చదువుతున్నప్పుడో బాయ్‌ఫ్రెండ్, ఆ తర్వాత మరో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోవడం, ఒకటికి రెండు మార్లు పెళ్లిళ్లు… తర్వాత కూతురునే చెల్లెలుగా భర్తకు పరిచయం చేయడం, కూతురిని దారుణంగా హతమార్చడం… ఒకదాని కొకటి పొంతనలేని ట్విస్ట్‌లు, ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు… ఒక బాలీవుడ్ మషాలా సినిమాకు ఇంతకన్నాకావల్సింది ఏముంది?
సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యోదంతంలో కీలక పాత్రధారి అయిన ఇంద్రాణీ ముఖర్జీ కధ బాలీవుడ్ సినిమా రూపకర్తలకు అద్భుతమైన ముడిసరకుగా మారిపోయింది. ఆమె కధతో సినిమా తీయడానికి బాలీవుడ్ ప్రముఖులు పోటీపడుతున్నారు. తాను ఇప్పటికే దాదాపు ఇదే తరహా కధాంశంతో సినిమా ప్రారంభించానని, ఈ వ్యవహారం ఇంతగా సంచలనం కాకముందే తాను దాదాపు కధ మొత్తం సిద్ధం చేసేశానని ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ చెబుతున్నారు. ఆయన తన సినిమా టైటిల్ కూడా ప్రకటించేశారు అబ్ రాత్ గుజర్నే వాలేహై అంటూ.
ఇక మరో సినీ ప్రముఖుడు మనీష్ సింగ్ సైతం ఈ కధ కోసం రేసులో ఉన్నారు. బాలీవుడ్‌కి చెందిన ఇద్దరు ప్రముఖ స్క్రిప్ట్ రైటర్లను పకడ్బందీగా స్క్రిప్ట్ రూపొందించమని పురమాయించిన మనీష్… నటి సుప్రియానాయర్‌ను ఈ సినిమాలో ఇంద్రాణి పాత్రకు ఎంపిక చేశారట. మిగిలిన నటీ నటుల ఎంపిక కూడా పూర్తి చేసి ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించనున్నట్టు ఆయన చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే… సభ్య సమాజం కలలో కూడా అసహ్యించుకునేంత విలనీ ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్ నటీమణులు ఆసక్తి చూపిస్తున్నారట.