భీమేశ్వరరావుని చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియటం లేదు రేఖకు.. పక్క వాటాలో అతను దిగినప్పుడు ‘పేరుకు తగ్గట్టే ఉన్నాడే’ అనుకొని నవ్వుకొంది. ఈ మధ్య తన వెంటపడి సతాయించడంతో ఏడుపొస్తోంది. అతనికీ బుద్ధి ఎందుకు పుట్టిందని బాధపడింది. అతని భార్య సన్నగా, సగం ప్రాణంతో బతుకుతున్నట్టుంటుంది. తనలా పుష్టిగా, కళకళలాడుతూ వుండదు. అందుకేనేమో! మరి అన్నాళ్లూ కాపురం చేసేడే! ఇద్దరు ఆడపిల్లలు. డిగ్రీ ఫస్టియరు, ఇంటరు ఫస్టియరు చదివే ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యేడే! ఆంతకాలం పనికొచ్చిన భార్య ఇప్పుడు తనను చూడగానే పనికిరాకుండా పోయిందా? ఈయనేదో రసికుడిలా పెద్దగా గొంతేసుకొని వెధవ జోకులేస్తూ, తనే నవ్వుతూ, తుళ్లుతూ హడావుడి చేస్తూ తిరుగుతాడు. ఆవిడ ఏదో మరో లోకం గురించి ఆలోచిస్తున్నట్టు పరధ్యాన్నంగా వుంటుంది. వంటిల్లే కైలాసంగా బతుకుతుంది. ఆతనిలో కుర్రతనం పోకపోయినా భార్యకు ముసలితనం ముంచుకొచ్చినందుకు వాళ్లిద్దరి మధ్యా అంతరం పెరిగిందా?
ఇవన్నీ కాదేమో. తనది నర్పు ఉద్యోగం అని తెలియగానే అతనికి ఇటువంటి అభిప్రాయం కలిగి వుంటుంది. అదేం దురదృష్టమో, కొన్ని ఉద్యోగాలలో పనిచేసే ఆడవాళ్లంటే మగాళ్లకే కాదు, ఆడాళ్లకీ చిన్నచూవు. వాళ్లకి శీలం వుండదని వీళ్లకు గట్టి నమ్మకం. ‘నైట్ డ్యూటీలో వార్డులో పేషంట్లను వాళ్ల మానాన వదిలేసి నర్పులూ, డాక్టర్లూ గదుల్లో మజా ఉడాయిస్తారటగా’ అని తనని ఎంతోమంది ఆడిగేరు. కాదని సమాధానం చెబితే వాళ్లకు నచ్చదు. అందువల్ల తను జవాబి చ్చేలోవులే 'నువ్వెందుకు చెప్తావ్' అంటూ వాళ్లు ఊహించుకొన్నదే నిజం అనుకొని ఆనందిస్తారు. ఆకాడికి అడగడం ఎందుకో?
ఇటువంటి వాళ్లు పేషంట్లుగా వచ్చినప్పడు వేవుకు తింటారు. వంగి దుప్పటి సర్దుతూంటే గుండెల కేసి తదేకంగా చూస్తారు. చెయ్యి వెనకగా పోనిచ్చి గిల్లుతారు, చరుస్తారు. కొంతమంది ఒక్కోచోట ఒళ్లు ముట్టుకోమని చంపి అదో రకమైన ఆనందం పొందుతారు. ఇంకా కొంతమంది 'పెళ్లయిందా? నన్ను పెళ్లాడతావా? మా ఆవిడ పోయిందిలే' లాటి ప్రశ్న వేస్తారు. మౌనంగా సహించడంతో వీళ్లింకా రెచ్చిపోతారు. తనిష్టపడుతోందని ఆర్థాలు తీస్తారు. సిస్టర్ అని పిలుస్తూనే యివన్నీ చేస్తారు. ఎనిమిది వాటాల యీ కాంప్లెక్సులో తనతో మాట కలిపే ఆడవాళ్లు ఇద్దరో, ముగ్గురో. తక్కినవారందరూ తనను పాపాత్మురాలిగానే చూస్తారు. వాళ్ల పిల్లలు ఆటల్లో దెబ్బలు తగిలించుకున్నప్పుడు ప్రథమ చికిత్స చేయించడానికో, లేక తమకు జబ్బ మీద కాక వేరే చోట యింజక్షన్ చేయించుకోవడానికి వచ్చినపుడు మాత్రం సిస్టర్, సిస్టర్ అంటారు. అవసరం తీరగానే మొహం తిప్పేసుకుంటారు. ఇవన్నీ ఎవరితోనూ చెప్పకునే బాధలు కావు. బాధపడినా చికాకు మొహం మీద ప్రదర్శించలేని స్థితి.
