ఎమ్బీయస్‌: సన్నికల్లు దాచేస్తా….

వెనకటికి ఓ కుర్రాడు వుండేవాడు. మేనమామ తన కూతుర్ని యిస్తాడన్న ధీమాతో వేరే ఏ పురుషప్రయత్నమూ చేయకుండా కూర్చున్నాడు.  వీడికి పిల్ల నివ్వకపోయినా ఏం ఫర్వాలేదు, నోర్మూసుకుంటాడు అనుకున్న మేనమామ తన కూతురికి యింకో…

వెనకటికి ఓ కుర్రాడు వుండేవాడు. మేనమామ తన కూతుర్ని యిస్తాడన్న ధీమాతో వేరే ఏ పురుషప్రయత్నమూ చేయకుండా కూర్చున్నాడు.  వీడికి పిల్ల నివ్వకపోయినా ఏం ఫర్వాలేదు, నోర్మూసుకుంటాడు అనుకున్న మేనమామ తన కూతురికి యింకో వరుణ్ని తీసుకుని వచ్చాడు. అప్పుడు రగిలింది మనవాడికి. ‘ఈ పెళ్లి ఆపకపోతే నా పేరు మార్చుకుంటా’ అని శపథం పట్టాడు. కానీ పెళ్లి ఏర్పాట్లు దిగ్విజయంగా సాగిపోతున్నాయి. మనవాడిలో కదలిక కనబడలేదు. వీడు పెళ్లి ఎలా ఆపుతాడా అని  స్నేహితులందరూ ఉగ్గబట్టుకుని చూస్తున్నారు. పెళ్లివారు ఊళ్లోకి దిగారు, విడిదిలో బస చేశారు. స్నేహితులు వెళ్లి మన హీరోని అడిగారు – ‘ఈ పరిస్థితిలో పెళ్లి ఎలా ఆపుతావురా?’ అని. వాడు నవ్వాడు – ‘ఎలా ఆపుతానో మీరు చూస్తూ వుండండి.  నా దగ్గర బ్రహ్మాస్త్రం వుంది.’ అని. గుట్టు విప్పమని వాళ్లు బతిమాలితే చెప్పాడు – ‘‘పెళ్లిలో పెళ్లికూతురు సన్నికల్లు (రాయి) తొక్కాలిగా. అది దాచేశా. తొక్కందే పెళ్లి అయినట్టు కాదు కదా…’’ అని. ఆ కుర్రాడి పేరేమిటంటారా? రాజగోపాల్‌, వెంకటేశ్‌, అశోక్‌బాబు, కేశవ్‌.. ఏదైనా కావచ్చు.  

సీమాంధ్ర ఛాంపియన్లు యిన్నాళ్లూ పడి నిద్రపోయారు. తాము నిద్రపోవడమే కాకుండా, తమ ప్రజలను జోకొట్టారు – మేం చూసుకుంటాం అంటూ. వాళ్లు చెప్పిన ఒక్కొక్కమాట బూటకం అని తేలిపోతున్న కొద్దీ వాళ్లు మరో మారువేషం వేసుకుని వచ్చి నాటకం ఆడాల్సి వస్తోంది. తెలంగాణ ప్రతిపాదనే లేదన్నారు, దిగ్విజయ్‌ విభజనకు వ్యతిరేకి అన్నారు, జులై 30 తర్వాత 2014లోపున వచ్చే ప్రశ్నే లేదన్నారు, ఆంటోనీ యిక్కడికి వచ్చినపుడు భరతం పడదామన్నారు… యిలా అడుగడుగునా ఏదో ఒకటి చెప్పి పబ్బం గడుపుకుని వచ్చారు. అవతల మారువేషాలు అయిపోతున్నాయి. ఎప్పటికో అప్పటికి నిజరూపం బయటపడక తప్పదు. అది తెలిసి కూడా వీళ్లు తమ శక్తి కొలదీ నటించేస్తున్నారు. కానీ హై కమాండ్‌ ఎలాటి మొహమాటాలు పెట్టుకోవడం లేదు. గతంలో టి-లీడర్లు  తమ పేరు నియోగించుకుని ఏదైనా మాట్లాడితే అధిష్టానంవారు ఖండించకుండా ఊరుకునేవారు. ‘మేం పెద్దలకు అన్నీ వివరించాం, వాళ్లు సానుభూతితో విన్నారు, తెలంగాణ ఏర్పాటు చారిత్రక ఆవశ్యకత అన్నారు. ఇక వచ్చేస్తుంది’ అని చెప్పుకుంటూ జనం మధ్య తిరిగే అవకాశం టి-లీడర్లకి కల్పించారు. ఇప్పుడు సీమాంధ్ర వాళ్లంటే ఢిల్లీ వాళ్లకు బాగా లోకువగా వుంది. జనం తిట్లు, చివాట్లు, రాళ్లదెబ్బలు భరించలేక సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఏదో ఒకటి చెప్తే వెంటనే ఢిల్లీ నాయకులు ఖండించి పడేస్తున్నారు. అసెంబ్లీకి రెండు సార్లు వస్తుంది అని కిరణ్‌ అంటే – కాదు ఒక్కసారే అని షిండే అంటారు, హైదరాబాదు యుటీని చేసే ఆలోచన వుందని దిగ్విజయ్‌ అన్నారు అని జెడి శీలం అంటే – అంతా వట్టి అబద్ధం అని దిగ్గీ అంటారు. ‘త్రోయింగ్‌ క్రిస్టియన్స్‌ టు లయన్స్‌’ అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాంగ్రెసు వాళ్లను సీమాంధ్రులు తరిమితరిమి కొట్టేట్లా చేస్తున్నది ఢిల్లీ కాంగ్రెసు వారే. 

