జీఓఎమ్ (తెలుగులో మంత్రుల ముఠా అంటే సబబుగా వుంటుంది) ఎదుట పార్టీలు తమ వాదనలు వినిపించాయి. ఇన్నాళ్లూ కాంగ్రెసు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లు ప్రవర్తించింది. అఖిలపక్షం అనడం, అందర్నీ పిలవడం, తన మనసులో వున్నది చెప్పకపోవడం, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు చూదాం అనడం, అంతా వినేసి 'వెళ్లిరా' అనడం తప్ప 'అభివృద్ధి గణాంకాలు ఒకటి చెప్తూ వుంటే నువ్వు యింకోటి చెప్తున్నావేమిటి?' 'నువ్వు చెప్తున్నది చేస్తావన్న నమ్మకం ఏమిటి?', 'నీ సూచన ఆచరణయోగ్యం కాదు కదా', 'నీతో పాటు వచ్చిన నీ పార్టీ సహచరుడే నీతో విభేదిస్తున్నాడేం?' – వంటి ప్రశ్నలు కూడా ఎప్పుడూ వేయలేదు. అసలు ఎదుటివాళ్లు చెప్తున్నది విన్నారో లేదో కూడా తెలియదు. ఈ ఆట ఏళ్లపాటు సాగించారు.
అఖిలపక్షమా, వికలపక్షమా?
ఇప్పుడు 'అఖిలపక్షం' పేర వికలపక్షం నిర్వహిస్తున్నారు. విడివిడిగా పిలిచి మా చెవిలో చెప్పి పొండి అంటున్నారు. అందర్నీ ఒక చోట కూర్చోపెట్టి 'ఇదిగో సీమాంధ్రుల భయాలు యిలా వున్నాయి, ఆ భయాన్ని పోగొట్టే సాకు చెప్పి మీ రాష్ట్రాన్ని మేం స్వాధీనం చేసుకోబోతున్నాం. అలా జరగకూడదంటే మీరు ఫలానా ఫలానా హామీలు యివ్వాలి. ఇస్తారా?' – యిలాటి ప్రశ్నలు వేసి చర్చించ లేదు. సమావేశం జరిగాక దానికి కొనసాగింపుగా తదుపరి చర్యలు యిలా చేపట్టాం అని చెప్పలేదు. ఏం చేస్తున్నారు అని అడిగితే 'ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నాం. అందర్నీ పిలిచి మాట్లాడుతున్నాం' అని ఏళ్లూ, పూళ్లూ గడిపేశారు. మాటలాడడం అంటే యిద్దరూ తమతమ అభిప్రాయాలు కలబోసుకుంటేనే మాట్లాడడం అంటారు. వీళ్లు నోరు విప్పింది ఎప్పుడు? 'నీ సొద నువ్వు చెప్పుకో, నాకు తోచింది నేను చేస్తా' అన్నట్టే ప్రవర్తించారు.
ఇప్పుడూ అదే పద్ధతి అవలంబించారు. కానీ యీసారి కొన్ని పార్టీలు ఎదురు ప్రశ్నించాయి. ఏవిటీ రహస్య సమావేశాలు? అని నారాయణ అడిగారు. హైదరాబాదును యుటీ చేయాలని మీరేదో నివేదిక యిచ్చేశారటగా అని అసదుద్దీన్ ఆంటోనీని డైరక్టుగా అడిగారు. ఇక బిజెపి వాళ్లయితే కడిగి పారేశారు. 'ముందు హైదరాబాదు ఆదాయం ఎంతో చెపితే దాన్ని ఎలా పంచాలో తర్వాత చెప్తాం' అన్నారు. 'మేమూ ఆ అంకెల గురించే వెతుకుతున్నాం. దొరగ్గానే చెప్తాం' అంది మంత్రుల ముఠా. 'దొరికిన తర్వాతే మీటింగు పెట్టలేకపోయారా? అవి దొరికించుకుని మీరు చదువుకుని ఒక అభిప్రాయం ఏర్పరచుకుని అప్పుడు మమ్మల్ని పిలిస్తే మేం మా అభిప్రాయం చెప్తాం' అని వాయించి వచ్చారు. వీళ్లు యిలాగే అన్నారో లేదో మనకు నిర్ధారణగా తెలియదు. ఎందుకంటే 'మేం యిలా చెప్పాం' అని వీళ్లు బయటకు వచ్చి చెప్పుకోవడమే తప్ప ముఠా సభ్యులు పెదవి విప్పటం లేదు.
