జయలలితకు ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమె వైద్యులతో మాట్లాడగలుగుతోందని, ఆసుపత్రిలో మరికొంతకాలం వుండాలని అపోలో ఆసుపత్రి వారు శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి నాటికి యింటికి పంపించేస్తారని ముందురోజు వార్త వచ్చింది కానీ అపోలో వారు ఆ మాట అనలేదు. ఏది ఏమైనా ఐదువారాల పాటు నడిచిన సస్పెన్స్ డ్రామాకు తెరపడుతున్నట్లుంది. ఆవిడ కోలుకోవాలని, ఎప్పటిలాగ తన పనులు తను చేసుకోవాలని ఆశిస్తూనే, అసలింత సస్పెన్స్ ఎందుకు రగిలిందాని ఆలోచించవలసిన అవసరం వుంది. 68 ఏళ్ల మహిళ అనారోగ్యం పాలవడంలో, ఆస్పత్రి పాలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మరి ఎందుకింత గోప్యం? గోప్యం మేన్‌టేన్ చేసినకొద్దీ ప్రజల్లో అనుమానాలు, పుకార్లు, వాటిని నివృత్తి చేయాలంటూ కోర్టులో పిల్, ఏ రోజు కా రోజు యింకేముంది, అయిపోయింది అని పుకారు రావడంతో దుకాణాలు టైము కంటె ముందే కట్టేయడాలు, స్కూలు పిల్లలను ముందే పంపేయడానికి ఏర్పాట్లు, దుకాణాలు, బంకులు వారం పాటు మూసేసినా ఫర్వాలేనట్లు ఆహారపదార్థాలు, పెట్రోలు పోగేసి దాచుకోవడం, అపోలో ఆసుపత్రి ముందు పూలు, పళ్ల అమ్మకాలు, టీవీ ఛానెళ్లు, పత్రికలు ఎందుకైనా మంచిదని ముందుచూపుతో జయలలితపై అన్ని రకాలుగా కథనాలు తయారుచేసుకోవడాలు… యింత హంగామా అవసరమా అంటే ఆ పరిస్థితిని కల్పించిన జయలలితనే నిందించాలి. గతంలో ఎమ్జీయార్ కూడా యిలాగే తన అనారోగ్యాన్ని దాచుకుని నెత్తిమీదకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు జయలలిత పరిస్థితి పరిశీలించిన ఇంగ్లీషు డాక్టర్ రిచర్డ్ బీల్ 'ఈవిణ్ని వారం రోజుల క్రితమే ఆసుపత్రిలో చేర్చి వుండాల్సింది' అన్నాట్ట. ఆసుపత్రిలో చేరడమంటూ చేరితే అనామకమైన ఆసుపత్రిలో చేరితే లాభం లేదు. అపోలో వంటి సకల వసతులు వున్న ఆసుపత్రిలో చేరాలి. అక్కడ చేరితే అందరి కళ్లల్లో పడడం జరుగుతుంది. అది యిష్టం లేక జయలలిత యింటిదగ్గరే వైద్యం చేయించుకుంటూ కాలక్షేపం చేసి ముప్పు తెచ్చుకుంది. చివరకు అపస్మారకస్థితికి చేరాక, ఆమె సన్నిహితురాలు శశికళ, వైద్యులు కలిసి నిర్ణయం తీసుకుని సెప్టెంబరు 22న రాత్రి 8.45కి ఆసుపత్రికి తరలించారు.
