ఎమ్బీయస్‌: ఆఖరి కోరిక

ఆఖరి కోరిక Advertisement ఆ రాత్రి వైట్‌, అతని కొడుకు హెర్బర్ట్‌ చదరంగం ఆడుకుంటున్నారు. వైట్‌ భార్య ఫైర్‌ప్లేస్‌ పక్కనే కూచుని అల్లుకుంటోంది. 'చెక్‌' అని పావును ముందుకు తోస్తూ ''మారిస్‌ వస్తానన్నాడు. ఇంకా…

ఆఖరి కోరిక

ఆ రాత్రి వైట్‌, అతని కొడుకు హెర్బర్ట్‌ చదరంగం ఆడుకుంటున్నారు. వైట్‌ భార్య ఫైర్‌ప్లేస్‌ పక్కనే కూచుని అల్లుకుంటోంది. 'చెక్‌' అని పావును ముందుకు తోస్తూ ''మారిస్‌ వస్తానన్నాడు. ఇంకా రాలేదెందుకో'' అన్నాడు వైట్‌. 

అంతలోనే తలుపు చప్పుడైంది. వచ్చింది వాళ్ల బంధువు మారిస్‌.

''భారతదేశంలో నువ్వు చూసిన వింతలేమిటి మారిస్‌?'' అన్నాడు వైట్‌, బంధువు గ్లాసులో బ్రాందీ పోస్తూ… ''అన్నట్టు నువ్వోసారి ఓ కోతి పంజా గురించి చెప్పావు కదా. ఏమిటదసలు?''

మారిస్‌ అదేం విననట్టుగా ''అబ్బే ఏంలేదులెండి'' అన్నాడు విషయం మరల్చడానికి ప్రయత్నిస్తూ, కానీ ముగ్గురు శ్రోతల ఒత్తిడికి అతను లొంగక తప్పింది కాదు.

''నేను సైన్యంలో పనిచేస్తూ భారతదేశంలో పర్యటిస్తుండగా నాకీ కోతి పంజా దొరికింది. ఇది చూడడానికి వికృతంగా ఉంటుంది. అయినా దీనిలో ఓ ఫకీర్‌ అసాధారణ శక్తి అమర్చాడు. మానవ జీవితాన్ని నడిపించేది విధి మాత్రమేనని నిరూపించాలని అతని ఉద్దేశ్యం. అతను వేసిన మంత్రం వల్ల ఇది ముగ్గురు వ్యక్తుల మూడేసి కోరికలు తీరుస్తుంది.''

వైట్‌ కొడుకు హెర్బర్ట్‌ కాస్త వెక్కిరింతగా అడిగేడు, ''మరి మీ మూడు కోరికలూ తీరేయా?''

''ఆ'' అన్నాడు మారిస్‌ గ్లాసులో మిగిలిన బ్రాందీని గొంతులో పోసుకుంటూ…

''మరి నీ కంటె ముందున్న వ్యక్తికి…?''

''అతనికీ తీరాయి. మొదటి రెండు కోరికలూ ఏమిటో నాకు తెలియవు కానీ అతని ఆఖరి కోరిక మాత్రం చావు, అందువల్లే ఇది నా దగ్గరికి చేరింది.''

''మరి నీ మూడు కోరికలూ అయిపోయాక అది ఇంకా నీ దగ్గర ఉంచుకోవడం ఎందుకు మారిస్‌?'' అన్నాడు వైట్‌.

''అదో వెర్రి! ముందు దీన్ని అమ్ముదామా అని అనుకొన్నాను. కానీ ఇటువంటి వాటిని జనం నమ్మరు. కాకమ్మ కథల కింద కొట్టి పారేస్తారు. ఎందుకంటే దీనిద్వారా వచ్చిన ఫలితం కూడా కాకతాళీయంగా జరిగినట్లుంటుంది. అయినా దీన్నిలా ఉండనివ్వడం నా కిష్టం లేదు'' అంటూ 'ఫైర్‌ప్లేస్‌'లోకి ఆ పంజాను విసిరేశాడు మారిస్‌.

ముసలాయన ఒక్క అరుపు అరిచి, వెళ్లి దాన్ని మంటల్లోంచి బయటకు లాగేశాడు. ''ఇంత మహిమ కలిగినదాన్ని అలా నిప్పులో పడేస్తావా? మూర్ఖత్వం కాకపోతే! నీ కక్కరలేకపోతే పోనీ నా కిచ్చెయ్యి''

''వద్దు, వద్దు. అది దుఃఖాన్ని కొని తెస్తుంది. దాన్ని కాలి బూడిదై పోనీయండి'' అన్నాడు మారిస్‌.

