ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్ల నుండి నుండి కార్పోరేట్లు సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న సంగతి హఠాత్తుగా చర్చలోకి వచ్చింది – ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్సు బ్యూరో రెండు నెలల పాటు నిఘా వేసి ఫిబ్రవరి 18 న ఢిల్లీ పోలీసుల చేత దోషులను అరెస్టు చేయించారు కాబట్టి! ఎన్నో ఏళ్లుగా యిలాటివి జరుగుతూనే వుంటాయని అందరూ వూహిస్తూంటారు. 2010 నాటి నీరా రాడియా టేపుల తర్వాత నిర్ధారణ అయింది కూడా. ఈసారి పెట్రోలియం శాఖ ఆఫీసుల్లో సిబ్బంది 9 రహస్య డాక్యుమెంట్లతో సహా పట్టుబడ్డారు. కేంద్ర బజెట్‌లో ప్రతిపాదించబోయే నేషనల్ గ్యాస్ గ్రిడ్‌కై సేకరించిన సమాచారంతో సహా నెలవారీ నివేదికలు, ఉత్తరప్రత్యుత్తరాలు వాటిలో వున్నాయి. వాళ్లు పవర్, కోల్ మంత్రిత్వ శాఖల్లో కూడా యిలాటి పనులే చేశామని ఒప్పుకున్నారు. చివరకు శంతను సైకియా, ప్రయాస్ జైన్ అనే ఎనర్జీ కన్సల్టెంట్లను, ఐదు కార్పోరేట్ల ఉన్నతాధికారులను – రిషి ఆనంద్ (అడాగ్ రిలయన్సు), సుభాష్ చంద్ర (జుబిలియంట్ ఎనర్జీ), వినయ్ కుమార్ (ఎస్సార్), శైలేశ్ సక్సేనా (ఆర్‌ఐఎల్), కెకె నాయక్ (కెయిర్న్‌స్) అరెస్టు చేశారు.
అసలు మీలాటి పెద్ద కార్పోరేట్లు యిలాటి పనికి ఎందుకు దిగజారాలి? అని అడిగితే సంస్థల ప్రతినిథులు కొందరు వాపోయారు – 'ఏం చేయమంటారు? మేం ఉత్తరాలు రాస్తే ప్రభుత్వాధికారులు జవాబివ్వరు. అపాయింట్‌మెంట్ అడిగితే యివ్వరు. బతిమాలితే కొన్నాళ్లకు యిచ్చినా సమావేశాల్లో పెదవి విప్పరు. మనం చెప్పినది విని వూరుకుంటారు. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో, ఎలాటి విధానం రూపొందిస్తున్నారో తెలియకపోతే మా కంపెనీ పథకాలను ఎలా రచించేది? కోల్, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ రంగాలలో యిలాటి ముందస్తు సమాచారం చాలా అవసరం. అది పెట్టుకుని మేం పత్రికల్లో అనుకూలంగానో, ప్రతికూలంగానో వ్యాసాలు రాయిస్తాం, పార్లమెంటులో ప్రశ్నలు వేయిస్తాం, ఆ విధానాన్ని త్వరగా అమలు చేయించడమో, ఆలస్యం చేయించడమో, అడ్డుకోవడమో ఏదో ఒకటి చేయగలుగుతాం. రక్షణ శాఖ విషయంలో పోటీదారు ధర తెలుసుకుని, మనం ఎలాగోలా కాంట్రాక్టు దక్కించుకోగలిగితే అది కొన్ని వందల కోట్ల లాభానికి బాట వేస్తుంది.' అంటారు. ప్రభుత్వం నుంచే కాదు, యితర కంపెనీల నుండి కూడా సమాచారాన్ని సేకరించడం వారి కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది.