అది కూడా డైరక్టుగా ఆస్పత్రికి ఫోన్ చేసి వచ్చేయలేదు. చైర్మన్ ప్రతాపరెడ్డి గారి కుమార్తె, వైస్ చైర్మన్ అయిన ప్రీతా రెడ్డికి ఫోన్ చేస్తే ఆవిడ ఆంబులెన్సు పంపింది కానీ డ్రైవరుకి ఎక్కడికి వెళ్లాలో ముందే చెప్పలేదు. చెప్తే మీడియాకు ఉప్పందిస్తాడనే భయం. కాథెడ్రల్ రోడ్డుకి వెళ్లమని చెప్పి అక్కడికి వెళ్లాక పోయెస్ గార్డెన్‌కి వెళ్లాలని చెప్పారు. స్పృహలో లేని జయలలితకు తోడుగా శశికళ రాగా, ఆమెకు సెక్రటరీగా వ్యవహరిస్తున్న పూంగూంద్రన్ వెనక్కాల వేరే కారులో వచ్చాడు. వాళ్లు ఎమర్జన్సీ రూమ్‌కి వచ్చేసరికే ప్రీతా రెడ్డి కార్డియాలజీ, పల్మనాలజీ, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులను సిద్ధంగా వుంచారు. చాలాకాలంగా జయలలిత మధుమేహాన్ని పర్యవేక్షిస్తున్న డయబెటాలజిస్టు డా|| జయశ్రీ అక్కడకు చేరారు. జయలలితకు శీతాకాలంలో నెమ్ము చేసే వ్యాధి కూడా వుంది. అవేళ 'ఏక్యూట్ పల్మనరీ డిస్ట్రెస్ సిండ్రోమ్' కేసు కింద ఆమెను హాస్పటల్‌లో చేర్చుకున్నారు. ఊపిరందకపోవడంతో తాత్కాలికంగా పేస్‌మేకర్ పెట్టి, ఊపిరందేట్లు చేసి, తర్వాత మల్టి-డిసిప్లినరీ సిసియు (ఎమ్‌డిసిసియు)కు తరలించారు. ఎమర్జన్సీ రూమ్ అయితే విశాలమైన ప్రదేశంలో రోగులు సులభంగా వచ్చేట్లు నిర్మించారు కాబట్టి ఆనాటి సంఘటనలను కొందరు గమనించగలిగారు. ఎమ్‌డిసిసియు అయితే రెండో ఫ్లోర్‌లో చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో వుంది కాబట్టి యిక సమాచారం బయటకు రావడం మానేసింది. ఇక దాంతో ఎవరి చిత్తం వచ్చినట్లు వారు ఊహాగానకచ్చేరీలు చేసేశారు.
ఈ కచ్చేరీలకు అపోలోవారి వాద్యసహకారం కూడా వుంది. ఎందుకంటే వారు ఉన్నదున్నట్లు ఎన్నడూ చెప్పలేదు. చేరిన మర్నాడు సెప్టెంబరు 23న విడుదల చేసిన ప్రెస్ రిలీజులో ముఖ్యమంత్రికి జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమే అని చెప్పారు. ఇవాళ్టికి ఆవిడకు జ్వరం తగ్గి సాధారణ ఆహారం తీసుకుంటున్నారు అని కూడా చేర్చారు. ఇది శుద్ధ అబద్ధమని తర్వాతి ఘటనలు తెలిపాయి. సెప్టెంబరు 29న మరో రిలీజు. దాన్లో 'ముఖ్యమంత్రి చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. కోలుకోవడానికై ఆసుపత్రిలో మరి కొన్నాళ్లు వుండవలసి వస్తోంది' అని చెప్పారు. అక్టోబరు 2 నాటి ప్రకటనలో 'ఇంగ్లండు డాక్టరు రిచర్డ్ ముఖ్యమంత్రి చికిత్సను పర్యవేక్షించి, సరైన విధానంలోనే చికిత్స జరుగుతోందని అన్నారు.' అని చెప్పారు. అప్పుడే జయలలితకు ఇన్ఫెక్షన్ సోకిందని, యాంటీబయాటిక్స్ వాడుతున్నామని మొదటిసారి ఆసుప్రతివారు ఒప్పుకున్నారు. ఇంతకీ డా|| రిచర్డ్ స్పెషాలిటీ ఏమిటో చూస్తే ఆవిడకున్న వ్యాధి ఏమిటో కాస్త ఐడియా వస్తుంది. ఆయన పనిచేసే లండన్ బ్రిజ్ హాస్పటల్ వెబ్‌సైట్ ప్రకారం 'ఎక్యూట్ లంగ్ ఇంజరీ, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్, జనరల్ యింటెన్సివ్ కేర్' ఆయన ప్రత్యేక రంగాలు. అంటే యీవిడకు వీటిలో కొన్ని కానీ, అన్నీ కానీ వున్నాయన్నమాట. అక్టోబరు 3 నాటి ప్రకటనలో అపోలో వారు మరింత స్పష్టంగా 'యాంటీబయాటిక్స్ వాడుతున్నామని 'రెస్పిరేటరీ సపోర్టు' యిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రెస్పిరేటరీ సపోర్టు అనేది అస్పష్టమైన వర్ణన. ఊపిరి అందనివాళ్లకు పెట్టే ఆక్సిజన్ మాస్క్ నుంచి చాలా క్రిటికల్ కండిషన్‌లో వున్న వాళ్లకు పెట్టే వెంటిలేటరు దాకా ఆ వర్ణనలోకి యిముడుతాయి. ఈవిడకు పెట్టినది ఆక్సిజన్ మాస్కో, వెంటిలేటరో తెలియక, మళ్లీ ఎవరి సత్తువ కొద్దీ వారు వూహలు చేశారు. అక్టోబరు 6 వరకు ఆసుపత్రివాళ్లు అదే పాట పాడుతూ వచ్చారు. ఐసియులో 4 రోజుల కంటె ఎక్కువ వుంచవలసి వస్తే పరిస్థితి బాగా లేనట్లే అని నిపుణులంటారు. అక్టోబరు 9న కాబోలు ఆఖరి హెల్త్ బులెటిన్ యిచ్చారు. మళ్లీ యిన్నాళ్లకు యీ బులెటిన్.
ఉన్న విషయం స్పష్టంగా చెప్పడానికి ఆసుపత్రికి ఏం తీపు తీసింది అనుకోవడం అవివేకం. వాళ్లపై పార్టీ, ప్రభుత్వ ఆంక్షలు వుండి వుంటాయి. ఎందుకంటే పార్టీ వాళ్లు పరిస్థితి మామూలుగానే వుందని చెప్పి ప్రజల్ని మాయ చేయడానికి నిశ్చయించుకుని ఆవిడ పేర రకరకాల ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఆవిడ ఆసుప్రతిలో చేరిన మర్నాడే అరియలూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన 15 మంది గురించి సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు పరిహారం యిస్తూ ఒక ప్రకటన వెలువరించారు. రాష్ట్రవ్యాప్తంగా 107 అమ్మా కాంటీన్లు ప్రారంభిస్తూ మరో ప్రకటన కూడా. మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 26 న స్థానిక ఎన్నికలకై ఎడిఎంకె ఆభ్యర్థుల జాబితా విడుదలైంది. మరో రెండు రోజులకు కావేరీ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోనందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉమాభారతి అధ్యక్షతన జరిగిన కావేరీ సూపర్‌వైజరీ కమిటీ సమావేశంలో ఆవిడ తరఫున చీఫ్ సెక్రటరీ చదవవలసిన ప్రసంగాన్ని స్వయంగా డిక్టేట్ చేసిందంటూ నాటకం ఆడారు. సెప్టెంబరు 27న సాయంత్రం 4.30 నుండి గంటపాటు తన ఆసుపత్రి గదిలోనే అధికారులతో కావేరీ సమస్యపై సమావేశం ఏర్పాటు చేశారని చెప్పుకున్నారు. సెప్టెంబరు 28 న ప్రభుత్వోద్యోగులకు బోనస్‌గా 476 కోట్ల రూ.లను ఆమె ఆదేశాలకు మేరకు విడుదల చేశామని చెప్పారు. అదేవారంలో ఇద్దరు ఐయేయస్ అధికారుల విదేశీ ప్రయాణాలను అనుమతిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు చెప్పినా కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయనందుకు మోదీకి నిరసన తెలపాలంటూ ఆమె తన పార్టీ ఎంపీలను ఆదేశించిందటూ అక్టోబరు 4 న మరో ప్రకటన విడుదల చేశారు. అనేక మంది నాయకులు వచ్చి జయలలితను పరామర్శించి వెళ్లారంటూ ప్రకటనలు యిస్తున్నారు కానీ, వారెవరూ జయలలిత మంచం వరకు కూడా వెళ్లలేదు. రెండు గేట్ల అవతలి నుంచే చూసి వెళ్లిపోయారట. వాళ్లు వచ్చి వెళ్లినట్లు జయలలితకు తెలియను కూడా తెలియదు. కానీ యిలాటి ప్రకటనలు యిస్తూ 'సబ్ ఠీక్ హై' అనే సినిమా చూపించే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వీటివలన అనుమానాలు మరింత పెరిగాయి. వాళ్లెందుకు యిలా ప్రవర్తించాలి అంటే, అలా చేయకపోతే జయలలితకు కోపం వస్తుందేమోనన్న భయం మరి.
