మద్యనిషేధం వుంటే మంచిదని అందరం మాట్లాడతాం. కానీ అమలులో యిది చాలా కష్టసాధ్యం. దానివలన దొంగ సారాయి పెరిగి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆల్కహాలుకి బదులు యువతీయువకులు డ్రగ్స్ తీసుకుంటారు. టూరిస్టులు రారు. ఐటీ, మార్కెటింగ్ వంటి కార్పోరేట్ రంగాలలో నిపుణులు మద్యనిషేధం వున్న రాష్ట్రాలలో పని చేయడానికి యిచ్చగించరు. మద్యం అమ్మకాల వలన వచ్చే ఆదాయం రాష్ట్రానికి రాకపోగా దొంగ రవాణా అరికట్టడానికి నియమించవలసిన అదనపు సిబ్బంది కారణంగా చాలా డబ్బు ఖర్చవుతుంది. మద్యమే ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు అయిపోయింది. అయితే మద్యాన్ని అడ్డూ, ఆపూ లేకుండా ప్రవహింప చేయాలా? అంటే దానికీ సమాధానం కష్టమే. బార్లు అనుమతించాక, మద్యపానం పెరిగింది. బారు అయితే లైసెన్సు తీసుకోవాలి. కానీ మద్యం షాపు ఎదురుగానే నిలబడి తాగేస్తున్నారు. పబ్లిక్‌కు న్యూసెన్సుగా తయారవుతున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి.వాటిలో పట్టుబడినవారిని జరిమానా వేసి వదిలేయకుండా, తీసుకెళ్లి లాకప్‌లో పెట్టి మత్తు దిగాకనే వాహనం మళ్లీ చేతికివ్వాలి. లేకపోతే వాళ్లకూ, యితరులకూ డేంజరే. అది జరగటం లేదు.
కథల్లో, సినిమాల్లో ముఖ్యపాత్రల దగ్గర్నుంచి అందరూ తాగుతూ చూపిస్తూ అది ఒక వ్యసనం కానట్టు అభిప్రాయం కలిగిస్తున్నారు. తాగుడు దృశ్యాలు లేని సినిమాలు లేనే లేవని చెప్పాలి. ఒక మూల తాగుడు చెడ్డది అని చిన్న కాప్షన్ చూపిస్తే దాన్ని పట్టించుకునే వాడెవడు? తండ్రీ కొడుకూ కలిసి మందు కొట్టినట్టు చూపించే దృశ్యాల కారణంగా సామాజిక విలువలు మారిపోతున్నాయి. తెలుగునాట గత మూడు థాబ్దాల్లో చూసుకుంటే సిగరెట్టు తాగడం తగ్గింది కానీ మందు కొట్టడం, పొగాకు నమలడం పెరిగాయి. మద్యం సీసాలను దానిపై ముద్రించిన ధర కంటె ఎక్కువగా అమ్ముతున్నారని, పరిమితి తీసుకున్న షాపువాళ్లు స్వయంగా బెల్టు షాపులు కూడా పెట్టిస్తున్నారని తెలిసి కూడా అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. మన కంటె కేరళలో మద్యపానం ఎక్కువ. అక్కడి ప్రజలు ఏడాదికి తలసరిన 8.3 లీటర్ల మద్యం తీసుకుంటున్నారు. ఇది భారతదేశంలోనే అత్యధికం. ఇటీవల అక్కడ మద్యనిషేధం అమలు చేద్దామని ప్రభుత్వం సంకల్పించడానికి వెనుక ఒక కథ జరిగింది.
