‘ఆర్టిస్టు’ అనే మాటకు అర్థాలు వీరు!

జార్జ్ వేలంటైన్… ఫ్రాన్స్‌ను ఊపేస్తున్న సూపర్‌స్టార్. క్రేజీస్టార్. అంతేనా.. సినిమా అతడికి పంచ ప్రాణాలు. స్టార్‌గా వెలుగొందుతున్న ఆభిజాత్యపు మనిషే అయినా.. సినిమా అంటే అపారమైన అభిమానం. ఇలాంటి స్టార్‌కు ఉన్నట్టుండి సినీఇండస్ట్రీ షాకిస్తుంది.…

జార్జ్ వేలంటైన్… ఫ్రాన్స్‌ను ఊపేస్తున్న సూపర్‌స్టార్. క్రేజీస్టార్. అంతేనా.. సినిమా అతడికి పంచ ప్రాణాలు. స్టార్‌గా వెలుగొందుతున్న ఆభిజాత్యపు మనిషే అయినా.. సినిమా అంటే అపారమైన అభిమానం. ఇలాంటి స్టార్‌కు ఉన్నట్టుండి సినీఇండస్ట్రీ షాకిస్తుంది. మీ రోజులు పోయాయని అంటుంది.. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచ సినిమా మూకీల నుంచి టాకీల వైపు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న వేళ అది. కాలంతో పాటు మనిషి రూటూ మార్చాలి లేకపోతే.. అంతే! ఈమాత్రం లౌక్యం తెలియక కాదు.. మూకీలోనే మహత్తు ఉందని మనస్ఫూర్తిగా నమ్మాడు ఆ స్టార్ హీరో. మూఢనమ్మకం కాదు.. మూకీ అంటే ప్రేమ. స్టూడియో ఓనర్‌కు మాత్రం ఆ నమ్మకం, ప్రేమ లేదు. మా స్టూడియో నుంచి మూకీలు ఇక తీయబడవు.. అన్నీ టాకీలే అని అతడు పేపర్ ప్రకటనా ఇచ్చేశాడు! టాకీలు చేద్దామంటే.. ఓకే, లేకపోతే నువ్వే అవసరం లేదని ఆస్టార్ హీరోకీ స్టూడియో ఓనర్ స్పష్టం చేశాడు!

రాజీ పడటమా… తన స్థాయికి అంతకు మించిన చిన్నతనం లేదు.. తెగించాడు. సొంతంగా నిర్మాతగా మారాడు. ‘‘టియర్స్ ఆఫ్ లవ్’’.. మూకీ మీద ప్రేమతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా రూపొందించిన సినిమా. దాని క్లైమాక్స్‌లో హీరో పాత్ర ఒక ఊబిలో మునిగిపోతుంది. విషాదంతం. వేలంటైన్ కెరీర్‌కు కూడా అదే అనుభవం. సినిమా ప్లాఫ్.. మూకీలకు కాలం చెల్లిపోయిందని రుజువైంది.. వేలంటెయిన్ ఆస్తులూ హారతి కర్పూరాలయ్యాయి… ఆ తర్వాత కూడా రాజీపడకుండానే పయనం సాగిస్తాడు ఆ ఫ్రెంచి స్టార్ హీరో… ఇదంతా కల్పిత కథే. దీనికే ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ప్రసిద్ధ ‘‘ద ఆర్టిస్ట్’’ సినిమా కథ ఇది. 2012లో ఆస్కార్ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన మూకీ డ్రామా ‘‘ద ఆర్టిస్ట్’’. ఇండస్ట్రీ మూకీల నుంచి టాకీల వైపు పరిణామక్రమం చెందుతున్న వేళ రాజీపడలేకపోయిన.. ఒక స్టార్ హీరో కథగా ఆ సినిమా రూపొందింది. సిసలైన ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో నిర్వచనమిచ్చింది.

మరి.. సినిమా మత్తులో అంతలా కూరుకుపోయిన స్టార్లు ఉంటారా? సినీ రంగాన్ని బాగా సంపాదించుకోవడానికి ఒక మార్గం, ఇంకో రకమైన విలాసాల స్వర్గధామంగా, స్టార్‌డమ్ అంటే అది సినిమాపై తమకు ఉన్న ప్రేమకు నిరూపణగా కాకుండా.. అభిమానాన్ని రాజకీయంగానో మరో రకంగానో క్యాష్ చేసుకోవాలని చూసే వాళ్లు కాకుండా.. సినిమా కోసం తమను తాము హారతి కర్పూరంగా కాల్చుకోగల తారలు ఉంటారా? అంటే.. అందుకోసం ఎక్కడికో హాలీవుడ్ వరకూ వెళ్లనక్కర్లేదు.. తాము నమ్మిన సిద్ధాంతం కోసం సర్వాన్నీ ఒడ్డి పోరాడుతున్న తారలు మన దగ్గరే కనిపిస్తారు.

