సినిమా రివ్యూ: క్రిష్‌ 3

రివ్యూ: క్రిష్‌ 3 రేటింగ్‌: 1/5 బ్యానర్‌: ఫిల్మ్‌ క్రాఫ్ట్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు సంగీతం: రాజేష్‌ రోషన్‌ నేపథ్య సంగీతం: సలీమ్‌…

రివ్యూ: క్రిష్‌ 3
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: ఫిల్మ్‌ క్రాఫ్ట్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు
సంగీతం: రాజేష్‌ రోషన్‌
నేపథ్య సంగీతం: సలీమ్‌ సులేమాన్‌
కూర్పు: చందన్‌ అరోరా
ఛాయాగ్రహణం: ఎస్‌. తిరు
కథ, కథనం, నిర్మాణం, దర్శకత్వం: రాకేష్‌ రోషన్‌
విడుదల తేదీ: నవంబర్‌ 1, 2013

‘కోయి మిల్‌ గయా’, ‘క్రిష్‌’ విజయం సాధించడంతో ఆ ఫ్రాంఛైజీలో నెక్స్‌ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌గా ‘క్రిష్‌ 3’ని తెరకెక్కించారు. భారతీయ సినిమాకి తొలి సూపర్‌ హీరో అంటూ క్రిష్‌కి బాగానే బిల్డప్‌ ఇచ్చారు. క్రిష్‌లో సూపర్‌హీరో విన్యాసాల్ని ఒక స్థాయికి పరిమితం చేసిన రాకేష్‌ రోషన్‌ ఈసారి మరింత గ్రాండ్‌గా, ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఇండియన్‌ సూపర్‌హీరోని ఎలివేట్‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే మన బడ్జెట్‌కి హాలీవుడ్‌ సూపర్‌హీరో సినిమాల్ని మ్యాచ్‌ చేయడం కష్టం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఆ రేంజ్‌ని ఎలాగో రీచ్‌ కాలేరు కాబట్టి కనీసం కథ, కథనాలతో అయినా కట్టి పడేయగలగాలి. కానీ క్రిష్‌ 3 కట్టి పడేసిన ప్రేక్షకులు కూడా తాళ్లు తెంపుకుని పరుగులు తీసేలా చేసింది. 

కథేంటి?

తన మేథస్సుతో సైంటిస్ట్‌గా సేవలు అందిస్తున్న రోహిత్‌ మెహ్రా (హృతిక్‌ రోషన్‌), తన శక్తులతో ప్రజలకి తోడ్పడుతున్న కృష్ణ అలియాస్‌ క్రిష్‌ (హృతిక్‌) ఇద్దరికీ ‘కాల్‌’ (వివేక్‌ ఒబెరాయ్‌) నుంచి సవాల్‌ ఎదురవుతుంది. నరరూప జంతువులకి (మాన్‌వర్‌) అధిపతి అయిన కాల్‌ (వివేక్‌ ఒబెరాయ్‌) ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసి, అంతా కనుసన్నల్లో నడిచేలా చేసుకోవాలని భయంకరమైన వైరస్‌ని భారతదేశంపై ప్రయోగిస్తాడు. దానిని క్రిష్‌, రోహిత్‌ మట్టుబెడతారు. ఇక కాల్‌ సైన్యం దండెత్తి రాగా క్రిష్‌ వారిని చెదరగొడతాడు. అప్పుడిక స్వయంగా కాల్‌ వచ్చి బీభత్సం సృష్టిస్తాడు. దానికి క్రిష్‌ ఎలా బదులిచ్చాడనేదే ఈ సినిమా. 

కళాకారుల పనితీరు!

సూపర్‌హీరో పాత్రకి తగ్గ శరీర ధారుఢ్యం ఉన్న హృతిక్‌ రోషన్‌ మరోసారి క్రిష్‌ పాత్రకి న్యాయం చేశాడు. అయితే మాస్క్‌లో ఉన్నప్పుడు, పవర్స్‌ చూపిస్తున్నప్పుడు మినహా అతను ఒక సాధారణ నటుడిలా అనిపించాడు. వృద్ధ పాత్రలో అయితే నటనలో మరీ శృతిమించి విసుగు పుట్టించాడు. 

