ఎన్టీఆర్ ను ఎందుకు వదిలేసారు?

నాగ్ తో ఎన్టీఆర్ సినిమా అని తెగ వార్తలు వినవచ్చాయి. వీటిని నాగ్ ధృవీకరించాడు కూడా. ఎన్టీఆర్ తో తాను చేస్తున్నానని, మంచి కథ అని చెప్పాడు. కానీ రభస తరువాత వున్నట్లుండి సీన్…

నాగ్ తో ఎన్టీఆర్ సినిమా అని తెగ వార్తలు వినవచ్చాయి. వీటిని నాగ్ ధృవీకరించాడు కూడా. ఎన్టీఆర్ తో తాను చేస్తున్నానని, మంచి కథ అని చెప్పాడు. కానీ రభస తరువాత వున్నట్లుండి సీన్ మారిపోయింది. ఎన్టీఆర్ సీన్ లోంచి తప్పుకుని కార్తీ వచ్చారు. దీనికి నిర్మాత ఎవరు అన్నది మొదట్నించీ సీన్ లో ఎవరి పేరు వినిపించలేదు. కానీ వున్నట్లుండి ఈ ప్రాజెక్టు పీవీపీ చేతిలోకి వచ్చింది. పీవీపీ చేతిలోకి వచ్చాక, కాస్ట్ పెరిగిపోతుంది అని చెప్పి ఎన్టీఆర్ ను పక్కన పెట్టినట్లు వార్తలు వినిపించాయి. కానీ పివిపి లాంటి సంస్థ ప్రెస్టీజియస్ సినిమా చూస్తుంది కానీ కాస్ట్ చూడదు. 

పైగా నాగ్ ఇప్పుడు నాలుగైదు కోట్ల రేంజ్ లోనే వున్నాడు. ఎన్టీఆర్ కూడా తన రెమ్యూనిరేషన్ తగ్గించుకున్నాడని వార్తలు వచ్చాయి. మహా అయితే ఆరేడు కోట్లలో వుండి వుంటాడు. పివిపి లాంటి బ్యానర్, మంచి కథ అయితే అతగాడు కూడా పారితోషికం గురించి ఎందుకు పట్టుపడతాడు? కథ సమస్య లేదు..పారితోషికం సమస్య లేదు..మరి ఇంకేమిటి అనుకోవాలి? పివిపి సంస్థకు తమిళనాట కూడా సినిమా వ్యవహారాలున్నాయి. రెండు భాషలయితే బాగా వర్కవుట్ అవుతుందని కార్తీని తెచ్చి వుండాలి. లేదా గతంలో పివిపి రాజకీయంగా, వ్యాపార పరంగా జగన్ తో వున్నా, ఇప్పుడు తెలుగుదేశంతోనే వున్నట్లు తెలుస్తోంది. పవన్ తో సినిమా బంధాలు, రాజకీయ బంధాలు వుండనే వున్నాయి. కానీ అవేవీ ఇప్పుడు తెరపై కనిపించడం లేదు. తెలుగుదేశం బంధాలు వున్నా లేకున్నా, అయిదేళ్ల పాటు అవసరాలు మాత్రం వుంటాయి. అందువల్ల ఇలాంటి నేపథ్యంలో 'దేశా'నికి పొసగని ఎన్టీఆర్ తో సినిమా అన్నది పివిపికి అంత అనుకూలమైన అంశం కాకపోవచ్చు. అందుకోసమే ఎన్టీఆర్ ను డ్రాప్ చేసి, తెరపైకి కార్తీని తీసుకుని వచ్చి వుండొచ్చు.

కానీ మరోపక్క నాగ్ స్వయంగా ఎన్టీఆర్ వద్దు అని చెప్పినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ టైమ్ ఇప్పుడు అంతగా బాగా లేనందున, మరొకర్ని చూస్తే బెటరేమో అని సలహా ఇచ్చాడని వార్తలు వినవస్తున్నాయి.

ఇదిలా వుంటే పివిపి యూనిట్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అని, ఆ సినిమా కూడా వుంటుందని అనడం కొసమెరుపు. మీడియా ఊహాగానాలే తప్ప, ఆ సినిమా వేరు, దానికి వంశీపైడిపల్లి కాదు అంటూ చెబుతున్నారు. మొత్తానికి ఏదో జరిగింది. ఏం జరిగిందన్నది ఎన్టీఆర్ కు పివిపికే తెలిసి వుండాలి.

అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ముచ్చట కూడా వుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ను అంటే నాగార్జున-ఎన్టీఆర్-వంశీపైడిపల్లి ని అనుకున్నది నిర్మాత దిల్ రాజు. కానీ మరి ఎందుకో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు అదే కాంబినేషన్ వుంటే దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించాలి. అదే మొత్తం కాంబినేషన్ మార్చేస్తే, దిల్ రాజు సీన్ లో వుండరు. అందుకు కూడా ఇలా జరిగి వుండొచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.