సమాచారం లేదు కానీ తీర్పు రెడీగా వుంది..
వెళ్లినవాళ్లు సమాచారం కోసం యిలా అడగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ 'మా దగ్గర గణాంకాలు ఏమీ లేవు, యింకా సేకరిస్తున్నాం' అని ముఠావారు నిర్లజ్జగా చెప్పడమే వింతగా వుంది. ఓ పక్క తెలంగాణ బిల్లు వచ్చేస్తోంది.. చేస్తోంది..స్తోంది.. ది.. అంటూ ఊదరగొట్టేస్తున్నారు. 20 న ఫైనల్ నివేదిక, నెలాఖరుకి అసెంబ్లీకి రాక, పదిరోజుల్లో పోక, డిసెంబరు 5 న పార్లమెంటులో పెట్టుట, 9 న సోనియమ్మ జన్మదినాన తెలుగువారిని చీల్చుట… అంటూ టైమ్‌టేబుల్ చెప్పేస్తున్నారు. మరి ఇవాళ్టి దాకా సమాచారం కూడా లేకుండా వుంటే యింతటి బృహత్కార్యం ఎలా నిర్వహిస్తారు? ముఠావారు అబద్ధం చెప్పారని అనలేము. వాళ్ల దగ్గర నిజంగా ఏమీ లేదేమో! ఒకవేళ వుందేమో ఫైళ్లు వెతికే ఓపిక లేదేమో! వాళ్లు కూర్చునేదే రెండు, మూడు గంటలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ గతి ఎలా అఘోరిస్తుందో ఎవరి అంచనాలు వాళ్లు చెప్పుకుని ముచ్చట్లాడడానికి ఓ అరగంట, ముప్పావుగంట పోయాక విభజన ఫైలు తెరవగానే నదీజలాలు, ప్రాంతాలవారీ ఆదాయవ్యయపట్టికలు కనబడగానే కళ్లు తిరుగుతాయి. వీళ్లెవరూ ఆ యా శాస్త్రాల్లో నిపుణులు కారు. రాజకీయాల్లో ఓ గాడ్‌ఫాదర్ వుంటే ఆయన్ని ఆశ్రయించి పైకి వచ్చినవాళ్లు. ఇంత సాంకేతికపరమైన అంశాలు బోరు కొడతాయి.
