ఎమ్బీయస్‌: న్యాయస్థానాలపై నియంత్రణ- 4

ప్రాసిక్యూషన్‌ వాదనను యీయన ఎందుకు అంగీకరించలేదు అన్న సంగతి చాలా ఆసక్తికరంగా వుంది. అతి ముఖ్యులైన సాకక్షులైన పటేల్‌ సోదరులు మూడుసార్లు సాక్ష్యం యిచ్చారు. సిబిఐకు రెండు సార్లు, మేజిస్ట్రీటు ముందు ఒకసారి. 'మూడుసార్లూ…

ప్రాసిక్యూషన్‌ వాదనను యీయన ఎందుకు అంగీకరించలేదు అన్న సంగతి చాలా ఆసక్తికరంగా వుంది. అతి ముఖ్యులైన సాకక్షులైన పటేల్‌ సోదరులు మూడుసార్లు సాక్ష్యం యిచ్చారు. సిబిఐకు రెండు సార్లు, మేజిస్ట్రీటు ముందు ఒకసారి. 'మూడుసార్లూ ఒకలాటి స్టేటుమెంటే యిచ్చారు – అక్షరం మార్చకుండా. ఇది కామన్‌సెన్సుకి విరుద్ధం. అందువలన యీ సాక్ష్యాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు' అన్నాడు గోసావీ. ఒక్కోసారి ఒక్కోటి చెపితే అప్పుడేమంటారు? సాక్షిని నమ్మడానికి వీల్లేదు అనరూ? వీళ్లు పోలీసు అధికారులు తమను బెదిరిస్తూ వుండగా వీడియో రికార్డింగు కూడా చేశారు. పోలీసు అధికారుల ద్వారా అమిత్‌ షా అభయ్‌ తమను బెదిరించాడని, దానికి చూడాసమా ఫోన్‌ వుపయోగించాడనీ వీళ్లు చెప్పారు. అది వాళ్ల వూహే తప్ప, వాస్తవం కాకపోవచ్చని గోసావీ తీర్పు. అమిత్‌ చట్టవిరుద్ధమైన ఆదేశాలు యిచ్చాడని రాయగిర్‌ చెపితే 'న్యాయబద్ధమైన ఆదేశాన్ని కూడా రాయగీర్‌ చట్టవిరుద్ధమైనదని అనుకోవచ్చు. అది అతని వ్యక్తిగత అభిప్రాయం' అన్నాడు. ఇలాటి మీటింగు జరగలేదని అమిత్‌కు మద్దతుగా నిలబడిన గీతా జోహ్రీ, పిసి పాండేల స్టేటుమెంటు మాత్రం ఆయనకు విశ్వసనీయంగా తోచింది. సోలంకీ రిపోర్టు గురించి అమిత్‌  గీతా జోహ్రీ వద్ద కోపం వెళ్లగక్కిన సంగతి చెప్పిన సోలంకీ, ఆచార్య స్టేటుమెంట్లు కూడా జడ్జిగారు కొట్టిపారేశాడు. అమిత్‌ షా అరిచినట్లు సోలంకీ చూశాడా? గీత చెప్పగా విన్నదే కదా అన్నాడు. 