ముందుగా కేరళలో మద్యపాన ప్రభావం గురించి జరిగిన సర్వే వివరాలు చూదాం – తాగుడుకు అలవాటు పడినవారు ఆదాయంలో 44% దానికే ఖర్చు పెడుతున్నారు. ఆసుపత్రుల్లో 19-27% బెడ్స్ మద్యపానం వలన వచ్చే రోగాలతో బాధపడేవారితో నిండుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో 40% తాగి డ్రైవ్ చేసే వారి వలననే జరుగుతున్నాయి. గృహహింసకు, విడాకులకు, ఆత్మహత్యలకు మద్యపానం ఒక ప్రధానమైన కారణంగా వుంటోంది. అన్నిటికన్నా దురదృష్టకరమేమిటంటే మద్యపానాన్ని దురలవాటుగా చూడడం మానేయడంతో మహిళలు, ముఖ్యంగా యువతులు తాగుడికి అలవాటు పడుతున్నారు. వీటివలన యిళ్లల్లో కలహాలు పెరుగుతున్నాయి. మొదటిసారి ఏ వయసులో తాగారు అని అడిగి సరాసరి వయసు కడితే పదమూడున్నరగా తేలింది. మద్యపానం యింత విశృంఖలంగా వుంటే, లిక్కర్ వ్యాపారస్తులు ఎంత బలపడతారో, రాష్ట్ర రాజకీయాలను ఎలా శాసిస్తారో వూహించుకోవచ్చు. ఇవన్నీ చూసి కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్, మరి కొన్ని సామాజిక సంస్థలు మద్యనిషేధం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఇది యిలా వుండగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)వారు రాష్ట్రంలోని 730 బార్లలో 418 బార్లలో సరైన సౌకర్యాలు లేవని, వాటిని సమకూర్చుకోవడంలో అలసత్వం వహిస్తున్నాయని డిసెంబరు 2012లో నివేదిక యిచ్చింది. మన రాష్ట్రంలో యింజనీరింగ్ కళాశాలల్లాగే అవి కూడా టైమిస్తే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాన్ని అర్థించడం, ఆ తర్వాత ఏమీ చేయకుండానే లైసెన్సు కొనసాగించమని దబాయించడం చేస్తూ వున్నాయి. ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వం కొనసాగిస్తోంది కూడా. ఇలాటి వాటికి లైసెన్సు కాన్సిల్ చేయకుండా పొడిగించడం ద్వారా ప్రజాభద్రతకు భంగం వాటిల్లుతోందని కాగ్ అంటూ గత ప్రభుత్వాలతో సహా ప్రస్తుత రాష్ట్రప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టింది. దాంతో ఊమెన్ చాండీ ప్రభుత్వం వాటిని ఏప్రిల్ 1 నుండి మూయించేసింది. సౌకర్యాలు మెరుగు పరుస్తామని హామీ యిచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని బార్ల యజమానులు, వాటిపై ఆధారపడిన ఉద్యోగులు, వ్యాపారస్తులు ఆందోళన చేశారు. ఎన్నికలకు ముందు యిలా చేయడం రాజకీయంగా పొరబాటని పార్టీ నాయకులు విమర్శించారు. అయితే మద్యనిషేధం కార్యకర్తలు గట్టిగా నిలబడడంతో, ఊమెన్ 'ఎన్నికల తర్వాత యీ విషయం చూసుకుందాం' అంటూ వూరుకున్నాడు. ఎన్నికలయిపోయాయి. వాటిని మళ్లీ తెరవడానికి అనుమతి యివ్వాలి. ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తూ వుంటే కాంగ్రెసు పార్టీలో విభేదాలు వచ్చాయి.
కేరళ ప్రదేశ్ కాంగ్రెసుకు కొత్తగా అధ్యకక్షుడైన వి ఎం సుధీరన్‌కు మద్యం అంటే కిట్టదు. ఈ 418 బార్లను తెరిచేందుకు ససేమిరా అనుమతి యివ్వకూడదని పట్టుబట్టాడు. రాజకీయాలలో తల పండిపోయిన ఊమెన్ వీటిని శాశ్వతంగా మూసేసి, తక్కిన 312 బార్లను అనుమతిస్తే సబబుగా వుండదని వాదించాడు. ఈ లోపుగా మూసేసిన బార్ల యజమానులు హై కోర్టును ఆదేశించారు. తాము సౌకర్యాలు కల్పించుకున్నామని, అయినా ప్రభుత్వం లైసెన్సు పొడిగించకుండా తాత్సారం చేస్తోందని విన్నవించుకున్నాయి. హై కోర్టు కొంతమంది అధికారుల చేత యిన్‌స్పెక్షన్ చేయించి ఆ బార్ల ప్రస్తుత పరిస్థితిపై నివేదిక యిమ్మనమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆర్డరు రాగానే యీ బార్ల యజమానుల్లో చాలామంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆదరాబాదరాగా రిపేర్లు చేయించి, చట్టప్రకారం వుండవలసిన సౌకర్యాలన్నీ కల్పించేశారు. ఇక ప్రభుత్వానికి అనుమతి యివ్వక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ థలో సుధీరన్ ఊమెన్ ప్రభుత్వం లోని అధికారులు యిలాటి పరిస్థితినే కోరుకున్నారు కాబోలు అంటూ బహిరంగ సమావేశంలో వ్యాఖ్యానించాడు. కేరళ యుడిఎఫ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న కేరళ కాంగ్రెస్ (మాని వర్గం), ముస్లిం లీగ్ కూడా సుధీరన్‌కు మద్దతు పలకడంతో ఊమెన్ యిరకాటంలో పడ్డాడు. కోర్టు ఆదేశాల ప్రకారం, ఆ బార్లు తిరిగి తెరవనిస్తే మద్యం లాబీకి అమ్ముడుపోయాడన్న అప్రతిష్ట మూటకట్టుకోవలసి వస్తుంది. అందుకని యీ బార్ల పునరుద్ధరణ గురించి మాట్లాడదాం రండి అంటూ ఆగస్టు 21 న సమావేశం ఏర్పాటు చేసి ఎవరూ వూహించని విధంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని ప్రతిపాదించి రాజకీయ ప్రత్యర్థుల నోళ్లు మూయించాడు.
