అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు? తిరుమల వేంకటేశ్వరస్వామి. ప్రధానంగా తెలుగువారికి ఆరాధ్యుడు. మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఎవరు? అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు ద్వారా మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయిన సెల్వి (కుమారి) జె.జయలలిత. తమిళుల ఆరాధ్య దేవత. ఆమెకు అక్రమాస్తులు ఉంటేనేం, ఆ కేసులో దోషిగా తేలితేనేం, నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వస్తేనేం, కష్టాల్…నష్టాల్ వస్తే రానీ ఆమె ఇప్పటికీ తమిళ ప్రజలకు వందనీయురాలు. అభినందనీయురాలు. ఆమె జైలు నుంచి నిర్దోషిగా బయటకు రావాలని, అంతకంటే ముందు బెయిల్‌పై రావాలని, మళ్లీ సింహాసనం అధిష్టించాలని, తమను పరిపాలించాలని, ఆమె చల్లని పాలనలో తాము సుఖసంతోషాలతో జీవితాలు వెళ్లదీయాలని కోరుకుంటున్నారు లక్షలాది మంది అభిమానులు. పూజలు చేస్తున్నారు. నిరసన దీక్షలు చేస్తున్నారు. వినూత్నమైన, విచిత్రమైన మొక్కులు మొక్కుకుంటున్నారు. కళ్ల నీళ్ల పర్యంతమవుతున్నారు. కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక మార్గం…ఆమె ఒక దుర్గం. ఆమె జీవితం స్వర్గం…నరకం. ఆమె ఏకాంత కాంత…నియంత.
గతమెంతో ఘనం…ఆధునిక రాచరికం
జయలలిత మొదటిసారిగా 1991 నుంచి 1996 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకొని అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ఆమె అరంగేట్రం అదిరిపోయింది. ఆమె పాలన కూడా అదేవిధంగా ‘ఆధునిక రాజరికం’లా సాగింది. మహారాజుల, మహారాణుల పరిపాలన మనం ప్రత్యక్షంగా చూడలేదు. కేవలం సినిమాల్లోనే చూశాం. ‘జయీభవా, విజయీభవా కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణానిఖిల రాజన్యమకుట మణిఘృణీ నీరాజిత మంగళచరణామేరుశిఖర శిఖరాయమాన గంభీర ధీరగుణ మానధనా…..నోటిలో రాళ్లు వేసుకొని నమిలినట్లుగా ఉన్న సంస్కృత పద సమాస భూయిష్టమైన ఈ వాక్యాలు చూస్తుంటే మన కళ్ల ముందు రాజు, అతని సేవకులు, వందిమాగధులు, సకల పరివారం, వాళ్లంతా దర్బారులో అతన్ని స్తోత్రం చేస్తూ కనబడతారు. గత కాలపు రాచరికాల్లో ఇలాంటి ధోరణి మామూలే. ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటివి ఊహించలేం. కాని జయలలిత పాలన రాచరికాన్ని పురుద్ధరించింది. మొదటి నుంచి వ్యక్తిపూజ అధికంగా ఉన్న తమిళనాడులో ఇలాంటి వందిమాగధ ధోరణి జయలలిత అధికారంలోకి రావడంతోనే మరింత పెరిగిపోయింది. ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమెకు 46 ఏళ్లు. ఆమె పుట్టినరోజు ఉత్సవాలను రాష్ర్టంలో పెద్ద పండుగలా నిర్వహించారు. జయ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మద్రాసులో ‘ఈనాడు’ రిపోర్టుగా పనిచేసిన సమయం. అప్పుడు ఆమె రాజరికం ఎలా ఉందో చూడగలిగాను. ఆమె పుట్టిన రోజు సందర్భంగా 46 జంటలకు వివాహాలు చేశారు. నగరం నిండా నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేశారు. అన్నాడిఎంకె కార్యకర్తలు ఏ చిన్న గోడనూ వదలకుండా పోస్టర్లు అంటించారు. గోడల మీద అందమైన రంగులతో ఆమె బొమ్మలు చిత్రించారు. వివిధ రకాల స్తోత్ర పాఠాలు రచించారు. మంత్రులు బహిరంగ సభల్లో జయలలితను కీర్తించడం తప్ప ప్రభుత్వ విధానాలను వివరించడం జరగదు. పాలన గురించి మాట్లాడటం కంటే జయ భజన చేయడంలోనే ఎక్కువ ఆనందం పొందేవారు.
