ఫరీద్‌కోట రాజు ఆస్తులు దొంగ విల్లుతో కైవసం

1989లో మరణించిన ఫరీద్‌కోట మహారాజు హరీందర్‌ సింగ్‌ ఆస్తులను యితరులు యిన్నాళ్లూ దొంగ విల్లు సహాయంతో అనుభవించారని, అవి ఆయన కూతుళ్లిద్దరికీ మాత్రమే చెందాలని చండీగఢ్‌ కోర్టు యిటీవలే తీర్పు యిచ్చింది. ఆ ఆస్తుల…

1989లో మరణించిన ఫరీద్‌కోట మహారాజు హరీందర్‌ సింగ్‌ ఆస్తులను యితరులు యిన్నాళ్లూ దొంగ విల్లు సహాయంతో అనుభవించారని, అవి ఆయన కూతుళ్లిద్దరికీ మాత్రమే చెందాలని చండీగఢ్‌ కోర్టు యిటీవలే తీర్పు యిచ్చింది. ఆ ఆస్తుల విలువ రూ.25,000 కోట్లు. హరీందర్‌ సింగ్‌కు ముగ్గురు కూతుళ్లు – అమృత్‌, దీపీందర్‌, మహీపీందర్‌. కొడుకు హర్‌మందిర్‌ ఓ రోడ్డు ప్రమాదంలో 1981లో చనిపోవడంతో ఆయన నైరాశ్యంలో మునిగిపోయి జబ్బు పడ్డాడు. మగ వారసుడు లేకపోవడం చేత రాజుగారి వద్ద పనిచేసే కొందరు ఉన్నతోద్యోగస్తులు, లాయర్లు కలిసి కుట్ర పన్నారు. 1989లో ఆయన పోయాక 1982లో రాశారంటూ ఒక దొంగ విల్లు చూపించారు. దాని ప్రకారం ఆస్తులన్నీ కుటుంబసభ్యులకు ఎవరికీ దక్కకుండా మహారావల్‌ ఖేవాజీ ట్రస్టు అనే ధర్మసంస్థకు చెందుతాయి. ఆ ట్రస్టులో ధర్మకర్తలందరూ యీ లాయర్లు, ఉద్యోగస్తులే. తమ చేతిలో కీలుబమ్మలుగా వున్న రెండో కూతురు దీపీందర్‌ను చైర్మన్‌గా, మూడో కూతురు మహీపీందర్‌ను వైస్‌చైర్మన్‌గా పెట్టారు. హరీందర్‌ తల్లి, భార్య, పెద్దకూతుళ్లకు ఏమీ లేకుండా చేశారు.

మహీపీందర్‌ కొన్ని రోజులపాటు ధర్మకర్తలు చెప్పినట్టే ఆడిరది. వాళ్లు పెట్టమన్నచోటల్లా సంతకాలు పెట్టింది. కానీ రెండేళ్లు పోయాక అనుమానం వచ్చి తిరగబడిరది. ట్రస్టులోంచి బయటకు వచ్చేసి విల్లును సవాలు చేసిన కొన్ని రోజులకే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఈ వరసంతా చూసి పెద్దకూతురు అమృత్‌ ఆ విల్లులో రాసిన కొన్ని అంశాలు అనుమానాలు రేకెత్తించాయంటూ కోర్టు కెక్కింది. ‘‘ఒకవేళ నా ప్రస్తుత భార్యద్వారా కాని, భవిష్యత్తులో ఏర్పరచుకోబోయే సహజీవన ఒప్పందం లేదా సర్రోగేట్‌ మ్యారేజి (నా వీర్యంతో బిడ్డను కని యిచ్చే ఒప్పందం) వలన కానీ మగపిల్లవాడు పుడితే…’’ అంటూ దానిలో ఓ పేరా వుంది. రాజుగారి భార్యకు అప్పుడు 67 ఏళ్లు. ఆవిడకు యింకా పిల్లలు పుడతారని యీయన ఎలా అనుకున్నాడు? 1982 నాటికి సహజీవన ఒప్పందాలు, సర్రోగేట్‌ మ్యారేజీలు విరివిగా లేవు. అంటే వీళ్లు సినిమాల్లో చూపించినట్టు ఎవడో ఒకణ్ని తీసుకుని వచ్చి ‘వీడి తల్లి రాజుగారితో సహజీవనం చేసింది కాబట్టి వీడే వారసుడు’ అందామనుకున్నారన్నమాట. ఈ పాయింటే కాకుండా మరోటి కూడా వుంది. విల్లు ప్రకారం యింత ఆస్తి దక్కించుకున్న ఫరీద్‌కోట కోట, చండీగఢ్‌లోని మణి మజ్రా అనే భవనం, ఫరీద్‌కోటలోని షాపీ సమాధులు మేన్‌టేన్‌ చేస్తే చాలు. తక్కిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నిర్దేశించలేదు. ఇది చాలా అసాధారణంగా వుంది. 

ఈ ట్రస్టు సభ్యులు తమ చిత్తం వచ్చినట్టు ప్రవర్తించారు. ‘మాపై కేసు పెట్టావు కాబట్టి నువ్వు ఫరీద్‌కోట్‌ రాజమహల్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు’ అని ఉత్తరం రాసింది. ఆ ట్రస్టు వ్యవహారాలు ఎంత శ్రుతి మించాయంటే వారిపై ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు కూడా జరిగాయి. ఎట్టకేలకు 22 ఏళ్ల పోరాటం తర్వాత యీ జులైలో అమృత్‌ కేసు గెలిచింది. ఆవిడకు యిప్పుడు 80 ఏళ్లు. ఆమెకు, చెల్లెలు దీపీందర్‌కు చెరిసగం ఆస్తి దక్కుతుంది. కోర్టు డిక్రీ అమలు చేయడానికి వీళ్లు మళ్లీ యింకో కేసు వేయాల్సి వుంటుంది. దానితో బాటు దీపీందర్‌ విల్లును సవాలు చేయలేదు కాబట్టి ఆమెకు వాటా యివ్వనక్కరలేదని కూడా యీమె అడగబోతోంది. ఇన్నాళ్లూ ట్రస్టు పక్షాన వుందని యీవిడకి ఆమెపై కోపం. 16 మంది ట్రస్టు సభ్యుల్లో 6గురు మాత్రమే బతికి వున్నారు. మహారాజుగారి భవంతుల్లో తిష్ట వేసుకుని వున్న యీ ఆరుగురూ ఆస్తులు అప్పగించేందుకు సుముఖంగా లేరు. తీర్పును సవాలు చేస్తారట. కుట్ర కథకు యిప్పట్లో ముగింపు కనబడటం లేదు. 

–  ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]