గుజరాత్‌లో పంజాబ్‌ రైతుల వ్యథ

‘దేశంలోని పౌరులు ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు, కానీ కశ్మీర్‌లో మాత్రం కాదు, అక్కడ కశ్మీరీయులే కొనగలరు’ అని నియంత్రించే ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని బిజెపి ఉద్యమిస్తూ వుంటుంది. ఈ స్ఫూర్తికి భిన్నంగా వున్న…

‘దేశంలోని పౌరులు ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు, కానీ కశ్మీర్‌లో మాత్రం కాదు, అక్కడ కశ్మీరీయులే కొనగలరు’ అని నియంత్రించే ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని బిజెపి ఉద్యమిస్తూ వుంటుంది. ఈ స్ఫూర్తికి భిన్నంగా వున్న ఓ వివాదాస్పద నిబంధన ఆ బిజెపి ఏలుతున్న గుజరాత్‌లోనే అమలవుతున్న విషయం యిప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ సర్క్యులర్‌ ప్రకారం గుజరాత్‌లో పంట పొలాలను గుజరాత్‌ వాసులైన వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అమ్మకూడదు. అంతేకాదు, యితరప్రాంతాల నుండి వచ్చిన రైతులకు కూడా అమ్మకూడదు. అది చూపించి యిప్పుడు గుజరాత్‌ ప్రభుత్వం కచ్‌ ప్రాంతంలో వున్న పంజాబ్‌ హర్యాణా రైతుల భూముల ఖాతాల లావాదేవీలను నిలిపివేతకు (ఫ్రీజ్‌) దిగింది. అక్కడ పంజాబీ రైతులేమిటి అంటే దానికో నేపథ్యం వుంది. కచ్‌ ప్రాంతం పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో వుండడమే కాకుండా అక్కడ ముస్లిములు ఎక్కువ. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగాక, అక్కడ సిక్కులను తెచ్చి పెట్టి తూకం చేస్తే దేశభద్రతకు మంచిదని కేంద్రం భావించింది. కచ్‌ యిసుక ప్రాంతం, నీటి లభ్యత తక్కువ. వ్యవసాయానికి అవకాశాలు లేవు. వ్యవసాయంలో దిట్టలైన పంజాబీలను తీసుకుని వస్తే వారు చమత్కారాలు చేయగలరని కూడా ఆశించి 454 సిక్కు రైతులకు వుచితంగా భూములిచ్చారు. 

వారు నిజంగా చమత్కారం చేసి చూపించారు. ఆ వుప్పునేలలనే లోతుగా తవ్వి జలను బయటకు తెచ్చారు. పంటలు పండించారు. ఆ ప్రాంతాల్లో ఎరగని పత్తి   పండించారు. వాళ్లను చూసి, పంజాబ్‌, హరియాణాలలోని యితర జాట్‌ రైతులు అక్కడ తమ భూముల్ని అమ్ముకుని యిక్కడ కొనుక్కుని, స్థిరపడ్డారు. ఆ పద్ధతి యింకా కొనసాగుతూనే వుంది. 2005లో ఒక రైతుల పంజాబ్‌లో 3 ఎకరాలమ్మితే కచ్‌లో 30 ఎకరాలు వచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం యీ అమ్మకాలన్నిటినీ రిజిస్టర్‌ చేసింది, స్టాంప్‌ డ్యూటీ వసూలు చేసింది. ఇలా చేస్తూ చేస్తూ యిప్పుడు హఠాత్తుగా 1973 నాటి సర్క్యులర్‌ను బయటకు లాగి వెయ్యిమంది రైతుల ఖాతాలను నిలిపివేసింది.  (అబ్బే అన్ని లేవు 784 మాత్రమే, వాటిలో 164 మందివి సిక్కులవి, 100 మంది గుజరాతీలవి అంటారు జిల్లా కలక్టర్‌ హర్షద్‌ పటేల్‌). రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ 2012లో గుజరాత్‌ హై కోర్టుకి వెళ్లారు. వీరి వ్యవసాయం వలన అక్కడి ప్రాంతమంతా అభివృద్ధి చెందింది. భూముల ధరలు పెరిగాయి. ఇప్పుడు యిలా ఖాతాలు నిలిపివేయడం వలన బ్యాంకులు లోన్లు ఆపేశాయి. పండిన పంటను మార్కెట్‌ యార్డులో అమ్ముకోలేరు కాబట్టి ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరలకు అమ్ముకోవాలి.  ఇన్నాళ్లూ పన్నులు వసూలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం యిప్పుడు సడన్‌గా యిదంతా అక్రమం అంటోంది.

రైతుల వాదన విన్న హైకోర్టు వారి పక్షాన తీర్పు యిచ్చింది. తీర్పు వ్యతిరేకిస్తూ గుజరాత్‌ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లింది. సిక్కు రైతులకు ఒళ్లు మండి నరేంద్ర మోదీ దిష్టిబమ్మలు తగలేశారు. శిరోమణి అకాలీదళ్‌కు ఫిర్యాదు చేశారు. జాతీయ మైనారిటీ కమిషన్‌ వచ్చి వారి ఫిర్యాదులు వింది. గుజరాత్‌ కాంగ్రెసు ఎంపీలు మన్‌మోహన్‌ను కలిసి వీరి సంగతి చూడమని విజ్ఞప్తి చేశారు. ఇదంతా చూసి పంజాబ్‌ ముఖ్యమంత్రి బాదల్‌ మోదీతో మాట్లాడాడు. ‘‘మాదేం లేదు, ఆ 1973 నాటి నోటిఫికేషన్‌ కాంగ్రెసు హయాంలో వచ్చినదే’’ అన్నాడు మోదీ. గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్జున్‌ మోద్‌వాడియా ‘‘గుజరాత్‌ రైతుల భూములు బినామీ రైతుల పేర అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో యిచ్చిన నోటిఫికేషన్‌ అది. ఈ పంజాబు, హర్యాణా రైతులు నిజమైన రైతులు. దాన్ని వీరికి వర్తింపచేయడం అన్యాయం.’’ అన్నాడు. కచ్‌లో హరితవిప్లవాన్ని తెచ్చిన ఆ రైతులకు తమ బతుకులు పచ్చగా వుంటాయో లేదో చెప్పలేని స్థితిలో వున్నారు.
 
–  ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]