‘సీతారామస్వామీ నే చేసిన నేరంబదియేమి?’ అని రామదాసు నిలదీసి విలపిస్తే సీమాంధ్ర కాంగ్రెసు నాయకులూ సోనియాను  నిలదీయలేక విలపిస్తున్నారు. రామభక్తుడనంటూనే  రామదాసు రాముణ్ని కడిగి పారేశాడు. నీకు హారాలు చేయించడమేనా నేను చేసిన నేరం? ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు? ఇవన్నీ నీ బాబు చేయించాడా? నీ జనకమామ చేయించేడా? అని నిలదీశాడు. ‘నువ్వు యీ రోజు ఢిల్లీలో గద్దె ఎక్కావంటే, యిన్ని స్కాములు చేయగలిగావంటే మా తెలుగువాళ్లం యిచ్చిన 33 సీట్లే కదా’ అని అడగాలని మన కాంగ్రెసు వాళ్లకూ వుండి వుంటుంది. కానీ అడగలేరు, ఏమంటే ఎందులో యిరికిస్తారోనని భయం. జగన్‌ ఉదాహరణ ప్రత్యక్షంగా కనబడుతోంది. ‘కాంగ్రెసులో వుండి వుంటే సిఎం అయివుండేవాడు, తిరగబడి చెడిపోయాడు’ అని ఆజాద్‌ అనేశాడు కదా. వీళ్ల నిస్సహాయత మనకు అర్థం అవుతోంది కాబట్టి సరేలే అని సరిపెట్టుకుంటాం. కానీ వాళ్లు అంతటితో ఆగకుండా ఏదో పొడిచేస్తాం అంటేనే మండుతుంది. ఇప్పటిదాకా ఏం పొడిచారు? ఆ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ వ్యవహారం ఏమిటని గట్టిగా అడగ్గలిగారా? 