భీమేశ్వరరావు కూడా ఇటువంటి వాళ్లల్లో ఒకడేమో. ముందులో రెండు మూడు రోజులు మర్యాదగానే మాట్లాడేడు. ఆ తర్వాత తన ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నాక ఆదోలా చూడడం మొదలెట్టాడు. ‘‘మీ హాస్పటల్లో ఫలానా కుర్ర డాక్టరు నాకు బాగా తెలుసు’’ అన్నాడు. ‘‘ఓహో!’’ అంది. ‘‘ఏ నర్సునీ వదిలిపెట్టడటకదా’’ అన్నాడు ఎగాదిగా చూస్తూ. ‘నీ వంతు అయిపోయిందా?’ అని అడుగుతున్నట్ట నిపించింది. ‘‘నాకు తెలియదండి. ఈసారి ఆయన్నడిగి చెప్తాను’’ అని వచ్చేసింది.
నిజానికి తను మాత్రం ఈ ఉద్యోగం కోరి వరించిందా? తన జాతకం బాగుండి వుంటే హాయిగా సామాన్య గృహిణిగా భర్తా, పిల్లలతో కాపురం చేసుకొంటూ వుండేది. అలాంటిది. పుట్టడంతోనే తల్లికి కష్టాలు తెచ్చి పెట్టింది. తన తండ్రి మొదటి భార్య పోయాక తన తల్లిని వంటలక్కగా కుదుర్చుకున్నాడు. అప్పటికే ఆయనకు ఏభై యేళ్లు. పేదరికం వల్ల ముప్ఫయి ఏళ్లు వచ్చినా తల్లికి పెళ్లి కాలేదు. ఎలా సందర్భపడిందో ఇద్దరూ ఒకటయ్యేరు. రహస్యం బయటపడకుండా ఎంతకాలం సాగేదో కానీ తమ కడుపున పడింది. అబార్షన్ చేయించబోయినా కుదరలేదట. ఇక తప్పక ఆయన తల్లిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఎదిగిన కొడుకులు ఎదురు తిరిగారు, తండ్రికి డబ్బు పంపడం మానేశారు. రిటైరయిన తర్వాత ఆయన కొచ్చినదంతా లాక్కున్నారు. పెన్షన్ డబ్బుల్తో జీవితం ఈడ్చుకొస్తూనే అరవయ్యో యేట తండ్రి గుటుక్కుమన్నాడు.
కుటుంబం గడవడానికి తల్లి మళ్లీ వంటలక్క అయింది. వంటపని చేసి నాన్నగారి పరువు మంట కలపవద్దని సవితి కొడుకులు కబురు పెట్టారు. అలాగని డబ్బూ పంపలేదు. తల్లి తన చదువు మానిపించి హాస్పటల్లో పనికి కుదిర్చింది. ఆవిడ ఇంట్లోంచి బయటకు రాకుండా ఏవేవో పనులుచేసి నడుపుకొచ్చింది. హాస్పిటల్లో పనిచేస్తూ తను నర్సు కోర్సు పాసయి నర్సయ్యేక తల్లి చేత ఆ పనులన్నీ మాన్పించింది. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా పాడయిపోవడంతో పెళ్లి మానుకొని తన దగ్గరే పెట్టుకొంది. ఆవిడని కూడా వెంటబెట్టుకొని కాపురానికి వస్తానంటే ఏ మొగాడూ ఒప్పకోకపోవచ్చు. పెళ్లి మానేయడానికి తనే కల్పించుకొన్న సాకేమో ఇది. తండ్రి ‘చాపల్యం’ గురించి విని, విని సెక్సంటే విముఖత పెంచుకొంది తను. ఆరోగ్యం కోసం ఒళ్లు జాగ్రత్తగా చూసుకొంటుంది తను. దేవుడిచ్చిన అందం వుంది. అంటే దాని అర్థం పెళ్లాడి తీరాలని కాదు. తన వెంట మగాళ్లు పిచ్చికుక్కల్లా పడడం కూడా తన విరక్తికి కారణం కావచ్చు.
పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఎలాగూ లేదు కాబట్టి ఉద్యోగం శ్రద్ధగా చేసుకొంటూంటే ‘నర్సు ఉద్యోగం తలవంపులు తెస్తోంది కాబట్టి (‘పెళ్లీ పెటాకులూ మానేసి పదిమందితో పడుకోవచ్చని ఈ ఉద్యోగం చేస్తోందిట తను’) సవితి అన్నగార్లు పోరు పెట్టారు. ఇక ఆ ఊరొదిలేసి ఈ ఊరొచ్చి వేరే ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించింది. ఏ మాటకా మాట చెప్పాలంటే నర్సు ఉద్యోగం వల్లనే యిల్లు దొరికింది. ఈ ఊళ్లో తనకు యిల్లు అద్దెకు ఎవరూ యివ్వనన్నారు. తనకు పెళ్లి కాకపోవడంతో పాటు, బాగా బలహీనంగా ఉన్న తల్లి తోడుండడం మైనస్ అయింది. ‘ఆవిడ చటుక్కున పోతే, పోయినది మంచి నక్షత్రం కాకపోతే యిల్లు ఆర్నెల్లపాటు ఖాళీగా పెట్టాల్సి వస్తుంది’ అంటూ అందరూ తిరస్కరించారు. ఈ యింటాయన తమ ఆసుపత్రిలో చేరినప్పుడు తన సపర్యలు చూసి మురిసి, తన కష్టం తెలుసుకుని యీ వాటా యిచ్చాడు. తల్లిని తెచ్చుకుని ఉంటోంది. ఏదో నడుస్తోంది అనుకుంటే యీ భీమేశ్వరరావు తగిలాడు.
ఓపారి పొద్దున్నే పూలు కోస్తూంటే, “వయసులో ఉన్నదానివి. ఆ పేషంట్లకు చాకిరీ చేస్తూ బతికే బదులు ఏ డాక్టరు దగ్గరో సెటిలయిపోరాదూ?’’ అన్నాడు వెకిలిగా. “సెటిలవ్వడానికి డాక్టరే ఎందుకు? దమ్మున్నవాడు ఎవడైనా చాలు’’ అంది తను చికాగ్గా. ‘‘అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? నాకు దమ్ము లేదని ఇన్‌డైరక్టుగా చెప్పడమా?’’ అన్నాడు అతను జోక్ చేస్తున్నట్టు. ‘నీ గురించి ఎవడన్నాడ్రా’ అని మనసులో అనుకున్నా, పైకి ఏమనాలో తోచక ఏమీ మాట్లాడకుండా లోపలికి వచ్చేసింది.
ఆ సంఘటనలోంచి ఏమర్థం తీసుకున్నాడో ఏమో అప్పట్నుంచి భీమేశ్వరరావు తనను వలలో వేసుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓ ముత్యాల దండ కొని తెచ్చాడు. హేండ్ బ్యాగ్ ఆఫర్ చేశాడు. స్ప్రే ఒకటీ – తను వద్దన్నకొద్దీ ఇంకా ఖరీదైనవి పట్టుకొచ్చేవాడు. తను తృప్తిపడకపోతే ఇంకా ఖరీదైనవి తెస్తానన్నాడు. నాకిలాటివి యిష్టం ఉండవని చెప్పినా వినటం లేదు. కోపగించుకోబోతే ‘‘ఇంటాయన నాకు బాగా తెలుసు. నువ్వు యింటికి ఎవరెవర్నో తెస్తున్నావని ఫిర్యాదు చేసి, ఖాళీ చేయించేస్తాను.’’ అన్నాడు బెదిరింపుకి జోకు రంగు పులుముతూ. ‘‘మీరేం చెప్పినా ఆయన నమ్మడు. ఇంట్లో మా అమ్మ ఉందని ఆయనకు తెలుసులెండి.’’ అంది తను నవ్వుతూనే. ‘‘నర్సువి. నిద్రమాత్రలకు కొదవా? కావలసినపుడు ఆవిడ పాలలో నిద్రమాత్రలు పడేస్తూంటావని చెప్తా’’ అన్నాడతను గట్టిగా నవ్వుతూ. వరస చూస్తే అన్నంత పనీ చేయగలడన్న భయం వేసింది.
అతని భార్య నడిగి చూసింది ‘ఏమిటీ ఈయన వ్యవహారం?’ అని, ‘ఆయనంతే’ అని నోరు చప్పరించేసిందామె. ‘‘అది కాదండీ, ఆయన నా వెంటబడడం మీరు గమనించే వుంటారు. మా అమ్మకు సరిగ్గా కళ్ళు కనబడకపోయినా అన్నీ గ్రహిస్తుంది. మీరు కళ్లు తెరుచుకొనే వున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా?’’ అంది తను.
