హైదరాబాదు బ్రాండ్ యిమేజి చెడిపోతోందని తెరాసవారు తెగ యిదవుతున్నారు. ఇది దానంతట అదే అవటం లేదని, కుట్రలో భాగంగా జరుగుతోందని కూడా నమ్మారు. ఆ పై కుట్రదారు చంద్రబాబు అని కూడా కనుగొన్నారు. ఈ మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని కూడా వెల్లడించారు. రేవంత్ రెడ్డికే యీ కితాబు దక్కడానికి కారణం – రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా పనిచేస్తున్నవారు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలే. తక్కిన వారందరూ నోరెత్తకుండా అప్పుడప్పుడు సణుగుళ్లతో సరిపెడుతున్నారు. ఆంధ్రలో బాబుపై అనునిత్యం యాగీ చేసే వైకాపా, తెలంగాణలో కిమ్మనదు. అంటే తెలంగాణను పూర్తిగా తెరాసకు ధారాదత్తం చేసేసినట్లేనా? లేక ఒప్పందాలేమైనా వున్నాయా? ఇక కాంగ్రెసుకి బలం పూర్తిగా నశించలేదని మెదక్ ఉపయెన్నికలో ద్వితీయస్థానం రుజువు చేసింది. అయినా వారిలో చైతన్యం లేదు. ఉద్యమం నడిచినంత కాలం కెసియార్ తమను ఎంత పడతిట్టినా పన్నెత్తి ఒక్కమాట అనలేదు. అల్టిమేట్‌గా ఆయన కాంగ్రెసులో చేరి, తమపై పెత్తనం చేస్తాడు, అనవసరంగా పేచీ తెచ్చుకోవడం దేనికి అనుకుంటూ. అదేమీ జరగలేదు. కానీ వీళ్లు యిప్పటికీ గట్టిగా ఏమీ అనటం లేదు. తెలంగాణ ప్రజలంతా కెసియార్‌ను దేవుడిగా భావిస్తున్నారు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే మనం చెడ్డవాళ్లమవుతాం అనుకుంటున్నారు కాబోలు. వాళ్లు భ్రమల్లోంచి ఎప్పుడు బయటపడతారో తెలియదు. ఇక కిషన్‌రెడ్డి మాత్రం విమర్శలు చేస్తూ తన పార్టీ ఉనికి కాపాడుకుంటున్నారు. ఎప్పుడు తెరాసలోకి దూకాలో ముహూర్తాలు పెట్టించుకున్న ఘటాలు టిడిపిలో కూడా చాలా వున్నాయి కాబట్టి టిడిపి నాయకుల్లో చాలామంది మౌనంగానే వుంటున్నారు. తెరాసలో కొన్నాళ్లుండి వచ్చిన రేవంత్ ఛస్తే అటువైపు వెళ్లకూడదని గట్టిగా అనుకున్నారేమో, తెగించి తెరాసను తూర్పారబడుతున్నారు.
తాజా వివాదం మెట్రోది. పూర్వాపరాలు అందరికీ తెలుసు. ఎలైన్‌మెంట్ మార్చడానికి ఎల్ అండ్ టి ఒప్పుకుంది అని మీడియాకు లీకులు యిచ్చిన ప్రభుత్వం మూణ్నెళ్లయినా వాళ్లను పిలిచి మాట్లాడకపోవడమేమిటి? మా ఉద్దేశం యిది, మారిస్తే అదనంగా ఎంతవుతుంది, మేం ఎంత భరించాలి అని లేఖ రాయకపోవడమేమిటి? కంపెనీవాళ్లు పేపర్లో చదివి తెలుసుకోవాలా? ప్రతిష్టాత్మకమైన మెట్రో ప్రాజెక్టు 200 కి.మీ. వరకు లైన్లు వేయిస్తాం, పాత ప్రభుత్వాధినేతలకు తలకాయ లేక యింత చిన్నగా ప్లాన్ చేశారు అని ప్రకటనలు యివ్వగానే సరిపోయిందా? అసలు హైదరాబాదువాసులు మెట్రోను ఆదరిస్తారో లేదో టిక్కెట్లు, పార్కింగ్ చార్జిలు చూశాక తెలుస్తుంది. ఎంఎంటిఎస్ స్టేషన్లలోనే ఒక్కో చోట ఒక్కోలా వసూలు చేస్తున్నారు. పాస్ అయితే ఫర్వాలేదు కానీ, విడిగా వెళ్లేటప్పుడు యింత యిచ్చుకునే బదులు బస్సెక్కితే చౌక అనే కాలిక్యులేషన్లు వేస్తున్నారు జనాలు. డబ్బు విషయంలో నగరవాసుల కంటె పట్టణవాసులు, వారి కంటె గ్రామవాసులు మరీ గట్టిగా వుంటారు. హైదరాబాదు నుండి 200 కి.మీ.లంటే గ్రామవాసులు కూడా ఎక్కితేనే గిరాకీ వుంటుంది. వాళ్లు యింత ఖరీదైన మెట్రోను ఆదరిస్తారా అనేది సందేహం. (ఆంధ్రరాష్ట్రంలో ఏకంగా ఐదు చోట్ల మెట్రో అనేస్తున్నారు. ఊళ్లకు వూళ్లు షేర్ ఆటోల్లో వెళ్లిపోయే జనాలు మెట్రో వంటి ఖరీదైన సాధనాన్ని వాడతారా? ప్రాజెక్టు చేపట్టడానికి ఏ కంపెనీ ఐనా ముందుకు వస్తుందా? ఒకవేళ వస్తే ఎన్ని హిరణ్యాక్షవరాలు కోరుతుందో!?) 200 కి.మీ.ల మాట అలా వుంచండి, ఉన్నదైనా పూర్తి చేయనివ్వాలి కదా. గబగబ పిలిచి నచ్చచెప్పాలి కదా. అదేం లేదు. చూసి చూసి విసుగెత్తి సెప్టెంబరు 10 న ఎల్ అండ్ టివారు లేఖ రాశారు. దానికైనా స్పందించాలా? లేదే. తెల్లారితే 'నెల్లాళ్లలో చెట్లు నాటించమని కెసియార్ అధికారులను ఆదేశించారు, బోరు బావులు తవ్వించమని హుంకరించారు, కబ్జా అయిన చెఱువులను తిరిగి స్వాధీనం చేసుకోమని హెచ్చరించారు, ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్‌ను జేబులో పెట్టుకుని రమ్మనమని ముగ్గుర్ని తోలారు..' వంటి వార్తలే వస్తున్నాయి కదా. మెట్రో గొడవేమిటో చూడండి, కంపెనీ వాళ్లు చాలా ఘాటుగా రాశారు అని సిఎం గారు ఒక్కరికీ చెప్పలేదా?
కంపెనీవారు వారం ఓపిక పట్టి ప్రభుత్వంలో చలనం రావాలంటే మీడియాను ఆశ్రయించడమొకటే మార్గం అనుకున్నారు. తమ లేఖను లీక్ చేశారు. ప్రభుత్వం కదిలింది. వాళ్లను పిలిచి మాట్లాడింది. మార్పుచేర్పుల విషయం ఏమీ తేలలేదు కానీ కంపెనీకి తమ ఉద్దేశం మాత్రం తెలిపింది. చర్చల ప్రక్రియంటూ ప్రారంభమైంది కాబట్టి ఎప్పటికో అప్పటికి ఎలాగో అలాగ తేలవచ్చు. ఈ ప్రారంభానికే కంపెనీ అంత స్టెప్ తీసుకోవలసి రావడం విషాదకరం. ఇక్కడ రెస్పాన్సివ్ గవర్నమెంట్ లేదు అనే సంకేతం యిన్వెస్టర్లకు వెళుతుంది. సింగిల్ విండో పెడతాం, ఛేజింగ్ సెల్ పెడతాం, షంషాబాద్ ఎయిర్‌పోర్టులో డబ్బు సంచులతో ఎవడైనా దిగగానే వాణ్ని వెంటాడి, పెట్టుబడి పెట్టేదాకా వదిలిపెట్టం అని చెప్పుకుంటూనే యిప్పటికే యింత యిన్వెస్ట్ చేసిన కంపెనీతో యిలా వ్యవహరించడం వలన హైదరాబాదు యిమేజికి డామేజి చేసినట్లు కాదా? కావాలని చేసిన పొరబాటు కాకపోవచ్చు, ఏదో అశ్రద్ధ, ఉదాసీనత, యిది చేస్తే నాకేంటంట? అనే ఆలోచన – ఏదైనా కావచ్చు, జరిగిపోయింది జరిగిపోయింది యికపై హుషారుగా వుంటే సరిపోతుంది అనుకుని వూరుకుంటే ఉత్తమంగా వుండేది. కానీ యీ లేఖ యిలా బయటకు రావడం వెనక్కాల కుట్ర వుంది అంటూ యాగీ చేసుకుంది తెరాస సర్కారు. ఎల్ అండ్ టి చంద్రబాబుకి సన్నిహితులు కాబట్టే యిదంతా అనే వాదన తెచ్చారు.
వ్యాపారస్తుడికి అధికారంలో ఎవరుంటే వారే సన్నిహితులు. 'హైటెక్ సిటీతో బాటు, టిడిపి ఆఫీసు కూడా కట్టిపెట్టారు' అంటే అది టిడిపి అధికారంలో వున్నప్పుడు చేసింది. గత పదేళ్లగా వాళ్లు టిడిపికి ఏం కట్టిపెట్టారట? ఈ మెట్రో అదనపు ఖర్చు మేం భరిస్తాం అని కెసియార్ అంటే వాళ్లు తెరాసకు వరంగల్‌లో భవనం కట్టి యివ్వవచ్చు. వాళ్లు ఏ పార్టీతోనూ చెడగొట్టుకోరు. ఎవరు ఎప్పుడు అధికారంలోకి వస్తారో ఎవరికి ఎఱుక? అయినా కెసియార్ ఎల్ అండ్ టి పై పగబట్టినట్టున్నారు. కంపెనీ వాళ్లను పిలిచి 'మీరు పోతే పొండి, మీలాటి కంపెనీలు ప్రపంచంలో 190 వున్నాయి, మీ డబ్బు మీ మొహాన పడేసి వాళ్లను తెచ్చుకుంటాం' అని కడిగిపారేసినట్లు, వాళ్లు క్షమాపణలు చెప్పుకున్నట్లు లీకులు వచ్చాయి. ఆ విధంగా కెసియార్ యిగో తృప్తి పడిందేమో కానీ, ఎల్ అండ్ టి వారు ఘనులు. కేంద్రంలో ఏ చక్రం తిప్పారో ఏమో కానీ హైదరాబాదు మెట్రోను వేరే చట్టం కింద తీసుకుని వచ్చారు. ఇకపై కేంద్రమే దీన్ని పర్యవేక్షిస్తుందట. ఎలైన్‌మెంట్ మార్చడం రాష్ట్రప్రభుత్వానికి అలవి కాదట. కేంద్రం యిలాటి స్టెప్ తీసుకుందంటే అర్థం – తెరాస ప్రభుత్వ వ్యవహారంపై అనుమానపడుతోందని! మెట్రో, మై హోమ్ తగాదా గురించి రేవంత్ రెడ్డి ఏవో సాక్ష్యాలు బయటపెడతానంటున్నారు. ఇలాటివి ఏ రాష్ట్రంలోనైనా తప్పవు. వాటి సంగతి ఓ పట్టాన తేలదు. వాటిపై కేంద్రం స్పందించిందని అనుకోను. కృష్ణా, గోదావరీ నదీ జలాలు, హైదరాబాదులో శాంతిభద్రతలు.. యిలా అన్నీ కేంద్రం తన చేతిలో తీసేసుకుంటోంది. తాజాగా మెట్రో కూడా!
కోర్టులు కూడా తెరాస ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నాయి. స్థానికతకు 1956 నిబంధన సబబు కాదని తెలంగాణ నాయకులే అనేకమంది అన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయించమని విజ్ఞప్తి చేశారు. మీతో అడిగేదేమిటని కెసియార్ వ్యవహరించారు. పిల్ దాఖలైంది. హై కోర్టు నిప్పులు కక్కింది. తెలంగాణ భారతదేశం వెలుపల వుందా? ఇప్పుడు దీన్ని అనుమతిస్తే రేపు ప్రతీ రాష్ట్రం యిలాటి చట్టమే పాస్ చేస్తాయి, దీన్ని అనుమతించే ప్రశ్నే లేదు అని కరాఖండీగా చెప్పింది. రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాని రూలు పెట్టమని కెసియార్‌కు సలహా యిచ్చిన సలహాదారులెవరో మరి! సర్కారు ఏర్పడగానే ఉద్యమకాలంలో తనకు సాయపడిన మేధావులందరికి యిలాటి పోస్టులిచ్చి కూర్చోబెట్టారు. వాళ్లు యిచ్చే సలహాలు యింత అందంగా వుంటున్నాయి. వాళ్లిచ్చిన మరో సలహా వాహనాల రీ రిజిస్ట్రేషన్. అసలు ఏ చట్టం కింద మీరు యిలా డిమాండ్ చేస్తున్నారు చెప్పండి అని కోర్టు అడిగితే ప్రభుత్వప్రతినిథి గుటకలు మింగాడు. కొత్త వాహనాలకు తప్ప పాత వాహనాల జోలికి వెళ్లవద్దు అని కోర్టు చేత గట్టిగా చెప్పించుకున్నారు. ఇక అక్కడితో ఆగాలి. అబ్బే, దీని కంటె పై కోర్టుకి వెళతాం అంటున్నారు. నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. చట్టపరంగా ఆ హక్కు వుంది. కానీ వాళ్లు యింతకంటె భిన్నమైన తీర్పు యిస్తారనుకోవడానికి లేదు. స్థానికతకు ప్రతీ రాష్ట్రంలోను ఓ ఫార్ములా వుంది. మన రాష్ట్రంలో వచ్చే పదేళ్లదాకా అమలు కావలసిన రాష్ట్రపతి ఉత్తర్వు వుంది. దాన్ని పక్కకు పడేసి ఎప్పుడో 60 ఏళ్ల క్రితం డాక్యుమెంట్లు పట్టుకుని రా, లేకపోతే నువ్వు ఔట్ అనడం సమంజసంగా లేదని ఎవరైనా చెప్తారు. ఆంధ్రమూలాలున్నవారి వద్ద ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోంది. కానీ సంక్షేమానికి వచ్చేసరికి నువ్వు మా పౌరుడివి కాదు పొమ్మంటోంది. ఈ ఎనామలీని అధిగమించిన నాడే కోర్టులు వీళ్ల మాట వింటాయి.
కోర్టులు ప్రదర్శించిన విజ్ఞత చదువులు చెప్పే చుక్కా రామయ్యగారు కనబరచలేదు. ''ఆంధ్రభూమి''లో వ్యాసం రాస్తూ ''ఫీజు రీ యంబర్స్‌మెంటు ద్వారా విద్యకు ఆర్థికసహాయం చేయడం పెట్టుబడిగా భావిస్తున్నారు, ఇది జిడిపి పెరగడానికి దోహదపడుతుంది. దీనికి కేంద్రం కూడా సాయపడితే మంచిది..' అంటూ మంచి పాయింట్లు రాస్తూనే తెరాస ప్రభుత్వం చూపుతున్న వివక్షతను సమర్థించారు – 'ఆర్థిక యిబ్బందుల వలన అత్యవసరమైన వారికే యీ సౌకర్యం అందించడానికి ప్రయత్నం చేస్తూంటే అపార్థం చేసుకుంటున్నారు. 1956 కన్నా ముందున్న వారి పిల్లలు ఫస్ట్ లెర్నర్స్ కాబట్టి రాష్ట్రప్రభుత్వం ఆ విధంగా అటువైపు మొగ్గు చూపటం భావ్యం' అన్నారు. అంటే 1956 కన్నా ముందున్న వారి పిల్లలు యిప్పటిదాకా అక్షరాస్యతకు నోచుకోలేదా? మరి ఆ గణాంకాలు ఎలా పెరిగాయి? ఆర్థికస్థితి బాగా లేనివారే కదా ఫీజు రియంబర్స్‌మెంట్ అడిగేది. రాష్ట్రపౌరుల్లో కొందరికి మాత్రమే అందిస్తే మొత్తం జిడిపి ఎలా పెరుగుతుంది? బతకమ్మకు నిధులుంటాయి, పుష్కరాలకు నిధులుంటాయి, చదువుకి మాత్రం వుండవు. గణాంకాలు తీసినపుడు 1956కి ముందున్న వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుని, తక్కినవాళ్లంతా మనుష్యులు కారని జీవో పాస్ చేస్తే అప్పుడు మాత్రమే జిడిపిలో వృద్ధి కనబడుతుంది.
