ఇక వైకాపా – టిడిపి వారు యీ మధ్య అందిపుచ్చుకున్న సమన్యాయం పల్లవి కాపీరైట్ వీళ్లదే. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికే సర్వాధికారాలు, మేం యివ్వనూ లేం, అడ్డుకోనూ లేము నిమిత్తమాత్రులం అని చెప్పుకుంటూ గడిపారు. ఇప్పుడీ సమైక్య ఉద్యమం జోరు చూడగానే సమన్యాయం నుండి సమైక్యం వైపుకి వచ్చిపడ్డారు. సమైక్యం అన్నాం కదాని, అందరి కంటె ముందుగా రాజీనామాలు చేశాం కదాని సీమాంధ్ర ప్రజల ఉద్యమాలకు నాయకత్వం వహించాలని ఉబలాటపడ్డారు. కానీ సమైక్య ఉద్యమకారులు వైకాపాను వాటేసుకోలేదు. అలా అని నిందించనూ లేదు. చూద్దాంలే అన్నట్టు ఉదాసీనంగా వున్నారు. జగన్‌కు యిది చాలలేదు. ఏకైక సమైక్యవీరుడిగా అవతారం ఎత్తుదామని నిశ్చయించారు. అది అతని అవసరం కూడా. ఎందుకంటే సమైక్యం ముసుగులో విభజనకు సహకరించాలన్న షరతుపైనే సోనియాతో డీల్ కుదిరి బెయిల్ లభించిందని టిడిపి జోరుగా ప్రచారం చేస్తోంది. ఆ మచ్చ తుడుపుకుందామని జగన్ హైదరాబాదులో పెద్ద సభ పెట్టి, సోనియాను ఘాటుగా విమర్శించారు. ‘అది కూడా డీల్‌లో భాగమే, ఆ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెసు రైళ్లు నడిపింది, జనసమీకరణ చేసింది, దానికి తెరాస తోడ్పడింది’ అన్నారు టిడిపివారు. ఒక్కదెబ్బతో శత్రువులందరినీ ఒక్క గాటికి కట్టేసి తిట్టేశారు. ఆర్టికల్ 3 వుందని, దాని ప్రకారం విభజించమని జగనే సోనియాకు సలహా యిచ్చారని టిడిపి ఆరోపణ. లేకపోతే సోనియాకు యీ విషయం తెలియదా!?
జగన్ సభకు ఎన్నో ఆంక్షలు విధించారని మర్చిపోకూడదు. జనసమీకరణకు ప్రభుత్వం సాయపడనక్కరలేదు. సమైక్యవాదంలోనే ఆ ఫోర్సు వుంది. ఎన్‌జిఓల సభకు అన్ని పరిమితులు పెట్టి నియంత్రించారు కానీ ఏ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనో పెడితే జనం యింకా వచ్చేవారు. జగన్‌కు సొంత గ్లామర్ వుంది. పైగా సమైక్యానికి ఏకైక ఆశాదీపంగా కనబడుతున్నాడు. ఇలాటి సభలు యింకో నాలుగు పెట్టినా వాటికీ జనం వస్తారు. పెట్టాలన్నా దృఢసంకల్పం వుండాలంతే. ఇది గమనించే తెరాస దీన్ని ఆపే ప్రయత్నం విరమించుకుంది. గతంలో ఎన్‌జిఓ సభ అడ్డుకోబోయి భంగపడిన విషయం వాళ్లకు గుర్తుంది. అడ్డుకోకపోవడం, జగన్ తన ఉపన్యాసంలో కెసియార్ మాట ఎత్తకపోవడంతో వైకాపా-తెరాస డీల్ వుందని మొదలెట్టారు. అలా అంటున్నారని విజయలక్ష్మిగారి ఖమ్మం పర్యటనను తెరాస అడ్డుకుంది. ‘తెలంగాణ ఎలాగో వస్తోంది, వీళ్లు వచ్చి మొత్తుకుంటే ఏమవుతుంది?’ అని కెసియార్ చెపుతూండగా మళ్లీ దానికి విపర్యంగా జరగడం వింతగా వుంది. అడ్డుకోవడం వలన అడ్డుకున్నవారి బలహీనతే బయటపడుతుంది. తెలంగాణ వస్తుందన్న నమ్మకం తెరాసకు కొరవడిందన్న సందేశం వెళుతుంది.
వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి జగన్ మీటింగుకి జనం రారనుకున్నారు కానీ కుప్పలుతిప్పలుగా వచ్చారు. సమైక్యవాదానికి సహజంగానే బలం వుంది. ప్రస్తుత పరిస్థితిలో సీమాంధ్రుల్లో భవిష్యత్తు గురించి భయాందోళనలు కూడా విపరీతంగా వున్నాయి. కేంద్రం నుండి ప్యాకేజి వస్తుందా రాదా, వస్తే ఎలాటిది వస్తుంది, వచ్చినా అమలవుతుందా అన్న సందేహాలు చాలా వున్నాయి. ఈ గందరగోళంలో ఎవరు తమ తరఫున మాట్లాడినా వారిని దేవుళ్లా చూస్తారు సీమాంధ్రులు. ఆ రోజు మీటింగులో జగన్ చాలా పకడ్బందీగా ఉపన్యాసం యిచ్చారు. సమైక్యమే నా మార్గం, కేంద్రంలో ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతారో వారికే నా మద్దతు అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ఈ స్పష్టత యిన్నాళ్లూ లేదు. ‘తెలంగాణ సెంటిమెంటు గుర్తిస్తాం. అసలు తెలంగాణకోసం చిన్నారెడ్డి ద్వారా ఉత్తరం పంపినది వైయస్సారే’ అంటూ విజయమ్మ పరకాల ఉపయెన్నికలలో మాట్లాడినప్పుడు యీ సమైక్యం అటకెక్కించారు కదా. సమన్యాయం చేస్తే చాలు, విభజించేయండి అన్నారు కదా. ‘విభజన అడ్డుకునే శక్తి మాకు లేదు’ అని ప్లీనరీలో మాట్లాడిన జగన్ యీ రోజు ఏ ధైర్యంతో ‘అడ్డుకోగలం’ అంటున్నారు. హఠాత్తుగా ఎక్కణ్నుంచి శక్తి వచ్చింది? ఆనాడు బిజెపి మాకు ప్రధాన శత్రువు కాబట్టి యుపిఏకు మద్దతు యిస్తాం అన్నారు. ఈ రోజు యుపిఏ కావచ్చు, ఎన్‌డిఏ కావచ్చు, మూడో ఫ్రంట్ కావచ్చు ఎవరు సమైక్యంగా వుంచితే వారికే నా మద్దతు అంటున్నారు. ఫోకస్ ఎందుకు మారింది? జగనే మార్చారు.
ఇన్నాళ్లూ జగన్ ఫోకస్ – కాంగ్రెస్ దుష్పరిపాలన, టిడిపి అవకాశవాదం, బిజెపి మతతత్వం వగైరా. ఇప్పుడు మొత్తం ఫోకస్ – సమైక్యం. దాన్నే ఎన్నికల అంశంగా మారుద్దామని జగన్ నిశ్చయించుకున్నారు. ఇలా మార్చడం ద్వారా జగన్ కేసుల నుండి ఫోకస్ మారిపోతుంది. తక్కిన పార్టీలన్నీ జగన్ కేసుల మీద ఆధారపడే తమ స్ట్రాటజీ తయారుచేసుకున్నాయి. జగన్ వస్తే రాష్ట్రాన్ని కబళించేస్తాడు జాగ్రత్త అని. ఇప్పుడు జగన్ వ్యూహం ఫలించి సమైక్యమే ఎన్నికల అంశం అయిపోతే ప్రజలు యిక దాని గురించే మాట్లాడతారు. సమైక్యం గురించి నిలబడినవారిపై అభిమానం కురిపిస్తారు. వారి వైఫల్యాలు, వారిపై ఆరోపణలు కాస్సేపు మర్చిపోతారు. సమైక్యం ఎన్నికల అంశంగా మారితే సమైక్య ఛాంపియన్లు సీమాంధ్ర మొత్తమే కాదు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా గెలిచి, ముఖ్యపాత్ర పోషిస్తారు. రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా 2014 ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేసే పార్టీ ఏదీ లేదు. నెగ్గే పార్టీకి సింపుల్ మెజారిటీ వస్తుందో రాదో కూడా డౌటే. అలాటి పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 120-130 సీట్లు తెచ్చుకునే అవకాశం సమైక్య ఛాంపియన్‌గా నిలబడే పార్టీకే వుంది. ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో కనీసం 100 సీట్లు రావడం గ్యారంటీ.
ఈ విషయాన్ని బాబు విస్మరిస్తున్నారు, జగన్ గట్టిగా పట్టుకున్నారు. సోనియా డైరక్షన్‌లోనే జగన్ నటించాల్సిన అవసరం లేదు. 2014 ఎన్నికలలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవడమే జగన్ లక్ష్యం. ఆ సీట్లు చూపించే సిబిఐ మళ్లీ తనపైకి రాకుండా చూసుకోగలరు. సోనియా మాట వింటున్నాడు కదాని జనం ఓట్లేయరు. తమకు నచ్చే మాట చెపితేనే వేస్తారు. సీమాంధ్రులకు ప్రస్తుతం సోనియా శత్రువు. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఓట్లు పడతాయి. ఓట్లు పడి గెలిచాక జగన్ సోనియా మాట వింటారా లేదా అన్నది అప్పటి పరిస్థితిపై ఆధారపడుతుంది. ఒకవేళ సోనియాయే అధికారంలోకి వస్తే, ప్రజాభిప్రాయం మాట ఎలా వున్నా తన ప్రయోజనాల కోసం జగన్ ఆమెవైపు మళ్లవచ్చు. ప్రజలు నిలదీస్తే ఏదో ఒకటి చెప్పవచ్చులే అనుకోవచ్చు. అయితే ఒకవేళ సోనియా అధికారంలోకి రాకపోతే..? అప్పుడు యీనాటి ఒప్పందం జగన్ పట్టించుకుంటారా? పట్టించుకోవాలని సోనియా పట్టుబట్టగలరా? సోనియా మళ్లీ అధికారంలోకి వస్తారా రారా అన్నదానిపై యావత్తు ఆధారపడి వుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2013)