ఈ విషయంపై అసోచామ్‌వారు 2012లో 1500 మంది సిఇఓలతో నిర్వహించిన సర్వేలో 900 మంది యితర కంపెనీల్లో తమ గూఢచారులను పెట్టి సమాచారం సేకరించినట్లు ఒప్పుకున్నారు. తమకు కావలసినవారిని పోటీ కంపెనీల్లో ప్యూన్లుగా నియమింపచేసి టేబుల్ కింద బగ్గింగ్ సామగ్రి పెట్టించడం, రిసెప్షనిస్టులుగా చేర్చి టెలిఫోన్ సంభాషణలను వినమనడం – యిలాటివి చేస్తామని చెప్పారు. లంచాలిచ్చి, విందులిచ్చి సమాచారాన్ని సేకరించడం, దాన్ని బట్టి విధానాలను తమ కనుగుణంగా మార్చడానికి, తమ కనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులను, మంత్రులను లోబరచుకోవడానికి ప్రతి కంపెనీ కొంత శాతం ఖర్చు పెడుతోందన్నది బహిరంగ రహస్యం అయిపోయింది. రూ. 300 కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి 2% దీనికోసం కేటాయించినా అది రూ. 6 కోట్లు అవుతుంది. వాల్‌మార్ట్ ఇండియాలో ప్రవేశిద్దామనుకున్నపుడు తమ తరఫున లాబీయింగ్‌కై 25 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టిందని 2013లో బయటకు వచ్చింది. ఈ విభాగానికి వారు పెట్టుకున్న ముద్దు పేరు – లయజన్ లేదా కార్పోరేట్ కమ్యూనికేషన్ ! తమకు కావలసిన ప్రభుత్వశాఖల నుంచి రిటైరైన వారిని నెలకు రూ.లక్ష జీతంతో నియమించుకుని, పాత పరిచయాలతో పని చక్కబెట్టుకుని రమ్మంటారు. వీరితో పాటు విడిగా పని చేసే కొన్ని సంస్థలను కన్సల్టెంట్లుగా, లాబీయిస్టులుగా పెట్టుకుంటారు. వీరు స్వతంత్రంగా పనిచేస్తూ రేటు ఎవరికి కావాలంటే వారికి తాము సేకరించిన సమాచారం అమ్ముతూ వుంటారు. వీరు ప్రతి చిన్న లేఖను ఎంతో కొంత ధర పెట్టి కొంటూ వుంటారు. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా! సమాచారాన్ని కొన్న తర్వాత తమకు పనికి రాకపోతే దాన్ని ఇంకోళ్లకు అమ్మేసుకునే పద్ధతి కూడా వుంది. వీరికి జర్నలిస్టులు కూడా తోడవుతారు. ఏదైనా హాట్‌హాట్ సమాచారం దొరికితే కథనం రాసుకోవచ్చు కదాని వారి ఆశ. ప్రచురించలేని సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులకు అమ్మేసుకుంటారు.
డాక్యుమెంటు విలువను బట్టి ధర పలుకుతుంది. మీటింగ్ రిపోర్టులకు పేజీకి రూ.వెయ్యి, రిపోర్టులు, ప్రొజెక్షన్లు, సర్వేలు, ఆంతరంగిక సమావేశాల తీర్మానాలు, మంత్రుల చర్చలు అయితే రూ.50 వేల నుండి రూ.లక్ష దాకా. ప్రధానమంత్రి ఆఫీసు నుంచి డాక్యుమెంట్లయితే రూ.2 నుంచి 5 లక్షల దాకా వుంటుంది. ఒక ఫైలు సరాసరిన డజను కార్యాలయాలకు వెళుతుంది. దాన్ని చిన్నా పెద్దా ఉద్యోగులు చేతబట్టి అనేక శాఖలకు తీసుకెళతారు. వారిలో కాంట్రాక్టు వుద్యోగులు కూడా వుంటారు. ఈ క్రమంలో ఎక్కణ్నుంచైనా సమాచారం లీక్ కావచ్చు. సీనియర్ ఆఫీసర్లు సమాచారాన్ని పంపడానికి తమ ప్రయివేటు యీ మెయిల్స్ వుపయోగిస్తున్నారు. సమాచారం బయటకు వచ్చే మార్గాలు అనేకం. క్లాసు 