1965లో మలేసియన్ ఫెడరేషన్ నుండి విడివడ్డాక సింగపూర్‌లో ఆధునికత, ఆర్థికాభివృద్ధి బాగా పెరిగింది. ఈ రోజు ప్రపంచంలోని ఆర్థిక కేంద్రాలలో దానిది నాల్గవ స్థానం. బిజీగా వుండే నౌకాశ్రయాలలో ఐదవ స్థానం. అత్యధిక తలసరి ఆదాయంలో మూడోస్థానం. అయినా సింగపూరులో మూఢనమ్మకాలు యింకా రాజ్యం ఏలుతూనే వున్నాయి. 100 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన చైనీయులు తమ ప్రాచీన నమ్మకాలను అలాగే కొనసాగిస్తున్నారు. సింగపూరు వాసి ఎవరూ మీకు బహుమతిగా వాచీ యివ్వరు. ఎందుకంటే ‘వాచీ యివ్వడం’ అనే మాట చైనీస్ భాషలో అంతిమ ప్రార్థనల్లో వుపయోగించే ‘సుంగ్ రంగ్’ను స్ఫురించేస్తుంది కాబట్టి! (ఏడు అనే సంఖ్యను మనవాళ్లు కొందరు ‘ఆరున్నొకటి’ అనేవారు – ‘ఏడు’పు అనే ధ్వని రాకుండా) చేప వండడానికి ముళ్లు తీస్తూ వుంటే అది జారి కింద పడితే మనం ఎక్కిన పడవ మునిగిపోతుందని నమ్ముతారు. భోజనం చేసే పుల్లలు (చాప్ స్టిక్స్) అనుకోకుండా పొడుగూ, పొట్టీ వస్తే దాని అర్థం – మనం పడవో, విమానమో, రైలో మిస్సయిపోతామన్నమాట. చాలామంది సింగపూరు వాసులకున్న అలవాటు ఏమిటంటే – ఎక్కడికైనా బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక తలుపు తడతారు – లోపల మనుష్యులెవరూ లేకపోయినా. తాము లేనప్పుడు దయ్యాలు వచ్చి వుంటే, తాము తలుపు తట్టడం వలన యిల్లు ఖాళీ చేస్తాయని వాళ్ల నమ్మకం.
చనిపోయినవారికి తర్పణాలు యిచ్చే అలవాటు హిందువులకు వుంది. కానీ సింగపూరు చైనీయుల నమ్మకం యింకా చిత్రమైనది. భూతమాసంలో (ఆగస్టు-సెప్టెంబరులలో వస్తుంది) నరకం నుండి ఆత్మలను విడుదల చేసి రోడ్లమీద తిరగనిస్తారని నమ్మి ఆ సమయంలో ‘హంగ్రీ ఘోష్ట్ ఫెస్టివల్’ అని నిర్వహిస్తారు. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ సైనికులు ఇంగ్లీషు వారిని ఓడించి, పట్టుకున్న 50,000 మంది యుద్ధఖైదీలను హింసించిన బ్రిటిషు మిలటరీ బేస్‌ను 1965లో ఆసుపత్రిగా మార్చారు. అక్కడి హింసకు గురై మరణించినవారు దెయ్యాలయి ఆసుపత్రిలో తిరుగుతున్నారని, అందుకే ఎవరూ స్విచ్ నొక్కకుండానే లిఫ్టులు పైకీ కిందకూ తిరుగుతూ అప్పుడప్పుడు హఠాత్తుగా తెరుచుకుంటూ వుంటాయనీ, నీలం రంగులో వున్న ఓ దయ్యపు పిల్లవాడు దిగాలుగా చూస్తూ కనబడతాడని – యిలా వదంతులు చెప్పుకుంటూ వుంటారు. వీటికి తోడు చాలా యిళ్లల్లో దయ్యాలున్నాయని, అందుకే వాటిలో ఎవరూ నివసించడం లేదనీ నమ్ముతూంటారు. ‘‘అసలు సంగతేమిటంటే సింగపూరులో యిళ్ల స్థలాల రేట్లు బాగా పెరిగిపోయాయి. అమ్మితే మళ్లీ కొనుక్కునే పరిస్థితి లేదు. అందుకని వేరే వూరు వెళ్లిపోయినా యిక్కడి సొంతయిళ్లకు తాళాలేసి వుంచుతున్నారు. ఖాళీగా వుండడంతో యిలాటి పుకార్లు పుడుతున్నాయి.’’అంటాడు ఓ పరిశీలకుడు.
– ఎమ్బీయస్ ప్రసాద్