సొహ్రాబ్‌ కిడ్నాప్‌, ఎన్‌కౌంటరు జరిగిన నవంబరు 22 – 26, 2015 తారీకుల్లో అమిత్‌ షా ఎన్‌కౌంటరు చేసిన వంజారా, పాండ్యన్‌లతో నిరంతరం టచ్‌లో వున్నాడని నిరూపించడానికి సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను సిబిఐ కోర్టుకి సమర్పించింది. 'రాష్ట్రంలో టెర్రరిస్టు కార్యకలాపాలు విపరీతంగా వున్నాయి కాబట్టి హోం మంత్రి పోలీసు అధికారులను నిరంతరం సంప్రదించడంలో వింత లేదు' అని జడ్జిగారు దీన్నీ కొట్టి పారేశారు. గుజరాత్‌లో అప్పుడు టెర్రరిజం లేదు, వున్నా టెర్రరిజం వంటి తీవ్రసమస్యను డిజిపి స్థాయి వ్యక్తులతో చర్చిస్తారు కానీ ఎస్‌పి, డిప్యూటీ ఎస్పీ లెవెల్‌ వాళ్లతో ఎందుకు చర్చిస్తారు? అని సిబిఐ న్యాయవాది చేసిన వాదనను పట్టించుకోలేదు. గోసావిగారు 75 పేజీల తీర్పులో సిబిఐ వాదనలను రెండు పేజీల్లో ప్రస్తావించి వదిలేశారు, అమిత్‌ షా తరఫున చేసిన వాదనలకు 32 పేజీలు కేటాయించారు. 25 పేజీల్లో తన డిస్చార్జి ఆర్డర్‌ దయచేశారు. అమిత్‌ షాను వదిలేయగానే, మమ్మల్నీ వదిలేయండి అంటూ యితర పోలీసు అధికారులు అర్జీ పెట్టుకున్నారు. బిల్డర్లను బెదిరించారని ఆరోపణలు ఎదుర్కుంటున్న చూడాసమా, వంజారా కూడా బయటపడిపోయారు. చూడాసమాను గుజరాత్‌ ప్రభుత్వం వెంటనే సర్వీసులో చేర్చేసుకుంది కూడా. గోసావీగారు ఆ తర్వాత అదే స్పీడులో పిసి పాండే, రాజకుమార్‌ పాండ్యన్‌ అనే పోలీసు అధికారులపై కూడా కేసులు ఎత్తేశాడు. 

ఇది జరిగిన రెండు నెలలకే 2015 ఫిబ్రవరి మూడోవారంలో స్పెషల్‌ కోర్టు రాజస్థాన్‌ హోం మంత్రి గులాబ్‌చంద్‌ కటారియాను కూడా యీ కేసులో నిర్దోషిగా విడిచిపెట్టేసింది. విమల్‌ పట్నీ అనే మార్బుల్‌ వ్యాపారి నుంచి సొహ్రాబుద్దీన్‌ డబ్బు గుంజడానికి ప్రయత్నించాడని, అతని పీడ వదిలించమని పట్నీ అప్పటి బిజెపి ప్రభుత్వంలోని హోం మంత్రి గులాబ్‌చంద్‌కు కోరాడని, అందుకే సొహ్రాబుద్దీన్‌ బోగస్‌ ఎన్‌కౌంటర్‌లో గులాబ్‌ చంద్‌ కూడా పాలు పంచుకున్నాడని  ప్రాసిక్యూషన్‌ అభియోగం. సిబిఐ అనుబంధ చార్జిషీటులో అతన్ని నిందితుడిగా చేర్చింది. ఇప్పుడు కూడా అతను రాజస్థాన్‌ బిజెపి ప్రభుత్వంలో హోం మంత్రిగానే వున్నాడు. ఈ కేసులో అమిత్‌ షా తర్వాత విముక్తి పొందిన రెండో రాజకీయ నాయకుడు అతను. 

రాజకీయనాయకుల ప్రభావానికి లోనైతే న్యాయవ్యవస్థ ఎంత అందంగా నడుస్తుందో అమిత్‌ షా కేసు ఒక ఉదాహరణ. 2జి స్కాము, కోల్‌ స్కాము యిత్యాదులు బయటకు వచ్చాయంటే న్యాయవ్యవస్థ ఎంతోకొంత బలంగా వుండడం చేతనే! భవిష్యత్తులో అలాటి ప్రమాదం తలెత్తుకుండా ప్రస్తుత ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది. ఇప్పుడు కొలోజియం స్థానంలో ఏర్పరస్తున్న కమిషన్‌లో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అధ్యకక్షుడు. సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (వాళ్లు ముకుల్‌ రోహ్‌ాతగి, ఉదయ్‌ లలిత్‌ వంటి వారు కావచ్చుగా) కేంద్ర న్యాయశాఖ మంత్రి, మరో యిద్దరు ప్రముఖులు వుంటారట. ఈ ప్రముఖులెవరో చీఫ్‌ జస్టిస్‌, ప్రధాని, అప్పోజిషన్‌ లీడరు కలిసి నిర్ణయిస్తారట. చీఫ్‌ జస్టిస్‌ ప్రధాని నియమించిన వ్యక్తి అయితే వాళ్లదే మెజారిటీ అవుతుంది. అప్పోజిషన్‌ లీడరు వున్నా వాళ్లూ రూలింగు పార్టీ లాటి వాళ్లే కదా, వాళ్లపైనా బోల్డు కేసులుంటాయి కదా. అనేక సందర్భాల్లో పాలకపక్షంవారిపై ప్రతిపక్షనాయకులు కేసులు పెట్టడాలు, ఆ తర్వాత లోపాయికారీ ఒప్పందాలు జరిగి, విత్‌డ్రా చేయడాలూ చూశాం. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే అవతలివాళ్లు దిగమింగిన డబ్బు కక్కించి, పేదలకు పంచిపెడతామని వాగ్దానాలు కురిపిస్తారు. నెగ్గిన తర్వాత అంతా గప్‌చుప్‌. ఇలాటి తోడుదొంగలు కలిసి తమ అకృత్యాలపై ఎవరు విచారించాలో నిర్ణయిస్తారన్నమాట. వీళ్లను బాలన్స్‌ చేయడానికై సామాజిక ప్రముఖులను కూడా వేస్తారట. వాళ్లు ఎలా తేలతారో తెలియదు. లెజిస్లేటివ్‌ కౌన్సిలులో మేధావులు వుండాలని ఒరిజినల్‌ ఐడియా. చివరకు సోషల్‌వర్కర్ల పేర సాధారణ ఎన్నికలలో ఓడిపోయిన రాజకీయనాయకులతోనే నింపేశారు. ఇప్పుడీ 'ప్రముఖులు' కూడా రాజకీయవాదులుగా తేలినా ఆశ్చర్యం లేదు. 

ఇలాటి కమిషన్‌లో వుండడానికి చీఫ్‌ జస్టిస్‌ దత్తుగారికి సడన్‌గా మొహమాటపడ్డారు. మొన్న జనవరిలోనే ఆయన మోదీకి దూరదృష్టి గల వ్యక్తి అని సర్టిఫికెట్టు యిస్తూ 'గతంలో ఎన్నడూ లేనంతగా న్యాయవ్యవస్థకూ, ప్రభుత్వానికి మధ్య అద్భుతంగా సంబంధాలు బలపడుతున్నాయి..' అని మెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సమావేశంలోనే మోదీ న్యాయమూర్తులు ఏ కేసులను విచారించాలో, ఫైవ్‌స్టార్‌ కార్యకర్తలు (తీస్తా సెతల్వాడ్‌ టైపని ఆయన భావమని విమర్శ) కేసులను ఎందుకు ప్రోత్సహించకూడదో వాళ్లకు క్లాసు తీసుకున్నారు. దత్తుగారికి అది అభ్యంతరకరంగా తోచలేదు. ఎప్పుడైతే న్యాయవాదులు, తక్కిన న్యాయమూర్తులు యీ మార్పులను గట్టిగా వ్యతిరేకించారో, అప్పటి నుంచి ఆయనకు గుబులు పుట్టినట్లుంది. కమిషన్‌లో వుండనంటున్నారు. దానితో న్యాయమూర్తులు నియామకాలన్నీ ఆగాయి. కోర్టుల్లో కోట్లాది కేసులు పెండింగులో వున్నాయి. ఇప్పుడీ ప్రతిష్టంభన వచ్చిపడింది. దీన్ని అధిగమించడానికి అంటూ రాజకీయనాయకులందరూ పోగడి తమకు కావలసినవారిని నియమించేసుకుంటారేమో తెలియదు. ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థలో లోపాలు లేవని ఎవరూ అనలేరు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం – యిత్యాది అనేక జాడ్యాలతో కోర్టులు కునారిల్లుతున్నాయి. దానిని సవరించవలసిన అవసరం ఎంతైనా వుంది. కానీ మందు వేయవలసిన డాక్టర్లు, రాజకీయనాయకులు కాదు. ఈ కమిషన్‌ నియామకాన్ని రాజకీయ నాయకులందరూ హర్షిస్తారు. కెసియార్‌ కూడా కోర్టుల జోక్యాన్ని నిరసిస్తున్నారు కదా – న్యాయానికి స్పీకరు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ స్పీకర్లందరూ అధికారపార్టీలకు వత్తాసు పలికేవారిగా తయారయ్యారు. పార్టీ ఫిరాయింపుదారులను బాహాటంగా కాపాడుతున్నారు. వారికి ముకుతాడు వేయాలని కోర్టులకు వెళితే అది యీ నాయకులు సహించలేకపోతున్నారు. ఇది యివాళ్టి గొడవ కాదు. తమిళనాడులో ఎస్‌ఎచ్‌ పాండ్యన్‌ అనే స్పీకరు నియంతలా ప్రవర్తించేవాడు. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించేవాడు. 'నా అధికారాలకు పరిమితి ఆకాశం మాత్రమే, నా పేరులోని ఎస్‌ఎచ్‌ అంటే 'స్కై హై' అని చెప్పుకునేవాడు. 

ఈ రోజు మోదీ యీ సవరణలు తెస్తున్నాడు కాబట్టి మోదీపై అభిమానంతో యిది సవ్యమైన చర్యే అని సమర్థిస్తే భవిష్యత్తులో చాలా విపరీతాలు జరుగుతాయి. మోదీ కలకాలం వుండడు కదా. మోదీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తాడని అనుకున్నా తర్వాత వచ్చినవారు దుర్వినియోగం చేస్తే…? ఇప్పుడైనా ప్రతిపక్ష నాయకుడికి నియామకాల్లో పెద్ద భూమిక యిచ్చారు. ఆయన ఎవరు? నిలువెల్లా అవినీతిలో మునిగిపోయిన కాంగ్రెసు పార్టీకి చెందిన వ్యక్తి. తమ స్కాములన్నీ కోర్టుల కారణంగానే బయటకు వచ్చి, అధికారం పోయిందని న్యాయవ్యవస్థను తిట్టుకునే వ్యక్తి. ఎవరు న్యాయమూర్తులుగా వుండాలో ఆయనా నిర్ణయిస్తాడా? శాస్త్రప్రకారం సిబిఐ, కోర్టులు స్వతంత్రంగా ప్రవర్తించాలి. కానీ ఆచరణలో ఏం జరుగుతోందో విపులంగా చెప్పడానికి అమిత్‌ షా కేసును ఉదాహరణగా తీసుకున్నాను. ఉదాహరణలతో పని లేకుండా కూడా అందరికీ తెలుసు. అయినా కోర్టుల్లో కొందరు పెద్దమనుషులు వుండడం చేత ఆ వ్యవస్థ అంతంతమాత్రంగానైనా ఒంటికాలిపై కుంటుతూ నడుస్తోంది. ఆ కాలు కూడా విరిచేస్తాం, మేం యిచ్చే చంకకర్రలు పెట్టుకుని నడు అంటున్నారు రాజకీయనాయకులు. అది విషాదకరం. న్యాయవ్యవస్థ అధికార వ్యవస్థను అదుపు చేసేట్లా వుండాలనే ఆలోచన మన భారతీయ సంస్కృతిలోనే వుంది. 

– (సశేషం) ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives