ఏది శాపమో, ఏది వరమ్మో తెలిసీ తెలియక అలమటించుటే జీవితం అంటాడు కవి. ఈ రోజు కీడు అనుకున్నది రేపటికి మేలుగా తోచవచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకునేవాళ్లకు నచ్చే చారిత్రక వాస్తవం యిది. 1971-79ల మధ్య ఉగాండాను పాలించిన ఇదీ అమీన్ అనే మిలటరీ నియంత 1972 ఆగస్టులో ఆసియన్లను తమ దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాడు. ఉగాండాలో ఆసియన్లంటే భారతీయులే. వారు ఎన్నో తరాలుగా అక్కడ స్థిరపడిపోయి ఆస్తిపాస్తులు సంపాదించుకుని దేశ ఆర్థికవ్యవస్థనే పాలించే దశలో వున్నారు. నరమాంస భక్షణకు పేరుబడిన అమీన్ వాళ్ల ఆస్తులన్నీ జాతీయం చేసి, 90 రోజుల గడువులో కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాలని చెప్పాడు. తలా 50 పౌండ్లు మాత్రం తీసుకెళ్లడానికి అనుమతించాడు. ఆగర్భశ్రీమంతులు ఒక్కసారిగా గర్భదరిద్రులై పోయారు. 70,000 మంది ఆసియన్లు ఆ రోజు ఉగాండా విడిచి వెళుతూ అమీన్‌కు శాపనార్థాలు పెట్టారు.
వారిలో 28,000 మంది శరణార్థులుగా ఇంగ్లండ్ చేరుకున్నారు. ఉగాండా ఉష్ణదేశం కాబట్టి అక్కడ ఉన్నిదుస్తుల అవసరం లేదు. బ్రిటన్‌లో చలి తట్టుకోవడానికి వీరి దగ్గర సరైన దుస్తులు లేవు. లావుపాటి బూట్లు లేవు. చాలామందికి ఇంగ్లీషు రాదు. వాడకంలో లేని మిలటరీ బారక్స్ చూపించి అదే ‘శరణార్థుల శిబిరం’ అంది బ్రిటన్ ప్రభుత్వం. గతిలేక చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు. కాస్త కుదుటపడ్డాక తమకు బాగా వచ్చిన కళ వ్యాపారమే కాబట్టి (వీరిలో దాదాపు అందరూ గుజరాతీలే – పటేల్, అమిన్, షాలే!) వ్యాపారాలు పెట్టుకున్నారు. అలా మొదలైన తమ ప్రయాణం 40 ఏళ్లల్లో ఎక్కడికి చేర్చిందో సింహావలోకనం చేసుకోవడానికి ఆగస్టులో లండన్‌లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ‘‘ఎక్సయిల్స్-ద ఉగాండన్ ఏసియన్ స్టోరీ’’ అనే పేరు పెట్టిన యీ ప్రదర్శనలో ఆనాటి ఫోటోలు, న్యూస్ పేపరు కటింగ్స్, టీవీ ఫుటేజిలు, ప్రభుత్వ ఆదేశాలు, వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.. అన్నీ పెట్టారు. ఇటువంటి వంద ప్రదర్శనలు పెట్టగల ఆర్థికస్తోమత వారికి యిప్పుడుంది. నిజానికి ఆ రోజు అక్కణ్నుంచి తరిమేసి అమీన్ తమకు మేలు చేశాడని, తమ ప్రతిభ చాటుకోవడానికి, అధికంగా సంపాదించుకోవడానికి సంపన్నదేశ మొకదాన్ని చూపించాడని ఆసియన్లు అనుకుంటున్నారు. కొందరు తమ యిళ్లల్లో అతని ఫోటో పెట్టుకున్నారు కూడా.
ఈ రోజు ఇంగ్లండ్‌లో గుజరాతీలు ఎంత లోతుగా చొచ్చుకుపోయారో చెప్పడానికి ఓ వాస్తవం లాటి జోక్ చెప్తారు. – ‘ఓ అమెరికన్ టూరిస్టు లండన్‌లో దిగాడు. తనను హోటల్‌కు తీసుకెళ్లిన టాక్సీ డ్రైవర్ని పేరు అడిగితే ‘పటేల్’ అన్నాడు వాడు. హోటల్ యజమాని కూడా ‘పటేల్’యే. హోటల్ వీధి చివర వున్న డిపార్ట్‌మెంటల్ స్టోర్సుకి వెళ్లి యజమాని పేరు అడిగితే అదీ ‘పటేల్’యే. ఇదంతా చూసి తలనొప్పి తెచ్చుకుని మాత్రకోసం మెడికల్‌షాపుకి వెళితే అదీ ‘పటేల్’దే. తను తెచ్చిన డాలర్లను పౌండ్లుగా మార్చుకోవడానికి డీలరు వద్దకు వెళితే అతనూ ‘పటేలే’. బుర్ర తిరిగి హోటల్ రూము కొచ్చి కాఫీ తెమ్మనమని రూంబోయ్‌ను పిలిస్తే వాడూ ‘పటేలే’! హోటల్ సిబ్బందిలో సగం మంది ‘పటేల్’లు వున్నారని తెలిశాక ఆ అమెరికన్‌కు మతిపోయి అడిగాడట – ‘అవునూ, అడగడం మర్చిపోయాను, బ్రిటిషు రాణి పేరు కూడా ‘పటేలా’?’
– ఎమ్బీయస్ ప్రసాద్