కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ చనిపోయి నాలుగు వారాలవుతోంది. అతని కూతురు, రాజకీయవారసురాలు మెహబూబా వెంటనే అతని స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తుందనుకుంటే ఆమె ఉలుకూపలుకూ లేకుండా కూర్చుంది. గవర్నరు పిలిచి సంగతేమిటి, ఎవరైనా వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, రాష్ట్రపతి పాలన కొనసాగించాలా అని అడగాల్సి వచ్చింది. ఇది ఎవరికీ, ముఖ్యంగా మన తెలుగువాళ్లకు మింగుడపడటం లేదు. మన చుట్టూ వున్న నాయకులెటువంటివారు? తండ్రి దుర్మరణం పాలైతే శవం వుండగానే కొడుకు కోసం సంతకాలు సేకరించినవారు, అలా మరణించకుండా పూలరంగడిలా మళ్లీ పెళ్లి చేసుకున్న మామగార్ని వెన్నుపోటు పొడిచి దింపేసినవారు, దళితుణ్ని సిఎం చేస్తానని ఓట్లడిగి తనే కుర్చీ ఎక్కేసినవారు.. యిలాటివాళ్లను చూస్తూ రాజకీయాలంటే యిలాగే వుంటాయనుకుంటూంటే యీ మెహబూబాకు యింత విముఖతేమిటి అనే ఆశ్చర్యం కలగదా? సోదరుడు చనిపోయేక తల్లి బలవంతంమీద రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ లాటిదా యీమె అనే సందేహమూ రావచ్చు. అలాటిదేమీ లేదు. సయీదా రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లయింది. నిజానికి వద్దామని ఆమె కూడా అనుకోలేదు. తన తండ్రి కాంగ్రెసు నాయకుడు. నలుగురు పిల్లల్లో పెద్దామె యీమె. మేనబావనే పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లల్ని కంది. అయితే భర్తతో పొసగలేదు. విడాకులు తీసుకుని, కూతుళ్లతో సహా 1987లో ఢిల్లీకి వెళ్లిపోయింది. 1989లో కశ్మీర్లో తీవ్రవాదం ప్రబలడం, వాళ్ల చేతిలో చెల్లెలు కిడ్నాప్‌కు గురికావడం ఆమెను భయపెట్టాయి. కశ్మీర్ జోలికి వెళ్లకుండా ఢిల్లీలోనే వుండిపోవాలనుకుంది. ఎయిర్‌లైన్సులో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. పిల్లలకు బాగా చదువు చెప్పించింది.
తీవ్రవాదం పెచ్చరిల్లడంతో కేంద్రం కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించి ఆరేళ్ల్ల తర్వాత 1996లో ఎన్నికలు నిర్వహించబోయింది. అయితే కాంగ్రెసు తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. కాంగ్రెసు అధ్యక్షుడిగా వున్న ఆమె తండ్రి ముఫ్తీ గత్యంతరం లేక తన కుటుంబసభ్యులకే టిక్కెట్లు యిచ్చాడు. భార్య గుల్షన్‌ను పహల్‌గాంవ్ నుంచి నిలబెట్టాడు. తన సొంత వూరైన బిజ్‌బెహారాలో కొడుకు తస్సాదక్ హుస్సేన్‌ను నిలబెడదామనుకున్నాడు. కానీ అతనికి వయసు చాలలేదు. (వయసు వచ్చిన తర్వాతైనా అతను రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమా రంగంలోకి వెళ్లాడు. అతని చిన్న మేనకోడలు, మెహబూబా కూతురు కూడా అతన్ని అనుసరించింది. ముఫ్తీ పోయిన తర్వాత అతన్ని పార్టీ సమావేశానికి పిలిస్తే వచ్చి కాస్సేపు కూర్చున్నాడు తప్ప తండ్రి స్థానం తీసుకుందామని అనుకోలేదు) అందుచేత పెద్ద కూతురు మెహబూబాను ఢిల్లీ నుంచి రప్పించి నువ్వు ఒంటరిగా అక్కడ వుండడం బాగాలేదంటూ నచ్చచెప్పి అభ్యర్థిగా నిలబెట్టాడు. అప్పటికి ఆమె వయసు 36. తండ్రి మాట కొట్టేయలేక ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసింది. తల్లి ఓడిపోయింది కానీ ఆమె నెగ్గింది. మూడింట రెండు వంతుల మెజారిటీతో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పరచగా యీమె ప్రతిపక్ష నాయకురాలై పోయింది. 1999లో ముఫ్తీ కాంగ్రెసు వదిలేసి, సొంత పార్టీ పిడిపి (పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ)ని స్థాపించినపుడు ఆమె అతనికి కుడిభుజంగా పనిచేసింది. భద్రతాదళాల చేతిలో మిలిటెంట్లు చనిపోయినపుడు ప్రజలు అధికారంలో వున్న నేషనల్ కాన్ఫరెన్సుపై ఆగ్రహం చూపేవారు. ఈమె వాళ్లింటికి వెళ్లి ఓదార్చి వస్తూండేది. వేషభాషల్లో తనను తాను పూర్తి కశ్మీరీ మహిళగా చూపించుకుని వారికి ఆత్మీయురాలిగా మారింది. 2008 ఎన్నికలలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఆమె మాజీ భర్త ఇక్బాల్‌ను నేషనల్ కాన్ఫరెన్సు పిలిపించినా కశ్మీరు మహిళలు ఆమెనే ఆదరించారు. ముఫ్తీ రాజకీయ చతురత చూపిస్తూ వుంటే యీమె కార్యకర్తలతో బంధం పెంచుకుంటూ పోయింది.
