శరద్ పవార్‌గారికి అర్జంటుగా మధ్యంతర ఎన్నికలు కావాలి. యుపిఏకు నూకలు చెల్లాయని గుర్తించాడు. దీనిలో భాగస్వామిగా పిండుకున్నంత పిండుకున్నాడు. రాబోయే ప్రభుత్వం ఏదైనా దానిలో భాగస్వామి కావాలంటే దీనిలోంచి సరైన టైములో బయటకు వెళ్లాలి. వెళ్లేముందు దీని ప్రతిష్ట అడుగంటించాలి. తెలంగాణ సమస్యపై మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన ప్రకటించడంలో ఆంతర్యం యిదే. తెలంగాణ యిమ్మనమన్నాం కానీ యింత అడ్డదిడ్డంగా విడగొట్టమన్నామా, ఆంధ్రులను ఎలా హ్యేండిల్ చేయాలో మీకు తెలియలేదు అని బిజెపితో పాటు పవారూ కాంగ్రెసును విమర్శించబోతాడు చూడండి. యుపిఏను ఏడిపించాలంటే యిలాటి చిన్న ట్రిక్కులు చాలవు. సామాన్యజనమంతా బూతులు తిట్టాలంటే ఉల్లి ధర పెంచాలి. 1979లో జనతా పార్టీ కూలిపోయిందంటే దానికి కారణం ఉల్లి ధరే! కూరలు ప్రియం అయిపోయినపుడు, కూలీవాళ్లు రొట్టెలో ఉల్లిపాయలు నంచుకుని తిని ఆకలి చల్లార్చుకుంటారు. ఉల్లిని వాళ్లకు అందుబాటులో లేకుండా చేస్తే ప్రభుత్వంపై పగపడతారు. ఉల్లికి, శరద్ పవార్‌కు లింకేమిటంటే – దేశంలోని ఉల్లి మార్కెటులో 70% జరిగేది మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో. అది శరద్ పవార్ పార్టీకి కంచుకోట. అక్కడ ఉల్లి వ్యాపారస్తులు, వాళ్లకు అండగా నిలిచేవారు చాలామంది పవార్ సమర్థకులే. కొందరు బిజెపివారు కూడా వున్నారు కానీ కాంగ్రెసుకు చెడ్డపేరు తెచ్చే క్రమంలో పవార్‌తో చేతులు కలపడానికి సిద్ధం.
2012లో ఉల్లి ఉత్పాదన 42 లక్షల టన్నులైతే ఈ ఏడాది దిగుబడి 55 లక్షల టన్నులు. మరి ఉల్లి ధర కిలో 80 రూ.లు ఎలా అయింది? ఇంతెలా పెరిగింది? ఉల్లి ధర పెంచడం వెనక జరిగిన ట్రిక్కులు అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. పంట పండినపుడు రైతులు మార్కెట్ యార్డుకు తన సరుకు పట్టుకుని వస్తాడు. మార్కెట్ యార్డును శాసించే కొద్దిమంది వ్యాపారస్తులు కూటమి (కార్టెల్ అంటారు)గా ఏర్పడి ధర పెరక్కుండా చూసి, అతి తక్కువ ధర యిచ్చి కొనేస్తారు. ఆ తర్వాత స్టాకును గోడౌన్లలో దాచేసి వుంచుతాడు. మార్కెట్‌లోకి కొద్దికొద్దిగా స్టాకు రిలీజ్ చేసి, కొరత సృష్టించి రేటు పెంచి, వినియోగదారుడి వద్ద నుండి హెచ్చు ధర రాబడతారు. అటు వినియోగదారుడు, యిటు రైతు యిద్దరూ నష్టపోతారు. మధ్యలో వున్న దళారి బాగుపడతాడు. ఈ ఏడాది పంటలో 80% దిగుబడిని ఫిబ్రవరి-మార్చి మాసాల్లో క్వింటాల్ రూ.800-రూ.1200 రేటులో వ్యాపారస్తులు కొనేశారు. 80% మంది రైతులు చిన్నకారు వాళ్లే కాబట్టి, తమ ఉత్పాదనను దాచుకునే సౌకర్యం లేని వాళ్లు కాబట్టి అమ్ముకున్నారు. తక్కిన రైతులు దాచుకుని కొన్నాళ్లు పోయాక రూ.5600 రేటులో అమ్మారు. వ్యాపారస్తులు రూ.4000 – నుండి రూ.6000 రేటులో దాన్ని తిరిగి అమ్ముకున్నారు. ఆ సరుకులో రూ.800కి కొన్నది కూడా వుందని గుర్తు పెట్టుకోవాలి. దేశంలోనే అతి పెద్దదైన ఉల్లి మార్కెట్ యార్డు లసల్‌గావ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్. దాని కమిటీలో వున్న వ్యాపారస్తులు ఆగస్టు 12-15 మధ్య నాలుగు రోజుల్లో రూ.150 కోట్లు గడిరచారు.