నిజానికి జయలలితకు రెండేళ్లగా ఆరోగ్యం బాగా లేదట. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నపుడు కూడా మద్రాసు విడిచి ఓ పూట ప్రచారానికి వేరే వూరు వెళితే సాయంత్రానికల్లా యింటికి వచ్చేయాల్సిందే. నడక కూడా బాగా నెమ్మదించింది. ఈవిడ నడిచే తీరు గురించి, కరుణానిధి చక్రాల కుర్చీలో కదిలే పద్ధతి గురించి విజయకాంత్ ఎన్నికల సభల్లో అనుకరించి చూపించి, ఓటర్లను నవ్వించాడు. ఎన్నికలలో గెలిచాక కూడా జయలలిత బయటివాళ్లను పెద్దగా కలవడం లేదు. కొత్త ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే ఆవిష్కరిస్తోంది. అళందూరులో రెండో మెట్రో రైలు లైను కూడా సెక్రటేరియట్ వీడియో లింకు ద్వారానే ప్రారంభించింది. రామనాధపురం జిల్లాలో అదానీ గ్రూపు నెలకొల్పుతున్న సోలార్ పవర్ ప్రాజెక్టుకూ అదే గతి. అసెంబ్లీలో బజెట్ సమావేశాలు జరిగినప్పుడు ఆమె తన స్థానంలో కూర్చునే వుంది. ఎంత తీవ్రమైన వాగ్వాదాలు జరిగినా సీటులోంచి లేవలేదు. తన ఆరోగ్యం యిలా వున్నపుడు ఆమె పార్టీలో, ప్రభుత్వంలో తన ప్రత్యామ్నాయాలను తయారుచేసి వుండాల్సింది. కానీ అలాటి ఆశలు కల్పిస్తే ఎలాటి వెన్నుపోటు పొడుస్తారో ఏమవుతుందోనన్న భయంతో ఆమె పూనుకోలేదు. అందుకే తాత్కాలిక ముఖ్యమంత్రిగా వుండడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలలేదు. దొంగ సంతకాలతో ఆమె పేరన ప్రకటనలను విడుదల చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చినా నోరు మూసుకుని వున్నారు. ఆమె అనే కాదు, దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీది దాదాపు యిదే పరిస్థితి. అధినేత ఆరోగ్యం చెడిందని తెలిస్తే చాలు, పార్టీ విచ్ఛిన్నమై పోతుందన్న భయం వెంటాడుతోంది. అందుకే అనారోగ్యాలను యింత మర్మంగా వుంచుతున్నారు.