వైట్‌ భార్య కళ్లు మిటకరించి ''అంతా అరేబియన్‌ నైట్స్‌ కథలా ఉందే'' అంది. ''ఇంతకీ కోర్కె ఎలా కోరాలి?''

''కుడిచేత్తో పట్టుకుని గుప్పిలి పైకెత్తి కోరిక ఏమిటో గట్టిగా చెప్పాలి''

''బావుంది, అయితే నాకు పది చేతులిమ్మని కోరండి బాబూ, పని చేసుకోలేక ఛస్తున్నాను'' అందామె.

అందరూ నవ్వేరు. భోజనం చేస్తున్నప్పుడు ఈ విషయం మర్చిపోయారు. మారిస్‌ వెళ్లిపోయాక హెర్బర్ట్‌ తన తండ్రిని ''అతనికి ఏమైనా ఇచ్చేవా?'' అని అడిగేడు.

''ఏదో కాస్త ఇచ్చాలే, అయినా వింత వస్తువు కదా, ప్రయత్నించి చూద్దాం. పని చెయ్యకపోతే నష్టం లేదు'' అన్నాడు వైట్‌.

''అవునవును. నష్టం ఏముంది? నువ్వు బోల్డంత డబ్బు కోరుకో. వచ్చేస్తుంది. ఇన్‌కంటాక్స్‌ వాళ్లు వచ్చి ఇదంతా నీకెక్కడిది అని లాక్కుంటారు. అప్పుడు నువ్వు గోలపెడతావ్‌. చెప్పాడుగా కోర్కె తీరుస్తుంది కానీ కష్టాలు కొని తెస్తుందని'' అన్నాడు హెర్బర్ట్‌ హాస్యధోరణిలో.

''అంత డబ్బు ఎందుకుగాని, ఇల్లు బాగుచేయించడానికి రెండువందల పౌండ్లు కావాలని అనుకొంటున్నాంగా. అది కోరండి'' అంది మార్గరెట్‌.

వైట్‌కీ సూచన వచ్చింది. పంజాని చేత్తో పట్టుకుని ''నాకు రెండువందల పౌండ్లు కావాలి'' అన్నాడు గట్టిగా.

అంతలోనే కెవ్వుమని కేకపెట్టాడు. భార్య కొడుకు అతని దగ్గరికి పరిగెట్టుకు వచ్చేడు.

''అది కదిలింది, నేను కోరిక కోరుతుండగా చేతిలో పాములా మెలికలు తిరిగినట్టనిపించింది'' అన్నాడు వైట్‌ వణుకుతూ.

''అదంతా నీ చాదస్తంలే, కదలడం మాట అలా ఉంచి, డబ్బేది? నాకు కనబడలేదేం?'' అన్నాడు హెర్బర్ట్‌ వేళాకోళంగా.

''చాదస్తం కాదుకానీ కదలడం మాత్రం వాస్తవం. పోన్లే పోతేపోనీ, వెధవగోల'' అన్నాడు ముసలాయన నోరు చప్పరించి.

రాత్రి పొద్దుపోయేదాక తండ్రీ కొడుకులిద్దరూ ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇక ముసలామె ఆవలిస్తూ 'ఇక పడుకుందాం' అనేసరికి ఇద్దరూ లేచారు. తన గదిలోకి వెళ్లబోతూ – ''నాన్నా రేప్పొద్దున నువ్వు లేచేసరికి నీ మంచానికి రెండువందల పౌండ్లూ మూటకట్టి ఉంటుందేమో చూసుకో'' అన్నాడు కొడుకు నవ్వుతూ.

xxxxxxxxxxxxxxxxx

మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుండగా కోతి పంజా విషయం మళ్లీ గుర్తొచ్చింది హెర్బర్ట్‌కి. ''నాన్న వెర్రిబాగులాడని తెలిసిపోయినట్టుంది మారిస్‌కి. అందుకనే ఆ పనికిమాలిన వస్తువు అంటగట్టాడు'' అని ఉడికించేడు తండ్రిని.