అయితే యీ మద్యనిషేధం రాత్రికి రాత్రి అమలు చేయడం అసాధ్యం. ప్రభుత్వానికి ఏటా దీనిపై పన్నుల రూపేణా 1811 కోట్ల రూ.లు వస్తోంది. రాష్ట్రంలోని బార్లకు హోల్‌సేల్, రిటైల్ సారాయి సప్లయి చేసే ప్రభుత్వ సంస్థ కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ (బెవ్‌కో) ఆదాయం ఏడాదికి రూ.1010 కోట్లు వస్తోంది. అది మూసేస్తే సేల్స్ టాక్స్, ఎక్సయిజ్ టాక్స్ రూపేణా రూ.825 కోట్లు పోతాయి. సంపూర్ణ మద్యనిషేధం అనేక రాష్ట్రాలలో విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రొహిబిషన్ వుండే రోజుల్లో కర్ణాటకకు వెళ్లి తాగేవారు. కల్తీ సారాయి తాగి అనేకమంది ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. అందువలన థలవారీగా పదేళ్లలో అమలు చేస్తామని ఊమెన్ ప్రకటించారు. ఈ పథకం ప్రకారం 2015 ఏప్రిల్ 1నుండి మొత్తం 730 లిక్కర్ బార్‌లు మూసేస్తారు. విదేశీ టూరిస్టులకు యిబ్బంది కలగకుండా ఫైవ్ స్టార్ హోటళ్లలో వున్న 20 బార్లు మాత్రం అనుమతిస్తారు. బెవ్‌కో సంస్థ తన ఔట్‌లెట్స్‌ను ఏడాదికి 10% చొప్పున మూసేస్తూ పోతుంది. ఇలా మూసేయడం వలన ఏటా 375 కోట్ల రూ.లు నష్టం వస్తుంది. 2025 నాటికి దాని కౌంటర్లు ఏవీ మిగలవు. సంవత్సరంలో 68 రోజులు – ఆదివారాలతో సహా – డ్రై డేగా ప్రకటించబడతాయి. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. బెవ్‌కో సంస్థ యికపై ఘాటు మద్యాన్ని తక్కువగా సరఫరా చేసి, లైట్‌గా వుండేదాన్ని ఎక్కువగా పంపిణీ చేస్తుంది. ఆ విధంగా తాగుడు అలవాటును తగ్గించడానికి చూస్తుంది. 18 ఏళ్ల కంటె ఎక్కువ వయసువాళ్లకే లిక్కర్ అమ్మాలనే నిబంధనను మార్చి ఆ 18 ని 21 చేశారు. బార్లు యిప్పుడు పొద్దున్న 6 నుంచి అర్ధరాత్రిదాకా తెరిచి వుంచుతున్నారు. ఇకపై ఉదయం 8 నుండి రాత్రి 11 లోపునే పని చేయాలి. బెవ్ కో నుండి వచ్చే ఆదాయంలో 1% ఆదాయం వెచ్చించి మద్యపానం వలన కలిగే దుష్ఫలితాల గురించి ప్రచారం చేస్తారు.