పార్టీ ఏర్పడిన మూడేళ్ల తర్వాత 2002లో వచ్చిన ఎన్నికలలో పిడిపికి 16 సీట్లు వచ్చాయి. పిడిపి, కాంగ్రెసు సంయుక్త ప్రభుత్వం ఏర్పడింది. దఫదఫాలుగా ముఖ్యమంత్రి పదవి మార్చుకోవాలనే ఒప్పందంతో ముఫ్తీ తొలి మూడేళ్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆరేళ్ల తర్వాత (మన దగ్గర ఐదేళ్ల కోసారి ఎన్నికలైతే అక్కడ ఆరేళ్ల కోసారి) 2008లో పిడిపికి 21 సీట్లు వచ్చాయి. అప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెసు కలిసి ఒప్పందానికి వచ్చి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈమె ప్రతిపక్షంలో వుంటూ వాళ్లపై ఘాటు విమర్శలు చేసేది. ఆమె నిరంతర కార్యశీలత కారణంగా దక్షిణ కశ్మీర్ పిడిపికి కంచుకోటగా మారింది. 2014 ఎన్నికలు వచ్చేసరికి పిడిపికి 28 సీట్లు వచ్చాయి. 87 సీట్లున్న అసెంబ్లీలో మెజారిటీ కావాలంటే 25 సీట్లు తెచ్చుకున్న ఆగర్భశత్రువు బిజెపితో చేతులు కలపక తప్పని పరిస్థితి. రాజకీయాల్లో యిలాటి శషభిషలు పెట్టుకోకూడదనుకున్న ముఫ్తీ వారితో కలిసి సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మెహబూబాకు అస్సలు నచ్చలేదన్నది బహిరంగ రహస్యం. ఎన్నికల ప్రచారసభల్లో ఆమె బిజెపిని, మోదీని తిట్టిపోసేది. ఎన్నికల తర్వాత యిలాటి ఏర్పాటు వలన కశ్మీరు లోయలో తమ ప్రతిష్ఠ పోతుందని భయపడింది. ఎందుకంటే కశ్మీర్ లోయలో బిజెపి 36 స్థానాల్లో నిలబడితే 35 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైంది. కానీ ముఫ్తీ ధైర్యంగా ముందుకు వెళ్లాడు. బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అభ్యంతరం తెలిపిన తన కార్యకర్తలకు పిడిపి '2014 వరద బాధితులను ఆదుకోవాలంటే రూ. 50 వేల కోట్లు కావాలి. కాంగ్రెసుతో లేదా నేషనల్ కాన్ఫరెన్సుతో చేతులు కలిపితే ఒరిగేదేముంది? డబ్బు కోసమే బిజెపితో రాజీ పడుతున్నాం' అంటూ చెప్పింది. వాళ్లు సరిపెట్టుకున్నారు. కానీ ఆచరణలో జరిగినదేమిటి?
