దిగ్గీ రాజా పేరు వింటనే గుండెలు దిగ్గుమంటాయి

దిగ్గీ రాజాగా పిలవబడే దిగ్విజయ్‌ సింగ్‌ పేరు యీనాడు మన రాష్ట్రమంతా సుపరిచితం. చాలా ఏళ్లగా అచేతనంగా వున్న విభజన అంశం ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా వచ్చిన దగ్గర్నుంచే ఊపందుకుంది. ఏదో యిన్నాళ్లకు…

దిగ్గీ రాజాగా పిలవబడే దిగ్విజయ్‌ సింగ్‌ పేరు యీనాడు మన రాష్ట్రమంతా సుపరిచితం. చాలా ఏళ్లగా అచేతనంగా వున్న విభజన అంశం ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా వచ్చిన దగ్గర్నుంచే ఊపందుకుంది. ఏదో యిన్నాళ్లకు నావను ఆ ఒడ్డుకో, యీ ఒడ్డుకో చేర్చడానికి సిద్ధపడ్డాడు అనుకుంటే యీ వ్యవహారాన్ని ఎంత అస్తవ్యస్తంగా చేయాలో అంత యిదిగానూ చేస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడతాడు. అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని ఉద్యోగస్తులకు నా మాటగా హామీ యిచ్చేయండి అని ఈయన ముఖ్యమంత్రికి చెప్తాడు. చెప్పడానికి ఆయనెవడు, నేను కదా చెప్పాలి అంటూ హోం మంత్రి మరొకటి చెప్పాడు. ఈయన దగ్గర కెళ్లి అదేమిటండీ అంటే, హోం మంత్రిని కనుక్కుంటా అంటాడు. కనుక్కోవడానికి ఎన్నాళ్లు పడుతుందిట? ఓ మిస్స్‌డ్‌ కాల్‌ కొడితే చాలదా? మొత్తం వ్యవహారాన్ని గబ్బు పట్టించి, సీమాంధ్రులకు కాంగ్రెస్‌ అంటే రోత పుట్టించే స్థితికి తెచ్చాడు. ఇదీ రాష్ట్ర కాంగ్రెస్‌ యిన్‌చార్జిగా యీయన సాధించిన ఘనకార్యం! మరి యిలాటాయన పొజిషన్‌ సొంత రాష్ట్రంలో ఎలా వుంది? వచ్చే నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కాబోతున్న తరుణంలో యీయన వలన పార్టీకి ఒనగూడే లాభం ఏమైనా వుందా?

దిగ్గీరాజా రాజకీయాల్లో అర్జున్‌ సింగ్‌కు శిష్యుడు. 1990ల్లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వుండగా చాలా సమర్థుడైన పాలకుడిగా పేపర్లలో వచ్చేది. ఆంధ్రలో చంద్రబాబు, కర్ణాటకలో ఎస్‌ఎమ్‌ కృష్ణ, మధ్యప్రదేశ్‌లో యీయనా – ముందుచూపు కలవారనీ, ఆధునిక పద్ధతుల్లో తమ రాష్ట్రాలను ప్రగతిపథంలో నడిపించేస్తున్నారని మీడియా పొగిడిరది. మన చంద్రబాబు ప్రతీ నియోజకవర్గంలో తన పార్టీ కార్యకర్తలను పేర్లతో సహా గుర్తుపట్టగలిగినట్లే, యీయనా మధ్యప్రదేశ్‌లో తన పార్టీ కార్యకర్తలను పేరుతో పలకరించగలరు. తీరా చూస్తే వీళ్లు ముగ్గురూ తర్వాత వచ్చిన ఎసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. పార్టీలో వారి పట్ల అభిమానం చెక్కు చెదరకపోయినా, ప్రజలకు మాత్రం వాళ్ల పాలన గిట్టలేదు. దిగ్గీ రాజా హయాంలో మధ్యప్రదేశ్‌లో రవాణా బాగుండేది కాదు, నీటి సమస్య, విద్యుత్‌ సమస్య వుండేవి. గ్రోత్‌ రేట్‌ నెగటివ్‌లోకి వెళ్లిపోయింది. అతని పరిపాలన అంటే ప్రజలకు ఎంత భయం పట్టుకుందంటే 2003లో ఓడిరచడమే కాదు, 2008లో ‘మాకు ఓటేసి గెలిపించకపోతే మళ్లీ దిగ్గీ పాలన వస్తుంది జాగ్రత్త’ అని ఎన్నికల ప్రచారంలో బిజెపి హెచ్చరిస్తే అడిలిపోయి మళ్లీ బిజెపినే గెలిపించారు. ఐదేళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి కనబడుతోంది. ‘దిగ్గీ ప్రచారానికి దిగితే కాంగ్రెస్‌ పని మటాషే, ఆయన వెనక్కాల వుండి మంత్రాంగం నడిపితే ఫరవాలేదు’ అని కాంగ్రెస్‌ వారే అంటున్నారు. 

ఈ పరిస్థితి గమనించి దిగ్గీ ‘‘నాకు రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తి లేదు. జాతీయ రాజకీయాల్లోనే వుంటాను’ అని పదేపదే ప్రకటిస్తున్నాడు. కాంగ్రెసు పార్టీ మధ్యప్రదేశ్‌లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జ్యోతిరాదిత్య సింధియాను చూపిస్తూ అతనికే పగ్గాలు అప్పగించింది. దిగ్గీ కొడుకు జీవర్ధన్‌ సింగ్‌కు రాఘవ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్టు యిచ్చి సరిపెట్టవచ్చంటున్నారు. సొంత రాష్ట్రంలో పరపతి లేని యిలాటి నాయకులందరూ మన తెలుగువారి భాగ్యవిధాతలుగా మారి మన భవిష్యత్తును లిఖిస్తున్నారు. అదీ మన దురదృష్టం!

–  ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]