ఈ పథకాన్ని వ్యతిరేకించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ఎప్పుడో పదేళ్లకు కాదు, యిప్పటికిప్పుడే చేయాలి అని పట్టుబడితే రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని, టూరిజం దెబ్బతింటుందని, కల్తీ సారాయి ప్రవహిస్తుందని తెలుసు. గతంలో అనేక ప్రభుత్వాలు కమిటీలు వేయడం, ఆ సూచనలు అమలు చేయలేకపోవడం జరిగాయి. అందువలన యీ పథకం మాత్రం ఆచరణసాధ్యమా అని ఆశ్చర్యపడడం తప్ప ప్రతిపక్ష కూటమి ఎల్‌డిఎఫ్ యింకేం చేయలేకపోయింది. ఊమెన్‌ను విలన్‌గా చూపిద్దామనుకున్న సుధీరన్, మిత్రపక్షాలు కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. మహిళా సంఘాలు ఊమెన్‌ను ప్రశంసలతో ముంచెత్తాయి. ఫైవ్ స్టార్ హోటళ్లను ఎందుకు మినహాయించారు? ఈ పక్షపాతమేల? అని కొందరు విమర్శిస్తున్నారు. వాస్తవానికి చూస్తే మద్యపానం వలన సమాజంలో కింది వర్గాలు నష్టపోతున్నంతగా పై వర్గాలు నష్టపోవడం లేదు. కింది వర్గాలకు తాగుడుపై అదుపు వుండటం లేదు. ఆదాయంలో చాలాభాగం దానికి వెచ్చిస్తున్నారు. పై వర్గాలలో ఆ సమస్య లేదు. అందర్నీ ఒకే గాటన కట్టి, పథకం అమలు కాకుండా చేస్తే దురదృష్టకరం. కేరళలో యిది అమలు కావడం మొదలుపెడితే తక్కిన రాష్ట్రాలు కూడా థలవారీ నిషేధంపై దృష్టి పెట్టవచ్చు.
ఊహించినట్లుగానే 312 మంది బార్ల యజమానులు దీనిపై సుప్రీం కోర్టుకి వెళ్లారు. వారు యీ నెలాఖరులోగా వాదోపవాదాలు వినమని కేరళ హైకోర్టును, సెప్టెంబరు 16 లోగా అఫిడవిట్‌ను దాఖలు చేయమని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 9 పేజీల అఫిడవిట్‌లో ప్రభుత్వం తాము తమ ఎన్నికల మానిఫెస్టోలోనే థలవారీగా ఫారిన్ లిక్కర్ ఉత్పత్తి, పంపిణీ తగ్గిస్తామని వాగ్దానం చేశామని చెప్పుకుంది. 'మార్చి 2013 వరకు నాలుగే నాలుగు స్టార్ హోటళ్లకు బార్ అనుమతి యిచ్చాం, కొత్త అబ్కారీ విధానంపై 2013 మార్చిలో ఏకసభ్య కమిటీని వేశాం, కోర్టు చెపితే తప్ప ఏ కొత్త బారుకి లైసెన్సు యివ్వలేదు, బెవ్‌కో చేత కొత్త బార్లు తెరిపించలేదు, అందువలన యిది యిప్పటికిప్పుడు ఎవరిమీదో కక్షతో చేసిన పని కాదు' అంటూ వివరించింది. కోర్టు వారి ఆలోచనాధోరణి ఎలా వుందన్నదానిపై చాలా విషయాలు ఆధారపడతాయి. ఈ లోగా ఊమెన్ ప్రభుత్వం మద్యపానం తగ్గించే విషయంలో తమ చిత్తశుద్ధిని చాటుకోవడానికి సెప్టెంబరు 17 నాటి కాబినెట్ సమావేశంలో మద్యంపై 20%, పొగాకు ఉత్పాదనలపై 8% పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 'ప్రభుత్వాదాయంలో 22% మద్యవ్యాపారం నుండే వస్తోంది కదా, ఇప్పటికే కేంద్రం నుండి రూ. 6900 కోట్లు అప్పు తీసుకుంది కదా, ఈ నెలలోనే రూ. 100 కోట్లు ఓవర్‌డ్రాఫ్టు తీసుకుంది కదా, మద్యనిషేధం అమలు చేస్తే ప్రభుత్వం ఎలా నడపగలరు?' అనే విమర్శ తట్టుకోవడానికి కొన్ని పొదుపు చర్యలు ప్రకటించారు. మంత్రులందరూ తమ జీతాలను 20% తగ్గించుకుంటారట. మరీ అవసరమైతే తప్ప విదేశీయానాలు చేయరట. ఇలా ఖర్చు తగ్గించి, యింకో పక్క ఆదాయం పెంచడానికి ప్రభుత్వం నీటిపై, భూమిపై కూడా పన్నులు పెంచుతుందట. ఇలా యీ కథ ఎక్కడో మొదలై ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. కోర్టు తీర్పు వచ్చాక దానిపై తక్కిన పర్యవసానాలు ఆధారపడి వుంటాయి.
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)