ముంబాయి వాంఖడే మైదానంలో ప్రస్తుతం జరుగుతున్నది చారిత్రాత్మకమైన క్రికెట్ టెస్ట్‌మ్యాచ్…! ఎంతగా చారిత్రాత్మకమైనది అంటే అధికారిక మ్యాచ్ నిర్వాహకులు కూడా దీనిని వెస్టిండీస్ టూర్‌లో ‘2వ టెస్ట్’గా పరిగణించడం లేదు. ‘ఎస్‌ఆర్‌టి 200’గా పరిగణిస్తున్నారు. సచిన్ రమేశ్ టెండూల్కర్… క్రికెట్ క్రీడకు ప్రాభవం ఉన్నంత కాలమూ.. అభిమానుల రోమాలు గగుర్పొడిచేలా చేయగల పేరు…! ఆయన ఆడుతున్న 200వ టెస్ట్‌మ్యాచ్‌గా ఇది చారిత్రాత్మకమైనది. అసలు మ్యాచ్ ఆరంభం కావడమే.. ‘ఒక మానవుడు ఆడగలుగుతున్న 200వ టెస్ట్‌మ్యాచ్ ఇది’ అనే రవిశాస్త్రి వ్యాఖ్యానంతో ఆరంభం కావడమే ఓ విశేషం.
అయితే.. మ్యాచ్‌కు ముందు సచిన్ అభిమానులు, ఆప్తులు అంతా ఏం ఆశించారు. ఇప్పుడు సచిన్ లాస్ట్ ఇన్నింగ్స్ (దాదాపుగా) పూర్తి అయిన తరువాత… వారేం అనుకుంటున్నారు.. అనే అంశం కూడా ఆసక్తి దాయకమైనదే.
సచిన్‌కు ఈ 200 వ టెస్ట్‌మ్యాచ్ అత్యంత కీలకమైనదే కావొచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో అతను డకౌట్ అయినా పర్లేదని కోరుకున్న ఆప్తులు ఉన్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 199వ మ్యాచ్‌లో కోల్‌కత ఈడెన్‌లో సచిన్ పది పరుగులకు పెవిలియన్ చేరినందుకే అభిమానులు తీవ్రంగా నిరాశ పడిపోతే.. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయినా పర్లేదని, మ్యాచ్‌కు ముందుగా ఆశించిన ఆప్తులు ఎవరా అని అభిమానులకు కోపం రావొచ్చు. కానీ.. ఆమె సచిన్ అత్త. స్వయానా సచిన్ భార్య అంజలికి తల్లి. ఆమె మీడియాతో మాట్లాడుతూ సచిన్ డకౌట్ అయినా పర్లేదు కానీ.. ప్రతి బంతిని ఆస్వాదిస్తూ ఆడితే చాలు అని ఆకాంక్షించారంటే వారిలోని క్రీడాస్ఫూర్తి, సచిన్ కుటుంబమంతా నిండిని క్రికెట్ ప్రేమ మనకు అర్థం అవుతుంది.
అదే జరిగింది. అసలు తన క్రికెట్ కిట్‌ను తన పక్కమీద పెట్టుకుని దాన్ని అంటుకుని పడుకునే అలవాటు ఉన్న ఓ నలభయ్యేళ్ల కుర్రాడు.. తన క్రీడాజీవితపు చివరి టెస్ట్‌మ్యాచ్‌ను ప్రతిబంతిని ఆస్వాదిస్తూనే ఆడాడు. తొలిరోజే ఆయన క్రీజ్‌లోకి వస్తాడని ఎవరూ ఆశించలేదు. ఇండియన్ ఇన్నింగ్స్ మొదలవుతోంది.. సచిన్ రాగల అవకాశం ఉందని తెలియగానే.. ముంబాయి నగరం సగం స్తంభించింది. సెలబ్రిటీలు పలువురు ఎక్కడి పనులు అక్కడ వదిలేసి.. తమ వద్ద ముందే సంపాదించి పెట్టుకుని వీఐపీ పాసుల్ని సర్దుకుంటూ ఎగబడి స్టేడియంకు చేరుకున్నారు. సచిన్ నింపాదిగా ప్రారంభించి.. తను నేర్చుకున్న అన్ని రకాల షాట్లను కొట్టాడు. తన తల్లి, తనకు తొలి క్రికెట్ పాఠాలు నేర్పిన రమాకాంత్ అచ్రేకర్.. ఇలా అందరూ వీల్ చెయిర్లలో వచ్చి తన ప్రదర్శనను తిలకించాలని కోరుకుంటున్న వేళ.. వీడ్కోలు చెప్పదలచుకుంటున్న ఒక ఆటగాడిమీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఎవ్వరైనా ఊహించవచ్చు. ఆ ఒత్తిడి తన మీద కనపడనివ్వకుండా సచిన్ బ్యాట్‌కు పనిచెప్పాడు. రెండోరోజు కూడా చెలరేగి ఆడాడు. టెస్టు జీవితంలో 68వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 74 పరుగుల వరకు చేరుకున్నాడు.
అయితే అప్పటిదాకా ఆడిన ప్రతి బంతిని ఆస్వాదిస్తూనే సచిన్ ఆడాడు. క్రికెట్ టెక్ట్స్‌బుక్‌లోని అన్ని షాట్‌లను కొట్టడం మాత్రమే కాదు.. తనకంటూ స్పెషలైజ్ చేసిన షాట్లను కూడా చివరి మ్యాచ్‌లోనూ ప్రజలకు రుచిచూపించాడు. అందుకే సచిన్ ప్రతి బంతిని ఆస్వాదిస్తూ ఆడాడు. ఆయన ఆటను అభిమానులంతా తెగ ఆనందించారు. యావత్తు క్రీడాప్రపంచం స్టాండిరగ్ ఓవేషన్ నడుమ.. సచిన్ తన ప్రస్థానం ముగించాడు.
హేట్సాఫ్ సచిన్.