పోనీ సొంతరాష్ట్రం అయితే ఆదిలాబాదు ఎక్కడుందో, ఆమదాలవలస ఎక్కడుందో తెలుస్తుంది. అసలు రెండోదాని స్పెల్లింగ్ చదివేటప్పటికే మతి పోతుంది. ఒకసారి ఓ తెలుగేతరుడు నాకు దాని ఇంగ్లీషు స్పెల్లింగు చూపించి 'దీనిలో ఏడు 'ఏ'లు వున్నాయి. ఏది దీర్ఘంగా పలకాలి? ఏది హ్రస్వంగా పలకాలి?' అని అడిగాడు. నిజమేకదా పాపం అనుకున్నాను. ముఠా మొత్తంలో ఒక్క తెలుగువాడు లేకుండా చేసింది మహాతల్లి. 50 పేజీల మేటర్ యిచ్చి అరగంటలో టైపు చేసి యిమ్మన్న బాస్‌ని టైపిస్టు ఎంత తిట్టుకుంటాడో, యీ ముఠా సభ్యులు కూడా సోనియాను తిట్టుకుంటూ కాస్సేపు కాగితాలు తిరగేసి వచ్చేస్తున్నారు. ఆ కాగితాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన అంకెలు యిచ్చారు. ప్రభుత్వం పంపినదే ఫైనల్ అనుకుందామంటే 'ఇవి సమైక్యవాది కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం పంపిన అంకెలు, నమ్మకూడదేమో' అని సందేహం. పోనీ రెండేళ్ల క్రితం శ్రీకృష్ణ కమిటీ ఎంతో శ్రమ కోర్చి సేకరించిన అంకెలు చూస్తే ఓ ఐడియా వస్తుంది కదా అనుకుంటే నామోషీ. హోం శాఖ చెత్తబుట్టలో పడేయడానికి ఉద్దేశించిన ఆ నివేదికను, 500 పై చిలుకు పార్లమెంటు సభ్యుల్లో ఎవరూ చదవబోని ఆ నివేదికను, మనం మాత్రం చదవడం ఏమిటి షేమ్ షేమ్ అనుకుంటున్నారు. అందువలన ఎవరేమడిగినా ముఠావాళ్లు 'తెలియదు' అంటున్నారు. ప్రపంచంలో అంతకంటె సులభమైన సమాధానం లేదు. 'తెలుసు' అంటే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. తెలియదు అంటే యింకేం అడగ్గలరు?
లీక్స్ అండ్ ఎక్స్‌క్లూజివ్స్..
ఇలా తెలియనివాళ్లందరూ కలిసి తెలుగువాళ్ల దుంప తెంపడానికి సమకట్టారేమిట్రా బాబూ అని మనం వర్రీ అవుతూంటే తెలుగు మీడియా వారు 'ఎక్స్‌క్లూజివ్'లు గుప్పిస్తున్నారు. హోం శాఖ తయారుచేసిన నివేదిక రహస్యంగా సంపాదించార, ఆంటోనీ నివేదిక దొంగతనంగా సంపాదించాం, రాష్ట్రపరిస్థితిపై గవర్నరు చెప్పినదాన్ని ఆచూకీ తీశాం, విభజనానంతర సమస్యలపై డిజిపి తంత్రాన్ని కూపీ లాగాం, సమైక్యవాదిగా కనబడుతున్న ముఖ్యమంత్రి చాటుగా విభజనకై ఎలా ప్రయత్నిస్తున్నాడో మేం పట్టేశాం, విభజనవాదిగా కనబడుతున్న కెసియార్ ఎన్నికలదాకా విభజన జరక్కుండా ఎలా చూస్తున్నాడో గుట్టు రట్టు చేస్తున్నాం, మా పత్రికకు మాత్రమే యిలా సమాచారచోరకళ వుంది, తక్కినవాళ్లు మా ముందు బలాదూర్ అంటూ ప్రతీ పత్రికా కథనాలు యిచ్చేసి హెడ్‌లైన్స్ పెట్టేస్తోంది. వీటిల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు కానీ ఏ నివేదిక చూసినా తెలంగాణవాదులకు ఆనందం చేకూర్చేది అంశం కనబడటం లేదు. అన్నిట్లోనూ హైదరాబాదుపై మడత పేచీలే.