జయలలిత తన వారసులను ప్రకటించలేదు. ఆమె చెలికత్తె శశికళ చేతిలో 60 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు వున్నట్లు అంచనా. ఇతర మంత్రుల ఆఫీసు సిబ్బంది నియామకాల్లో కూడా వారి ప్రమేయం వుంటుంది. వారి కార్యాలయాల్లో వీరి గూఢచారులు కూడా వుంటారు. వీళ్లందరినీ కలిపి 'మన్నార్‌గుడి (శశికళ సొంత వూరు) మాఫియా' జయలలిత తిరిగి రాని, తిరిగి వచ్చినా పరిపూర్ణ ఆరోగ్యంతో పనిచేయలేని స్థితి కలిగితే యీ మాఫియా చెలరేగిపోతుందని అందరికీ భయం. అందరికీ ఆ భయం వుందని వాళ్లకూ తెలుసు కాబట్టే అందరికీ ఆమోదయోగ్యుడైన పన్నీరు శెల్వంను ముందుకు తోశారు. షీలా బాలకృష్ణన్ అనే మాజీ ఐయేయస్ అధికారిణి జయలలిత ఆదరాన్ని, నమ్మకాన్ని చూరగొంది కాబట్టి ఆవిడ జోలికి కూడా వీళ్లు వెళ్లటం లేదు. షీలా మాట రాజకీయవర్గాల్లోనే కాదు, అధికార వర్గాల్లో కూడా చెల్లుబాటు అవుతుంది. ఎమ్జీయార్ లాగానే జయలలిత కూడా బ్యూరాక్రసీనే బాగా నమ్ముతుంది. తన ఎమ్మెల్యేల శక్తిసామర్థ్యాలపై కంటె అధికారగణం పాలనాపటిమపైనే ఆమె ఎక్కువగా ఆధారపడుతుంది. తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో బ్యూరాక్రసీకి స్వేచ్ఛ ఎక్కువ. డిఎంకె, ఎడిఎంకె రెండు పార్టీలు తమ పథకాల అమలుకై అధికారులనే ఆశ్రయిస్తాయి. ఎమ్మెల్యేలలో విద్యాధికులు తక్కువ, కుటుంబనేపథ్యమూ అంత గొప్పగా వుండదు. పైగా ముఖ్యమంత్రులు అధికారులను గౌరవిస్తూంటారు. ఆ కారణం చేత సాధారణంగా ఎమ్మేల్యేలు అధికారుల పట్ల గౌరవం చూపుతూంటారు. జయలలితకున్న తెలివితేటలు, త్వరగా అవగాహన చేసుకునే సామర్థ్యం, బహుభాషాపరిజ్ఞానం, ఎమ్మెల్యేల డిమాండ్లకు తలొగ్గకపోవడం వంటి లక్షణాల వలన బ్యూరాక్రసీకి ఆమె అంటే అమిత గౌరవం. ఎమ్మెల్యేల కార్యకలాపాలన్నీ వారు ఆమెకు చేరవేస్తూ వుంటారు. ఆ సమాచారంతో ఆమె వారిని నియంత్రిస్తూ వుంటుంది. ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో నిశ్చేతనంగా పడి వున్నా రాష్ట్రం దాని పాటికి అది నడుస్తోందంటే దానికి కారణం బ్యూరాక్రసీయే. మరొక రాష్ట్రమైతే పాలన పడకేసి వుండేదే.
పరిపూర్ణ ఆరోగ్యంతో జయలలిత బయటకు వచ్చిన తర్వాత తన అనారోగ్య వివరాలను యీ మాత్రంగానైనా బయటపెట్టినందుకు పార్టీ అనుచరులపై ఎంత కోపిస్తుందో తెలియదు. తను లేకుండా చూసి తీసుకున్న నిర్ణయాలను తిరగదోడినా తోడవచ్చు. జయలలితకు గుట్టు చాలా ఎక్కువ. తన డయాబెటిస్ పై వార్తలు రాసిన మీడియాపై కేసులు పెట్టిందామె. అందుకే ఆమె అనుచరులు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారంటూ అనేకమందిని అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడే ఓ జోక్ చదివాను – 'మా నాన్న పెళ్లం చచ్చిపోయింది, సెలవు కావాలి' అనడిగాడట ఓ మద్రాసు ఉద్యోగి. 'అమ్మ చచ్చిపోయిందనవచ్చుగా' అని ఆఫీసరు అంటే, 'ఆ ముక్కంటే పోలీసులు అరెస్టు చేస్తారని భయం' అన్నాట్ట ఉద్యోగి! ఈమె అనారోగ్యం సందర్భంగా అనుచరులు, అభిమానులు చేస్తున్న హడావుడి చూస్తూంటే ఎమ్జీయార్ కథ గుర్తుకువస్తుంది. అతనికి సుగర్ వ్యాధి వుంది. డాక్టర్లు వద్దని వారించినా శుబ్భరంగా తినేవాడు. తనకు రోగం వుందని సన్నిహితులకు సైతం ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. అంతా గుట్టే. చివరకు కిడ్నీలు చెడిపోయాయి. 1984 అక్టోబరులో యిదే అపోలో ఆసుపత్రిలో చేర్చి 16 రోజులు వుంచవలసి వచ్చింది. అప్పట్లో ఆయన వ్యక్తిగత వైద్యుడు, మంత్రి అయిన డా|| ఎచ్‌వి హండే ఎమ్జీయార్ ఆరోగ్యపరిస్థితి గురించి ప్రెస్ రిలీజులు యిచ్చేవాడు. ఈ రోజు అలాటివాళ్లు కూడా ఎవరూ లేరు. ఎమ్జీయార్ అభిమానుల దృష్టిలో ఎమ్జీయార్ అజేయుడు, మృత్యువు సైతం అతన్ని ఏమీ చేయలేదు. తమ కిడ్నీలు యిస్తామంటూనే సరిగ్గా చికిత్స చేయకపోతే డాక్టర్లను చంపుతామంటూ కూడా టెలిగ్రాంలు పంపేరు. గుళ్లల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు, మొక్కుల మాట సరేసరి. చివరకు అమెరికా వెళ్లి అన్న చక్రపాణి కూతురు యిచ్చిన కిడ్నీతో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు.