“తెలుసమ్మా, కానీ ఏం చేయను? ఆయనకు చపలత్వం వుంది. వయసు పెరిగిన కొద్దీ ఎక్కువౌతోంది కానీ తగ్గటం లేదు. ఇదివరకు పనిమనుషులతో కక్కుర్తి పడేవారు. ఇప్పుడు ధైర్యం పెరిగి పక్కింటివాళ్ల మీద పడ్డారు. చెప్పి చూసేను. వినరు. నోర్మూసుకో అంటారు. ‘నిన్నేం వదిలిపెట్టేయనులే’ అంటూ హామీలొకటి.”
“మీరు పోట్లాడాల్సింది.”
‘‘పోట్లాడి ఏం చెయ్యను? మళ్లీ ఆయన పక్కలోకే చేరాలి. ఇంట్లోంచి బయటకు వెళ్లి స్వతంత్రంగా బతకలేను కదా. నువ్వయితే ఉద్యోగం చేస్తున్నావు. నాకెవరిస్తారు పని? పాచిపని చేసుకుని బతకాలి,. చిన్నప్పడే చదువు మానిపించేశారు. ఆడది ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్లేలాలా? అన్నారు. ‘అలా చేసే అవసరం పడితే!’ అన్న ఆలోచన వాళ్లకి రాలేదు. కాపురం బయట పడేసుకుంటే నా పిల్లల గతి ఏమిటి?”
‘‘మరి ఈ సంగతి ఇంతేనా?’’ ‘‘అది నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి వుందమ్మా!’’
భీమేశ్వరరావుకి ఆశ్చర్యం వేసింది. ఈసారి తను తెచ్చిన రుమార్లు రేఖ ఏమీ అనకుండా తీసుకొన్నందుకు! చిన్న వస్తువు కదాని తీసుకుందా? తను ఖరీదైన వస్తువులు ఇవ్వబోయినప్పుడు వద్దంది. తను డబ్బుకు అమ్ముడుపోయే రకం తెలియచెప్పిందన్నమాట. అది తను గ్రహించుకోలేక పోయేడు. ఇంకా ఇంకా ఖరీదైనవి ఇవ్వచూపాడు. ఈ రుమాళ్లపై ఎంబ్రాయిడరీ నచ్చి కొన్నాడు. ఇస్తే వెంటనే తీసుకొని బాగ్‌లో పెట్టుకొని “థేంక్స్. ఎంతయింది?” అంది.
“అబ్బే ఎవరో తెలిసున్నవాళ్లు ఫ్రీగా ఇచ్చేరు.”
“వాళ్లు మీకిచ్చేరు. నాకు ఫ్రీగా వద్దు. కనీసం మా ఇంట్లో కాఫీ తీసుకోండి, దానికి బదులుగా.”
“ఆ మాటన్నారు, బాగుంది.”
ఆ సాయంత్రం “ఏమండీ ఎలా ఉన్నారు?” అంటూ రేఖ ఇంటికి వెళ్లాడు. కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సౌమ్యంగా మాట్లాడింది. అందకత్తె. పొందికైన శరీరం. ఎక్కువా, తక్కువా కాని కొలతలు. మిసమిసలాడే ఒళ్లు. టానిక్‌లూ, క్రీములూ హాస్పటల్లో ఫ్రీగా దొరుకుతాయేమో!
“ఏమిటీ ఒళ్ళంతా అంత పరీక్షగా చూస్తున్నారు. మీరు డాక్టరీ చదువుతున్నారా? హ్యూమన్ ఎనాటమీ గురించి ఎవరికైనా లెక్చర్లివ్వాలా?” అంది రేఖ చిరునవ్వుతో,
“నేను డాక్టరై, నువ్వూ నేనూ నైట్ డ్యూటీలో పడితే ఎలా వుంటుందాని ఆలోచిస్తున్నాను.”
