ముందే చెప్పేస్తున్నా – యీ వ్యాసం పూర్తిగా చదివినా మీకు జవాబు దొరకదు. నా బోటి వాడు రాసినది కాదు, మహామహా వాళ్లు రాసినది చదివినా మీకు ఆన్సరు దొరకదు. ఎందుకంటే ఏ మంత్రి ఏం చెప్తాడో, అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా నియంతలా (గట్టిగా మాట్లాడితే టిన్‌పాట్ డిక్టేటర్‌లా) వ్యవహరించిన జయరాం రమేష్ టీవీ ఛానెల్‌లో 'చర్చ జరగాల్సిందే' అనడం జోకా? లేక తప్పుదారి పట్టించే ప్రయత్నమా? బిల్లు మంగళవారం చర్చకు వస్తుంది అని అందరూ అంటూ వుంటే 'సోమవారమే వస్తుంది' అని షిండే ఒక అసందర్భపు వేదిక యైన మహారాష్ట్రలో చెప్పడం దేనికి? చాలాకాలంగా ఆరుగురు మంత్రులు ఆరు రకాలుగా మాట్లాడి ప్రజలను కావాలని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఇలాటి పరిస్థితుల్లో ఏ వ్యాఖ్యనుండి ఏం పిండుతాం? జ్యోతిష్కుడి నెవరినైనా అడుగుదామని చూసినా లాభం లేదు. ఎందుకంటే వాళ్లు – స్థల, కాల, స్వభావాలను లెక్కలోకి తీసుకోవాలని చెప్తారు. ఉదాహరణకి లగ్నంలో శుక్రుడు వుంటే తెల్లగా వుంటాడు అని పుస్తకంలో వుంది కదా అని చెప్పేయకూడదు. ఆ లెక్కన కశ్మీరులో వున్న ప్రతీవాడికీ లగ్నంలో శుక్రుడుండాలి. ఉండడుగా! ఆ సిద్ధాంతం మనలాటి వాళ్ల విషయంలో వర్తిస్తుందంతే. ఇప్పుడు పార్లమెంటు నడిపిస్తున్నది మ్లేచ్ఛులు, అప్రాచ్యులు. వారిని మన గ్రహాలు ఏమీ చేయలేవు. ఉపగ్రహాలుగా మారిపోయి చుట్టూ తిరుగుతాయంతే. అందువలన యీ విషయంలో తలపండిన జోస్యులు కూడా తలగోక్కోవలసిందే. పరిస్థితి యింత అనూహ్యంగా వుంది కాబట్టే జూదరులు పందాలమీద పందాలు కాస్తున్నారు.
నిజానికి చర్చ జరిగిందా లేదా అని పందెం వేద్దామనుకునేవారు మొదట బిల్లు ప్రవేశపెట్టబడిందా లేదా అన్నదానిపై పందాలు వేయాలి. ప్రవేశపెడితేనే కదా, చర్చకు వచ్చేది. ప్రవేశించింది అని కాంగ్రెసు అంటే, లేదు అని బిజెపి, యితర ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇదంతా చూస్తూ వుంటే కన్యాశుల్కంలో గిరీశం పూటకూళ్లమ్మ పెళ్లి గురించి చెప్పినది గుర్తుకు వస్తుంది. ఆమె తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక ముసలివగ్గుకి యిచ్చి పెళ్లి నిశ్చయించారు. పుస్తె కట్టబోతుండగానో, కట్టిన మరుక్షణంలోనో ఆ ముసలాడు పెళ్లి పీటల మీదనే చచ్చిపోయాడు. పెళ్లి అయినట్టా కాదా అన్న మీమాంస బయలుదేరింది. పుస్తె కట్టిన తర్వాత పోయాడు కాబట్టి, ఆమె అతనికి భార్య, మీరు మనోవర్తి యివ్వవలసినదే అని పిల్ల తండ్రి పెళ్లికొడుకు వారసులపై దావా తెచ్చాడు. పుస్తె కట్టకుండానే చనిపోయాడు కాబట్టి ఆమె అతని భార్య కాదు, మేము మనోవర్తి యివ్వనక్కరలేదు అని వాళ్లు వాదించారు. పురోహితుడికి లంచం యిచ్చి వాళ్లకు కావలసినట్టు చెప్పించుకున్నారు. దాంతో మనోవర్తి రాలేదు, పెళ్లి ఒకసారి అయిపోయిందని మాట పొక్కి ఎవరూ పెళ్లి చేసుకోలేదు. ఆమె పెద్దదయ్యాక జీవనాధారం కోసం ఒక పూటకూళ్ల యిల్లు (యీనాటి భాషలో 'మెస్') నడుపుతూండేది. తాను వితంతు వివాహం చేసుకుందా మనుకుంటున్నానని, నిన్నే చేసుకుంటానని చెప్పి ఆశ పెట్టి ఆమెను గిరీశం బుట్టలో పెట్టాడు. ఆమె యితని మాటలు నమ్మి, మోసపోయి శారీరక సంబంధం పెట్టుకోవడంతో బాటు తిండి పెడుతూ అవసరాలకు డబ్బు కూడా యిచ్చేది. ఇలా అన్ని విధాలా నష్టపోయింది.
