు ఎంజాయ్ చేయలేరు అని గట్టిగా అనడానికి లేదు. ఇప్పటిక్కూడా నేను చందమామ దొరికితే వదిలిపెట్టను. అది చదువుతూంటే బాల్యంలోకి వెళ్లిపోయి ఊహాలోకంలోకి విహరించి వచ్చేస్తాను.
సినిమాల్లో కూడా సత్యజిత్ రాయ్ సినిమాలు చూస్తూ, కష్టపడి అర్థం చేసుకుంటూనే మధ్యమధ్యలో హాయిగా స్టంటు సినిమాలకి వెళ్లిపోయేవాణ్ని. అవైతే తలకాయ తీసి ఒళ్లో పెట్టుకుని హాయిగా శ్రమ లేకుండా చూడవచ్చు. ఈ సాంఘిక సినిమాల్లో మనకు మెంటల్ ఎక్సర్సైజ్ ఎక్కువ. కథలో చిక్కదనం తగ్గిందని, పాత్రను సరిగ్గా మలచలేదని, సహజత్వానికి దూరంగా వుందని యిలా గొంగళీలో వెంట్రుకలు వెతికే పని పెట్టుకుంటాం. జానపదాల్లో ఆ బాధే లేదు. కథ ఎలా నడిచినా మనకు బెంగలేదు. సరదా సరదాగా సాగిపోతుంది. ఇప్పటిదాకా ఏడిపించిన జానపద సినిమా లేదు. హీరోకు కష్టాలు వచ్చినా అతని చెలికాడు వచ్చి భూతాలతో సరసాలాడి మనల్ని నవ్వించేస్తాడు.
అంతో యింతో చదువుకుని, యింటలెక్చువల్ ముద్ర కొట్టించుకోడానికి తాపత్రయ పడే మనమే యిలా వుంటే అచ్చగా శ్రామికుడు యింకెలా ఫీలవుతాడో ఊహించండి. రోజంతా పొలంలోనో, మిల్లులోనో కష్టపడి, మెంటల్‌గా రిలాక్స్ కావడానికి వాడు వచ్చేది – 'బీదలపాట్లు' సినిమాకా? లేక 'జయం మనదే' సినిమాకా? పెద్దగా చదువుకోనివారు, పల్లెపట్టున, ఓ మాదిరి పట్టణాల్లో వున్నవాళ్లు ఆదరించేది యిలాటి సినిమాలనే! వీటినే సినీ పరిభాషలో బి, సి సెంటర్లంటారు. వీటి సంఖ్య ఎక్కువ. జానపద సినిమా ఎ క్లాసు సెంటర్లో కంటె బి, సి సెంటర్లలోనే ఎక్కువ కలక్ట్ చేస్తుంది. అక్కడే రిపీటెడ్ ఆడియన్సు వస్తారు. ఇలా జానపద సినిమాలకు మార్కెటింగ్ అవకాశాలు ఎన్నో వున్నాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)