తెరాసను మక్కికి మక్కి కాపీ కొడుతున్న టి-కాంగ్రెసు
సమైక్యం అంటూనే విభజన జరిగితే యిలా వుండాలి అని గట్టిగా మాట్లాడుతున్న మజ్లిస్ హైదరాబాదును యుటీగా గాని, కేంద్రం అజమాయిషీలో శాంతిభద్రతలుగానీ, ఉమ్మడి రాజధానిగా గానీ ఒప్పుకోవటమే లేదు. ఆంధ్రకు వర్కింగ్ కాపిటల్‌గా కొన్నాళ్లు వుంటే చాలంటోంది. తెలంగాణావాదుల్లో తీవ్రంగా వున్న తెరాస వారు హైదరాబాదును యుటీ చేస్తే వూరుకోమంటూ ఉమ్మడి రాజధానికి ఓకే కానీ అది కూడా ఐదేళ్లు చాలు అంటున్నారు. ఇక కేంద్ర అజమాయిషీ జాన్తానై, 28 రాష్ట్రాలు అనుభవిస్తున్న హక్కులన్నీ తెలంగాణకు వుండాల్సిందే అంటున్నారు. అ హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు అని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ తీర్మానం చెప్పినా తెలంగాణ కాంగ్రెసువాదులు ఐదేళ్లకు కుదించాలి అంటున్నారు. దామోదర రాజనరసింహ అఖిలపక్షంలో అలాగే చెప్పి వచ్చారు. (అసలు యిది కూడా కాస్త దిగి వచ్చినట్లే, మంత్రుల ముఠాకు టి-కాంగ్రెస్ తరఫున యిచ్చిన నివేదికలో దామోదర తాత్కాలిక రాజధాని మాత్రమే అన్నారు. ఎందుకంటే అప్పుడు తెరాస అలా అంది, యిప్పుడు తెరాస ఐదేళ్ల ఉమ్మడికి సై అంటే వీళ్లూ సైసై అంటున్నారు)
శాంతిభద్రతలు, భూమిపై హక్కులు కూడా వదులుకోమని, హైదరాబాదుపై ఆంక్షలు వుండడానికి వీల్లేదన్న విషయంలో కూడా తెరాస పాటే పాడుతున్నారు. (టి-కాంగ్రెసు యిప్పుడు పూర్తిగా తెరాస బాటే పట్టింది. జాగోభాగో అన్నారటేమిటి అని ముఠావారు కెసియార్‌ను ప్రశ్నించారు కానీ, అదే భాష ఉపయోగించిన టి-కాంగ్రెసు లీడర్లు కొంతమంది గురించి దామోదరను అడగలేదెందుకో) 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫస్ట్‌క్లాసైన తీర్మానం చేసింది. దాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ద్రోహులు, సోనియా మాట మాకు శిరోధార్యం, ఆవిడకు గుడి కట్టిస్తాం' అంటూనే ఆ తీర్మానానికి ఎదురు తిరుగుతున్నారు వీళ్లు. ఎందుకంటే తీర్మానాన్ని మొత్తంగా అంగీకరిస్తే తెలంగాణ ద్రోహులుగా తెరాస చేత ముద్ర వేయించుకోవాల్సి వస్తుందన్న భయం వీరిది. అందువలన తెరాసను మించిన తీవ్రతెలంగాణ వాదన వినిపిస్తున్నారు. అయితే హోం శాఖ తయారు చేసి ముఠాకు సమర్పించిన 400 పేజీల నివేదిక అంటూ బయటకు వచ్చిన దానిలో పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అనీ, పోలీసు, భూ ఆదాయం, మునిసిపల్, ఉన్నత విద్య బాధ్యతలన్నీ కేంద్రానికే అని వుంది.
ఆంటోనీ తన నివేదికను ఎక్కడ దాచారు?