పూటకూళ్లమ్మలాగానే టి-బిల్లు కూడా స-నాథో, అ-నాథో తెలియకుండా పోయింది. ఆ బిల్లు మొదటినుండి తప్పటడుగులు వేసుకుంటూనే వచ్చింది. కాబినెట్ మీటింగుల్లో టేబుల్ ఐటంగా ప్రత్యక్షం కావడం దగ్గర్నుంచి అన్నీ అడ్డదారులే వెతుక్కుంది. రాష్ట్ర ఎసెంబ్లీలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు కలిసి బిల్లు 'పెట్టేశాం పెట్టేశాం' అన్నారు. లేదులేదు అని సీమాంధ్రులు అన్నారు. ఔనుఔను అన్నారు టి-వాదులు. అప్పటికే పెద్ద ఉపన్యాసం తయారుచేసి పెట్టుకున్న కిరణ్ అది చదివే ఛాన్సు పోతుందేమోనని బిల్లు పెట్టినట్టే అని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు పార్లమెంటులో సుష్మగారు ఉపన్యాసం రెడీగా పెట్టుకుని వుండరు. అందుకని నియమాలు, నిబంధనలు అంటూ మాట్లాడుతున్నారు. 'ఎజెండాలో లేదు, మధ్యాహ్నం రెండు గంటలకు యిచ్చిన సప్లిమెంటరీ ఎజెండాలో రెండు గంటలకు ప్రవేశపెడతారని రాశారు. అలాటప్పుడు పన్నెండు గంటలకే బిల్లు ప్రవేశపెట్టామని ఎలా అంటారు?' అని పాయింటు లాగుతున్నారు. చూడబోతే ఆవిడకు కూడా రాజబర్బరీకుడు అండ్ గ్యాంగ్ చేతిలో 'ట్రీట్‌మెంట్' తప్పదనిపిస్తోంది. లోకసభలో రేణుకా చౌదరి వుండి వుంటే ఎంత బాగుండేది, సుష్మ పని పట్టేది కదా అని కమలనాథ్, షిండేలు వగచి వుంటారు. సుష్మతో బాటు యింకో ఎనిమిది ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా స్పీకరు వద్దకు వెళ్లి బిల్లు ప్రవేశంపై అభ్యంతరం తెలిపారు. రేపు స్పీకరు 'చర్చకై బిల్లు స్వీకరించాను' అనగానే 'అసలు బిల్లు ప్రవేశపెట్టందే ఎలా స్వీకరిస్తారు?' అంటూ వీళ్లందరూ ప్రశ్నిస్తారు. పూటకూళ్లమ్మ పెళ్లి విషయంలోలా పెట్టినట్టా కాదా అని చర్చిస్తూ కూర్చుంటే ఓ పూటో, రోజో గడిచిపోతుంది. వెనక్కి తగ్గితే కాంగ్రెసుకు, వారి నిలయవిధ్వంసకులకు అవమానం. 'ఒరేయ్ కెమెరాలు అటు ఆ కుర్ర ఎంపీ వైపు తిప్పండిరా' అని ఓ కేక పెట్టి వీళ్ల బెంచీల పైకి లంఘించవచ్చు.
ఎస్పీ, కమ్యూనిస్టు, తృణమూల్ వంటి పార్టీల నాయకులు దిట్టమైన వాళ్లు. వీధిపోరాటాల్లో ఆరితేరినవారు. సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలైతే వ్యాపారస్తులు, షోకుషోకుగా తిరిగేవాళ్లు. చిరంజీవి వున్నా ఫైట్ ఎంతవరకూ చేయగలరో ఆయనకే తెలియాలి. ''గగనం'' సినిమాలో విమానం ఎక్కిన ఒక సినిమాహీరోకు పక్క సీట్లో ఒక అభిమాని తగులుతాడు. హైజాకింగ్ జరిగినపుడు యీ హీరో ఏదో ఘనకార్యం చేస్తాడని అభిమాని చాలా ఆశ పెట్టుకుని, అదేమీ జరగకపోవడంతో నిరాశ చెంది హీరోని తిట్టిపోస్తాడు. మొన్న సీమాంధ్ర ఎంపీల దంపుడు కార్యక్రమం జరుగుతూండగా ఎంపీల్లో అలాటి అభిమాని ఎవడైనా చిరంజీవిగారికి తగులుకుని 'వెళ్లి రఫ్ఫాడించండి సార్,' అనో 'వాళ్ల బాక్సు బద్దలు కొట్టండి, మెగాస్టార్' అనో ఊదరగొట్టారో లేదో తెలియదు కానీ ఆ రోజుమాత్రం చిరంజీవి 'యాక్షన్ హీరో'గా లేరు. రియాక్షనైనా యిచ్చారో లేదో! సీమాంధ్ర ఎంపీలు చిరంజీవిని, మిరియాల జల్లురీను నమ్ముకునే బదులు ఎస్పీ, లెఫ్ట్, తృణమూల్ ఎంపీలతో టై-అప్ పెట్టుకుంటే మంచిది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇవాళ ఆడ్వాణీ యింటికి వెళ్లి ఏం మాట్లాడారో తెలియదు. మీ ఎంపీల్లో బలిష్టమైనవారిని మాకు ఏర్పాటు చేయండి అన్నారేమో! కేంద్రమంత్రులు ప్రతిపక్ష నాయకుడి యింటికి వెళ్లి బతిమాలుకునే పరిస్థితి తెచ్చిన కాంగ్రెసు అధిష్టానం తీరు ఏమని చెప్పాలి? వీళ్లు వెళ్లి ఏం అడుగుతారు? టి-బిల్లును చర్చకు పెట్టించండి అంటారా? లేక హైదరాబాదును యూటీ చేయడం వంటి మా డిమాండ్లు మా అధిష్టానం పట్టించుకోలేదు కాబట్టి మీరైనా పట్టించుకోండి అని బతిమాలి వుంటారా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)