మార్గరెట్‌ అందుకొని ''ఈ మిలటరీ వాళ్లంతా ఇంతే. ఏవో కబుర్లు చెప్పి మనల్ని బోల్తాకొట్టిస్తారు. అయినా ఈ రోజుల్లో ఈ వరాలేమిటి? కోర్కెలు తీరడమేమిటి? పోనీ తీరినా  రెండువందల పౌండ్లు దొరికితే ముంచుకొచ్చే ఆపదేముంది? నా బొంద'' అంది.

''ఒకవేళ ఆకాశం నుంచి సరాసరి నాన్న నెత్తిమీద ఆ డబ్బుల మూటపడి తల బొప్పి కడుతుందేమో. అదేనేమో ఆపద'' అన్నాడు హెర్బర్ట్‌ వెటకారం పాలుపెంచి. ముసలాయనకి మాత్రం నమ్మకం పూర్తిగా పోయినట్లు లేదు. సాలోచనగా-

''మారిస్‌ చెప్పిన ప్రకారమే అయితే కోర్కె తీరుతుంది. కానీ అది ఎంత 'నేచురల్‌'గా జరుగుతుందంటే మనం అది కాకతాళీయం అనుకొంటామన్నమాట'' అన్నాడు.

''పోన్లే, అలాగే కానీ, కానీ డబ్బులు వస్తే మాత్రం నేను ఫ్యాక్టరీ మంచి వచ్చేలోగా ఖర్చుపెట్టేయకు'' అన్నాడు హెర్బర్ట్‌ పనిలోకి వెళుతూ.

మధ్యాహ్నం 'పోస్ట్‌' అన్న కేక వినబడితే మార్గరెట్‌, తన భర్తతో ''కోతి పంజా పంపిన మనియార్డరేమో'' అంటూ నవ్వుతూ వెళ్లింది. తిరిగొచ్చి ''టైలర్‌ బిల్లు! హెర్బర్ట్‌ తిరిగొచ్చి మిమ్మల్నింకా ఆటలు పట్టిస్తాడు చూస్తూండండి'' అంది.

''నువ్వు ఎన్నైనా చెప్పు. అది నా చేతిలో కదలడం మాత్రం ఖచ్చితంగా జరిగి… ఎవరది?''

బయట తచ్చాడుతున్న మనిషిని చూసి ఆగిపోయాడు వైట్‌. ''వెళ్లి లోపలికి తీసుకురా. మనింటికి లాగే ఉంది'' అన్నాడు భార్యతో.

మార్గరెట్‌ వెళ్లి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్ట్దింది. వచ్చిన వ్యక్తి మాటల కోసం తడుముకుంటున్నాడు…

''నన్ను… నన్ను మా కంపెనీవాళ్లు పంపించేరు. నేను… నేనేమో 'యాలండ్‌ మెగ్గిన్స్‌' కంపెనీలో పనిచేస్తుంటాను.''

మార్గరెట్‌ పరీక్షగా చూసి కాస్త తడబాటుతో ''మా వాడు పనిచేసే కంపెనీయే అది. ఏం? హెర్బర్ట్‌ కేమైనా అయిందా? చెప్పండి'' అంది.

ముసలాయన ''నువ్వుండు, ఖంగారుపడకు ఊరికే, ఏమయింది సార్‌?' చెప్పండి…''

''క్షమించాలి..'' అంటూ మొదలెట్టాడు ఆ వ్యక్తి.

''మా వాడికేమైనా దెబ్బలు తగిలాయా?'' అని మార్గరెట్‌ అడ్డుపడింది.

''అవును. చాలా గాయాలు తగిలేయి. కానీ అన్ని బాధలకు అతీతుడైపోయేడు ఇప్పుడు.''

''అమ్మయ్యా! భగవంతుడా, రక్షించావ్‌'' అంటూ ఆకాశం కేసి చేతులెత్తుతూనే ఆమె తల్లి మనసు అతని మాటల్లోని విపరీతార్థాన్ని గుర్తించింది. తక్షణం భర్తకేసి తిరిగి భోరుమని ఏడ్చింది. ముసలాయన కూడా ఏడుస్తూ వణుకుతున్న చేతుల్తో ఆమె తలపై నిమరసాగేడు.

కొద్దిసేపు నిశ్శబ్దం తాండవించాక ఆ వ్యక్తి మెల్లగా చెప్పేడు..