వీళ్లందరూ హైదరాబాదు అంటే ఎంసిఎచ్ పరిధి వరకే అని గట్టిగా వాదిస్తున్నారు. ఆంటోనీ నివేదిక అంటూ బయటకు వచ్చినదానిలో జిఎచ్‌ఎంసి వరకు ఉమ్మడి రాజధాని అంటూ వుంది. ఈ ఆంటోనీ నివేదిక ఏమిటో బ్రహ్మపదార్థంలా తయారైంది. దిగ్విజయ్ సింగ్‌ను అడిగితే ఆంటోనీగారు నివేదిక యిచ్చారు, కాంగ్రెసు పార్టీ అధ్యకక్షురాలు కాబట్టి సోనియా చేతిలో పెట్టారు. ఆవిడ చదివి అవసరమనుకుంటే ముఠాకు యిస్తుంది, లేకపోతే లేదు అని చెప్పారు. అసదుద్దీన్ నేరుగా అడిగితే ఆంటోనీగారు నేను నా నివేదిక ఎవరికీ యివ్వలేదే అన్నారట. జులై 30 ప్రకటన తర్వాత సీమాంధ్రులో ఆందోళన వస్తే 'ఇంకేముంది, ఆంటోనీ కమిటీ వేశాం, అది అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్‌లా పని చేస్తుంది, గోల చేయకుండా మీ గోడు ఆయనకు వినిపించండి' అన్నారు ఢిల్లీ నాయకులు. కాంగ్రెస్ వాళ్లే కాదు, ఎవరైనా వెళ్లి చెప్పుకోవచ్చు అన్నారు. ఎన్‌జిఓలు వెళ్లనంటే వాళ్లను చివాట్లు వేశారు. ఆయన మన రాష్ట్రానికి వచ్చి స్వయంగా గోడు వింటారన్నారు. కొన్నాళ్లు పోయాక 'రారు కానీ దివ్యదృష్టితో అన్నీ గ్రహిస్తారు, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ కమిటీ నివేదికలోనే వుంది' అన్నారు. చివరకు చూస్తే ఆంటోనీ గారు నివేదిక ఎవరికీ యివ్వలేదట. అసలు తయారుచేశారా, హాస్పటల్‌లో పరుపు కింద పెట్టి మర్చిపోయారా? లేక మడిచి రాకెట్‌లా ఆసుపత్రి కిటికీలోంచి బయటకు విసిరేశారా? ఈ విభజన యిస్యూ కాదు కానీ యావన్మంది తెలుగువాళ్లం ఢిల్లీకి లోకువై పోయాం. సొంత రాష్ట్రంలో ఉప్పూ, పత్రీ పుట్టని నేతాశ్రీలు కూడా మనల్ని ఆడుకుంటున్నారు. ఆంటోనీ పెద్దమనిషి అనుకుంటే ఆయనా యిలాగే తయారయ్యాడు.
హోం శాఖ నివేదిక చూస్తే విద్యార్థులు, ఉద్యోగులు మొత్తుకుంటారు
ఆంటోనీ జిఎచ్‌ఎంసి వరకు హైదరాబాదు అంటేనే టి-వాదులు మండిపడుతూంటే దరిమిలా కేంద్ర హోం శాఖకు రాష్ట్రప్రభుత్వ అధికారిక నివేదిక బయటకు వచ్చింది. వాళ్లు ఏకంగా ఎచ్‌ఎండియే దాకా వెళ్లిపోయారు. ఎచ్‌ఎండియే కనుక పదేళ్ల ఉమ్మడి రాజధానిగా కేంద్రం చేతిలోకి వెళ్లిపోయిందంటే తెలంగాణ ఉద్యమం పూర్తిగా విఫలం కావడమే కాదు, కౌంటర్-ప్రొడక్టివ్ అయినట్టే లెక్కేసుకోవాలి. ఇంకో విషయం కూడా మనం గమనించాలి. అసలు ఉద్యమంలో పెద్ద పాత్ర వహించినది – విద్యార్థులు, ఉద్యోగులు. ఓపెన్ క్యాటగిరీలో గెలుస్తున్న సీమాంధ్రులు రాష్ట్రం విడిచి వెళ్లిపోతే ఆ అవకాశాలు మనకే వచ్చి ఉద్యోగాలు, ప్రమోషన్లు వస్తాయన్న ఆశతో, ఉత్సాహంతో వున్నారు. హోం శాఖ ముఠాకు యిచ్చిన నివేదిక ౖప్రకారం చూస్తే ఉమ్మడిగా వుండే పదేళ్లలో తెలంగాణలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సమయంలో మొత్తం ఆంధ్రులను కూడా స్థానికులు (ఇన్‌సైడర్స్)గా చూడాలని వుంది. తెలంగాణలోని వైద్యసదుపాయాలన్నీ ఆంధ్రులకు అందుబాటులో వుండాలి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే – ఇక్కడ నుండి వెళ్లిపోమని ఎవర్నీ ఒత్తిడి చేయరాదు. పని చేసే వాళ్లే కాదు, పెన్షనర్లు కూడా. ఇక్కడ వుందామనుకుంటే ఇక్కడే స్థిరపడి యీ రాష్ట్రం నుండే పెన్షన్ తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో కూడా ఆంధ్రులపై వివక్షత చూపరాదు. ఉద్యోగభద్రత కల్పించాలి. డాక్టర్లు, యాక్టర్లు యిత్యాది ప్రొఫెషనల్స్‌పై ఎలాటి ఒత్తిడీ కలగకుండా వారిని కొనసాగేందుకు రక్షణలు కల్పించాలి. ఆంధ్ర పోలీసులను కూడా యిక్కడ నుండి పంపేయడానికి వీల్లేదు… యిలా సాగింది ఆ నివేదిక!
