టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు లోకేశ్ పాదయాత్రపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. లోకేశ్ పాదయాత్ర వల్ల పార్టీకి లాభం సంగతి దేవుడెరుగు… తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీనియర్ నేతలు తమ ఆందోళనను అధినేత చంద్రబాబు వద్ద వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
నాయకుడిగా లోకేశ్ తనను ఆవిష్కరించుకోవడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించారు. కొడుకును నాయకుడిగా చూడాలనేది తండ్రిగా ఆయన ఆశ. అయితే గతంలో కంటే లోకేశ్ పరిణతి సాధించినప్పటికీ, లాభం తెచ్చేంతగా ఎదగలేదనేది టీడీపీ సీనియర్ నేతల వాదన.
లోకేశ్ జనంలోకి వెళ్లిన తర్వాత తెలిసీతెలియక ఏది పడితే అది మాట్లాడితే కొత్త ఇబ్బందులు వస్తాయని టీడీపీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముంగిట ఇది పార్టీకి తీవ్ర నష్టం తెస్తుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. లోకేశ్ అజ్ఞానం, ఆవేశం వల్ల పార్టీకి వాటిల్లే నష్టం గురించి ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి దృష్టికి సీనియర్ నాయకులు తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే తన చేతల్లో ఏమీ లేదని, మంచోచెడో లోకేశ్ వెంట నడవాల్సిందే అని చెప్పినట్టు సమాచారం.
పార్టీలేదు, బొక్కా లేదు అని తిరుపతిలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి, కొంత నష్టపోయానని, పదేపదే మూల్యం చెల్లించుకోలేనని అచ్చెన్నాయుడు అంటున్నారని తెలిసింది. కొడుకు పాదయాత్రపై సీనియర్ నేతలు వెల్లడిస్తున్న భయాందోళనలను చంద్రబాబు కొట్టి పారేయలేకున్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు తదితర నేతలు లోకేశ్ పాదయాత్రకు అడ్డు చెబుతున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రపై నీలి నీడలు కమ్ముకున్నాయి.