''హెర్బర్ట్‌ మిషన్‌లో ఇరుక్కుపోయాడు. అది అతని అజాగ్రత్త వల్లనే జరిగిందని కంపెనీ అభిప్రాయపడుతోంది. అంచేత నష్టపరిహారం ఏమీ ఇవ్వనక్కర్లేనప్పటికీ, అతను నాలుగేళ్లకు పైగా కంపెనీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా, మీకు మా సంతాపాన్ని తెలియబరుస్తూ ఒక చిన్న మొత్తం 'కాంపెన్సేషన్‌'గా ఇవ్వదలచుకున్నాం.''

''ఎంత?'' అన్నాడు ముసలాయన గొంతు తడారిపోతుండగా.

''రెండువందల పౌండ్లు''

మార్గరెట్‌ కీచుమని కేక వేసింది. వైట్‌ పేలవంగా నిర్జీవమైన నవ్వు ఒకటి నవ్వి కుప్పలా కూలిపోయాడు.

xxxxxxxxxxxxxxx

ఊరికి రెండు మైళ్ల దూరంలో ఉన్న శ్మశానంలో కొడుకు దేహాన్ని పాతిపెట్టి అతని తల్లిదండ్రులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. అనుకోకుండా ఏదో కలలాగా జరిగిన విషాద సంఘటన జరిగినట్టే వేరొక సంఘటన అంత తమాషాగానూ జరిగి తమకు కలిగిన నష్టాన్ని పూడుస్తుందన్న వెర్రి ఆశతో వాళ్లు ఎదురు చూశారు. ఆ ఎదురుచూపులతోటే రోజులు గడిచేయి. ముసలివాళ్లిద్దరూ తమ ఏకైక కుమారుణ్ని పోగొట్టుకున్న దుఃఖంతో మాట్లాడడమే తగ్గించివేశారు.

ఆ సంఘటన జరిగిన వారం రోజులకి వైట్‌కు ఓ రాత్రి మెలకువ వచ్చి చూస్తే భార్యపక్క ఖాళీగా ఉంది. ఆమె కిటికీలోంచి తల బయటకు పెట్టి ఏడుస్తూండటం కనబడింది. ''లోపలికి రా. జలుబు చేస్తుంది'' అన్నాడు.

''హెర్బర్ట్‌ ఈ చలిలోనే కదా ఉన్నాడు…. అదీ ఆరుబయట'' అంటూ వెక్కివెక్కి ఏడ్చిందామె.

ఏం జవాబు చెప్పాలో తెలీక ముసలాయన భార్య తల నిమురుతూ కూర్చున్నాడు. భార్య వెక్కిళ్ల మధ్య ఆయన కళ్లు మూతలు పడుతున్నాయి. ఒక్కసారిగా భార్య కుదిపిన కుదుపుకి మెలకువ వచ్చింది.

''కోతి పంజా'' ఆమె గట్టిగా అరిచింది. ''ఏదీ ఆ కోతిపంజా?''

వైట్‌ ఉలిక్కిపడ్డాడు. ''ఏమయింది? ఎక్కడుంది? కోతిపంజాకి ఏమయింది?''

''నాకది కావాలి. ఎక్కడుంది? కొంపతీసి పారెయ్యలేదు కదా!'' ఆమె ఆదుర్దాగా అడిగింది.

'గూట్లోనే ఉంది. అయినా అదెందుకు?''

''హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అబ్బ! ఇన్నాళ్లూ ఎందుకు గుర్తురాలేదు?''

''గుర్తు ఎందుకు?''

''ఎందుకేమిటీ? మీరు ఇంకా రెండు కోరికలు కోరుకోవచ్చు. ఒక్కటేగా అయింది'' దాదాపు అరిచిందామె.

''అయ్యింది చాలదా?'' అన్నాడు వైట్‌ కోపంగా.

''చాలదు'' మార్గరెట్‌ కళ్లు మెరుస్తున్నాయి. ''మనకి ఇంకొకటి కావాలి. వెళ్లండి, వెళ్లి అది పట్టుకొచ్చి 'మన హెర్బర్ట్‌ మళ్లీ బతకాలని కోరండి''!

ముసలాయన ఉలిక్కిపడ్డాడు. కప్పుకున్న దుప్పటి విసిరేసి ''మార్గరెట్‌, నీకేం పిచ్చి పట్టలేదు కదా'' అన్నాడు ఆందోళనగా.

ఆమె ఏదీ వినిపించుకునే స్థితిలో లేదు.