“నేనిదివరకే చెప్పాను. నాకు డాక్టరైనా, యాక్టరైనా ఖాతరులేదు. మనిషి నచ్చాలంతే”
తన మనసు తొందర పెట్టింది. ‘అడిగేయ్, అడిగేయ్’ అని. బుద్ధి ‘ఆగు, తొందరపడకు’ అంటోంది. ఈలోపునే నాలిక ‘మరి నేను వచ్చానా?’ అంది. అన్నాక ఎందుకన్నానా అన్న పశ్చాత్తాపం మొదలయింది. రేఖ కోపం తెచ్చుకోలేదు. భృకుటి ముడి వేసి తీవ్రంగా పరిశీలనగా చూడడం సాగించింది. తనకు సిగ్గేసింది. తన ఒళ్లు గురించి తనకే తెలుసు. పెద్ద పొట్ట, ఎత్తు పిర్రలు, మొహం బాగా ఉబ్బి వుంటుంది. గారపళ్లు, రాలిపోతున్న జుట్టు. పిక్కలు, తొడలు బాగా కొవ్వు పట్టి వున్నాయి. ‘అయినా అందమనేది ఆడదానికుండాలి గానీ, మగాడి కెందుకు’ అనుకున్నాడు. కానీ రేఖ అలా అనుకోలేదు. తన చుట్టూ ఓ రౌండ్ కొట్టి పెదాలు చప్పరించింది. “మీకు ఒంటి మీద బొత్తిగా శ్రద్ధ లేనట్టుందే’’ అంది. ‘‘బాగా డ్రింక్ అలవాటుందేమో కదా, ఆ బానపొట్టనిండా బీరేనా?’’ అని కూడా అంది.
ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాడు తను ఎలాగైనా శ్రమపడి ఒళ్లు తగ్గించాకనే ఈమె కంట పడాలని. అపుడైనా తనను చేరదీస్తుందన్న నమ్మకం ఏమిటి? “ఒంటికేముందిలే, మనసు మంచిదై యుండాలి” అన్నాడు ఆమె చూపులు తప్పించుకుంటూ. “అలాగా, ఆ తూర్పు వైపు వాటాలో అమ్మమ్మ గారి మనసు చాలా మంచిది. ఎవడెళ్లినా మజ్జిగ ఇస్తుంది” అంటూ లోపలికి వెళ్ళబోయింది రేఖ. “అర్థం లేకుండా మాట్లాడకు” చెయ్యి పట్టుకుని ఆపేడు. రేఖ విదిలించుకోలేదు. ‘‘మీరూ అర్థం లేకుండా మాట్లాడకండి. అందమైన ఆడది కావాలని మొగాడికనిపించినప్పుడు, అందమైన మగాడు కావాలని ఆడది అనుకోకూడదా? పిప్పళ్ళబస్తాలా వచ్చి పక్కమీద దొర్లుతానంటే ఎలా? రెండు నిమిషాలకే ఒళ్ళు కదల్చలేక ఒగరుస్తూ పడిపోతే ఆడది హర్షిస్తుందా? అలా అసంతృప్తిగా మిగిలే బదులు అసలు ఆ జోలికే పోకపోవడం మంచిదనుకుంటుంది.’’
ఎంత పచ్చిగా చెప్పింది? నర్సు కదా, సిగ్గు తక్కువనుకుంటా అని మనసులో అనుకుంటూ, “సరే, ఒళ్ళు తగ్గించాననుకో. అప్పుడు ఒప్పుకుంటావా?” అని అడిగాడు. “ఏం మగాళ్లండీ, కాస్సేపు పోతే రాసి ఇమ్మనేట్టున్నారు. ఏ ఇంట్రస్టూ లేకపోతే ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? నేనేం డబ్బులాశిస్తున్నానా? నాకు మగాళ్ళకి కొదవా? హౌస్ సర్జన్ కుర్రాళ్ల దగ్గర్నుంచి పేరుకెక్కిన సర్జన్ల నుంచి, డబ్బున్న పేషెంట్ల దాకా ఎవరు కావాలన్నా దొరుకుతారు. ఆడదానితో ఎలా వ్యవహరించాలో ముందు తెలుసుకుని రండి. ఒళ్ళు తగ్గించడమే కాదు, బుర్ర కూడా పెంచుకోండి” అని కటువుగా మందలించింది రేఖ.
నిజమే. తనదే తప్పు. అలా అడక్కూడదు. లో క్లాసు వాళ్లతో అలవాటైపోయి, పచ్చిగా అడిగేశాడు. ఏమీ అనుకోవద్దని బతిమాలి వచ్చేశాడు.