ఇది చదివితే ప్రత్యేక తెలంగాణ కోరేవారి రక్తం కుతకుత ఉడకదా? ఇంత పోరాడి చివరకు సాధించినది ఏమైనా కనబడుతోందా? ఇదంతా పదేళ్లే వుంటుందో, ఆ పై యింకా కొనసాగుతుందో ఎవరు చూడవచ్చారు? అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. కేంద్రంలో ఆంధ్రులపై ఆధారపడే ప్రభుత్వం ఏర్పడితే తమ విశేషాధికారాలను ఉపయోగించి, గడువు పొడిగించవచ్చు. ఇక రాష్ట్రప్రభుత్వం పంపిన నివేదికలో కూడా శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు కేంద్రం చేతిలో అనీ, సీమాంధ్ర ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు రక్షణ కల్పించాలనీ, అంటూ రెండేళ్లలో రిటైరయ్యేవారిని మాత్రం హైదరాబాదులో వుంచాలని సూచించింది. స్థానికత నిర్వచించడానికి ప్రాతిపదిక ఏమిటో మీరే చెప్పాలంది. ఈ నివేదిక కిరణ్ రాయించారంటూ టి-వాదులు మండిపడుతున్నారు. ఇదంతా ఎడ్మినిస్ట్రేటివ్ ఛానెల్స్ ద్వారానే సాగుతుంది. కేంద్ర హోం శాఖే చెప్పి యిలా సిఫార్సు చేయండి అని చెప్పి వుండవచ్చు. ముఖ్యమంత్రి ప్రమేయం వుండనక్కరలేదు. ఓ పక్క సమైక్యం అంటూ విభజన యీ తీరుగా చేయండి అని ఆయన ఎలా చెప్తాడు? ఆయనను పక్కన బెట్టి, బ్యూరాక్రసీ ద్వారా కేంద్రం పనులు చేయిస్తూండవచ్చు.