''ముందు అది పట్రండి. త్వరగా కావాలి. నాన్నా హెర్బర్ట్‌, వస్తున్నారా బాబూ''

వైట్‌ అగ్గిపుల్ల గీసి కొవ్వొత్తి వెలిగించాడు. ''వెళ్లి పడుకో మార్గరెట్‌. నువ్వేం కోరుతున్నావో నీకే  తెలియడం లేదు.''

''మన మొదటి కోరిక తీరింది కదా! రెండోది మాత్రం ఎందుకు తీరదు?'' ఆమె తన పట్టు విడవలేదు.

''అది ప్రకృతి విరుద్ధం..'' అని అరిచాడతను.

''నా కదేం తెలియదు. అది తీసుకువచ్చి కోర్కె కోరండి'' అని పిచ్చిగా అరిచింది మార్గరెట్‌, భర్తను గదివైపు తోసింది.

వైట్‌ చీకట్లో మెట్టుదిగి కిందకి వెళ్లాడు. పంజా గూట్లోనే ఉంది. అది తాకుతుండగా తెలియని భావమేదో అతని వెన్నెముక గుండా పాకింది. మిషన్లో పడి మజ్జయిపోయిన కొడుకు బతికి తిరిగొస్తాడన్న ఊహ అతడిని జలదరింప చేసింది. వణుకుతున్న చేతుల్తో గోడను తడుముతూ గదిలోకి ప్రవేశించాడు. 

అతని భార్య ముఖంలో కూడా మార్పు కనబడింది. తెల్లగా పాలిపోయి పేలవమైన ఆమె ముఖం చూడడానికే అతనికి భయం వేసింది. 

''కోర్కె కోరండి'' ఉరిమిందామె.

''ఇది ప్రకృతి విరుద్ధం, బుద్ధిమాలిన పని..'' వైట్‌ తబ్బిబ్బుపడ్డాడు.

''కోరండి'' గర్జించింది.

వైట్‌ చెయ్యి పైకెత్తి కోరాడు. ''నా కొడుకు తిరిగి బతకాలి''

కోతిపంజా కిందపడిపోయింది. క్రితంసారి కలిగిన అనుభవమే మళ్లీ కలిగింది. వణుకుతూ కుర్చీలో కూలిపోయాడు. మార్గరెట్‌ కిటికీ దగ్గరికి వెళ్లి బయటకి తొంగి చూడసాగింది.

చలి ఉధృతమై, భరించలేనంతగా మారేవరకూ వాళ్లలాగే కూర్చున్నారు. కొవ్వొత్తి కరిగి, కరిగి ఆరిపోయే స్థితికి వచ్చింది. కిటికీలోంచి వచ్చిన గాలి తెరకి అది కూడా ఆరిపోయింది. వైట్‌ ఇక పక్కమీదకెక్కి పడుక్కొన్నాడు. మార్గరెట్‌ కూడా వచ్చి పడుకుంది.

ఎవ్వరూ మాట్లాడలేదు. ఇద్దరూ గడియారం 'టిక్‌ టిక్‌'మని చేస్తున్న శబ్దాన్ని వింటున్నారు. ఓ ఎలక మెట్ల మీదుగా శబ్దం చేస్తూ పరిగెట్టింది. ధైర్యాన్ని కూడదీసుకుని, వైట్‌ అగ్గిపెట్టె చేత్తో పట్టుకుని కొవ్వొత్తి కోసం మెట్లు దిగి కిందకు వెళ్లాడు.

చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి అగ్గిపుల్ల ఆరిపోయింది. ఇంకొకటి ముట్టించేలోగా తలుపుమీద చప్పుడు వినబడింది.

అగ్గిపుల్లలు వైట్‌ చేతిలోంచి జారి కిందపడ్డాయి. చలనం లేకుండా అతడలాగే నిలబడిపోయాడు. మళ్లీ ఇంకోసారి చప్పుడు వినబడేసరికి అతని గుండె కొట్టుకోవడం మానేసింది. అంతే! అతను పరిగెట్టుకుని తన గదిలోకి వచ్చి తలుపు మూసేశాడు. మూడోసారి తలుపుమీద కొట్టిన చప్పుడు వినబడింది.

''ఏమిటది? ఏమిటా చప్పుడు?'' అంది ముసలామె.

''అబ్బే ఎలుక, మెట్లమీంచి వెళుతోంది'' అన్నాడు వైట్‌ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ, 

''తలుపు చప్పుడండీ..''