ఈ కథ చిన్నప్పటినుండీ వింటూ వచ్చినదే. మరి దీన్ని అరికట్టేందుకు మార్గాలు కనిపెట్టలేదా? అంటే కనిపెట్టారు, అప్పుడప్పుడు మూసేస్తూ వుంటారు. ఉదాహరణకి ఉల్లి అత్యవసర వస్తువుల లిస్టులో వుండేది. ఆ లిస్టులో వుంటే మార్కెట్ ధరను ప్రభుత్వం నియంత్రించవచ్చు. కానీ 2004లో ఆ లిస్టులోంచి ఉల్లిని తప్పించారు. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యాపారస్తులు ఎన్నికలకు విరాళాలిచ్చారు. ఆ వ్యాపారస్తులకు అండగా నిలిచిన రాజకీయ పార్టీ మద్దతు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైంది. అదేవిధంగా ఏదైనా మార్కెట్‌లో సరుకు వేలం వేసేటప్పుడు ఎవరైనా వచ్చి పాల్గనవచ్చని చట్టం చెపుతుంది. కానీ దాన్ని అమలు చేయరు. కమిటీలో కొందరు సభ్యులు యింకెవర్నీ రానివ్వరు. గత మూడు నెలల్లో లసల్‌గావ్ మార్కెట్‌లో 6.5 లక్షల ఉల్లిని వేలం వేస్తే దాన్ని కొన్నవారు కేవలం 12 మంది వ్యాపారస్తులు/వ్యాపారబృందాలు. అంటే వాళ్లు రింగుగా ఏర్పడి ఎవర్నీ రానివ్వటం లేదని అర్తమౌతుంది. రైతు తన ఉత్పాదనను కొంతకాలం దాచుకోగలిగితే రేటు పెరిగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు వెసులుబాటు వుంటుంది. రూ.40000 పెడితే తాత్కాలికమైన గోదాము, రూ. 2 లక్షలు పెడితే స్టోర్ హౌస్ తయారవుతాయి. దానికోసం గతంలో అతనికి సబ్సిడీ యిచ్చేవారు. కానీ 2004 నుండి అది కూడా ఆపేశారు. ఎందుకు? వ్యాపారస్తులు బాగుపడాలి, రైతు నష్టపోవాలి.
సెప్టెంబరు మధ్యలో ఉల్లి మార్కెట్‌లో ధర క్వింటాల్ రూ.5700కు చేరింది. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ బోర్డు మార్కెటింగ్ డైరక్టరు సెప్టెంబరు 19న మార్కెట్ కమిటీ వాళ్లను పిలిచి మేం రంగంలోకి దిగాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. అంతే 24 గంటల్లో ధర రూ.4300కి పడిపోయింది. అంటే ఏమిటన్నమాట వీళ్లందరూ కలిసి కావాలని కృత్రిమంగా కొరత సృష్టించారు. ప్రభుత్వం చురుగ్గా వుంటే వెనక్కి తగ్గుతారు. లేకపోతే దోపిడీ చేస్తారు. ఫిబ్రవరి నుండి మే లోపున 27.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి గోదాముల్లో వుందని అధికారిక దస్తావేజులు తెలుపుతున్నాయి. దేశం మొత్తం మీద నెలవాడకం 7-8 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక కొరతకు అవకాశం ఎక్కడ? అయినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోదు. పైగా దేశంలో ఉల్లి దొరకటం లేదని తెలిసికూడా దుబాయి, బహరైన్‌ల యిత్యాది దేశాలకు ఎగుమతులను అనుమతించారు. ఉల్లి కోసం దేశప్రజలు హాహాకారాలు మిన్నుముట్టిన సెప్టెంబరు తొలిపక్షంలోనే నాసిక్‌లోని ఒక ఉల్లి వ్యాపారస్తుడు 46 క్వింటాళ్ల ఉల్లిని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశారు. అదే సమయంలో ఇంకో వ్యాపారస్తుడు నేపాల్, దుబాయిలకు 72 క్వింటాళ్ల ఉల్లిని ఎగుమతి చేశాడు. ఉల్లికి కొరత వచ్చిందని అనగానే ‘ఉండండి, ఈజిప్టు, చైనా, అఫ్గనిస్తాన్‌ల నుండి దిగుమతి చేసుకుని మీ అందరికీ సప్లయి చేస్తాం’ అంటారు. ఏమిటీ తిక్కపనులు? ఎగుమతెందుకు? దిగుమతెందుకు? ఓ పక్క గోడౌన్లలో ఉల్లి స్టాకులు కుప్పలుతిప్పలుగా వుండగా, రూపాయి విలువ విపరీతంగా పడిపోయిన యీ రోజుల్లో దిగుమతులా? ఆర్థికవేత్త ప్రధాని గారు బగ్గు పులుముకుని కూర్చున్నారు, కళ్ల నిండా మసి, కనబడదు, అడ్డపంచె మేధావిగారు ఆంధ్రులను విడగొట్టడంలో బిజీగా వున్నారు. ఆయనకు వినబడదు.
– ఎమ్బీయస్ ప్రసాద్