పదిమంది అన్నారా, ముఖ్యమైన శాఖల వాళ్లందరినీ తీసి పారేసి, ఆరుగురితో టీము కూర్చి ఆరోవేలులా పిఎంఓలో సహాయమంత్రిని ఆహ్వానితుడిగా చేర్చారు. పది రోజుల కోసారి కలుస్తున్నారు. ముచ్చటగా మూడు మీటింగుల్లో తేల్చి పారేస్తారట. అందరూ యిప్పటిదాకా కలిసి కూర్చున్నది లేదు. ఆంటోనీని కాకపోయినా, జిఓఎమ్‌నైనా రాష్ట్రానికి రప్పిస్తాం అని మన నాయకులు బీరాలు పలికారు. ఏడిశారు, వాళ్లెవరు చెప్పడానికి? ఈ మెయిల్‌ చాలు మీ మొహానికి అన్నారు షిండే. కృష్ణ కమిటీకి లేఖ రాసినట్టు దీనికీ రాస్తారా అని కొందరు నన్ను అడుగుతున్నారు. జస్టిస్‌ శ్రీకృష్ణ గారు పెద్దమనిషి. సమాచారం సేకరించి, వివిధవర్గాల అభిప్రాయాలు సేకరించి, పలు పరిష్కారాలు, వాటి అమలులో వున్న చిక్కులు అన్నీ సమగ్రంగా చర్చించిన వారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించాలన్న మన సలహా తీసుకోకపోవచ్చు. కానీ అలాటివాళ్లకు పంపితే పుణ్యం, పురుషార్థం. వీళ్లేముంది? అంతా తమకే తెలుసన్న అహంభావం వీళ్లది. ఎవరైనా వాదనలు విన్నాక తీర్పు చెప్తారు. వీళ్లు తీర్పు చెప్పి వాదనలు.. వేదనలు చెప్పుకోండి అంటున్నారు. ఉద్యోగికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ ఆప్షన్‌ యిస్తారు. దంపతులకు విడాకుల ఆప్షన్‌ యిస్తారు. ఇంతిస్తాం, ఇంతకుమించి యివ్వం అని చెప్పి యిష్టమైతే వుండు, లేకపోతే పో అని చెప్తారు. ఈ కేసులో దొరతనం వారు విడాకులు మంజూరు చేసేశారు – భరణం గిరణం తేల్చకుండానే ! 

ఇప్పుడు రాబోయే బిల్లులో కూడా యిలాటి వివరాలు ఏమీ వుండవట. గతంలో రాష్ట్రాలు విభజించినప్పుడు కూడా బిల్లులో యిలాటి విషయాలు ఏమీ చెప్పలేదట. ఇప్పుడు దీనిలోనూ ఏమీ వుండదు. ప్రతీ అంశానికీ చివర ‘కేంద్ర తగు నిర్ణయం తీసుకుంటుంది’ అని వదిలేస్తారట. ఇలా వదిలేస్తే భవిష్యత్తులో ఎవరి కొంప మునుగుతుందో చెప్పలేం. ఈ ప్రభుత్వం ఆయుర్దాయం అతి తక్కువ. దీనికి పునర్జన్మ వుంటుందని ఎవరూ గ్యారంటీ యివ్వలేరు. రాబోయే ప్రభుత్వ స్వభావస్వరూపాలు, ఒత్తిళ్లు ఎవరికీ తెలియవు. ఇప్పటిదాకా సోనియా తెలంగాణపై శీతకన్ను వేసి, జులై నుండే చల్లని చూపు ప్రసరింపచేసింది. సీమాంధ్ర కష్టాల పట్ల కన్ను మూసుకుంది. వచ్చే ప్రభుత్వం కూడా యిలాగే ప్రవర్తిస్తుందన్న నమ్మకం లేదు. అది సీమాంధ్ర ఎంపీల కరుణపై ఆధారపడితే, ఇప్పుడు ఓపెన్‌గా వదిలేసిన అంశాలను తెలంగాణకు వ్యతిరేకంగా మలచవచ్చు. ఉమ్మడి రాజధాని గడువును పదేళ్ల నుంచి పాతికేళ్లు చేయవచ్చు, కొత్త రాజధానికి కావలసిన డబ్బు తెలంగాణ రాష్ట్రమే యివ్వాలనవచ్చు. ‘ఏమిటండీ, బత్తగా జోకులేస్తున్నారు, అంత తలతిక్కగా ఎవరైనా చెప్తారా?’ అనవద్దు. ఇప్పుడు జరుగుతున్నది తలతిక్క వ్యవహారమే కదా. సంబంధిత అంశాల నిపుణులను కూర్చోబెట్టి ఒక విధానం ఏర్పరచుకుని, యిరుప్రాంతాల నాయకులను దానికి ఒప్పించే ప్రయత్నం జరుగుతోందా? నవంబరు 7 నాటికి సమాచారం తెప్పించుకుంటారట. సమాచారాన్ది ఏముంది, కృష్ణగారే బోల్డు పోగేసి పెట్టారు. పరిష్కారం మాట చెప్పండి మహాప్రభో. ఒక్కో సమస్యకు పరిష్కారం తేలేటప్పటికి నెలలు పడతాయి. 

ఈ జిఓఎమ్‌లో వున్నవాళ్లందరూ షష్టిపూర్తి చేసుకున్నవాళ్లు, రోగిష్టివాళ్లు. ముఖ్యమైన మంత్రిత్వశాఖలు నిర్వహించేవాళ్లు. వీళ్లకు తీరిక, ఓపిక రెండూ లేవు. ‘న్యాయం జరగగానే సరిపోదు, జరిగినట్టు కనబడాలి కూడా’ అని సామెత. ‘అన్యాయం చేయడమే కాదు, అన్యాయం జరిగినట్టు కనబడాలి కూడా’ అన్నట్టు వీళ్లు ప్రవర్తిస్తున్నారు. ‘మేం చేసినా ఈ సీమాంధ్రులు పడి వుంటారు.’ అన్న పొగరుమోత్తనం తప్ప వేరే ఏమీ కనబడటం లేదు. రాజ్యాంగం ప్రకారం వుండాల్సిన టైమ్‌ టేబుల్‌ను కుదించడానికి, కాబినెట్‌లో నోట్‌లో చెప్పిన మంత్రుల సంఖ్య తగ్గించడానికి వీరికెవరిచ్చారు హక్కు? రాష్ట్రవిభజన వంటి ముఖ్యమైన అంశంపై రోజుకొకరు పూటకో మాట మాట్లాడం పద్ధతేనా? హైదరాబాదు పరిస్థితి ఏమిటో స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత లేదా? మొన్న సోమవారం దిగ్విజయ్‌ మాట్లాడుతూ సీమాంధ్ర, తెలంగాణ, హైదరాబాదు వాసులకు (పీపుల్‌ ఆఫ్‌ హైదరాబాదు)లకు బెస్ట్‌ పాజిబుల్‌ డీల్‌ యిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది అని చెప్పారు. (ఇది టీవీలో వచ్చింది. ‘‘హిందూ’’లో కరక్టుగా రిపోర్టు చేశారు. నేను చూసిన తెలుగు పేపర్లలో రాలేదు). సీమాంధ్ర, తెలంగాణ రెండూ వేర్వేరు ప్రాంతాలని తెలుసు, హైదరాబాదును మూడో ప్రాంతంగా చేర్చడంలో మతలబు ఏమిటి? దిగ్గీగారు నోరుజారారంటే నమ్మగలమా? హైదరాబాదును తెలంగాణలో అంతర్భాగంగా చూడడం లేదా? 

‘ఇలా తెలుగువాళ్లందరినీ అయోమయానికి గురి చేస్తూ, అందర్నీ బేఖాతరు చేస్తూ ప్రవర్తిస్తున్న ఢిల్లీ నాయకులను మేం ఏమీ చేయలేం. బిల్లు ఆపగలిగితే సోనియానే ఆపాలి. మేం ఏమీ చేతకానివాళ్లం.’ అని ఒప్పేసుకుని సీమాంధ్ర నాయకులు మౌనంగా వుంటే కాస్తయినా మర్యాద దక్కుతుంది. కాంగ్రెసు వాళ్లే కాదు, యితర పార్టీల వాళ్లు కూడా! ఎందుకంటే కాంగ్రెసువాళ్లు అధిష్టానం మాట శిరోధార్యం అంటూ వచ్చారు. ఇక టిడిపి, వైకాపావారు ‘మాకు అభ్యంతరం లేదు, బంతి మీ కోర్టులోనే వుందంటూ’ ఉత్తరాలు యిచ్చారు. సమన్యాయం అనే బ్రహ్మపదార్థం ఏమిటో యిప్పటికీ చెప్పటం లేదు. మా కోర్టులో వున్న బంతిని యిష్టం వచ్చినట్టు ఆడుకుంటాం. ఈ షరతులు అప్పుడే ఎందుకు చెప్పాల్సింది అని కేంద్రం అంటే వీళ్లు నోళ్లు వెళ్లబెట్టాలి. వీళ్ల చేతకానితనం బయటపడ్డాక కూడా ‘అసెంబ్లీలో ఓడిస్తాం, కోర్టుకి వెళ్లి ఆపేస్తాం, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కి వెళతాం, ఐక్యరాజ్యసమితికి వెళతాం… ఏదో మాయ చేసి విభజన ఆపేస్తాం’ వంటి కబుర్లు చెపితే సన్నికల్లు దాచేసినవాడి కథలాగానే వుంటుంది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

[email protected]