2015 నవంబరులో మోదీ ప్రకటించిన రూ. 80 వేల కోట్ల ప్యాకేజీలో వరద బాధితుల పునరావాసానికి యిప్పటిదాకా యిస్తానన్నది రూ. 8 వేల కోట్లు. మొదటి విడతగా యిచ్చినది రూ. 1200 కోట్లు. అది కూడా ముఫ్తీ 'ఫ్లడ్ చెక్కు, చెక్కు' అంటూ ఆసుపత్రి మంచం మీద నుంచి కూడా కలవరించగా చివరకు జనవరి 4 న అరుణ్ జైట్లీ సంతకం పెట్టాడు. మూడు రోజులకే ముఫ్తీ కన్ను మూశాడు. ముఫ్తీ పదినెలల కాలంలో విద్య, వైద్యసౌకర్యాలు ఏమీ మెరుగుపడలేదు. విద్యుత్ కోతలు ఎక్కువై పోవడంతో పరిశ్రమలు రాలేదు. యువకులందరూ నిరాశానిస్పృహలతో తీవ్రవాదం బాట పట్టి లష్కరే తొయిబాలో, హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరుతున్నారు. సాధారణ ప్రజల విషయానికి వస్తే తీవ్రవాదంతో వ్యవహరించే విధానం విషయంలో ముఫ్తీ గుంజాటన వలన కశ్మీరు లోయలో అతనిపై గౌరవం పోయింది. కితం నెలలో ముఫ్తీ స్వగ్రామంలో ముగ్గురు మిలిటెంట్లను సైన్యం మట్టుపెట్టినపుడు ముఫ్తీ సొంత యింటిపై స్థానిక ఆందోళనకారులు దాడి చేసి యింటి కప్పుపై పాకిస్తాన్ జండా ఎగరేశారు. అతనేమీ చేయలేకపోయాడు. ముఫ్తీ గతంలో ముఖ్యమంత్రిగా వుండగా యిలాటి సంఘటనను వూహించలేం కూడా. బిజెపితో పొత్తు తర్వాత అతని కంచుకోటలోనే అతనికి పాప్యులారిటీ అడుగంటింది.
దీనికి కొలమానం ఏమిటంటే అతని అంత్యక్రియలకు హాజరైన జనాలు కేవలం వెయ్యికి లోపే! అతను కొద్దికాలంగా అస్వస్థుడిగా వుంటూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందాడు. చనిపోయిన తర్వాత మోదీ, రాజనాథ్ సింగ్ ఎయిర్‌పోర్టుకు వచ్చి శవపేటికపై పూలగుచ్ఛం వుంచారు. అంత్యక్రియలు కశ్మీరులో జరిగాయి. కశ్మీరు సింహంగా పేరు పొందిన షేక్ అబ్దుల్లా పోయినపుడు ఇందిరా గాంధీ స్వయంగా అంత్యక్రియలకు హాజరయ్యారు. పదిలక్షల మంది జనం వచ్చారు. ఇప్పుడు మోదీ వెళ్లలేదు సరి కదా పఠాన్‌కోటకు వెళ్లినపుడు అట్నుంచి అటే కశ్మీరు వెళ్లి మెహబూబాను పరామర్శించ లేదు కూడా. సంతాపదినాల్లో నాల్గవ రోజున సమాధికి అందరూ వెళ్లి ప్రార్థనలు చేస్తారు. అప్పుడు కూడా కేవలం 5 వేలమంది వచ్చారు. అదీ ముఫ్తీ స్వస్థలంలో! మూణ్నెళ్ల క్రితం లష్కరే తొయిబా పాకిస్తాన్ కమాండర్ అబూ కాసిమ్ అంత్యక్రియలు జరిగినప్పుడు 30 వేల మంది వచ్చారు. ఎన్కౌంటర్లలో పాకిస్తాన్ తరఫున పని చేసిన ఉగ్రవాదులు చచ్చిపోతే వారి కోసం పుల్వామా పట్టణంలో స్మారకచిహ్నం కడతామంటే ముఫ్తీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాంతో పదిహేను రోజుల పాటు దుకాణాలు మూసేసి బంద్ నిర్వహించారు. ఇవన్నీ పిడిపికి ఒకప్పటి కంచుకోట అయిన దక్షిణ కశ్మీరులో జరుగుతున్నాయి. వీటివలన బిజెపితో తమ పొత్తును తమ ఓటర్లు ఆమోదించలేదని, 16 ఏళ్లగా నిర్మించుకున్న పార్టీ యంత్రాంగం కుప్పకూలుతోందని గ్రహించింది. కానీ బిజెపితో తెగతెంపులు చేసుకునే ధైర్యమూ చేయలేకపోతోంది. చేసుకుంటే తన తండ్రివి అవకాశవాద రాజకీయాలని నిరూపించినట్లవుతుంది. కాదని కాంగ్రెసును వాటేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులకు గండి పడవచ్చు. కేంద్రం సహాయం లేనిదే కశ్మీర్లో తెల్లవారదు. బిజెపిని నట్టేట ముంచి కాంగ్రెసుతో జతకడితే మెహబూబా ప్రభుత్వానికి మోదీ చేయూత నిస్తాడనుకోవడం భ్రమ. సోనియా గాంధీ, గులాం నబీ యితరులు పరామర్శకు వచ్చినపుడు బేరసారాలు సాగాయేమో తెలియదు. 12 సీట్లున్న కాంగ్రెసు తో చేతులు కలిపినా మరో నలుగురు ఎమ్మెల్యేలు కావలసి వస్తారు.
