ఆగస్టు నెలలో లఖ్‌నవ్‌లో కీర్తిశేషులైన సోషలిస్టు నాయకుడు జ్ఞానేశ్వర్ మిశ్రా పేర ఒక పార్కు ఏర్పాటైంది. ఆ ప్రారంభోత్సవానికి రమ్మనమని ములాయం తన మాజీ సహచరుడు అమర్ సింగ్‌ను ఆహ్వానించారు. ఒకప్పుడు అమర్ సింగ్, ములాయంకు అత్యంత ఆత్మీయుడు, కుటుంబస్నేహితుడు. సినిమావాళ్లను, పారిశ్రామికవేత్తలను సమాజ్‌వాదీ పార్టీకి చేరువ చేసినది అమర్ సింగే. అయితే అతనంటే ఇంకో ముఖ్యమైన నాయకుడు ఆజంఖాన్‌కు అస్సలు పడదు. 2009లో రాంపూర్ లోకసభ సీట్లో అమర్ సింగ్ తన అనుచరురాలు జయప్రదను అభ్యర్థిగా నిలిపితే ఆజంఖాన్ ఆమె మీద, అమర్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, చివరకు పార్టీ విడిచి వెళ్లిపోయాడు. అమర్ సింగ్‌ను పార్టీలోంచి బహిష్కరించిన తర్వాతే వెనక్కి వచ్చాడు. ఆజంఖాన్ వెళ్లిన మరుసటి సంవత్సరంలో అమర్ సింగ్ కూడా ములాయంను నిందిస్తూ పార్టీలోంచి బయటపడ్డాడు. చాలాకాలం అనారోగ్యంతో బాధపడి, చివరకు కోలుకుని, 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ అనే కొత్త పార్టీ పెట్టి 2012 అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. ఈ ఏడాది మొదట్లో అజిత్ సింగ్‌గారి రాష్ట్రీయ లోక్ దళ్‌లో చేరి ఫతేపూర్ సిక్రి లోకసభ స్థానానికి పోటీ చేస్తే నాలుగో స్థానం దక్కింది. ఇలాంటి కాండిడేట్ పట్ల ములాయం అంత గౌరవం చూపడం దేనికి?
పార్టీలో ఆజంఖాన్ అజమాయిషీ చేయడం, ఇతర నాయకులకు నచ్చటం లేదు. హంగు మాట సరే, మొన్న పార్లమెంటు ఎన్నికలలో ఒక్క ముస్లిము అభ్యర్థిని కూడా గెలిపించలేని ఆజంఖాన్‌కు అంత ప్రాముఖ్యత అవసరమా? అని వారి ప్రశ్న. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ పాలన గురించి జాతీయ మీడియాలో అనేక వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఆ పార్టీ తరఫున ఢిల్లీలో వుంటూ లాబీయింగ్ చేసేవారు లేకపోయారు. అమర్ సింగ్ నిష్క్రమణ తర్వాత ఇండస్ట్రియలిస్టులు, సినిమావాళ్లు ఎస్పీతో పూర్వంలా సన్నిహితంగా లేరు. అమర్‌కు ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు భాగంలోని ఠాకూర్లపై పట్టు వుంది. ఈ కారణాలతో ములాయం అమర్‌ను దగ్గరకు తీస్తున్నాట్ట. దానికి నాంది ఈ ఆహ్వానం. ఆహ్వానం అందుకున్న అమర్ ఫంక్షన్‌కు వచ్చాడు. 2010 తర్వాత మళ్లీ ములాయంతో వేదిక పంచుకున్నాడు, ముందువరసలో కూర్చుని నాలుగు నిమిషాలపాటు ప్రసంగించాడు. తన ఉపన్యాసంలో ‘వ్యక్తిగత కారణాలతో హాజరయ్యాను తప్ప దీనిలో రాజకీయ కోణం చూడవద్ద’ని ప్రజలను కోరాడు.
ఆ సమావేశానికి ఊహించినట్టుగానే ఆజంఖాన్ రాలేదు. అతనితో బాటు ములాయం అన్నగారు, పార్టీ జనరల్ సెక్రటరీ అయిన రాం గోపాల్ యాదవ్ కూడా! షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు తమ సంస్థలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేద్దామనుకుంటే మైనారిటీ ఎఫయిర్ మంత్రి హోదాలో ఆజం దానికి అనుమతి ఇవ్వలేదు. అయితే ములాయం ఆజం నిర్ణయాన్ని తిరగతోడాడు. అది ఆజంను బాధించింది. ఉర్దూ అకాడమీ వారి అవార్డు ఫంక్షన్ ముఖ్యమంత్రి నివాసంలో జరిగితే గైరుహాజరయ్యాడు. ఇప్పుడు ఈ అమర్ సింగ్‌ను పార్టీలోకి తీసుకుని వస్తే తన ప్రాభవానికి గండి పడుతుందని అతని భయం. పార్టీలో అతని అనుయాయులు, సానుభూతిపరులు కూడా చాలామంది వుంటారుగా, ఇలాంటి పరిస్థితుల్లో తను తిరిగి పార్టీలోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే సందేహం తొలవడంతో పార్కు ప్రారంభోత్సవం తర్వాత కొన్ని రోజులకు అమర్ సింగ్ పిడబ్ల్యుడి మంత్రి, ములాయం తమ్ముడు ఐన శివ్ పాల్ యాదవ్‌ను కలిసి ఓ గంటసేపు చర్చించాడు. అమర్ రాజ్యసభ సభ్యత్వం నవంబరులో అయిపోతోంది. ఎంపీగా కొనసాగాలంటే ఏదో ఒక పార్టీ మద్దతు అవసరం. ఎస్పీలో వుండగా చక్రం తిప్పిన తను ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా వున్నాడు. అందుకే రాజీకి సిద్ధపడుతున్నాడు. పార్టీలో ఆజంకు ముకుతాడు వేయడానికి ములాయం అమర్‌ను వెనక్కి తీసుకోవచ్చు.
ఎమ్బీయస్ ప్రసాద్