వీళ్లకు బోలెడంత క్రేజ్ ఉంది, కమర్షియల్ రూట్లో దాన్ని క్యాష్ చేసుకోగల సత్తా కూడా ఉంది. కానీ.. ప్రతిసారీ అలాంటి బాటనే ఎంచుకోరు. సినిమాపై ప్రేమలో.. ఆభిజాత్యంలో.. రాజీపడని తత్వంలో.. వీళ్లు జార్జ్ వేలంటైన్‌ను ఏమాత్రం తీసిపోరు. అది కల్పితపాత్ర.. వీళ్లు కళ్లముందు కనిపిస్తున్న మనుషులు.

‘అమావాస్య చంద్రుడు’ పేరులోనే ఏదో దుశ్శకునం ఉందని.. ఈ కాన్సెప్టును తెరెకక్కించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదట. దక్షిణాది భాషలన్నింటిలోనూ అప్పటికే పేరు ప్రఖ్యాతులు కలిగిన కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్నా.. హీరోనే అంధుడు అయితే సినిమా చూసేదానికి వచ్చేదెవరు? అనే మిమాంసతో చాలా మంది నిర్మాతలు డ్రాప్. వేరే స్టార్ హీరో అయితే.. అసలు అలాంటి సినిమాలో నటించడానికే ఒప్పుకోడు. అక్కడ ఉన్నది కమల్. నటించడమే కాదు.. నిర్మాణానికి కూడా ముందుకొచ్చాడు. అన్నదమ్ములను ప్రొడ్యూసర్లుగా కూర్చోబెట్టి అంతా తనే చూసుకున్నాడు. సినిమా అట్టర్ ప్లాఫ్. నష్టాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత హీరోగా కెరీర్ దెబ్బతినకపోయినా.. చేతినిండా అవకాశాలు, మంచి రెమ్యూనరేషన్లు పొందుతున్నా.. ఆ సినిమా నష్టాల నుంచి బయటపడటానికి దాదాపు పదేళ్లు పట్టాయి!

అంత చేదు అనుభవం.. ఎవరూ కోరుకోని అనుభవం. అయితేనేం.. మళ్లీ అయినా రాజీ పడ్డాడా? ప్రయోగాలకు పెట్టింది పేరైన  కమల్ సగటు స్టార్ హీరోలు చేయడానికి ముందుకు రాని కాన్సెప్టుల్లో హీరోగా నటించడమే కాదు.. డబ్బులొస్తాయో రావో… అని పేరున్న నిర్మాతలు వెనుకడుగు వేసే స్థాయి సినిమాలనూ నిర్మించాడు. అప్పుల పాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు.. మళ్లీ నిలబడ్డాడు… అయితే ఇప్పటికీ అలాగే నడుస్తున్నాడు. ప్రయోగాలు చేస్తూ.. పడుతూ లేస్తూ.. మరి ఇలాంటి కమల్ మించిన ‘ద ఆర్టిస్ట్’ ఎక్కడ ఉంటాడు?!

కమర్షియల్ సినిమాను అస్సలు పట్టించుకోకుండా.. ఆర్ట్ సినిమా రూట్లో వెళ్లిపోయే వాళ్లు కాదు… కమర్షియల్ స్ట్రీమ్‌లో ప్రత్యేక పాయగా ప్రస్థానాన్ని సాగించే వాళ్లే సిసలైన ప్రత్యేకం. ఒక ఆర్.నారాయణ మూర్తి, మరో రామ్‌గోపాల్ వర్మ… హిట్లిస్తున్నారా, ప్లాఫులిస్తున్నారా కాదు.. వీళ్ల బాణీ వీళ్లది. తమిళ దర్శకుడు బాలా.. సినిమా కోసం శరీరంతో ప్రయోగాలు చేస్తూ హెల్త్‌సైన్స్‌కు సవాలు విసిరే విక్రమ్.. వీళ్లూ జార్జ్ వేలంటైన్ అంశమే అనుకోవాలి.

