ఉత్తరప్రదేశ్‌లో బిజెపి వైఫల్యానికి బాధ్యుడిగా నింద మోస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల ప్రచారంలో అతని రెచ్చగొట్టే ప్రసంగాలను పార్టీ ఎన్నడూ ఖండించలేదు, అతని వ్యక్తిగత అభిప్రాయాలుగా తీసిపారేయలేదు. ఎన్నికల ప్రచారసారథులుగా ఎంపిక చేసిన ముగ్గురిలో అతను ఒకడు. తక్కిన వాళ్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజపాయ్, కేంద్రమంత్రి కలరాజ్ మిశ్రా. తక్కిన ఇద్దరి కంటె ఇతని ఉపన్యాసాలే ఎంతో వేడిని పుట్టించాయి. అతను లేవనెత్తిన ‘లవ్ జిహాద్’ (ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకుని మతమార్పిడికి ప్రేరేపించడం) అంశానికి విస్తృతంగా ప్రచారం లభించి ‘అది నిజమేనా’ అని కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను విలేకరులు అడిగేదాకా వెళ్లింది. అలాంటిది జరుగుతోందని చెప్పలేక, ఆదిత్యనాథ్‌ను ఖండించలేక రాజనాథ్ ‘లవ్ జిహాదా? అంటే ఏమిటి?’ అని అడిగి తప్పించుకున్నాడు. ఏడాదికి పైగా పేపర్లలో నలుగుతున్న ఈ కాన్సెప్ట్ గురించి హోం శాఖ చూసే కేంద్రమంత్రికి తెలియదంటే నమ్మగలమా?
ఇంతకీ ఎవరీ ఆదిత్యనాథ్? 1972లో ఉత్తరాఖండ్‌లో అజయ్‌సింగ్ ఠాకూర్‌గా పుట్టిన ఆదిత్యనాథ్‌కు ఆ పేరు ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ ఇచ్చినది. గఢ్వాల్ యూనివర్శిటీ ద్వారా సైన్సులో పట్టా తీసుకున్న అతను 22వ యేట సన్యాసం తీసుకుని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠానికి అవైద్యనాథ్ వారసుడిగా గుర్తింపబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌ను హిందూ రాష్ట్రంగా, భారతదేశానికి హిందూ దేశంగా మార్చేంతవరకు విశ్రమించనని దీక్ష పూనాడు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసి తన ప్రాంతంలోని ఠాకూర్లలో మంచి పేరు సంపాదించుకున్నాడు. రాజకీయాల్లోకి రావడానికి సన్యాసం అడ్డు కాదనుకుని 1998లో లోకసభ ఎన్నికలలో గోరఖ్‌పూర్ స్థానం నుండి బిజెపి టిక్కెట్టుపై నిలబడి గెలిచాడు. హిందూ యువ వాహిని, శ్రీ రామశక్తి ప్రకోస్థ, గోరఖ్‌నాథ్ పూర్వాంచల్ వికాస్ మంచ్ వంటి సంస్థలు ప్రారంభించి తన బలాన్ని పెంపొందించుకున్నాడు. అప్పణ్నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ ఎన్నికలలో ఓడిపోలేదు. 2005లో పశ్చిమ యుపిలోని ఈటా జిల్లాలో మతం మారిన 5 వేల మందిని తిరిగి హిందూమతంలోకి మార్పించాడు. 2007లో గోరఖ్‌పూర్‌లో, పరిసర జిల్లాలలో మతఘర్షణలు జరిగినపుడు వాటిలో హిందూ యువ వాహిని హస్తం వుందన్న అనుమానంతో ఆదిత్యనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు, కానీ త్వరలోనే విడిచి పెట్టేశారు.
యుపి ఎన్నికలలో కులపరంగా ఓట్లు చీలిపోవడం గమనించిన బిజెపి, వాటిని మతపరంగా చీల్చి లబ్ధి పొందవచ్చనే ప్రణాళికతో ఆదిత్యనాథ్‌కు ప్రచార కమిటీ ప్రధాన బాధ్యత అప్పగించింది. అతను తన పని సీరియస్‌గా తీసుకుని కొన్ని వ్యాఖ్యలు చేసి దుమారం లేపాడు. కానీ పార్లమెంటు ఎన్నికలలో వీచిన మోడీ గాలి అసెంబ్లీ ఎన్నికల నాటికి చల్లబడడం చేత, బియస్పీ ఓట్లు ఎస్పీకి పడడం చేత బిజెపి కంగుతింది. పార్టీ అంతర్గత చర్చల్లో ఆదిత్యనాథ్ వలన మేలు కంటె కీడు ఎక్కువగా జరిగిందని ఫిర్యాదులు అందాయి. ఇకపై ఆదిత్యనాథ్ సేవలను పార్టీ ఏ మేరకు వినియోగించుకుంటుందో వేచి చూడాలి.
ఎమ్బీయస్ ప్రసాద్