బిరుదులే బిరుదులు
రాజుల కాలంలో వారికి అనేక బిరుదులు ఉండేవి. వారిని ఆ బిరుదులతోనే సంబోధించేవారు తప్ప నేరుగా పేరు పెట్టి పిలిచేవారు కాదు. దేశంలో సంస్థానాలు రద్దయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడేవరకూ సంస్థానాధీశులకు గొప్ప గొప్ప బిరదులు ఉండేవి. బ్రిటిషు పాలకులు కూడా అనేకమంది సంస్థానాధీశులకు బిరుదులు ఇచ్చి లోబరుకునేవారు. ఇప్పటికీ కళాకారులకు, నాయకులకు కొన్ని సంస్థలు బిరుదులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. జయకు ఆమె అభిమానులు, భక్తులైన నాయకులు అనేక బిరుదులు ఇచ్చారు. ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయిక) బిరుదు చాలా పాపులర్. భక్తులు భగవంతుడిని అనేక నామాలతో కీర్తించినట్లే అన్నా డిఎంకె నాయకులు, కార్యకర్తలు ఆమెను పరిపరివిధాల పొగుడుతూ, ఆ బిరుదులకు ప్రజల్లో ప్రచారం కల్పించారు. పాత తరం నాయకుల కంటే జయ ఎన్నో రెట్లు గొప్ప నాయరాలని ప్రచారం చేశారు. ఆమె మానవ జన్మ ఎత్తిన దేవత అన్నారు. ‘తెన్నగత్తు అరసి’ (దక్షిణ ప్రాంత రాణి) అని కీర్తించారు. తమిళంలో ‘తెన్’ అంటే దక్షిణం అని అర్థం. ‘కావల్ దైవం’ (రక్షించే దేవత) అని స్తోత్రం చేశారు. ‘కావల్’ అంటే రక్షణ అని అర్థం. జయను నడిచే దేవతగా భావిస్తూ ‘నడమాడుం దైవం’ అని ఆరాధించారు. ఆమె మామూలు నాయకురాలు కాదని అన్నాడిఎంకె నాయకుల అభిప్రాయం. అందుకే ‘తంగ తలైవి’ (బంగారు నాయకురాలు) అని బిరుదు ప్రదానం చేశారు.
జయను దేవతగా ఆరాధించే
అన్నాడిఎంకె నాయకులు ఆమె ఎల్లప్పుడూ తమ హృదయంలోనే ఉంటారని, తల్లివంటిదని ప్రశంసించారు. అందుకే ఆమెను ‘ఇదయతాయి’ (హృదయంలోని తల్లి) అని భక్తిగా కొలిచారు. అలాగే ‘ఇదయ దేవతై’ (హృదయంలోని దేవత) అని కూడా భక్తిగా పిలిచారు. అన్నాడిఎంకె నాయకులు, కార్యకర్తలు జయలలితే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆమెను ‘తమిళ్‌నాట్టిన్ నిరందర ముదలవర్’ (ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి) అని అన్నారు. కొందరు నాయకులు జయను మదర్ థెరిస్సాతో పోల్చి ‘తెన్నగత్తిన్ థెరిసా’ (దక్షిణ భారత థెరిసా) అని వినయవిధేయతలు చాటుకున్నారు. తమిళనాడులో ప్రాచీన వీరవనిత అయిన కణ్ణగితోనూ జయను పోల్చారు. తెలుగువారికి రుద్రమ దేవి ఎలాగో తమిళులకు కణ్ణగి అలా. అన్నాడిఎంకె నాయకులు సభల్లో ప్రసంగించేటప్పుడు ఆ సభలో జయ ఉన్నా లేకపోయినా పేరు పెట్టి మాట్లాడరు. పురట్చి తలైవి అనే అంటారు. పురట్చి తలైవి ఫలానా కార్యక్రమం అమలు చేయాలని చెప్పారు లేదా పురట్చి తలైవి ఫలానా ఉత్తర్వులు ఇచ్చారని చెబుతారు.