ప్రియాంక చోప్రా ఇందులో చేయడానికంటూ ఏమీ లేదు. క్రిష్‌లోని క్యారెక్టర్‌ని కంటిన్యూ చేశారు కాబట్టి ఇక ఆమెకి ఈ సినిమాలో ఎలాంటి ‘రోల్‌’ ప్లే చేసే ఛాన్స్‌ దక్కలేదు. విలన్‌ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ క్రూరత్వం చూపించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఆ పాత్రని సరిగా తీర్చి దిద్దకపోవడం వల్ల చివర్లో మరీ జోకర్‌లా కనిపిస్తాడు. మీటర్‌ మందం మేకప్‌ వెనుక కంగనా రనౌత్‌ ఏమి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చిందో కనిపెట్టడం కష్టం. మ్యూటెంట్‌గా కనిపించినపుడే కాకుండా ఆమెపై తీసిన పాటలోను కంగన మేకప్‌ భయపెడుతుంది. ఆమె మేకప్‌ ఖర్చుతో ఒక మీడియం బడ్జెట్‌ సినిమా తీయవచ్చు అనిపించేట్టు కంగన ముఖంపై మేకప్‌ ఆర్టిస్టులు తమకి తోచిన ఎక్స్‌పెరిమెంట్లు చేశారు. మిగిలిన వారెవరికీ పేరు చెప్పుకోవాల్సినంత పాత్రలేమీ దక్కలేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

సూపర్‌హీరో సినిమా కాబట్టి విజువల్‌ ఎఫెక్ట్స్‌ బ్రహ్మాండంగా ఉంటాయని ఎవరైనా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. గతంతో పోలిస్తే పెరిగిన బడ్జెట్‌, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వాడుకుంటే మరీ హాలీవుడ్‌ రేంజ్‌ గ్రాఫిక్స్‌ కాకపోయినా, కనీసం హాస్యభరితం కాని ఎఫెక్ట్స్‌ ఉంటాయని ఆశిస్తారు. అయితే ఇంత ఖర్చు పెట్టిన ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ దారుణంగా ఉన్నాయి. సినిమాకి కీలకమైన క్రిష్‌ – కాల్‌ యుద్ధ సన్నివేశమైనా ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో ఉంటుందని అనుకుంటే అదీ తీవ్రంగా నిరాశ పరుస్తుంది. అసలు తెరపై జరిగే తంతుని తమ ఎఫెక్ట్స్‌తో రిజిష్టర్‌ చేయాలనేది కూడా నిపుణులు పట్టించుకోలేదు. ఈ సినిమాకి ఆక్సిజన్‌లా పని చేయాల్సిన డిపార్ట్‌మెంట్‌ నుంచే ఎలాంటి సహకారం అందనపుడు ఇక ఇది ఎలా బ్రతికి బట్టకడుతుంది?

రాజేష్‌ రోషన్‌ స్వరపరిచిన పాటలైతే కనీసం రెండు కోట్ల ఖర్చుతో తీసే సినిమాల్లో కూడా అప్రూవ్‌ కావు. ఈ పాటల బదులు క్రిష్‌ మొదటి రెండు భాగాల్లోని పాటలే మళ్లీ చూపించినా అంతో ఇంతో ఫలితం ఉండేది. నేపథ్య సంగీతం అందించే బాధ్యత సలీమ్‌ సులైమాన్‌కి అప్పగించి చాలా పెద్ద హెల్ప్‌ చేశారు. కనీసం అప్పుడప్పుడు అయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకోగలిగింది. అది కూడా రాజేష్‌ రోషన్‌ చేసి ఉంటే క్రిష్‌ 3 ధాటికి కాల్‌తో పాటు ఆడియన్స్‌ కూడా కాలగర్భంలో కలిసిపోయుండేవారు. 

సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ప్రొడక్షన్‌ డిజైన్‌ బాగుంది. అయితే సినిమాకి కీలకమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ వీక్‌ అవడంతో ఇక ఏ టెక్నికల్‌ టీమ్‌ కూడా దీనిని కాపాడలేకపోయింది. రాజేష్‌ రోషన్‌ మరోసారి ముతక ఫార్ములాతో సూపర్‌ హీరో సినిమాని నడిపించాలని చూశాడు. తన ప్రాజెక్ట్‌ స్థాయి పెరిగిందని ఆయనకి అనిపించినపుడు, దీనిని మరింత పెంచాలనే కోరిక ఉన్నప్పుడు ఇలాంటి నాసిరకం కథ, కథనాలతో ప్రేక్షకుల తీర్పు కోసం రాకూడదు. మితి మీరిన మెలోడ్రామా ‘క్రిష్‌’ని సూపర్‌ హీరో కాదు కదా… ఎట్‌లీస్ట్‌ హీరోని కానివ్వలేదు. 

హైలైట్స్‌:

  •     – ఎంత ఆలోచించినా తట్టట్లేదు

డ్రాబ్యాక్స్‌:

  •     – ఎన్ని తగ్గిద్దామన్నా తగ్గట్లేదు

విశ్లేషణ:

రెండేళ్ల క్రితం దీపావళికి షారుక్‌ఖాన్‌ సూపర్‌హీరో సినిమా ‘రా.వన్‌’ వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల్ని ఎంతటి క్రియేటివ్‌ టార్చర్‌కి గురి చేసిందనేది అది అనుభవించిన వారికి ప్రత్యేకించి గుర్తు చేయక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ దీపావళికే మరో బాలీవుడ్‌ సూపర్‌హీరో క్రిష్‌3 పేరుతో మన ముందుకి వచ్చాడు. రా.వన్‌ సాధించలేకపోయిన ఘనతని ఇతడైనా సాధిస్తాడని అనుకుంటే, ఇతనికంటే అతనే మెరుగు అని భావించేలా, ‘రా.వన్‌’ టీమ్‌ గర్వపడేలా ‘క్రిష్‌’ ప్రేక్షకులకి నరక యాతన మిగిల్చాడు. 

