ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వంలోకి రాగానే సెజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం, దేశవిదేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం, సింగిల్ విండోలో అనుమతులిస్తున్నాం, మూడేళ్లు తిరిగే సరికి లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చెప్తుంది. ఒప్పందాలు జరుగుతాయి, ఫోటోలు పేపర్లో వస్తాయి, రాబోయే ఫ్యాక్టరీ పక్కన కట్టబోయే కాంప్లెక్సులో ఫ్లాట్లు అంటూ రియల్ ఎస్టేటు వాళ్లు ఫ్యాన్సీ రేట్లకు అమ్మేస్తారు. ఐదేళ్ల రీళ్లు తిరుగుతాయి. కొత్త సర్కారు వస్తుంది. పాత ప్రభుత్వం తన పార్టీకి విరాళాలిచ్చిన వారికి లాలూచీ పడి భూమిని చవకగా కట్టబెట్టింది. అక్కడ యింకా పని ప్రారంభం కాలేదు కాబట్టి ఆ భూమి వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రకటిస్తుంది. న్యాయమే కదా అనిపిస్తుంది ప్రజలకు. అంతలో పారిశ్రామికవేత్త వస్తాడు. 'నాకు నీళ్లు యిస్తానన్నారు, విద్యుత్ యిస్తానన్నారు, రోడ్లు వేస్తానన్నారు, ఏమీ యివ్వలేదు, ఫ్యాక్టరీ కట్టడానికి పర్యావరణ అనుమతులు కూడా యివ్వలేదు. ఏ విధంగా కట్టగలను? భూమిపై పెట్టిన పెట్టుబడి డెడ్ యిన్వెస్ట్‌మెంట్ అయి నేనేడుస్తూంటే మధ్యలో యీ ఆరోపణలేమిటి?' అని వాదిస్తాడు. ఇదీ పాయింటేస్మీ అనిపిస్తుంది ప్రజలకు. ఏది నిజం? ఎవరి వాదన కరక్టు? భూమి యిచ్చిన ప్రభుత్వానికి అనుమతులు, సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత వుందా లేదా? ఫలానా టైములోపున ఉత్పత్తి ప్రారంభించకపోతే చర్యలు తీసుకుంటాం అని పరిశ్రమకు షరతులు విధించినట్లే, ఫలానా తేదీలోగా అనుమతి యిప్పించకపోతే, విద్యుత్ యివ్వకపోతే దీనికి రెట్టింపు భూమి వూరికే యివ్వాలి అని షరతులు విధిస్తే…? ఈ కథ యీ రాష్ట్రందే అనుకుంటే పొరబాటు. అన్ని చోట్లా యిదే జరుగుతోంది. భారత్‌ను ఉత్పత్తి కేంద్రంగా మారుద్దామని సంకల్పిస్తున్న కేంద్రప్రభుత్వం యిలాటి కేసులన్నిటిని సమీక్షించి పరిష్కరించాలి. లేకపోతే విదేశీ పెట్టుబడిదారుల మాట అటుంచి, స్వదేశీవాళ్లే విదేశాల్లో ఫ్యాక్టరీలు పెడతారు.