ముఫ్తీ పోయిన తర్వాత బిజెపి నాయకులూ తొందర పడటం లేదు. అంత్యక్రియలకు రామ్ మాధవ్, నితిన్ గడ్కరీ వచ్చారు. సంతాపదినాలు నడుస్తూండగానే బిజెపి నాయకులు జమ్మూలో పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లారు. ఇప్పుడు ముఫ్తీ పోయాడు కాబట్టి వంతుల వారీగా తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నారని వార్త వచ్చింది. మూడేళ్లు పిడిపికి, మూడేళ్లు బిజెపికి అనుకుంటే పిడిపికి యింకా రెండేళ్ల ఛాన్సుంది. ఈ లోపునే సిఎం మార్పు ఒప్పుకుంటారా? విరుద్ధ భావాలు కల బిజెపితో కలిసి ప్రయాణం సాగించాలంటే ముఫ్తీకున్నంత ఓర్పు మెహబూబాకు లేదు. ఆమెకు ఆవేశకావేషాలు హెచ్చు. పైగా పిడిపిలో అంతఃకలహాలు కూడా వున్నాయి. బేగ్, తారీఖ్ కారా అనే యిద్దరు నాయకులకు ఎప్పుడూ పడదు. వాళ్లిద్దరూ బిజెపితో తెగతెంపులు చేసుకోమని బహిరంగంగా చెప్తున్నారు. ఇద్దరం మెహబూబాకు మద్దతిస్తాం అంటున్నారు కానీ బిజెపి కొత్త డిమాండ్లు, ఎక్కువ పదవులు అడిగితే ఏమవుతుందో తెలియదు. కశ్మీర్, జమ్మూ రెండు ప్రాంతాలకూ వేర్వేరు ప్రయోజనాలున్నాయి. పిడిపి, బిజెపి ఆ యా ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఈ సంకీర్ణం వలన వాటి కార్యకర్తలు, ఓటర్లు అసంతృప్తిగా వున్నారు. అయితే మెహబూబా కాడి పారేస్తే, ఆమె పార్టీ నాయకులు అందివచ్చిన అధికారాన్ని ఎందుకు వదులుకోవాలని వాదించవచ్చు. అందుకని మరిన్ని షరతులతో మెహబూబా ముందుకు వస్తోంది. అభివృద్ధి పథకాలు పెంచాలన్న కోరిక ఎలాగూ కోరింది. వరద బాధితుల పునరావాసం ప్రధాన అంశంగా వుంది. అది జరిగితే పిడిపికి పేరు వస్తుంది. కేంద్రం నిధులివ్వకుండా ఆపడం వలన పిడిపికి పేరు రాకుండా పోయింది. దీనికి తోడు వేర్పాటువాదులతో వ్యవహరించేందుకు తమకు స్వేచ్ఛ నివ్వాలని మెహబూబా కోరుతోంది. తాము చెప్పిన చోటకి సైన్యదళాలు తరలి వెళ్లాలని ముఫ్తీ సెప్టెంబరు 29న బహిరంగంగా కోరాడు. దాన్ని అమలు చేయమని ఆమె అడుగుతోంది. ఇవన్నీ ఎప్పటికి తేలతాయో, కశ్మీరులో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. దేశభద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన రాష్ట్రంలో యిలాటి అనిశ్చితి దేశానికే ముప్పు అనడంలో రెండో మాట లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)