ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనయుల హవా నడుస్తున్నది. కాదు, కాదు వారి కనుసైగల్లోనే పాలన, పార్టీలు నడుస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇదే హాట్ హాట్ టాపిక్‌గా మారింది. వాళ్లే ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్. ఇద్దరూ ఉన్నత విద్యనభ్యసించిన వాళ్లే. ఇద్దరూ అమెరికా నుంచి వచ్చిన వాళ్లే. తనయుల దూకుడును చూసి వారి తండ్రులు లోలోపల మురిసిపోతుంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారిస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ విమర్శలను పాలకపక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉంటే, కేటీఆర్ 2006లో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహారించడం వల్ల చాలా సులువుగా జనంలోకి వెళ్లగలిగారు. దీనితో సిరిసిల్ల అసెంబ్లీ నుంచి వరుసగా నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో తొలి కేబినెట్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఐటిపై తన ముద్రను వేసుకునే పనిలో పడ్డారు. ఇక నారా లోకేష్ గురించి వస్తే… 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికప్పటి నుంచి పరోక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ… 2012 నుంచి టీడీపీలో క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీలో చేరిన అనతి కాలంలోనే పార్టీలో తనకంటూ ముద్రను వేసుకోగలిగారు. ఆత్మవిశ్వాసం సడలుతున్న పార్టీ క్యాడర్‌కు అన్నీతానై నిలిచారు. ఆటుపోట్లను ఎదుర్కొంటున్న పార్టీకి అండగా నిలిచారు. పార్టీకి భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా నిలబడటానికి అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
దీనితోనే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో అందరూ కేటీఆర్, లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ వారి చుట్టే తిరుగుతున్నాయి. వాళ్లు చెప్పిందే వేదం. చిన బాబులు చెబితే పెద్ద బాబులు చెప్పినట్లే. దీనితో వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పొలిటీషియన్ మొదలుకుని అధికారుల వరకూ అందరూ ‘క్యూ’ కడుతున్నారు. కేటీఆర్, లోకేష్‌ను ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు అయిపోయినట్టేననే ప్రచారం రాజకీయవర్గాల్లో, అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీనితో అందరి చూపు ఆ తనయులవైపే. తెలుగు రాష్ట్రాల్లోని సర్కార్‌లో వారి పాత్రను చూస్తుంటే భవిష్యత్ ‘బాస్’లు వారేననీ వేరే చెప్పనక్కర్లేదు. తండ్రులు ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన ఉద్దండులు. అపారమైన అనుభవం కలిగినవారు. తండ్రులు ముఖ్యమంత్రులుగా కొనసాగుతుండగా… తనయులు తెర వెనక నుంచి చక్రం తిప్పుతున్నారు. అన్నీ తామై నడిపిస్తున్నారు. ఓ వైపు పార్టీపై, మరోవైపు పాలనలో సైతం తమ మార్కును కనబడేలా చేసుకుంటున్నారు.
తనయుల జోరును, హుషారును చూసి వారి తండ్రులు సైతం బాగానే ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. భవిష్యత్‌లో తమ రాజకీయ వారసులుగా తమ తనయులే కొనసాగుతారనే సంకేతాలను చంద్రులిద్దరూ ఇప్పటి నుంచే ఇవ్వడం మొదలుపెట్టారనీ అత్యంతమైన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. దీనితో అటు లోకేష్, ఇటు కేటీఆర్ ఇద్దరూ ఒక పద్దతి ప్రకారం తమ రాజకీయ భవిష్యత్ కోసం ఒక్కొక్క మెట్టును పటిష్టం చేసుకుంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంచు మించుగా ఒకేసారి, ఒకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినవాళ్లే. తరువాత ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్లే. ఇద్దరూ రాజకీయాల్లో ఆరితేరిన వాళ్లే. వ్యూహాలు రచించడంలో, ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఇద్దరు చంద్రులకు మంచి దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ సీఎం కాగా, ఆంధ్రప్రదేశ్‌కు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం విధితమే. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాష్ర్ట ఐటి, పంచాయత్‌రాజ్ మంత్రిగా వ్యవహారిస్తుండగా… ఆంధ్రలో నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మాత్రం చట్టబద్ధమైన ఎలాంటి పదవుల్లో లేకపోయినా పార్టీలో, సర్కార్‌లో తన మార్కు ఉండేలా చేస్తున్నారు. తనయులిద్దరూ తండ్రులకు బాసటగా నిలుస్తున్నారు.
కేబినెట్ కూర్పు మొదలుకుని ప్రభుత్వాలు కొత్తగా చేపడుతున్న సంక్షేమ పథకాల వరకు అటు లోకేష్, ఇటు కేటీఆర్‌దే కీలకమనీ జగమెరిగిన సత్యం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చినబాబులు చెబితే పెద్దబాబులు చెప్పినట్లేననీ అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అందుకు తగ్గట్టుగా ఇటు కేటీఆర్, అటు లోకేష్ పాలనాపరమైన వాటిలో జోక్యం చేసుకుంటున్నట్లు తరుచూ వార్తలు వింటున్నాం కూడా. ఓ వైపు పార్టీపై పట్టుకోసం ప్రత్యేక దృష్టిని పెట్టిన ఈ యువనేతలు మరోవైపు పాలనపై కూడా పట్టు సాధించుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరు యువనేతలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అగుపిస్తున్నది. కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం లోకేష్ ‘పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి’ని ప్రారంభించి అందరి దృష్టి తనవైపు మళ్లేలా చేసుకోగా… కేటీఆరేమో నిరుపేద మహిళల కోసం ‘కల్యాణలక్ష్మీ’ వంటి కొత్త పథకాన్ని తీసుకువచ్చి, యువతను తనవైపు ఆకర్షించుకోవడం కోసం హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా(వైఫై ఫ్రీ సిటీగా) మార్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు కారెక్కేలా చేయడంలో కేటీఆర్ పాత్ర కీలకమనీ తెలుస్తున్నది.
అంతేకాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంపొందించడం కోసం కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నారు. ఇదే, ఈ ఇద్దరు యువ నేతలు పార్టీలో, సర్కార్‌లో కీలకంగా మారేలా చేస్తుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేటీఆర్ మంత్రిగా ఉండటం వల్ల పాలనలో జోక్యం చేసుకుంటున్నప్పటికీ పెద్దగా తెలంగాణ ప్రాంతంలో విమర్శలు రావడం లేదు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్, కేటీఆర్ తదితరులు సిఫార్సు చేసిన వారినే పీఆర్వోలు, పీఏలుగా, ఓఎస్డీలుగా పెట్టుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ తెలంగాణలో ఏ మంత్రి కూడా నోరు తెరువని పరిస్థితి. అయితే, ఆంధ్ర విషయానికి వచ్చే సరికి లోకేష్ ఎలాంటి పదవుల్లో లేకపోవడం వల్ల ముఖ్యంగా అక్కడి ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలను ఎదుర్కోవల్సి వస్తున్నది. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారిస్తున్నారనీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తన విమర్శలను పెంచారు.
మంత్రుల ఛాంబర్లలో కూడా లోకేష్ తరుచూ జోక్యం చేసుకుంటుండటం వల్ల పలువురు మంత్రులకు ఇబ్బందికరంగా మారిందనీ, ముఖ్యంగా మంత్రుల ఛాంబర్లలో పీఆర్వో, ఇతర సిబ్బందిని లోకేష్ నియమించడం పట్ల మంత్రులు ఫీలవుతున్నట్లు హైదరాబాద్‌లోని ఆంధ్ర సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ లోకేష్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు కనబడుతున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో అవినీతి లేకుండా చేయడం, యావత్ కేబినెట్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం లోకేష్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ రా్ర రాజకీయంగా దశాబ్దాల అనుభవం కలిగిన కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. వారికి అండగా వారి తనయులు కేటీఆర్, లోకేష్ ఉంటూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని విధాలుగా నడిపిస్తున్నది తనయులేననీ పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్నది. ఇదీ యదార్థం కూడా. పాలనలో తనయులు జోక్యం పెరిగిపోతుందంటూ వస్తోన్న విమర్శలను అటు బాబు, ఇటు కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ర్ట కేబినెట్ కూర్పులో కేటీఆర్ మార్కు ఉందనీ ప్రచారంలో ఉంది.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా నెంబర్ వన్ కాగా, నెంబర్ టూగా కేటీఆర్ అని అంతటా చర్చ సాగుతున్నది. కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్నప్పటికీ కేటీఆర్ అన్నీ తానై కేసీఆర్‌ను నడిపిస్తున్నారనే టాక్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఉంది. భవిష్యత్‌లో కేటీఆర్‌ను గులాబీ బాస్‌గా చేయడం కోసమే అన్ని విషయాల్లో కేటీఆర్‌ను కేసీఆర్ ఇన్వాల్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీని కోసం ఇప్పటి నుంచి అడుగులు పడుతున్నాయి. కేటీఆర్ కూడా అందివచ్చిన ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ర్ట పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా ప్లోరైడ్ సమస్యను పరిష్కరించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని, మరోవైపు ఐటి, పరిశ్రమలపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం కేటీఆర్ కృషి చేస్తున్నారు. యువతను తనవైపు ఆకర్షించుకోవడం కోసం ఈ మేరకు 150ఐటి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇటు పార్టీలో, అటు పాలనలో తన ముద్రను కేటీఆర్ వేసుకున్నారు.
ఇకపోతే, ఆంధ్రలో లోకేష్ కూడా పార్టీపై పూర్తి పట్టును సాధించే పనిలో నిమగ్నమైనాడు. పాలనలో కూడా తన మార్కు కనబడేలా సంస్కరణలు తీసుకువస్తున్నారు. అయితే, ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. అయినప్పటికీ భవిష్యత్ తమ ముఖ్యమంత్రి నారా లోకేషేననీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంటి నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదే, అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో సర్వత్రా వినవస్తున్నది. ఇదిలా ఉంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికీ తమ రాజకీయ వారసులగా కుమారులను తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతోనే చంద్రులిద్దరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారనీ అత్యంతమైన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. యువకులు, విద్యావంతులైన కేటీఆర్, లోకేష్ ఇద్దరూ తమదైన శైలిలో కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ ఇద్దరిపైనే. లోకేష్, కేటీఆర్ దూకుడు చూస్తుంటే వారి తల్లిదండ్రులైన చంద్రబాబు, కేసీఆర్‌లను మించిపోతారా? తండ్రులకు తగ్గ తనయులు అవుతారా?అని అంతటా ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లోకేష్, కేటీఆర్ ఇద్దరూ పోటీపడి పని చేస్తున్నట్లుగా అగుపిస్తున్నది. చూడాలి మరి!
(ఎ.సత్యనారాయణ రెడ్డి)