''ఎవరో దారినపోయేవాడేమో. ఇంతరాత్రి ఎవరికి ఆశ్రయం ఇస్తాం? వెళ్లిపోతాడులే''

మార్గరెట్‌ పక్కమీద లేచి కూర్చుంది. మళ్లీ చప్పుడు – ఈసారి ఇంకా గట్టిగా.

''అదిగో హెర్బర్ట్‌'' ఆనందాతిరేకంతో మార్గరెట్‌ కీచుమంది. తలుపు దగ్గరికి పరిగెట్టింది.

భర్త ఆమె భుజం పట్టుకుని ఆపేశాడు. ''నువ్వేం చేస్తున్నావో తెలుసా?'' అన్నాడు వణుకుతున్న గొంతుతో.

''అదిగో నా కొడుకు… నా హెర్బర్ట్‌'' భర్త పట్టునుంచి విడిపించుకొనేందుకు ప్రయత్నించింది. 'రెండు మైళ్ల దూరం ఉంది కదా శ్మశానం! నడిచి వచ్చేసరికి ఆలస్యమయి ఉంటుంది. నన్ను వెళ్లనీయండి. ఆపుతారేం? తలుపు తీయనీయండి.''

''ఆ మనిషిని లోపలికి రానీయద్దు'' అన్నాడు వైట్‌ గద్గద స్వరంతో.

''మీ కొడుకు గురించి మీరే భయపడుతున్నారా? అబ్బాయి.. హెర్బర్ట్‌! వస్తున్నాన్రా…''

తలుపు మీద మళ్లీ చప్పుడైంది, ఇంకోసారి. మార్గరెట్‌ ఒక్క ఊపుతో విదిలించుకుని కిందకి పరిగెట్టుకెళ్లింది. 

వైట్‌ ఆమె వెంట పరిగెట్టేడు. మెట్ల దగ్గర ఆగి భార్యను పిలిచేడు. ఆమె రాలేదు. 

గుండెలదురుతుంటే, కళ్లు చీకట్లు కమ్ముతుంటే గోడకానుకుని వైట్‌ అలాగే ఉండిపోయాడు. తలుపు గడియ తీయడం అతనికి వినబడింది. కిందనున్న బోల్టు కూడా తీయడం వినబడింది. అంతలో మార్గరెట్‌ గొంతు – 

''పై బోల్టు రావడం లేదు. కొంచెం వచ్చి తీయండి. నాకది అందటం లేదు''

కానీ ఆమె భర్త నేలమీద పాకుతూ కోతి పంజాను వెతుకుతున్నాడు. బయటనున్న ఆకారం లోపలికి వచ్చేలోపల అది దొరకాలని దేవుళ్లకి మొక్కుతున్నాడు. ఇంతలో తలుపుమీద మళ్లీ బాదిన చప్పుడు. మార్గరెట్‌ కుర్చీ నొకదాన్ని తలుపు దగ్గరికి లాగడం వినబడింది. పై బోల్టు కిరకిర లాడిన శబ్దం అతనికి వినబడే క్షణంలోనే అతని చేతికి కోతిపంజా దొరికింది. అతను దాన్ని చేతిలో పట్టుకుని, ఆఖరి, మూడవ కోరిక కోరాడు.

తలుపు మీద చప్పుడు ఆగిపోయింది. దాని ప్రతిధ్వనులు ఇంట్లో వినబడుతూనే ఉన్నాయి ఇంకా. కుర్చీ వెనక్కి జరిపి తలుపు తెరిచిన శబ్దం అతనికి వినబడింది. చల్లటి గాలి  మెట్ల మీదుగా వచ్చి తాకింది. తన భార్య విడిచిన బాధాకరమైన నిట్టూర్పు అతనికి ధైర్యాన్నిచ్చింది. పరిగెట్టుకుని వెళ్లి గుమ్మాన్ని చేరి బయటకు తొంగి చూసేడు. ఖాళీ రోడ్డు వీధి దీపం కాంతిలో రోడ్డు మెరుస్తోంది.

(డబ్ల్యు.డబ్ల్యు.జాకబ్‌ వ్రాసిన 'ది మంకీస్‌ పా' కథకు అనువాదం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌, 

[email protected]

(ఆంధ్రజ్యోతి వీక్లీ జనవరి 1997లో ప్రచురితం)