1984 డిసెంబర్లో పార్లమెంటు ఎన్నికలతో బాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిఎంకె నాయకులు 'ఎమ్జీయార్ యిప్పటికే చచ్చిపోయాడు. ఆ విషయం బయటపడకుండా వీళ్లు నాటకమాడుతున్నారు.' అని ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్జీయార్ పోయాడని, బతికి వున్నా జీవచ్ఛవంలా వున్నాడని, అతనికి పక్షవాతం వచ్చి చెయ్యి, నోరు పడిపోయాయని జనాలు నమ్మసాగారు. ఎమ్జీయార్ లేనిపక్షంలో ఎడిఎంకెకు ఎందుకు ఓటేయ్యాలన్న ప్రశ్న రాసాగింది. ఇందిర సానుభూతిని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి ఆమె కొడుకు రాజీవ్ వున్నాడు. ఎమ్జీయార్‌కు పిల్లలు లేరు. ఎమ్జీయార్ బతికే వున్నాడని చూపించడానికి ఆర్ ఎం వీరప్పన్ అనే మంత్రి ఆసుపత్రిలో ఎమ్జీయార్ చికిత్స పొందుతున్న వీడియోను, ఫోటోలను ప్రెస్‌కు రిలీజ్ చేశాడు. ఆసుపత్రిలో బెడ్‌పై కూర్చుని ఎమ్జీయార్ భోజనం చేయడం, పేపరు చదవడం, వచ్చినవాళ్లను పలకరించి మాట్లాడడం (నిజానికి ఎమ్జీయార్‌కు గొంతు పోయింది. ఇండియాకు తిరిగి వచ్చాక చాలా శ్రమ పడితే ఓ మాదిరిగా తిరిగి వచ్చింది. కానీ యీ వీడియోలో కబుర్లు చెపుతున్నట్టు కనబడుతుంది. కనబడుతుంది కానీ వినబడదు. అందువలన అంతా నాటకమనే అనుకోవాలి) అంతా వీడియోలో కనబడుతుంది. ఈ వీడియో ఎన్నికలలో విజయానికి పనికి వచ్చింది కానీ ఎమ్జీయార్ యూత్‌ఫుల్ యిమేజికి దెబ్బ తగిలింది. అది ఎమ్జీయార్‌కు నచ్చలేదట. చివరకు మూడేళ్ల తర్వాత 1987 డిసెంబరులో చచ్చిపోయాడు.
ఇప్పుడు కూడా డిఎంకె నానారకాల పుకార్లు వ్యాప్తి చేస్తోంది. అయినా రాష్ట్రంలో నాయకత్వ శూన్యత ఏర్పడి సంక్షోభం రావాలని, ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆ సాకు చూపించి బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి కోరినట్లు ఏకంగా రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన విధిస్తే, కేంద్రంలో వున్న బిజెపి తన చిత్తం వచ్చినట్లు పాలిస్తూ, తను బలపడదామని చూడవచ్చని వారి భయం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2016)