క్రిష్‌ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన తప్పు కాదు. అయితే ఆరేళ్ల క్రితానికి, ఇప్పటికీ తాము ఎంత అప్‌డేట్‌ అయ్యామనేది కూడా చూపించుకోవాలి. క్యారెక్టర్‌ క్లిక్‌ అయింది కదా అని మరోసారి దాంతో కొన్ని విన్యాసాలు చేయించేస్తే భళా అంటూ భుజం తట్టి విజిల్స్‌ వేసేస్తారనుకోవడం మూర్ఖత్వమవుతుంది. స్క్రిప్ట్‌పై మినిమమ్‌ హోమ్‌ వర్క్‌ చేయలేదని ప్రతి సీన్‌లోను అర్థమవుతుంది. క్రిష్‌తో ఒక మ్యూటెంట్‌ ఫస్ట్‌ ఎన్‌కౌంటర్‌ ఎలా అవుతుందో తెలుసా? అతను అందరి దగ్గర్నుంచి ఐస్‌క్రీమ్‌లు కాజేస్తుంటే కోపంతో రగిలిపోయిన క్రిష్‌ వెళ్లి అతడిని బాదేస్తాడు! చదవడానికే సిల్లీగా అనిపించే ఈ సీన్‌ని తెరకెక్కించేశారంటే ఈ సినిమాని ఎంత పిల్లతనంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. క్రిష్‌ పిల్లలకి నచ్చే క్యారెక్టర్‌ కనుక ఇలాంటి సీన్స్‌ కన్సీవ్‌ చేసుంటారని కన్విన్స్‌ అవుదామన్నా అవలేనంత స్టుపిడిటీ ఆ సీన్‌లో ఉంది. 

ఆ తర్వాత ఒకేసారిగా వచ్చి క్రిష్‌తో నలుగురు మ్యూటెంట్స్‌ చేసే ఫైట్‌, అందులోని గ్రాఫిక్స్‌ వర్క్‌ క్రిష్‌ 3పై ఉన్న ఏ కాస్త హోప్‌ని అయినా చంపి సమాధి చేసేస్తుంది. అప్పటికే క్రిష్‌ చేసిన మానసిక హింసకి గాయపడి విలవిలలాడుతున్న వారిపై రాకేష్‌ రోషన్‌ నిర్దయగా మరో దాడి చేస్తాడు. మ్యూటెంట్‌ అయిన కంగన క్రిష్‌ లవ్‌లో పడుతుంది. అక్కడితో ఆగకుండా ఒక డ్రీమ్‌ సాంగ్‌ కూడా వేసుకుంటుంది. కొనప్రాణంతో కొట్టుకుంటున్న క్రిష్‌ గుండెపై పిడుగుపాటు అయిందా తంతు! ఇంకా ఆశ చావని వాళ్లు విలన్‌ వర్సెస్‌ క్రిష్‌ ఫైట్‌పై హోప్స్‌ పెట్టుకుంటారు. అంతవరకు వీల్‌ ఛెయిర్‌లో ఉండి విలనీ పండిరచిన వివేక్‌ ఒబెరాయ్‌ ఒక్కసారి లేచి నిలబడగానే… తన శక్తులతో ఇనుప ముక్కల్ని అన్నిటినీ ఆకర్షించి ఒక వింత కాస్టూమ్‌ తయారు చేసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే… ‘డబ్బా రేకుల సుబ్బారాయుడి’లా తయారవుతాడు! 

ఇక ఆ డబ్బా రేకుల వాడితో క్రిష్‌ చేసే క్లయిమాక్స్‌ ఫైట్‌తో క్రిష్‌3 పాతాళం నుంచి మరో రెండడుగులు కిందకి దిగబడుతుంది. జనాల్ని కాపాడే సూపర్‌హీరో నుంచి మనల్ని కాపాడే భగవంతుడి కోసం వెతికేలా చేసే క్రిష్‌ 3 ఈ దశాబ్ధపు అతి చెత్త చిత్రాల సరసన చోటు దక్కించుకుంటుంది. ప్రేక్షకుల్ని హింసకి గురి చేసిన భారీ చిత్రాల జాబితాలో సగర్వంగా ముందు వరుసలో నిలుచుంటుంది.  

బోటమ్‌ లైన్‌: క్రిష్‌ 3: ఆడియన్స్‌పై మర్డర్‌ ఎటెంప్ట్‌!

–   గణేష్‌ రావూరి

Feedback at:

[email protected]

twitter.com/ganeshravuri