‘ద ఆర్టిస్ట్’ సినిమాలో హీరో టాకీల్లో నటించడానికి చేతగాక కాదు.. అలాగే మణిరత్నం లాంటి దర్శకుడు ఏదో మామూలు కమర్షియల్ సినిమా చేసి కలెక్షన్లను రాబట్టలేకా కాదు.. వాళ్లంతే, వాళ్ల దారి వాళ్లదే.

ఏం సంపాదించుకుందో తెలీదు పాపం.. సౌందర్య. ‘ద్వీపా’ సినిమాకు స్వయంగా నిర్మాతగా మారింది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న వేళ.. సంపాదించుకునే మార్గాన్ని వదిలి, ఆ ప్రయోగాత్మక సినిమా కోసం డబ్బులు పెట్టి మరీ నటించింది. ఏ లోకన ఉన్నా.. సిసలైన నాయికగా సౌందర్యను ఇలాంటి సంర్భంలో స్మరించుకోవాల్సిందే.

సమంతా తపనా ఇదే..  మంచి కథేం దొరకకపోవడంతో కన్నడలో ప్రశంసలు పొందిన ఒక సినిమా కోసం స్వయంగా నిర్మాతగా మారుతోంది.

ప్రధాన పాత్రలో పెడితే పారితోషకం గురించి పట్టించుకునేవాడు కాదు శ్రీహరి. హీరో పాత్రను ఇస్తే.. పారితోషకం సంగతి సినిమా విడుదలై, లాభాలు వచ్చినప్పుడు. అదీ కాదంటే.. హీరోగా అవకాశం ఇస్తే ఫ్రీగా నటించాడు. మరో హీరో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు వేషం అంటే.. అప్పుడు ఆయన రేటు వేరే. అది కోట్లలో ఉండేది! ‘మీరే హీరో..’ అంటే మాత్రం ఆయన మనసు వేరే!

తను ప్రయోగాలు చేయగలడు.. వైవిధ్య భరితమైన సినిమాల్లో నటిస్తుంటాడు. అయితే.. అంతటితో ఆగిపోతే మజా ఏముంది. అందుకే ధనుష్.. తను చేయలేకపోతున్న వైవిధ్య భరిత సినిమాల్లో ఏదో విధంగా తన ప్రమేయం ఉండేలా చూసుకుంటున్నాడు. నిర్మాతగా మారి ప్రశంసలు అందుకునే సినిమాలు తీస్తున్నాడు. అతడి ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమా ఒకటి ఆస్కార్ బరిలో కూడా నిలిచి, ఫలితాల కోసం వేచి ఉంది.

వీళ్లంతా ఈతరం వాళ్లు ‘ఆర్టిస్ట్’లు. వీరి మధ్యనే ఇంకా కొంతమంది ఉన్నారు.. ఇంకా అనేక మంది, తరచి చూడాలి. వారి తపన అర్థం అవుతుంది. తమ జీవితకాలమంతా ఒకటీ రెండు ప్రయోగాలు చేసి.. ఎంత త్యాగం చేశామో అని ఫీలయ్యే నంబర్‌వన్ స్టార్ హీరోలు, కొత్తదనాన్ని వెదికే శక్తి లేక.. ఎవడు హిట్టు కొడతాడా, దాన్ని రీమేక్ చేసి.. సేఫ్ జోన్లు ఉందామా అనుకునే ట్రెండ్ సెట్టర్లకు ఈ జాబితాలో స్థానం ఉండదు. సినిమాతో సంపాదించుకున్న ఇమేజ్‌తో రాజకీయాల్లో సంపాదన మరిగిన వాళ్లు… ఎంత సూపర్ స్టార్లు అయినా.. ఇలాంటి వాళ్ల ముందు మరగుజ్జులే!

‘ద ఆర్టిస్టు’ సినిమాకు క్లైమాక్సూ ఉంది. రాజీపడని జార్జ్ వేలంటెయిన్ స్టార్ స్టేటస్ కోల్పోతాడు. పెంపుడు కుక్క తప్ప ఆఖరికి ఎవరూ పట్టించుకోని స్థితికి చేరతాడు. అంతటితో కథ అయిపోదు.. మరో మూకీతో అతడి పునఃవైభవం మొదలవడంతోనో సినిమాకు శుభంకార్డు పడుతుంది, అదెలా అనేది? వర్ణించడానికి సాధ్యం అయ్యే పని కాదు. సినిమా ఇమేజ్‌ను క్యాష్ చేసుకుందామనుకునే స్టార్లకు ఉంటుందేమో కానీ, సిసలైన ఆర్టిస్టు వైభవానికి ఏనాటికీ అంతం ఉండదు.

-జీవన్ రెడ్డి.బి