'హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటూ పెద్ద కబుర్లు అక్కరలేదు. నువ్వు సాధారణమైన మనిషిలా ఫీలయి, ఎదుటివాణ్ని సాటి మనిషిలా చూస్తే చాలు' అనే రూసీ మోదీ యిక లేరు. ఆయన పేరు చెప్పగానే టాటా స్టీల్ గుర్తుకు వస్తుంది. 1939లో ఆఫీసు అసిస్టెంటుగా టిస్కోలో చేరి, 1984లో ఆ సంస్థకే సిఎండి (చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరక్టర్) అయి, 1993 వరకు ఆ కంపెనీకి సేవలందించిన రూసీ టాటా స్టీల్‌కు హెడాఫీస్ అయిన జంషెడ్‌పూర్‌కు రారాజుగా వెలిగారు. ఓసారి పుట్టినరోజుకి ఆ వూళ్లో ఏనుగుమీద వూరేగారు కూడా. ఓ రోజు ఆ వూళ్లో కారును రాంగ్‌సైడ్ పార్క్ చేసి, ఎవరికోసమో ఎదురు చూస్తూ వుంటే పోలీసువాడు వచ్చి ''ఈ రోడ్డు నీ బాబుదనుకున్నావా?'' అని తిట్టబోయాట్ట. ''అవును, నా బాబుదే, కావాలంటే రోడ్డు పేరు చూడు.'' అన్నాట్ట రూసీ. నిజమే, ఆ రోడ్డుకి ఆయన తండ్రి పేరే పెట్టారు.
1918లో బొంబాయిలో వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టిన రూసీ (ఆయన తండ్రికి 'సర్' బిరుదం వుండేది) విద్యాభ్యాసమంతా ఇంగ్లండ్‌లో జరిగింది. ఆక్స్‌ఫర్డ్‌లో కాలేజీలో చదువు ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి టిస్కోలో చేరారు. 1953లో పర్శనల్ డిపార్ట్మెంట్గా డైరక్టరుగా, 1965లో రా మెటీరియల్స్ విభాగానికి డైరక్టరుగా, 1970లో ఆపరేషన్స్‌కు డైరక్టరుగా ఎదిగాడు. ఆయన సాంకేతిక నిపుణుడు కాదు. అయినా పర్శనల్ డిపార్టుమెంటుకి డైరక్టరుగా వుండే రోజుల్లో ప్రతి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో చుట్టూ 15 మందిని కూర్చోబెట్టుకుని కబుర్లు చెపుతూ వుండేవాడు. వాళ్ల వాళ్ల విభాగాల్లో ఏమౌతోందో కనుక్కునేవాడు. అలా టెక్నికల్ విషయాలపై పట్టు వచ్చింది. పై స్థాయికి వెళ్లినప్పుడు కూడా ఆయన యీ అలవాటు వదలలేదు. ఎండి అయిన తర్వాత కూడా వివిధ వర్క్‌షాపులకు వెళ్లి పనివారిని కలిసి పేరుపేరునా పలకరించేవాడు. వారి గోడు వినేవాడు. ''90 శాతం కేసుల్లో వారి బాధలు నేను తీర్చలేనివి. అయినా తమ కష్టం చెప్పుకున్నామన్న తృప్తి వారికి వుండేది.'' అనేవాడు రూసీ.
ఒకసారి ఒక ఖరీదైన యంత్రాన్ని పొరబాటున పాడుచేసినందుకు శిక్షగా ఒక పనివాణ్ని ఉద్యోగంలోంచి తీసేశారు. అతను వెళ్లబోయేముందు వీడ్కోలు చెప్పడానికి రూసీని కలిశాడు. విషయం తెలుసుకున్న తర్వాత ఆయన అతని రికార్డు తెప్పించి చూసి నైపుణ్యం గల పనివాడని గ్రహించాడు. జరిగినది కేవలం పొరబాటు వలననే అని తెలుసుకున్నాడు. ''యంత్రాన్ని పోగొట్టుకోవడం కంటె మంచి పనివాణ్ని పోగొట్టుకోవడం మరింత ఖరీదైన వ్యవహారం.'' అంటూ అతన్ని మళ్లీ ఉద్యోగంలో నియమించాడు. కార్పోరేట్ రంగంలో రూసీని చాలా గౌరవంగా తలచుకుంటారు. టాటా స్టీల్ ద్వారా భారతీయ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకై భారత ప్రభుత్వం ఆయనకు 1989లో పద్మభూషణ్ యిచ్చింది.
ఆయనకు హాబీలు కూడా వున్నాయి. పియానో వాయించేవాడు. ఆక్స్‌ఫర్డ్‌లో యితను పియానో వాయిస్తూ వుంటే పక్కవాయిద్యంగా ఐన్‌స్టీన్ వయోలిన్ వాయించాడు. విపరీతంగా పుస్తకాలు చదవడం, కళాత్మక వస్తువులు సేకరించడం, వంట చేయడం చాలా యిష్టం. విక్టోరియా మెమోరియల్‌ను ప్రజలు రాత్రివేళ కూడా చూడడానికి వీలుగా రూ.28 లక్షలు విరాళం యిచ్చి లైట్లు ఏర్పాటు చేయించిన ఉదారుడు. టాటా యాజమాన్యంతో విభేదాలు తలెత్తి ఆయన 1993లో టాటా స్టీల్ నుండి తప్పుకున్నాడు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్సుకి చైర్మన్‌గా కొద్దికాలం చేశాడు కానీ అక్కడ రాణించలేదు. జీవిత చరమాంకం కలకత్తాలోనే గడిపాడు. అక్కడే యీ మే 17 న స్వర్గస్తుడయ్యాడు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)