అదిగో భద్రాద్రి, …యిదిగో తన్నుకోండి
విభజన జరిగితే హైదరాబాదు వివాదాస్పద అంశం అవుతుందని మొదటినుండీ అనుకుంటూన్నదే. కానీ భద్రాచలం కూడా వివాదం అయింది యిప్పుడు. ఒకప్పుడు కెసియార్ భద్రాచలాన్ని కేర్ చేయలేదు. ఆ చేత్తో హైదరాబాదు యివ్వండి, యీ చేత్తో భద్రాచలం తీసుకోండి అని ఆఫర్ యిచ్చారు. దాన్ని ఏ తెలంగాణవాదీ ఖండించలేదు. ఇప్పుడు అందరూ హఠాత్తుగా రామభక్తులై పోయారు. అమ్మో రాములోర్ని వదులుకుంటే ఎలా అంటున్నారు. తలంబ్రాల సంప్రదాయం గుర్తు చేస్తున్నారు. ఆ మాటకొస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ నిజాం కింద వుండేది. భద్రాచలం మాత్రమే ఎందుకు, మొత్తం రాష్ట్రాన్నే తెలంగాణగా పరిగణించవచ్చు! జయపాల్ రెడ్డిగారు ఆంధ్రలో చాలామంది దేవుళ్లున్నారు, తెలంగాణకు ఉన్నది ఒక్కడే దేవుడు, భద్రాద్రి రాముడు మేం వదులుకోం అన్నారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని, వేములవాడ రాజేశ్వరుణ్ని, ఓరుగల్లు భద్రకాళిని ఎలా మర్చిపోయారో మరి! అలంపురం, బాసర, కాళేశ్వరం – యివన్నీ పుణ్యస్థలాలు కావా వారి దృష్టిలో!? నిజం చెప్పాలంటే తెలంగాణలో శక్తిపూజ, శివారాధన ఎక్కువ. వైష్ణవ దేవాలయాల గురించి చెప్పాలంటే – తెలుగునాట మొత్తం చూసుకుంటే విష్ణువు అవతారాలలో నరసింహస్వామిని ఎక్కువగా పూజించాం. ప్రతీ రెండు జిల్లాలకు ప్రముఖమైన నారసింహక్షేత్రం కనబడుతుంది. ఆ తర్వాత చెప్పుకోవలసినది వేణుగోపాలస్వామి రూపంలో. రాముడి అవతారంలో గుళ్లు భద్రాచలం గుడి తర్వాతే చిన్న స్థాయిలో వచ్చాయి. అందువలన భద్రాద్రి రాముడే తెలంగాణ భక్తికి ప్రతీక అనడం పొసగదు.
ఈనాటి యీ రామభక్తికి కారణం వేరే వుంది. ఆంధ్రలో కట్టబోతున్న పోలవరం ప్రాజెక్టు నిరాటంకంగా సాగాలంటే నిర్వాసితుల సమస్య తీర్చాలి. ఇతర రాష్ట్రాల జోక్యం వుంటే పని సాగదు. ఇప్పటికే ఒడిశా నానా చిక్కులూ పెడుతోంది. ప్రజాభిప్రాయం తీసుకోవాలని కేంద్రం చెప్తోంది. ఆ పని ఒడిశా చేయదు, మన అధికారులు వెళ్లి తీసుకోతే అడ్డుపడుతోంది. పోలవరం కట్టనివ్వకూడదని పట్టుదలతో వున్న తెలంగాణ రేపు మరిన్ని చిక్కులు పెడుతుంది. అందువలన పోలవరం కట్టాలంటే భద్రాచలం ఆంధ్రలో వుండాల్సిందే. ఈ విషయం గ్రహింపుకు వచ్చినకొద్దీ భద్రాచలంపై వివాదం ముదిరింది. భద్రాచలం చేతిలో వుంటే పోలవరం ఆపినట్టే అని తెలంగాణవాదుల అంచనా. పోలవరం ఆగకుండా వుండాలంటే భద్రాచలం చేతిలో వుండాలని ఆంధ్ర ఆరాటం. ఇక రాష్ట్రప్రభుత్వ నివేదిక చూస్తే భద్రాచలం, మునగాల వగైరాలు ఆంధ్రకు యిచ్చేయాలని సూచించింది.
