ఎందుకు ఆగిపోయాడు?!

అన్ని రికార్డులు తిరగరాసే వరకు ఈసారి ‘ఆగడు’…   అభిమానుల అంచనాలు. మహేష్‌ దూకుడు ఆపడం మిగిలిన సినిమాల తరం కాదు…  ట్రేడ్‌ ఎక్స్‌పెక్టేషన్లు. ఆగడుకి ఎదురెళ్లడం కంటే.. ఆగి వస్తే మేలు…  చిన్న…

అన్ని రికార్డులు తిరగరాసే వరకు ఈసారి ‘ఆగడు’…   అభిమానుల అంచనాలు.
మహేష్‌ దూకుడు ఆపడం మిగిలిన సినిమాల తరం కాదు…  ట్రేడ్‌ ఎక్స్‌పెక్టేషన్లు.
ఆగడుకి ఎదురెళ్లడం కంటే.. ఆగి వస్తే మేలు…  చిన్న సినిమాల నిర్మాతలు.
వినోదానికి ఎల్లలుండేట్టు లేవు.. చూడకుండా ఆగేదే లేదు…  సినీ ప్రియుల నమ్మకాలు.

    
‘ఆగడు’ సినిమాకి వచ్చినంత హైప్‌ ఈ ఏడాదిలో ఇంతవరకు మరే సినిమాకీ రాలేదు. ఈ చిత్రంపై ఉన్నంత నమ్మకం ఎవరికీ మరే చిత్రంపై కలగలేదు. ‘సినిమా హిట్‌.. రేంజ్‌ ఒక్కటే తేలాలి’ అనే చాలా మంది అనుకున్నారు. ‘గబ్బర్‌సింగ్‌’ ఛాయలు కనిపిస్తున్నా.. ఆడియో ఉండాల్సిన స్థాయిలో లేకపోయినా కానీ అవేమీ ‘ఆగడు’పై అంచనాలని తగ్గించలేదు. బ్రేకుల్లేకుండా దూసుకుపోయే దూకుడు ఈ సినిమా సొంతం అనుకుంటే… ఎన్నో రికార్డులు బ్రేక్‌ అయిపోయే వరకు ఆగడు అని నిశ్చితాభిప్రాయంతో ఉంటే… అనూహ్యంగా మహేష్‌`వైట్ల ద్వయానికి ద్వితీయ విఘ్నం ఎదురైంది. 

మహేష్‌ని పది శాతం వాడుకుంటేనే దూకుడు ఇచ్చిన వైట్ల ఈసారి తనని వంద శాతం వాడుకున్నానని చెబుతుంటే… దూకుడు రేంజ్‌కి కనీసం రెండిరతలు అయినా ఉంటుందని ఆశించడం అభిమానుల తప్పు కాదు. ఢీ నుంచి బాద్‌షా వరకు తన ప్రతి సినిమాలో ఒకే ఫార్మాట్‌ని ఫాలో అయిన శ్రీను వైట్ల ఈసారి మొత్తం మార్చేసి ఫ్రెష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ట్రై చేసానంటే తెలుగు సినిమా వినోదానికి కొత్త ఫార్ములా దొరికిందని ఆశ పడ్డంలో వింతేమీ లేదు. కానీ అంతిమంగా ఏం చేసాడు? ఆగడులో మహేష్‌ని ఎంత వాడుకున్నాడు… తనవరకు ఎంత కొత్తదనం చూపించాడు? 

దూకుడు, బాద్‌షాకే శ్రీను వైట్ల మళ్లీ మళ్లీ తిప్పి తిప్పి అదే సినిమా తీస్తున్నాడనే కామెంట్స్‌ వచ్చాయి. అయితే ఆ టైమ్‌కి ఆ హీరోలకి ఇది కొత్త ఫార్ములా కనుక వైట్ల పాత ఫార్ములా కూడా కోట్లు కురిపించేసింది. అయితే మహేష్‌తో మళ్లీ టీమ్‌ అప్‌ అయినపుడు ఖచ్చితంగా శ్రీను వైట్ల తనని తాను అప్‌డేట్‌ చేసుకుని ఉండాలి. కానీ సక్సెస్‌ఫుల్‌ ఫార్మాట్‌ని వీడి సరికొత్తగా ప్రయత్నించి బోల్తా పడడం కంటే… సక్సెస్‌ ఫార్ములానే పట్టుకుని సేఫ్‌గా ఒడ్డు చేరిపోదామని అనిపించిందో ఏమో తనకి తెలియకుండానే మరోసారి ‘దూకుడు’ తీసేసాడు. అప్పట్లో మహేష్‌తో ‘దూకుడు 2’ తీయబోతున్నాడనే ఒక టాక్‌ వినిపించింది. ఈ కథ రాసుకున్నప్పుడు దీంట్లో దూకుడు పోలికలు కనిపెట్టి ఉన్నట్టయితే… దీనినే ‘దూకుడు 2’గా మార్కెట్‌ చేసి ఉండాల్సింది. అప్పుడిది సక్సెస్‌ అయినా లేకున్నా కనీసం సినిమాపై రైట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడి ఉండేవి.

