విభజన అక్కడా.. ఇక్కడా.!

అవిభక్త కవలలు వీణా`వాణి అతి త్వరలో వేరు కాబోతున్నారనీ, ఇద్దరికీ విదేశాల్లో (బ్రిటన్‌)లో శస్త్ర చికిత్స జరగనుందనీ నిన్న మొన్నటిదాకా వార్తలు విన్పించాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే వీరిద్దరి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. కానీ,…

అవిభక్త కవలలు వీణా`వాణి అతి త్వరలో వేరు కాబోతున్నారనీ, ఇద్దరికీ విదేశాల్లో (బ్రిటన్‌)లో శస్త్ర చికిత్స జరగనుందనీ నిన్న మొన్నటిదాకా వార్తలు విన్పించాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే వీరిద్దరి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. కానీ, ఇప్పటిదాకా వీరిద్దరూ వేరుపడలేదు.

చిన్న వయసులో అయితే మన దేశంలోనే, అదీ మన తెలుగు గడ్డమీదనే వీణా`వాణిలను వేరు చేసేందుకు తగిన సౌకర్యాలుండేవి. అప్పట్లో వీరిద్దరినీ విభజించడం రిస్కే అయినా, చెయ్యగలిగే పరిస్థితులుండేవి. కాలం గడిచిపోయింది. వీణా, వాణి ఎదుగుతూ వచ్చారు. వారి తల్లిదండ్రుల ఆవేదనా పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయినా, వీణా, వాణిలకు మాత్రం మోక్షం లభించడంలేదు.

బ్రిటన్‌ వైద్యులతో తెలంగాణ ప్రభుత్వం వీణా,వాణిల విభజనపై సంప్రదింపులు జరిపిన విషయం విదితమే. నీలోఫర్‌ ఆసుపత్రికి వచ్చి చిన్నారుల్ని బ్రిటన్‌ వైద్యులు పరీక్షించి, ఆపరేషన్‌ చేస్తామని ముందుకు రాగా, ఖర్చు ఎంతైనా విభజనకు ‘సై’ అనేసింది తెలంగాణ ప్రభుత్వం. 10 కోట్ల రూపాయలకు పైగా ఆపరేషన్‌కి ఖర్చవుతుందనే అంచనాలున్నాయి.

ఎంత ఖర్చయినా సిద్ధమేనని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో వీణా,వాణి తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆ వ్యవహారం మాటలకే పరిమితమయిపోతోంది. తాజాగా ఎయిమ్స్‌, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందట. ఎయిమ్స్‌లోనే వీణా,వాణిల ఆపరేషన్‌కి తగిన అవకాశాలున్నాయనీ, అలాంటప్పుడు వారిని విదేశాలకు పంపడమెందుకన్నది అందులో ఎయిమ్స్‌ లేవనెత్తిన ప్రశ్న.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడితే మళ్ళీ వీణా,వాణిల విభజన కథ మొదటికి వస్తుంది. ఇప్పటికే చాలాకాలం వృధా అయిపోయింది. వయసు పెరిగే కొద్దీ విభజన సంక్లిష్టంగా మారిపోతుందని తెలిసీ, అధికారంలో వున్నవారు కాలయాపన చేస్తుండడం బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు శోకాన్నే మిగుల్చుతోంది