కేంద్రం వద్ద సమస్యలే వున్నాయి, పరిష్కారాలు లేవు
ఇలా తెలంగాణ తేనెతుట్ట కదిపిన కొద్దీ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రతీదీ వివాదమే. విభజనకై సూచిస్తున్న మార్గాలేవీ విభజనవాదులకు ఆమోదయోగ్యంగా లేవు. వాళ్లు ప్రతీ అడుగుకీ అడ్డుపడేట్లు వున్నారు. ఇక కేంద్రం వద్ద కూడా సమస్యలే తప్ప పరిష్కారాలు లేవు. సమైక్యవాదులు సమైక్యం సమైక్యం అంటూ వచ్చినంతకాలం అది ఉన్మాదం అంటూ కొట్టి పారేశారు. వారిలో కొందరు విడిగా వచ్చి పోనీ విభజన చేయండి, కానీ వాటిలో ఫలానాఫలానా సమస్యలున్నాయి వాటిపై మీరేం ఆలోచించారు అని అడిగితే ఇంకా ఏం ఆలోచించలేదు, మీకేమైనా ఆలోచనలుంటే చెప్పండి అంటున్నారు. చెప్తాం కానీ సమాచారం యివ్వండి, దానిపైనే మా ఆలోచన ఆధారపడుతుంది అంటే సమాచారమూ లేదు అంటున్నారు. వివేకం వున్నవాళ్లయితే పరిష్కారాలు వెతకలేక 'సరే వున్నదేదో యిలాగే వుండనీయండి, తర్వాత చూసుకుందాం' అనాలి. కానీ సోనియా తెలంగాణ యిచ్చి తీరాలని ఒంటికాలి మీద నిల్చున్నారు. అందువలన కేంద్రం చేయబోయేదేమిటంటే – కాంగ్రెస్ పార్టీ తీర్మానం లాగానే ఏదీ తేల్చకుండా మూడు ముక్కలతో బిల్లు తయారుచేస్తుంది. తక్కిన విషయాలన్నీ కేంద్రం, అనగా రాబోయే ప్రభుత్వం చూసుకుంటుంది అనేస్తారు. సీమాంధ్ర ప్యాకేజి గురించి కూడా బిల్లులో వుండదట. అది వేరేగా డీల్ చేస్తాం అంటారట.
తెలుగు ప్రజలు సమైక్యవాదులు, విభజనవాదులుగా ఎలాగూ చీలిపోయారు. సీమాంధ్రుల్లో విభజనకు మానసికంగా సిద్ధపడిన నాయకులు సైతం కేంద్రం అవలంబిస్తున్న అస్పష్ట, అవకతవకవిధానాల వలన భయపడుతున్నారు. ఎందుకంటే యీ నివేదికలన్నీ లీకులే తప్ప అధికారికంగా ఏదీ కన్‌ఫమ్ కాలేదు కదా. 'వీటిలో ఏదీ తెలంగాణ బిల్లులో వుండదు కదా. అమలు చేయడానికి మీ ప్రభుత్వం ఎలాగూ వుండదు. కనీసం మాట యివ్వడానికైనా సిద్ధపడకపోతే ఎలా? ప్రజలను ఎలా కన్విన్స్ చేయగలం? తెలంగాణ విడిపోయాక అప్పుడు ప్యాకేజీకి, హైదరాబాదులో రక్షణ వంటి విషయాలకు గండి కొడితే మేం బంగాళాఖాతంలో వురకాలి. లేకపోతే మా ప్రజలే మమ్మల్ని తోస్తారు, అదేదో ముందు తేల్చండి' అని వారు పట్టుబడతారు. తర్వాత చూస్తానంటున్నారుగా, ఏమిటీ సొద అని తెలంగాణవాదులు వారిపై కోపగించుకుంటారు. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటారు. తెలుగువాళ్ల మధ్య యీ గొడవలు యిలాగ కొనసాగుతూనే వుంటాయి. రావణకాష్టం రగులుతూనే వుంటుంది. ఈ విభజన సందర్భంగా అనేక పాత విషయాలు బయటకు వచ్చాయి. బళ్లారి పోగొట్టుకున్నామని, కృష్ణగిరి, గంజాం, కోరాపుట్ తెలుగువాళ్లు మనకు దూరమయ్యారని చాలామంది వాపోయారు. వాళ్లంతా మనతో కలిసి వుంటే ఏం చేసేవాళ్లమా అని నాకనిపిస్తోంది. కలిసి కొట్టుకోవడానికి ఇంకో నాలుగు గొంతుకలు చేరేవంతే. పోన్లెండి, వాళ్లనైనా వేరే రాష్ట్రంలో వుండి ప్రశాంతంగా వుండనీయండి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2013)