3, 4 తరగతుల ఉద్యోగులు డాక్యుమెంట్లను చూసి రాసివ్వడమో, జిరాక్సు చేయడమో చేస్తూంటారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లలో స్కాన్‌బాట్ అప్లికేషన్ వచ్చాక ఎక్కడికీ తీసుకెళ్లనక్కర లేకుండానే ఒక్క సెకనులో ఫోటో తీసేస్తున్నారు. క్షణాల్లో బయటకు పంపేసి, డిలీట్ చేసేస్తున్నారు. పట్టుబడినా జేబులో ఏ కాగితమూ దొరకదు. అందుకే థాబ్దాలుగా వేలాది క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు బయటకు వచ్చేస్తున్నాయి. మిలటరీ ప్రొక్యూర్‌మెంట్ ప్లాన్ల దగ్గర్నుంచి ప్రధాని కాబినెట్ మీటింగుల్లో రహస్య బ్రీఫింగుల దాకా ఏవీ లీకుకి అతీతం కాదు. 2014లో పెట్రోలియం మంత్రి వీరేంద్ర పాటిల్ గ్యాస్ ధరలు పెంచినపుడు అది ఒక కార్పోరేట్‌కు సాయపడడానికే అని సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా ఆరోపించారు. సాక్ష్యంగా పెట్రోలియం శాఖలోని ఫైళ్ల నోటింగ్సు చూపించారు. దాంతో ప్రభుత్వం వులిక్కిపడి, యికపై సమాచారం బయటకు పొక్కకుండా వుండాలని ఆఫీసుల్లో సిసిటివిలు పెట్టించారు, కొన్ని ఫైళ్లు బీరువాల్లో పెట్టించే ఏర్పాట్లు చేశారు. అంత చేసినా మరి యీ లీకులు ఎలా జరిగాయి అంటే సింపుల్. ఆ సిసిటివి కెమెరాలు పనిచేయకుండా పాడు చేశారు, ఆ బీరువా తాళాలకు డూప్లికేట్ తాళం చెవులు చేయించారు.
తాజా వుదంతాన్ని లాబీయింగ్‌తో ముడిపెట్టడాన్ని లాబీయిస్టులుగా పేరు బడినవారు వ్యతిరేకిస్తున్నారు. 'ఇది చౌకబారు దొంగతనం, దీన్ని లాబీయింగ్, లయజనింగ్ అంటే ఎలా? అది చాలా సోఫిస్టికేటెడ్‌గా సాగుతుంది. అధికారులకు డిన్నర్లు, మందు పార్టీలు యిచ్చి చర్చల్లోకి దింపి, మా ఆలోచనలను వారి మెదళ్లలోకి వారికే తెలియకుండా చొప్పించి, ఒరిజినల్‌గా అది వారి ఆలోచనే అని వారు భావించేట్లా చేస్తాం. దీనికి కొన్ని నెలల కసరత్తు చేయాలి. ఎన్నో తెలివితేటలు వుపయోగించాలి.' అంటున్నారు వారు. నీరా రాడియా టేపుల్లో ప్రస్తావనకు వచ్చిన కార్పోరేట్ లాబీయిస్టు దీపక్ తల్వార్ వున్నాడు. అతనూ, అతని క్లయింటు టెలికార్డియా అనే టెలికామ్ కంపెనీ కలిసి ఫ్లోట్ చేసిన ఎంఎన్‌పి ఇంటర్‌కనక్షన్ టెలికామ్ సొల్యూషన్స్ కంపెనీకి మరో కంపెనీతో బాటు మొబైల్ నెంబరు పోర్టబిలిటీ లైసెన్సు దక్కింది – హోం శాఖ భద్రతాపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినా! దీనికోసం అతను అప్పటి సిబిఐ చీఫ్ రంజిత్ సిన్హా యింటికి 2013 మే నుండి 2014 ఆగస్టు వరకు 63 సార్లు వెళ్లాడని సిన్హా యింటి దగ్గర పెట్టిన రికార్డులు చెపుతున్నాయి! ఇలా వుంటుంది ప్రభుత్వం పనిచేసే తీరు. ఇప్పుడీ ఫైళ్ల దొంగతనం తర్వాత ప్రభుత్వం ఏ మేరకు మేలుకుంటుందో, యీ అధునాతన సాంకేతికయుగంలో భద్రత ఏ మేరకు సాధ్యమో గమనించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)