సినిమా హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏమైపోయింది? ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయిన పవన్ ఇప్పుడేమీ మాట్లాడటంలేదేం? ఈ పార్టీ కార్యకలాపాలు ఎక్కడా కనబడవేం? ఇది ఒక రాజకీయ పార్టీ అయినప్పడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, ఘటనలపై స్పందించదేం? ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌గాని, ఎవరైనా అధికార ప్రతినిధి ఉన్నట్లయితే ఆయనగాని మాట్లాడరేం? జనసేన రాజకీయ పార్టీ అయినట్లయితే మీటింగులు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించాలి కదా. తీర్మానాలు చేయాలి కదా. అవేవీ లేవేం? ఎందుకంటే…జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు కనుక. రాజకీయ పార్టీ అయిట్లయితే ఎన్నికల సంఘంలో నమోదు కావాలి కదా. కాని కాలేదు. జనసేన పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు. కాని ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన నమోదైన పార్టీల జాబితాలో జనసేన పేరు లేదు. ఎందుకని? పార్టీ పెట్టి, దానికో జెండా తయారుచేసి, ప్రారంభ సభ జరిపి, దాని సిద్ధాంతాలు ప్రకటించి, సభ్యత్వ నమోదు పత్రాలు ప్రచురించి, ఎన్నికల్లో భీకరంగా ప్రచారం చేసి…ఇంత హడావిడి చేశాక జనసేన పేరు ఎన్నికల సంఘం జాబితాలో లేకపోవడం ఏమిటి? దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేయించలేదని అర్థమవుతోంది. ఎన్నికల సంఘంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,699 పార్టీలు రిజిస్టరైనట్లు కమిషన్ ప్రకటించింది. కాని దాంట్లో జనసేన కనబడకపోవడం విచిత్రంగా ఉంది.
పవన్ పొలిటికల్ డ్రామా ఆడారా?
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో రాజకీయ నాటకం ఆడారా? ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం బీజేపీ`టీడీపీ కూటమి తరపున ప్రచారం చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే అందుకోసం ఆయన పార్టీ పేరుతో హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రముఖ హీరో. టాప్‌లో, ఫామ్‌లో ఉన్న కథానాయకుడు. మెగాస్టార్ చిరంజీవి కంటే పవర్‌స్టార్‌కు ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఆయన హీరోగానే ఎన్నికల ప్రచారం చేయొచ్చు. అందుకు ఎటువంటి అడ్డంకులూ లేవు. అది తప్పూ కాదు. కాని ఓ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి ప్రజలను ఎందుకు మభ్యపెట్టారో అర్థం కావడంలేదు. రాజకీయాల పట్ల సీరియస్‌నెస్ ఉన్నట్లయితే సినిమా రంగాన్ని పాక్షికంగానో, పూర్తిగానో వదిలి పాలిటిక్స్‌లోకి ప్రవేశించవచ్చు. ప్రస్త్తుతం నందమూరి బాలకృష్ణ ఈ పనే చేస్తున్నారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూనే సినిమాల్లో నటిస్తున్నారు. కాని పవన్ కళ్యాణ్ తాను పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు భ్రమలు కల్పించారు. తనకు సినిమాల పట్ల ఆసక్తి తగ్గిందని ఎన్నికల సమయంలో మీడియాకు చెప్పారు.
అన్నయ్యను మించాడు
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి అభిమానుల్లో, ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు. కాని చివరకు కాంగ్రెసు, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేక, చతికిల పడి కాంగ్రెసులో కలిసిపోయారు. చిరు కనీసం పార్టీని కొంతకాలమైన నడిపించారు. కాని పవన్ కళ్యాణ్ అదీ చేయకుండానే అరచేతిలో స్వర్గం చూపించారు. చిరంజీవి రాజకీయాల ఆలోచన చేయని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ సామాజిక సమస్యలపై మాట్లాడేవారు. ఆవేశపడిపోయేవారు. సమాజానికి ఏదో చేయాలనే, చేస్తాననే తపన ఉన్నట్లు కనిపించేవారు. ఓ సందర్భంలో కామన్‌మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను (అలా అనుకోవాలి) పెడుతున్నట్లు ప్రకటించారు. వెంటనే పక్కనే ఉన్న భార్య రేణూదేశాయ్ (ప్రస్తుతం మాజీ సతీమణి) ని పిలిచి కోటి రూపాయలకు చెక్ రాసి ఇచ్చారు. ఆ తరువాత అదేమైందో తెలియదు. ఇది కూడా ఓ డ్రామాయే అనుకోవాలి. ఎప్పుడూ సమాజం గురించి మాట్లాడే ఈ హీరో ఏం కార్యక్రమాలు చేశారో, చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు.
పవనిజం…ఏది నిజం?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడనగానే ‘పవనిజం’ అనే కొత్త మాటను సృష్టించారు అభిమానులు. ఒకాయన ఆ పేరుతో పుస్తకం కూడా రాశాడు. ఇక పవన్ కళ్యాణ్ తన తెలంగాణ స్నేహితుడైన (ఈ మాట పవన్ చెప్పిందే) రాజా రవితేజతో కలిసి ‘ఇజం’ (ఐఎస్‌ఎం) అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం పవన్ రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఫిలాసఫీకి అద్దం పట్టిందని అన్నారు. కాని కొందరు, ప్రధానంగా వామపక్షవాదులు ఆ పుస్తకం నిండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఫిలాసఫీ ఉందని తేల్చారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చుంటే, నిరంతరం ప్రజల మధ్య ఉన్నట్లయితే ఆయన అసలు ఫిలాసఫీ ఏమిటనేది తెలిసేది. కాని ఆయన రాజకీయాలు మిథ్య అని , ఆయన ఫిలాసఫీ ఎవ్వరికీ అర్థం కానిదని అర్థమవుతోంది.
-అమృత