‘‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’’
అని మన గురజాడ వారు సెలవిచ్చారు గనక సదరు వాక్యాలను మన కేంద్రంలోని సర్కారువారు ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవడం లేనట్లుంది. అదే వాక్యాలను గురజాడ వారు ఏ ఉత్తరాది కవప్రముఖుల తరహాలో ఏ ఛటర్జీలుగానో, వత్సలు వేదులుగానో కనీసం బెంగాలీ గానో పుట్టి చెప్పిఉంటే ఆ వాక్యానికి దక్కగల విలువ మరో రీతిగా ఉండేదేమో! అచ్చంగా ఓ మారుమూల తెలుగు ప్రాంతంలో పుట్టి వచించినందుకు గాను.. దేశమంటే మనుషులని అంగీకరించడానికి సర్కారువారికి అహం అనుమతిస్తున్నట్లు లేదు. కానీ చూడబోతే వారు చెప్పగల నిర్వచనం మాత్రం.. ‘దేశమంటే పార్టీలోయ్’ అని స్వీకరిస్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్నటువంటి యూపీఏ2 అనబడు సర్కారు వారి బాహ్య వ్యవహార తీరు చూస్తే మనకు దేశమంటే పార్టీలోయ్ అనే నీతిని ప్రకటిస్తున్నట్టున్నూ… అంతర్ వ్యవహార తీరుచూస్తే దేశమంటే ఓట్లోయ్, దేశమంటే సీట్లోయ్ అని పాటిస్తున్నట్టున్నూ మనకు కనిపిస్తే వింత లేదు.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదయ్యా అంటే.. ఎప్పటికెవ్వరు ఉచితమొ.. అప్పటికి అవ్వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే వివేచన సర్కారు వారిలో సమూలంగా నశించినట్లుగా మనకు కనిపిస్తోంది. 90 రోజులుగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో.. ఆరున్నరకోట్ల మందికి ప్రతినిధులుగా కోటి మందే ఉద్యమిస్తున్నారనుకుందాం. వారందరూ రోడ్డున పడి ఓ లక్ష్యం కోసం నినదిస్తోంటే.. వారి చెంతకు వెళ్లగల ధైర్యం కూడా లేక రాజధానులకు మాత్రం పరిమితమైన ముసుగులు వేసుకు కూర్చున్న నాయకమ్మన్యులను ఇవాళ తమ అభిప్రాయాలు సెలవివ్వండి బాబూ.. అంటూ అఖిలపక్షం పేరుతో కేంద్రం ఆహ్వానిస్తుండడం చాలా చోద్యంగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన అనే అంశంమీద పార్టీలు అభిప్రాయం చెప్పగల వాతావరణం ఏనాడో మారిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పేరిట ఉద్యమం నడిపిన రాజకీయ పార్టీ ఎన్నిరకాల అవినీతి ఆరోపణల్లో కూరుకుని ఉన్నదో, ఎన్ని రకాలుగా తమ స్వప్రయోజనాలకోసం ఉద్యమాన్ని భ్రష్టు పట్టించే కుట్రపూరిత చర్యలకు పాల్పడినదో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరమూ లేదు. జేఏసీ ముసుగులో ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నాం అని చెప్పుకుంటున్న వారంతా రాజకీయ అధికార పదవీ లాలసతతో ఎలా కొట్టుకుంటున్నారో కూడా రుజువులు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. అలాగని తెలంగాణ రాష్ట్రం గురించిన బలీయమైన వాంఛ ప్రజల్లో లేదని అంటే మాత్రం అది జాతిద్రోహం అవుతుంది.
అలాగే జులై 30 తరువాత.. సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఉద్యమాలు పెల్లుబుకాయి. ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వీరందరూ కూడా విభజన నేపథ్యంలో రకరకాల భయాలను వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉండడమే తమ సమస్యలకు పరిష్కారం అంటున్నారు. అయినప్పటికీ.. సమైక్యాంధ్రం అనివార్యం అయ్యే సందర్బంలో వీరి వద్ద కూడా కొన్ని ప్రత్యామ్నాయ తరణోపాయాలు ఉన్నాయి.
అయితే విభజన రైలెక్కి సగం ప్రయాణం చేసేసిన తర్వాత.. మళ్లీ పార్టీలను పిలిచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటాం అంటున్నది కేంద్రం. కొత్త అఖిలపక్షం ఏర్పాటుకు తెర తీస్తోంది. ఒకవైపు పార్టీలే రకరకాలుగా స్పందిస్తూ.. ఈ సమావేశంపై విరుచుకుపడుతుండగా.. వీరికి అనుచిత సమయానికి అనవసరపు ఆలోచన ఎందుకువచ్చిందో తెలియదు. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది.
రాష్ట్ర విభజనకు అనుకూల మరియు ప్రతికూలంగా ఎలాంటి ఉద్యమాలు లేనప్పుడు.. ఒక డెసిషను తీసుకోదలస్తే.. అప్పుడు కేంద్రం రాజకీయ పార్టీలను పిలిచి అఖిలపక్షంలో వారి అభిప్రాయాలను తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించడం సబబు అనిపించుకుంటుంది. ఇప్పుడు అసలు పార్టీల చేతిలో ఉద్యమాలు లేకుండా పోయాయి. తె-ఉద్యమం కూడా అచ్చంగా తెరాస చేతిలో ఉన్నదని అనుకుంటే భ్రమ. అలాగే సమైక్య ఉద్యమం అచ్చంగా పార్టీ రహితంగానే జరిగినదని ఎవ్వరైనా చెప్పగలరు. పార్టీల ప్రాధాన్యాన్ని తుంగలో తొక్కేసి ప్రజలే తమకు ఏం కావాలో? ఏం వద్దో? అడుగుతూ ఉంటే.. కేంద్రంలో రాజ్యం చేస్తున్న యూపీఏ మళ్లీ అఖిలపక్షం అంటూ మరో ప్రహసనం నడిపించడానికి తెగించడం ఏమాత్రం పాడి అనిపించుకుంటుంది.
ఇక్కడ అడుగుతున్నది వద్దంటున్నది అంతా ప్రజలైతే.. అభిప్రాయాలు పార్టీలనుంచి స్వీకరిస్తాం అని కేంద్రంలో అనడంలోనే వారి అహంకారం బయటపడుతోంది. దేశమంటే ప్రజలనుకుంటున్నారా? పార్టీలనుకుంటున్నారా? ప్రజలు లేకుండా ఈ పార్టీలు ఒక్కటైనా మనుగడలో ఉండగలిగేవేనా? ప్రజలు ఉద్యమించినప్పుడు.. ఈ నాయకులంతా రాజధాని రక్షణ ఏర్పాట్ల మధ్యన ముసుగు వేసుకుని బతుకీడ్చిన వారు కాదా? వీరు ప్రజాఉద్యమా వాంఛలపై తమ అభిప్రాయాలను సెలవిస్తారా? వారికేం హక్కు ఉంది. అసలు అఖిలపక్షం, అందుకు హాజరయ్యే పార్టీలు జనమనోగతాన్ని ప్రతిబింబించే రోజులు ఎన్నడో మారిపోయాయి.
నిజంగానే ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయాలనే సంకల్పం కేంద్ర సర్కారుకు ఉంటే గనుక.. నేరుగా ప్రజాసంఘాలనే పిలిపించాలి. వారి అభిప్రాయాలను వినాలి, వారి భయాలను, ఆందోళనలను వినాలి. వాటిని తీర్చగల మార్గాలు తమ వద్ద ఉన్నాయేమో అన్వేషించాలి. అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుంది తప్ప.. ఇలాంటి మొక్కుబడి, మాయాపూరిత, మోసపూరిత సమావేశాల వలన ఫలితం ఉండదని గ్రహించాలి.
-కపిలముని