ఆ రోజునుంచీ భీమేశ్వరరావు పడని కష్టం లేదు. తాగుడు కట్టిపెట్టాడు. రాత్రి పేకాట మానేసి త్వరగా పక్క మీదకు చేరేవాడు. కళ్ళకింద చారలు పోవాలని తెల్లారే లేచి పరుగులు పెట్టేవాడు. కుక్క కరిచి ఇంజక్షన్లు తీసుకోవలసి వచ్చినా పరుగులు ఆపలేదు. కర్రొకటి భుజాన వేసుకుని పరిగెట్టేవాడు. అది కాళ్ళకు అడ్డం పడుతుండేది. బస్సు మానేసి ఆఫీసుకి సైకిలు మీద వెళ్లేవాడు. గుంజీలు తీసేవాడు. రాత్రిపూట అన్నం మానేశాడు. నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే డాక్టరు చివాట్లు వేశాడు కూడా. ‘ఒకేసారి ఇంత తీవ్రంగా డైటింగ్ చేయకూడదు. క్రమక్రమంగా తగ్గించండి’ అని హితవు చెప్పాడు.
‘ఆయనకేం తెలుసు? నెమ్మదిగా ఒళ్ళు తగ్గిస్తుంటే, ఆ లోపున రేఖ మనసు మార్చుకుంటే? పెళ్ళయి వెళ్ళిపోతే? వేరే యిల్లు వెతుక్కుని వెళ్లిపోతే తను యిక బెదిరించలేడు కడా!’ అనుకుని ఓ ఫ్రెండు నడిగి స్ప్రింగులు తెచ్చి ఎక్సర్‌సైజులు చేశాడు. ఓ స్ప్రింగు తెగి కాళ్ళమధ్య తగిలి, చచ్చే యాతనైంది. డాక్టరు ఈసారి కొట్టినంత పని చేశాడు. ఈ ఎక్సర్‌సైజుల ధర్మమాని అతనికి తిండిమీద, జీవితం మీద ఒకలాంటి విరక్తి కలిగింది. కబుర్లూ, జోకులూ తగ్గాయి. ‘డల్‌గా ఉన్నావేమిటోయ్’ అని అడిగేవాళ్ళు ఎక్కువయ్యారు. ‘వాళ్ళకేం తెలుసు? పరమపద సోపానం మీద అందాల భరిణ సరసన చేరాలంటే నిచ్చెనలెక్కాలి. ఆ నిచ్చెన విరిగిపోకుండా చూసుకోవాలి’ అని తనని తానే ఊరడించుకున్నాడు.
రెణ్నెల్ల తర్వాత రేఖ పలకరించింది ‘‘ఏమండీ? ఏమైనా మార్పు కనబడిందా?’’ అని. “మీరే చెప్పాలి, కొలతలు తగ్గాయో లేదో’’ అన్నాడు భీమేశ్వరరావు పేలవంగా నవ్వి. “రోడ్డు మీద కొలవమంటారేమిటి? రాత్రి ఎనిమిది తర్వాత ఇంటికి రండి. అమ్మ పడుకుంటుంది” అంది రేఖ. ఇన్నాళ్ళూ కోల్పోయిన శక్తి ఒక్కసారి తిరిగి వచ్చినట్టనిపించింది అతనికి. సెంటూ, గింటూ రాసుకుని వెళ్ళాడు. రేఖ టేపు పట్టుకొచ్చి నడుం కొలవబోయింది. “ఇంతేనా? నిజంగా పూర్తిగా ఒప్పుకున్నా వనుకున్నాను” అన్నాడు అతను దిగాలుపడి. ఆమె ఫక్కున నవ్వి, “అప్పుడే! ఆశ్వత్థవృక్షానికి అర రౌండు కొట్టి కడుపు తడిమి చూసుకున్నట్టుంది మీ కథ! పోన్లెండి. టేపు వద్దులెండి. నా చేతుల్తోనే కొలుస్తాను” అంటూ ఆమె అతన్ని నడుం వద్ద కౌగలించుకుంది.
భీమేశ్వరరావు పొంగిపోయి ఆమె నడుం చుట్టేసి గట్టిగా హత్తుకున్నాడు. కానీ ఆమె పరవశించిన దాఖలా కనబడలేదు. ‘‘ఇంతేనా? ఇంకా పట్టు బిగించండి’’ అంది. భీమేశ్వరరావు ఎంత ప్రయత్నించినా ఆమె తృప్తి పడలేదు. చికాగ్గా కౌగిలి విడిపించుకుని “మీదంతా ఊబ శరీరం. ఊరికే మాంసం తప్ప బిగి లేదు. తిండి తగ్గించి ఒళ్ళు గట్టిపడేలా చేయాలి. కౌగలించుకుంటే ఆడదాని ఎముకలు పడపటలాడించాలి గానీ, ఇదేమిటి బులబులాగ్గా..? దూదిబస్తాను వాటేసుకున్నట్టుంది” అంది. భీమేశ్వరరావు ఇక వినలేకపోయాడు. “పనుంది. మళ్ళీ కలుస్తా” అంటూ వెళ్ళిపోయాడు.