అడుగడుగునా ఆర్భాటాలు
జయలలితది రాచరిక పాలన అని చెప్పుకున్నాం కదా. జయ ఏ జిల్లాలో పర్యటించినా భారీ ఏర్పాట్లు జరిగేవి. ముఖ్యమంత్రి ఫలాన జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకోగానే పర్యటనకు పది రోజులు ముందుగానే ముగ్గురు నలుగురు మంత్రులు అక్కడకు చేరుకొని ఏర్పాట్లు చేసేవారు. బ్యానర్లు కట్టించడం, పోస్టర్లు అతికించడం, వేదిక ఏర్పాటు చేయడం, ఆమె ప్రయాణించే మార్గంలో స్వాగత ద్వారాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం…మొదలైన పనులు చేయించేవారు. జయ పర్యటనలో ఒక్క అపశృతి కూడా దొర్లకుండా చేసుకునేవారు. ఒకసారి ఆమె తంజావూరులో పర్యటించినప్పుడు ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలు రాచరిక యుగంలోని కోటలను తలపించాయి. ఆమె మొదటి టర్మ్‌లోనే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. తనను తాను మహా సామ్రాజ్ఞిగా చిత్రీకరించుకున్నారు. అప్పుడే అక్రమాస్తులకు కూడా పునాదులు వేసుకున్నారు.
మంత్రులు తోలు బొమ్మలు
‘తోలు బొమ్మ ఇది తూటుల తొమ్మిది తుస్సుమనుట ఖాయం…జీవా తెలుసుకో అపాయం’ అనే వేదాంతపరమైన పాట ఒకటుంది. జయ మంత్రులంతా ఈ బాపతే. ఆమె ఆడించినట్టాల్లా ఆడే తోలు బొమ్మలు. ఎవరికి గాలి కొట్టి పైకి తీసుకొస్తుందో, ఎవరి గాలి తీసి పాతాళానికి తొక్కేస్తుందో ఊహించలేరు. జయ ఆపదల్లో చిక్కుకున్న రెండుసార్లూ ముఖ్యమంత్రి అయిన పన్నీరు సెల్వం ఒకప్పుడు ఆమె వ్యతిరేకవర్గంలో ఉన్న నాయకుడు. కాని ఇప్పుడు ఆంజనేయుడిని మించిన భక్త శిఖామణి. మంత్రులెవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే చాలు పదవికి నీళ్లు వదులుకోవల్సిందే. అలా చాలామందిని పీకేశారు జయ. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. ఇద్దరి మధ్య ఉప్పునిప్పుగా ఉండేది. ఒక మంత్రి ఆయన్ని కలిసి మాట్లాడారని తెలియగానే మంత్రి పదవి ఊడిపోయింది. పదవులు పోయిన మంత్రులకు అలా జరగడానికి కారణమేమిటో తెలియదు. జయ చెప్పరు. కొందరికి జీవితాంతం కూడా కారణం తెలియకపోవచ్చు. ఈ భయంతోనే కావచ్చు మంత్రులు ఆమెను కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జయ జైలులో ఉండటంతో విధేయుడు పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిని చేశారు. కాని ఆయన అమ్మను అడగందే ఏ పనీ చేయరు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. మొన్న బెంగళూరు కోర్టు జయకు శిక్ష విధించిన తరువాత ఆమె కూర్చునే కుర్చీని ప్రత్యేకంగా చెన్నయ్ నుంచి బెంగళూరుకు తీసుకుపోయారంటే ఈ నాయకుల వీరభక్తి ఎటువంటిదో అర్థమవుతుంది. ఆ కుర్చీని జైలు అధికారులు అనుమతించలేదనుకోండి. అది వేరే విషయం.
ఇష్టం లేకుండానే ఇంత పెద్ద లీడరైంది
జయలలిత జీవితంలో విచిత్రమేమిటంటే ఆమె తనకు ఇష్టం లేకుండానే సినీ రంగంలోకి ప్రవేశించి టాప్ హీరోయినైపోయారు. అలాగే తనకు ఇష్టం లేకుండానే రాజకీయ రంగంలోకి ప్రవేశించి తిరుగులేని నాయకురాలైపోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో తనకు ఇష్టం లేకపోయినా పదిహేనేళ్ల వయసులో ముఖానికి రంగేసుకొని సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత చరిత్ర తెలిసిందే. రాజకీయాల్లోకి రావడం కూడా ఆమెకు ఇష్టం లేదు. కాని ఎంజి రామచంద్రన్ ఒత్తిడి చేయడంతో అన్నాడిఎంకె ప్రచార కార్యదర్శిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత చరిత్ర సృష్టించడమే కాకుండా తానే చరిత్రగా మారిపోయారు. మళ్లీ ఆమెకు గత వైభవం వస్తుందా? తన రాచరిక పాలన కొనసాగించగలరా? ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.
-ఎం.నాగేందర్