బెంగాల్‌లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన బుద్ధదేవ్ భట్టాచార్య తమ పార్టీ పాతికేళ్ల పాలనలో పరిశ్రమలు బెంగాల్ని విడిచిపెట్టేశాయని గుర్తించి, పరిశ్రమలకు సరైనా వాతావరణాన్ని కల్పించకపోతే నిరుద్యోగసమస్య ఎక్కువై పోయి, పార్టీ మనుగడకే ప్రమాదం అని తలచి 2006లో మూడు పెద్ద యిండస్ట్రీలను బెంగాల్‌కు పట్టుకుని వచ్చాడు. ఒకటి సింగూర్‌లో టాటా వారి నానో కార్ల ఫ్యాక్టరీ, రెండు నందిగ్రామ్‌లో కెమికల్ హబ్. ఫ్యాక్టరీలకై భూసేకరణ చేయబోతే అప్పటి ప్రతిపక్ష నాయకురాలు నానా యాగీ చేసి వాళ్లను తరిమివేసింది. అప్పటినుంచి బెంగాల్ అంటేనే పారిశ్రామికవేత్తలు వణుకుతున్నారు. మూడో ప్రాజెక్టు అయిన పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని సల్బోనీలోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీపై కూడా మమత కన్ను పడింది కానీ అక్కడ రైతులు ఆందోళన చేయకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. దానికి కారణమేమిటంటే అక్కడ 4300 ఎకరాల భూమి ప్రభుత్వందే వుంది. ఏనిమల్ హజ్బెండరీ ప్రాజెక్టుకై జ్యోతి బసు ప్రభుత్వం అడవులు కొట్టేసి దాన్ని సిద్ధం చేసుకుంది. ఆ ప్రాజెక్టు రాకపోవడం చేత అది ఖాళీగా వుంది. ఇంకో 189 ఎకరాలు కావలసి వచ్చింది. ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టి రైతుల నుండి భూమి తీసుకున్నారు. 2007లో జిందాల్ స్టీల్ వర్క్స్‌కు యిచ్చి 10 మిలియన్ టన్నుల స్టీల్ ఫ్యాక్టరీ, 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008 నవంబరులో ప్రారంభోత్సవం జరిగింది. ఇంచుమించు ఆరేళ్లు. ఇప్పుడు ఆ స్థలంలో వున్నదేమిటంటే ఆ స్థలం చుట్టూ పెద్ద ప్రహారీ గోడ, దానిపై ముళ్ల తీగల కంచె, మధ్యలో ఓ శంకుస్థాపన రాయి.
ఎందుకిలా జరిగింది అని జిందాల్ వాళ్ల నడిగితే మేం ముడి యినుము తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి యివ్వటం లేదు. అది లేకుండా స్టీల్ ఫ్యాక్టరీ ఏం కడతాం అని అడుగుతున్నారు. 'అన్నిటిని మించి యిక్కడ శాంతిభద్రతలు లేవు. మా ప్లాంట్ శంకుస్థాపన చేసి కలకత్తా తిరిగి వెళుతున్న ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌లపై ఈ జిల్లాలోనే మావోయిస్టులు హత్యాయత్నం చేశారు. రెండు లాండ్‌మైన్‌లు పేల్చారు కానీ సరైన టైముకి పేలకపోవడం చేత వాళ్లు బతికిపోయారు. అంత పెద్దవాళ్లకే రక్షణ లేకపోతే మా కంపెనీ ఉద్యోగులకు ఏం రక్షణ వుంటుంది? ప్రాణభయంతో ఎవరూ పనిచేయడానికి రావటం లేదు' అని చెప్తున్నారు. ఆ వెనువెంటనే మావోయిస్టుల మద్దతుతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చి టాటా వాళ్లను తరిమివేశారు. ఇక మా ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? మమతా ప్రభుత్వం సెజ్‌ల గురించి పాలసీ ఏదీ తయారుచేయలేదు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు అని ఫిర్యాదు చేస్తున్నారు. మమతా అదేమీ వినటం లేదు. 'వెంటనే పని ప్రారంభించండి, లేదా స్థలం విడిచి పెట్టి పొండి. మేం యింకోరికి యిచ్చేస్తాం' అంటోంది. మొదలెడతాం అంటూ జాప్యం చేస్తే కుదరదు, కొత్తగా ఒప్పందం చేసుకోండి, నీరు, విద్యుత్ వాడకం గురించి, టైమ్‌ఫ్రేముల గురించి కొత్తగా షరతులు మేం చేరుస్తాం, అంతే కాదు ఫ్యాక్టరీ ప్రారంభించేవరకు నెలకు రూ.4500 భూమి పోగొట్టుకున్న రైతులకు యివ్వాల్సిందే అని చెప్తోంది. 'మీరు భూమి పోగొట్టుకున్న సింగూరు రైతులకు యిస్తున్నది రూ. 2000. మా దగ్గరకి వచ్చేసరికి రెట్టింపు కంటె ఎక్కువ యిమ్మంటున్నారు. ఇదేం న్యాయం?' అని అడుగుతోంది జిందాల్. కొత్త షరతులు చేరుస్తామంటే మేం ఎలా ఒప్పుకుంటాం? అంటోంది.
ఇలాటి పరిస్థితుల్లో పరిశ్రమలు ఎలా వస్తాయో, ఎలా నిలదొక్కుకుంటాయో వూహించలేం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)