‘దూకుడు’ ఛాయలు కూడా ట్రెయిలర్స్‌లో కనిపించకుండా పూర్తిగా వేరే అంశాలనే హైలైట్‌ చేసారు. ఇంకా చెప్పాలంటే హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లోని డైలాగుల్నే ట్రెయిలర్స్‌ నిండా నింపేసారు. దీని వల్ల ‘ఆగడు’ రిలీజ్‌కి ముందు దీనిపై ‘దూకుడు’ ప్రభావం ఉన్నట్టు అనిపించలేదు కానీ… ‘గబ్బర్‌సింగ్‌’కి వైట్ల వెర్షన్‌ అనిపించింది. దీని వల్ల ‘ఆగడు’పై మరో రకం అంచనాలు ఏర్పడ్డాయి. హీరో నడవడిక, ఆహార్యం, మాట తీరు వగైరా అన్నీ చూసి మహేష్‌ని మాస్‌ మెచ్చే స్టయిల్లో చూపించారనే నమ్మకం కలిగింది. ‘బుక్కపట్నంలో ఓ పుడిరగి ఉన్నాడు… నా దగ్గర వాడికి మొగుడున్నాడు’ అంటే హీరోయిజమ్‌ పరవళ్లు తొక్కే పక్కా మాస్‌ మసాలా సినిమా అనే కాన్ఫిడెన్స్‌ ఫాన్స్‌కి వచ్చింది.

హీరో పరిచయ సన్నివేశంలోనే టీజర్స్‌లోని డైలాగులన్నీ వరసపెట్టి చెప్పేస్తుంటే… ఒక్క సీన్లోనే ఇన్ని పంచ్‌లంటే ఇక సినిమా అంతటా ఇంకెన్ని పవర్‌ఫుల్‌ సీన్లు, డైలాగులు ఉంటాయో అనిపిస్తుంది. అంత ఆటిట్యూడ్‌ ఉన్న క్యారెక్టరు… ఎవరినైనా ఎన్‌కౌంటర్‌ చేసి పారేస్తాడనే రెప్యుటేషను.. దేనినీ లెక్క చేయని నేచరు.. ఇవన్నీ చూసేసి హీరో ఎలివేషన్‌లో కొత్త హైట్స్‌ కొలవబోతున్నామనిపిస్తుంది. కానీ ముగ్గురు కామెడీ విలన్లకి పిట్ట కథలు చెప్పుకుంటూ కామెడీతో ఇంటర్వెల్‌ వరకు కాలక్షేపం చేసేస్తాడే తప్ప ఎక్కడా క్యారెక్టర్‌కి తగ్గ డైనమిజమ్‌ ఉండదు. హీరో బలాన్ని పెంచే విలనిజమ్‌ కనిపించదు. కనీసం సెకండ్‌ హాఫ్‌లో అయినా ఆ ఆశలు నెరవేరతాయని అనుకుంటే… ఉన్నపళంగా దూకుడు మోడ్‌లోకి దూకిన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులపై పిడిగుద్దులు కురిపిస్తుంది. హీరో డైనమిక్‌గా ఉండాల్సిన చోటే కామెడీ చేసినపుడు ఇక కామెడీనే చేద్దామని ఫిక్స్‌ అయిన తర్వాత ఇక ఎలివేషన్‌కి ప్లేస్‌ ఎలా ఉంటుంది?

అడుగడుగునా ‘ఆగడు’ అంచనాలకి అందకుండా సాగుతుంది. కాకపోతే మన అంచనాలు టాప్‌ ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటే… ఆగడు బోటమ్‌ ఎక్స్‌ట్రీమ్స్‌లో సర్కిట్లు కొడుతుంది. మహేష్‌ ఎంతగా ప్రయత్నించి ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా ఉంచడానికి ప్రయత్నించినా కానీ అతనికి ఛాన్స్‌ లేకుండా పోయింది. ఒక హీరో నటించిన ఇదే తరహా చిత్రాన్ని ఇంత కంటే బెటర్‌ అవుట్‌పుట్‌తో చూసినపుడు దానికంటే చాలా తక్కువ రకం అవుట్‌పుట్‌తో సంతృప్తి పడిపోమంటే అడ్జస్ట్‌ అవడం చాలా కష్టం. శ్రీను వైట్ల అతి పెద్ద బలమైన కామెడీ కూడా ఇందులో ఇరికించినట్టుగా అనిపిస్తుంది తప్పిస్తే సీన్‌లో సింక్‌ అయిపోయి ఉండదు. అందుకే సరోజ స్వీట్స్‌, మీలో ఎవరు పోటుగాడు, బ్రహ్మానందం పేరడీ డాన్సులు నవ్వు తెప్పించినా కానీ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. వైట్ల బలమే ఇందులో తేలిపోయినపుడు ఇక బలహీనతలు వెళ్లి దేని వెనుక నక్కుతాయి?

విలన్లతో హీరో మైండ్‌ గేమ్స్‌ ఆడుకుంటూ వారందరినీ ఒక ఆట ఆడిరచి నవ్వించడమనే ఫార్ములాకి కాలం చెల్లిపోయిందని ఈమధ్య వచ్చిన రభసతో పాటు ఆగడుతో కూడా తేలిపోయింది. ఇన్ని కోట్లు వెచ్చించిన సినిమాల ద్వారా ఈ సంగతి తెలుసుకోవడం కంటే ముందే దానిని గ్రహించి ఈ ఫార్ములాని ఏనాడో పాతరేసేసి ఉంటే బాగుండేది. కానీ జరగాల్సిన డ్యామేజ్‌ ఆల్రెడీ జరిగిపోయింది. ఇక దాని గురించి చేసేదేమీ లేదు కనుక కోట్లు వెచ్చించి నేర్చుకున్న ఈ పాఠాన్ని మిగతావాళ్లంతా స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా… వీళ్లకి తగిలిన దెబ్బలనుంచే నేర్చుకుని జాగ్రత్త పడితే మంచిది. బ్రహ్మానందాన్ని కథలోకి ఎలా దించాలనే దానిపై దృష్టి పెట్టడం కంటే… కథలో అతనికి చోటుందో లేదో చెక్‌ చేసుకుని అందుకు అనుగుణంగా అడుగులేస్తే ఇలా ఆదిలోనే ఆగిపోవాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొనే బాధ తప్పుతుంది.  

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri