ఎమ్బీయస్‌: పంద్రాగస్టా? గాంధీ జయంతా?

ఆగస్టు 15, జనవరి 26, గాంధీ జయంతి యిలాటి తారీకుల గురించి జైల్లోని ఖైదీలు ఆతృతగా ఎదురుచూస్తారు. అదేదో దేశభక్తి వలన అనుకోకండి.  సత్ప్రవర్తనకు మెచ్చి శిక్ష తగ్గించి జైల్లోంచి వదిలిపెట్టే ఖైదీల జాబితాలో…

ఆగస్టు 15, జనవరి 26, గాంధీ జయంతి యిలాటి తారీకుల గురించి జైల్లోని ఖైదీలు ఆతృతగా ఎదురుచూస్తారు. అదేదో దేశభక్తి వలన అనుకోకండి.  సత్ప్రవర్తనకు మెచ్చి శిక్ష తగ్గించి జైల్లోంచి వదిలిపెట్టే ఖైదీల జాబితాలో తమ పేరు వుంటుందేమోనని వాళ్ల ఆశ. ఇప్పుడు ముద్దాయిల విషయంలో దేశంలో  యిలాటి పండగేదో నడుస్తోంది. కోర్టులు వారి విషయంలో అతి వుదారంగా వుంటున్నాయి. మీమీద ఏదైనా కేసు నడుస్తూ వుంటే యిదే సీజనులో అది అర్జంటుగా విచారణకు రావాలని దేవుణ్ని కోరుకోండి. ఎటొచ్చీ మీకు రాజకీయంగానో, మరో రకంగానో పలుకుబడి వుండాలి. మీరు జైల్లోంచి బయటకు రావాలనో, అసలు వెళ్లనే కూడదనో మందిరాల్లో, మసీదుల్లో మొక్కుబడులు పెట్టుకునేవారు, పొర్లు దణ్ణాలు పెట్టేవారు, గుండు గీయించుకునేవారు, మట్టి కలిపిన అన్నం తినేవాళ్లు, ఆత్మహత్యలు చేసుకునేవారు, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేవారు, లైక్స్‌ మీద లైక్స్‌ కొట్టేవారు మీ వెనక ఎంతమంది వుంటే దేవుడు అంత బాగా మీ ప్రార్థన వింటాడు.

అవాక్కయ్యారా? అని అడుగుతుంది ఓ ప్రకటన. ఇవాళ్టి పరిస్థితి గురించి మరొక స్లోగన్‌ ఏదైనా కాయిన్‌ చేయాలి. ఎందుకంటే షాకు మీద షాకు! జయలలితపై కేసు కొట్టేశారు. కాస్సేపటికే రామలింగరాజు, సోదరులకు కేవలం లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ యిచ్చి పడేశారు, వారిపై వేసిన ఏడేళ్ల కఠిన శిక్ష తీర్పు అమలు కాకుండా బ్రేక్‌ వేశారు. జయలలిత కేసులో తీర్పుపాఠం పూర్తిగా చదవకుండా ఏమీ వ్యాఖ్యానించకూడదు, నిజమే. కానీ పైపైన కనబడుతున్నదేమిటి? 18 ఏళ్లగా నడుస్తున్న కేసు అది. స్పెషల్‌ జడ్జి సెప్టెంబరులో నాలుగేళ్ల శిక్ష వేశాడు. పదేళ్లదాకా పదవిలో వుండకూడదన్నాడు. రూ.100 కోట్ల ఫైన్‌ వేశాడు. పది రోజులు పోయాక బెయిల్‌ అడిగితే కర్ణాటక హైకోర్టు  కేసు తీవ్రత కారణంగా యివ్వడానికి వీల్లేదంది. జయలలిత సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డరు తెచ్చుకుని 21 రోజుల్లో జైల్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అదే కర్ణాటక హైకోర్టు 8 నెలల తర్వాత అన్ని కేసులూ కొట్టేసింది. కింద కోర్టు తీర్పులను పై కోర్టులు సవరించడం మామూలే. హై కోర్టు మరణశిక్ష వేస్తే సుప్రీం కోర్టు దాన్ని యావజ్జీవంగా మారుస్తూండడం చూస్తూ వుంటాం. అలాటి ఆశలతోనే కష్టనష్టాల కోర్చి పైకోర్టుకి అప్పీలు చేస్తారు. కానీ యీ కేసు విషయంలో మొత్తం కేసు ఒక్కసారిగా దూదిపింజలా ఎగిరిపోయింది. 

తన అక్రమాస్తుల గురించి ఎవరికీ సందేహాలు లేకుండా చేసుకుంది – జయలలిత! దత్తపుత్రుడి వివాహం ఆకాశమంత పందిరి వేసి, భూలోకమంత పీటలు వేసి జరిపించి తన వైభవాన్ని చాటింది. ఆ డోసు చాలదనుకున్న కరుణానిధి తను అధికారంలో వుండగా జయలలిత యింటిపైకి వీడియో టీమును పంపి ఆవిడ కున్న చెప్పుల సంఖ్య, చీర్ల సంఖ్య అన్నీ మాయాబజారు సీన్లలా సన్‌ టీవీలో చూపించాడు. రాజకీయాల్లోకి రావడానికి ముందు జయలలిత సినిమా కెరియరంతా ముగిసిపోయిందని, మిగిలిన డబ్బును ఓ తెలుగు హీరోని నమ్మి పోగొట్టుకుందని లోకవిదితం. పోయెస్‌ గార్డెన్‌లో యిల్లు తప్ప ఏమీ మిగలని పరిస్థితిలో ఎమ్జీయార్‌ ఆమెపై జాలి పడి రాజకీయాల్లోకి తెచ్చాడని కూడా అందరికీ తెలుసు. తర్వాతి రోజుల్లో ఆమె అధికారంలోకి వచ్చాక అవినీతి జడలు విరబోసుకుని నర్తించిందని కూడా ఆనాటి కేసులు చెప్పాయి. ప్రభుత్వ ఆఫీసుల అమ్మకాన్ని అడ్డుకున్న మహిళా ఐయేయస్‌ అధికారిణిపై ఆసిడ్‌ దాడుల దగ్గర్నుంచి రకరకాల వికృత చేష్టలు జరగడం చేతనే, జయలలిత అధికారం పోగొట్టుకుంది. ఓపెన్‌ అండ్‌ షట్‌ కేసుగా అభివర్ణించదగిన యిలాటి కేసులో కింది కోర్టు తీర్పుపై పైకోర్టు కాస్త వెసులుబాటు యిస్తుందని అనుకోవడం సహజం. కానీ జరిగినదేమిటి? మొత్తం కొట్టి పారేశారు. 

ఎందుకిలా? అంటే ఎవరి వూహాగానాలు వారివి. జయలలిత అంటే మోదీకి ప్రత్యేక అభిమానమనీ, రాజ్యసభలో మెజారిటీ తెచ్చుకోవడానికి ఎడిఎంకె మద్దతు అవసరం కాబట్టి జయలలితకు మేలు చేయాలని కోరుకుంటున్నారనీ, అందుకే అరుణ్‌ జైట్లీ మూడుసార్లు వెళ్లి జయలలితను కలిశారనీ అంటున్నారు. కరుణానిధి భావాలకు, మోదీ భావాలకు చుక్కెదురు. అందువలన తమిళనాడులో పట్టుకోసం మోదీ జయలలితను దువ్వవచ్చు, ఆశ్చర్యం లేదు. అందుకే సాటి బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన కేసులో ముద్దాయి జయలలితకు ఊరట లభిస్తే మోదీ కంగ్రాట్స్‌ చెపుతూ ఫోన్‌ చేశారు, ఫిబ్రవరిలో పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్‌ చేశారు. తను ప్రధాని, ఆమె మాజీ మరియు భావి ముఖ్యమంత్రి కాబట్టి సమాఖ్యస్ఫూర్తితో చేశారని సర్ది చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ సుబ్రహ్మణ్యం స్వామి యీ తీర్పుపై సుప్రీం కోర్టుకి అప్పీలుకి వెళ్లినపుడు అక్కడి జడ్జిపై మోదీ వ్యాఖ్యల, అభినందనల ప్రభావం వుండదంటారా? అఫ్‌కోర్సు, థియరీ ప్రకారం ప్రధానిని సైతం కోర్టు జడ్జి మందలించవచ్చు, కానీ అలా ఎంతమంది వ్యవహరిస్తున్నారు? జడ్జిల యిళ్లల్లో పెళ్లిళ్లకు రాజకీయనాయకులు హాజరవుతున్నారు, జడ్జిలు కుటుంబసమేతంగా గుడికి వెళితే మర్నాడు మీడియా అధినేతలు అదో పెద్ద న్యూస్‌లా ప్రచారం కల్పిస్తున్నారు. తమకు ఉచిత పబ్లిసిటీ యిచ్చిన పత్రికాధిపతులపై కఠినంగా వుండడం కష్టమే కదా! జడ్జిలు పాతకాలంలోలా మడి కట్టుకుని అసింటా అసింటా అనటం లేదు, జనజీవన స్రవంతిలో యీదులాడుతున్నారు. అందుకే మొహమాటాలు పెరుగుతున్నాయి, అదే నిష్పత్తిలో 'నాట్‌ బిఫోర్‌ మీ'లు వాడేసుకుంటున్నారు. 

మోదీకి రాజకీయ అవసరాలుండవచ్చు, వ్యక్తిగత అభిమానాలు వుండవచ్చు, కానీ వాటికీ కోర్టు తీర్పుకి సంబంధం ఏమిటి? అని వాదించవచ్చు. సంబంధం వుంది అనేవాణ్ని కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద కేసు పెట్టి వేధించవచ్చు. అందుచేత యిది కాకతాళీయం అనుకుని సరిపెట్టుకోవాలి. ఇలా వారానికి ఓ కాకతాళీయం, యివాళ్టిలా రోజుకి రెండు కాకతాళీయాలు జరుగుతూ వుంటే కాకిలోనైనా పొరపాటుండాలి, తాళఫలంలోనైనా పొరపాటుండాలి, వాటిని మనం గమనించే తీరులోనైనా పొరపాటుండాలి. సరిగ్గా గమనించినవారిలో మాత్రం జ్ఞానజ్యోతి వెలుగుతుంది, ముందుచూపు కలుగుతుంది. అధికారంలో వున్నవారే అక్రమాస్తుల కేసులో తప్పించుకోగలిగినప్పుడు, అధికారంలో వున్న వారి కుటుంబసభ్యులపై క్విడ్‌ ప్రో కేసులు నిలుస్తాయా? పదవీ దుర్వినియోగం అనే మాట అక్కడ అన్వయించదు కదా, ముఖ్యమంత్రి అవినీతిపరుడైతే అతని కొడుకుపై కేసు పెట్టగలరా? పెడితే నిలుస్తుందా? ఇక గట్టిగా నిలిచే కేసులేమిటయ్యా అంటే ఆర్థిక నేరాల కేసులు. అవి ఎలా నడుస్తున్నాయో సత్యం రామలింగరాజు కేసు చెపుతోంది. అంతర్జాతీయంగా సంస్థలను, ఆర్థిక సంస్థలను మోసగించానని ఒప్పుకున్నాక కూడా, ఏడేళ్ల శిక్ష మాత్రమే పడితే యివాళ అది కూడా కోల్డ్‌ స్టోరేజికి వెళ్లింది. లక్ష రూపాయల పూచీకత్తు చాలట, వేసిన జరిమానాలో (సోదరులిద్దరికి కలిపి 5 కోట్ల చిల్లర) పదోవంతు కడితే చాలట. (సత్యాన్ని తిరగేసి మేతవేసిన నా వంటి కోటకోటీశ్వరుడికి ఇంత తక్కువ విలువ కడతారా అని రామలింగరాజుగారు అవమానంగా ఫీలవ్వాలి). కేసులు ధూళిరేణువుల్లా ఎగిరిపోతున్న యీ సీజన్‌లో తన కేసు కూడా చప్పున విచారణకు వస్తే మంచిదని జగన్‌ ఆశిస్తే ఆశ్చర్యం వుందా? ఈ లోపున బిజెపికి, మోదీకి వ్యతిరేకంగా జగన్‌ ఏమీ మాట్లాడటం లేదని ఫిర్యాదు చేసి లాభమేముంది? 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2015)

[email protected]