కర్ణాటక రాష్ట్రం, బెళగావి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉమేష్ విశ్వనాథ్ కత్తి (61) మంగళవారం అర్థరాత్రి బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆయనకు రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించినా 2 గంటల తర్వాత మృతి చెందినట్లు ప్రకటించారు.
ఉత్తర-కర్ణాటక, హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఉత్తర-కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం తరచూ వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కలగానే మిగిలిపోయింది. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అనుచరుడిగా ఉన్న కత్తి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలో అటవీ, ఆహారం పౌర సరఫరా శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఉమేష్ కత్తి కుటుంబంలో గుండెపోటు అనేది వారసత్వ సమస్య. అతని తండ్రి విశ్వనాథ్ 1985లో విధానసౌధలోని బాంక్వెట్ హాల్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మరణించారు. ఇంతకు ముందు, ఉమేష్ కత్తి కూడా రెండుసార్లు గుండెపోటు వచ్చింది.
మంత్రి ఉమేష్ కత్తి మరణంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉమేష్ కత్తి మృతితో బెళగావిలోని పాఠశాలలు, కళాశాలలకు కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది.