మనిషికి కావాల్సిందేమిటి? వేదాంత భాషలో చెప్పాలంటే ఆరడుగుల నేల. లౌకికంగా చెప్పాలంటే కూడు, గూడు, నీడ. జాతీయ భాషలో చెప్పాలంటే రోటీ, కపడా ఔర్ మకాన్. ఇవి కనీస అవసరాలు. వీటి తరువాత కావల్సినవి సౌకర్యాలు. ఏ మనిషైనా ఇంతవరకు సమకూర్చుకుంటే హాయిగానే బతగ్గలడు. మూడోది విలాసాలు. అవీ అవసరమే. కాని ఎంతవరకు? చెప్పలేం. ఇది ఆయా మనుషుల స్వభావాలు, ఆలోచనలు, వారి ఆర్థిక పరిస్థితి బట్టి ఉంటుంది. విలాసంగా బతకాలంటే నిజాయితీగా, అడ్డదారులు తొక్కకుండా సంపాదించి బతకొచ్చు. అందుకోసం కష్టపడాలి. ఉన్నంతలో విలాసంగా బతకడంలో తప్పులేదు. కాని అడ్డూ అదుపు లేకుండా, అక్రమ పద్ధతుల ద్వారా సంపాదించి బతకడానికి సామాన్య జనమే కాదు, దేశంలోని దాదాపు అందరు రాజకీయ నాయకులు అలవాటు పడిపోయారు. వీరంతా పరిపాలకులు. అవినీతి పనులు చేసేవారిని, అక్రమంగా ఆర్జించేవారిని జైల్లోకి తోసే అధికారం ఉన్న పాలకులే అక్రమార్జనపరులుగా ముద్ర వేయించుకొని జైలుకు వెళుతున్నారు. ఇక అవినీతి పనులు చేసే సామాన్య జనం గురించి చెప్పుకునేదేముంది? ఈ అక్రమార్జన ఎవరి కోసం? ఎందుకోసం? ‘లక్షాధికారులైనా లవణమన్నమేగాని మెరుగు బంగారంబు మింగలేరు’ అన్నారు ఆరుద్ర అందాల రాముడు సినిమాలో.
ఈ దేశంలో అవినీతిపరులు కాని, అక్రమాస్తులు లేని రాజకీయ నాయకులు ఉన్నారా అని వెతికితే చాలా తక్కువమంది దొరుకుతారు. సర్పంచ్ దగ్గర్నుంచి ప్రధాన మంత్రి వరకు అవినీతిపరులే కనబడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరుల సంగతి చెప్పక్కర్లేదు. అవినీతిపరులైన ముఖ్యమంత్రుల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, మధు కోడా, శిబు సొరేన్, యడ్యూరప్ప కరడుగట్టిన అవినీతిపరులు అనడంలో సందేహంలేదు. ఇక వైఎస్ఆర్, చంద్రబాబు (తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు) వైఎస్ జగన్….ఇలా ఎందరో అవినీతిపరుల జాబితాలో ఉన్నారు. అవినీతిపరులైన నాయకులందరికీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు పెద్ద షాకనే చెప్పుకోవాలి. ఈ కేసులో తీర్పుతోనైనా వారికి పశ్చాత్తాపం కలుగుతుందా? జయలలిత విషయానికొద్దాం. దాదాపు రూ.67 కోట్ల అక్రమాస్తులు అమెవి. నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న ఆదర్శ ముఖ్యమంత్రి ఆమె. కాని చేసిన పనులేమిటి? నీలగిరిలోని కొడనాడులో వెయ్యి ఎకరాల భూమి సంపాదించింది. 28 కిలోల బంగారం, 12000 చీరలు…ఇంకా ఎన్నెన్నో. హైదరాబాదులోనూ ఆస్తులున్నాయి. 1991లో ఆమె మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమె ఆస్తి విలువ రూ.3 కోట్లు. 1996 నాటికి అది కొన్ని వందల రెట్లు పెరిగిపోయింది. ఆమె ఆదాయం ఎంత? ఆస్తులు ఎంత? చివరకు తేలిందేమిటి ఇదంతా అక్రమంగా సంపాదించిన ఆస్తి అని. పెంపుడు కుమారుడు సుధాకరన్ (తరువాత గెంటేసిందనుకోండి. అది వేరే విషయం) పెళ్లి ఖర్చే రూ.5 కోట్లకు పైగా అయింది. ప్రపంచంలో అత్యంత వైభవంగా జరిగిన వివాహాల్లో ఇదొకటి. అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకురాలు జయలలిత అక్రమంగా ఇన్ని కోట్ల విలువైన ఆస్తి ఆర్జించాల్సిన అవసరం ఏముంది?
ఆమె సినిమాల్లోనే బోలెడు సంపాదించింది. పోనీ ఆమెకు కుటుంబం ఉందా? పిల్లలున్నారా? మరి ఎవరికి ఇవ్వడానికి ఈ ఆస్తి? దీనికి జవాబు ఏం చెప్తాం. ఏదో రకంగా ఆస్తులు సంపాదించుకోవడం, వందల కోట్లు ఆక్రమంగా కూడబెట్టడం ఓ వ్యసనం. అదో వెర్రి. అదో మానియా. అదో రకమైన తనివితీరని దాహం. వీరు తాము ఓ బాధ్యత గల పదవిలో ఉన్నామని కూడా ఆలోచించరు. సంపాదించుకోవడం ఒక్కటే వీరికి తెలిసింది. జయలలిత ఇన్ని కోట్లు సంపాదించింది. ఎవరికిస్తుంది? ఆమెకు రక్తసంబంధీకులు ఎవరున్నారు? ఆమె తల్లి ఒకప్పటి సినీ తార సంధ్య అని కొంతమందికైనా తెలిసేవుంటుంది. చాలా తెలుగు సినిమాల్లో నటించింది. తండ్రి జయరాం జయకు రెండేళ్ల వయసులోనే చనిపోయారు. ఆయన పోయేనాటికి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దీంతో మద్రాసు (ఇప్పటి చెన్నయ్) రావడం, జయ సినిమా హీరోయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి దశ తిరిగిపోయింది. ఆమె సోదరుడు జయకుమార్ 1990ల ప్రారంభంలో చనిపోయారు. ఆమెకు ఆమ్మ, నాన్న తరపు బంధువులతో ఎంతవరకు సంబంధాలున్నాయో తెలియదు. అన్న కుటుంబం గురించి కూడా తెలియదు. జయకు ప్రత్యేకంగా కుటుంబం లేదు. ఓ కూతురు ఉందని కొందరంటారు. అందులో నిజానిజాలు తెలియవు. మరి ఇంత అక్రమాస్తి ఆమె తర్వాత ఎవరికి పోతుంది? ఎవరికి కట్టబెట్టడానికి ఆమె సంపాదించింది? మనకు తెలియదు. ఓ ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవల్సిన జయలలిత చరిత్రలో అవినీతిపరురాలిగా మిగిలిపోయింది.
ఎం. నాగేందర్