ఈ విషయంలో ప్రభుత్వాన్ని సమర్థించిన చుక్కా రామయ్యగారు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, హరగోపాల్ వంటి మేధావులు తమ సమావేశానికి వచ్చేసరికి దుయ్యబట్టారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దరిదాపులకు రాకుండా తరమడంతో కెసియార్‌వి ఫాసిస్టు పోకడలన్నారు. వీళ్లంతా తెలంగాణ కోసం కలవరించి, పలవరించినవారే. ఏర్పడబోయే తెలంగాణ ఎలా వుంటుందో వీరి దూరదృష్టికి అందలేదా? ఇది అన్యాయం కదమ్మా అని తెలంగాణ సంస్కృతీమాత కవితను టీవీ ఇంటర్వ్యూలో అడిగితే ''తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుంది. విభజన జరిగితే రాజధానిలో శాంతిభద్రతలు గవర్నరు చేతిలో వుండాలి' అని కేంద్రం భావించి, ఆ మేరకు గవర్నరుకు అప్పగించింది. వద్దని మేం వెళ్లి కొట్లాడాం. ఇలాటి సమావేశాలు జరిగితే రాజ్‌నాథ్ వద్ద మేం తలెత్తుకోలేం.'' అని వాదించింది. అంటే యిది సంఘవ్యతిరేక శక్తుల కార్యకలాపం అని ఆవిడ తేల్చేసినట్లేగా. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు వుంటుందనుకుంటాం. పోరాటాల తెలంగాణలో మరింత వుంటుందని నమ్మబలికారు. ఉండదని యీ సంఘటన తేల్చి చెప్పింది. సెప్టెంబరు 17 న మన రాష్ట్ర హోం మంత్రి నిజాంను కీర్తించారంటే కీర్తించరా మరి! ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు కదా! అందుకే కదా మీడియా గొంతు నొక్కింది కూడా. అంతా ఎంఎస్‌ఓలకు ఛానెల్స్‌కు మధ్య వ్యవహారం అని చెప్తూ వుంటే సరిపోతుందా? అదే నిజమనుకున్నా ఇరుపక్షాలను కూర్చోబెట్టి పరిష్కారం చూపవలసిన బాధ్యత లేదా? ఎంఎస్‌ఓలకు యింతింత అధికారాలు దఖలు పడితే వాళ్లు రేపు మరో ఛానెల్‌తో కూడా యిలా వ్యవహరించరన్న నమ్మకం ఏమిటి? ఈ రోజు వాళ్లు మీ చేతిలో వున్నారు, రేపు ఎవరైనా వాళ్లను వశపరుచుకుంటే..?
ఇలాటి ఘర్షణాపూర్వక వాతావరణంలో పెట్టుబడులు కురుస్తాయని ఎవరనుకుంటాం? అన్నిటి కంటె ముఖ్యం విద్యుత్ కొరత. మళ్లీ కోతలు ప్రారంభమయ్యాయి. పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలీడే, రాజధానిలో నాలుగు గంటలు, గ్రామాల్లో 12 గంటలు. ప్రతీ గ్రామాన్ని డెవలప్‌మెంట్ హబ్‌గా చేస్తామంటూ ప్రకటనలు. ఎలా చేస్తారు? ఏం పెట్టి చేస్తారు? విద్యుత్ లేకపోతే ఉత్పత్తి తద్వారా ఆదాయం తగ్గిపోదా? హైదరాబాదును విశ్వనగరం అని చెప్పగానే సరిపోతుందా? బ్రాండ్ యిమేజి అమాంతం పెరిగిపోతుందా? 2009 ప్రకటన తర్వాత నుండి హైదరాబాదు ప్రగతి కుంటుపడుతూ వచ్చింది. ఇప్పుడు మరీ కుంటుతోంది. ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. హాస్టళ్లు బోసిపోతున్నాయి. కాలేజీలు బావురుమంటున్నాయి. రేవంత్ రెడ్డి ఒంటిచేత్తో యివన్నీ చేయగలిగారంటే ఆయన్ని మానవాతీతుడనే అనాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)