ఇంకొక నెలన్నర గడిచాక బరువు చూసుకున్నాడు. ఆరు కిలోలు తగ్గాడు. కానీ వెర్రి నీరసం పట్టుకుంది. ముఖం పీక్కుపోయినట్టు కనబడడం వలన అందరూ ఆరోగ్యం గురించి అడగడం మొదలు పెట్టారు. ఇక అతనికి ఉక్రోషం వచ్చింది. రేఖ తనను ఆట పట్టిస్తోందన్న సందేహం తగిలి ఆమె గురించి దుష్ప్రచారం మొదలెట్టాడు. అవి ఆమె చెవిన పడి మండిపడింది. వదిలించుకుందామని ఎగతాళి చేస్తే అది ఇలా ఎదురు తిరిగినందుకు బాధపడింది. ఏదో ఒకటి గట్టిగా చేయాలనుకుంది.
ఓ రోజు ఆమె బస్సు దిగి వస్తుంటే సైకిలు అడ్డం పెట్టాడతను. రేఖ కోపం ప్రదర్శించకుండా “మీరా! గుర్తుపట్టలేనంతగా మారిపోయారు” అని పలకరించింది. ‘‘నీ ఉద్దేశ్యమూ మారిపోయిందా?’’ అన్నాడు భీమేశ్వరరావు నవ్వకుండా, ‘‘ఈ మధ్య మీరు నూతిదగ్గర నీళ్ళు తోడుతుంటే చూసి అనుకున్నాను, మనం అనుకున్న రోజు వచ్చిందని. ఎలా చెప్దామా అనుకుంటుంటే మీరే కలిశారు.’’
అతని కోపం ఎగిరిపోయింది. సైకిలు దిగి పక్కన నడుస్తూ “ఎప్పుడు? ఎప్పుడు?” అన్నాడు ఆత్రంగా. ‘‘అదే! మీ ఆవిడన్నారు.. శ్రీరామనవమికి మీ ఫామిలీ అంతా మీ సొంతూరు వెళతారని. వాళ్ళని పంపించేసి లీవు దొరకలేదని మీరు ఉండిపోండి. ఆవేళ రాత్రి మన వాటాల మధ్య తలుపు తీసి వుంచండి. మా అమ్మ ఎనిమిది గంటలకల్లా పడుకుంటుంది. ఓ అరగంట చూసి నేను వచ్చేస్తా. రాత్రంతా జాగారం చేద్దాం. సరేనా?” అంది రేఖ.
ఆ రోజు ఆమె రాగానే భీమేశ్వరరావు నసుగుతూనే ఒక కోరిక కోరాడు. “నువ్వేం అనుకోకపోతే నువ్వు నర్సు యూనిఫాం వేసుకుని రా. హైడ్రోసిల్ ఆపరేషన్ చేయించుకున్నపుడు ఓ నర్సు భలేగా వుందనిపించింది. అప్పట్నించీ బులబాటం. నువ్వలా వస్తే నాకు చాలా ఎక్సయిటింగ్‌గా వుంటుంది.’’ “అంతకంటే ఎక్సయిటింగ్ ఐడియా చెప్తా చూడండి. మనిద్దరం ఒకరినొకరు నగ్నంగా ఇప్పటిదాకా చూసుకోలేదు కదా. ఒకేసారి అలా చూసుకునే బదులు స్టెప్ బై స్టెప్ చూస్తే బాగుంటుంది. ఇద్దరం పేకాడదాం. ఒక్కో ఆటలో ఓడినవాళ్లు ఒక్కొక్కటీ బట్టలు విప్పేయాలి. ముందు పైవి, తర్వాత లోపలివీ అన్నమాట. పూర్తి అయ్యేవరకూ ఒంటిపై చెయ్యి వేయకూడదు. సరేనా?” అంది రేఖ.
యూనిఫామ్‌లో రేఖ, భీమేశ్వరరావు లుంగీ, షర్ట్‌తో ఆట మొదలు పెట్టారు. ఓ గంట గడిచేసరికి అతను లుంగీతో మిగిలేడు. రేఖ క్యాప్, సాక్సు మాత్రం తీసేసింది. ‘ఇలా అయితే రేఖను పూర్తిగా చూడడం అసంభవం’ అనుకున్నాడు భీమేశ్వరరావు. ఆటా, గీటా ఏమీ లేదు అనుకుంటూ ఆబగా ఆమెను వాటేసుకుంటూ పెదాలు అందుకుని, ముద్దు పెట్టబోతూండగానే రేఖ ‘‘అబ్బ, దుర్వాసన’’ అంటూ విదిలించుకుంది. ‘‘ఏదీ, నోరు తెరవండి. ఆ పళ్ళకు పట్టిన గార వదలనే లేదు. ఓసారి మా హాస్పటల్‌కి రాకూడదూ. డెంటిస్టుకి చెప్పి తీయించేస్తాను.’’ అంటూ విసుక్కుంది.
భీమేశ్వరరావుకి సగం చచ్చినట్టనిపించింది. ‘తన భార్య ఎప్పడూ ఇలా అనదు. తనేం చేసినా సంతోషించినట్టు కనబడుతుంది’ అనుకుని ముఖాన నవ్వు పులుముకుని కౌగిలి బిగించబోయేడు. ‘‘అబ్బే, ఇదేమి కౌగిలింత! ఒళ్లు తగలడమే లేదు.’’ అంటూ రేఖ దగ్గరకు వచ్చే ప్రయత్నం లాటిది చేసి, ‘‘ఏమీ లాభం లేదు. మధ్య ఈ బొజ్జ ఒకటి’’ అని చీదరించుకుని కౌగిలి విడిపించుకుని దూరంగా వెళ్ళి నిలుచుని అతన్ని క్షుణ్ణంగా పరిశీలించసాగింది.
జువాలజీ లాబ్‌లో కప్పలా ఫీలయ్యేడు భీమేశ్వరరావు. పెదవి కొరుక్కుంటూ మౌనంగా నిలబడ్డాడు. రేఖ పరిశీలన పూర్తయినట్టుంది. ‘‘ఛాతీ మీద, భుజాల మీద అన్ని వెంట్రుకలేమిటి? నెత్తి మీద బొచ్చు రాలిపోతోంది కానీ యిక్కడ మొలుచుకొస్తోంది. చంకల్లో, ముక్కులో, చెవుల్లో ఎక్కడ చూసినా అదే! తీసేసుకుని కాస్త శుభ్రంగా రాలేరూ? ఒళ్లు తగ్గిందన్నాడు తొడలు తగలవేమిట్రా అనుకున్నాను. మధ్యలో యీ బాన బొజ్జ అడ్డొస్తే ఎలా తగులుతాయి! ఇలాంటివాళ్లతో కలిస్తే సెక్స్ మీద విరక్తి పుడుతుంది. కావిలించుకోకుండానే రొప్పుతున్నారు. ఇంక మీ వల్లేమవుతుంది?’’ అంటూ దులిపేస్తోంది.
భీమేశ్వరరావుకి ఉద్రేకం అడుగంటింది. 'దీనితో సెక్స్ కాడు కదా ముఖపరిచయం కూడా అక్కర్లేదు. కసి పుట్టి రేప్ చేయాలన్నా తన వల్ల కాదు. ఇది వదిలితే చాలు’ అనిపించింది. నేల మీద పడిన ఆమె క్యాప్, సాక్స్ ఏరి చేతిలో పెట్టి ఓ నమస్కారం పెట్టాడు. ‘వెళ్ళు మహాతల్లీ’ అన్నట్టు. మర్నాటినుంచీ ఆమె కేసి చూడడానికి కూడా మొహం చెల్లలేదు. ఇంటిపక్కనే వుంటే ఎపుడైనా మొహం చూడాల్సి వస్తుందని పదిహేను రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేడు.
ఇల్లు ఖాళీ చేసేటపుడు భీమేశ్వరరావు భార్య వచ్చి రేఖ చేతులు పట్టుకుంది. ‘‘తల్లీ, ఏం మంత్రం వేశావో కాని మా ఆయన చాలా మారిపోయేరు. నన్నెంతో మెచ్చుకుంటున్నారీ మధ్య. నేను చాలా విశాలహృదయం కలదాన్నట. భర్తలో ఏ లోపం వున్నా ఎత్తిచూపకుండా సహకరిస్తానట. ఆడదంటే నాలాగా వుండాలిట. ఇక ఎవ్వరి జోలికీ వెళ్ళరట…’’ అంటూ చెప్పుకొచ్చింది.
వ్యథావనితాయణం సీరీస్‌లో మరో కథ వచ్చే నెల మొదటి బుధవారం
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)