త్రివేణి సంగమంలో గంగా, యమునాలు కలవడం కనబడుతుంది. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కూడా కలుస్తుందని హిందువులం నమ్ముతాం. ఈ సరస్వతీ నది ఋగ్వేదంలోని నదీస్తుతి ప్రకారం అది శతధృ నది (ఇప్పటి సట్లెజ్) ధృషద్వతి నదికి (ఇప్పటి యమున) మధ్య వుండేది. అది కాలక్రమంలో భూగర్భంలో వచ్చిన కదలికల వలన ఒక ఎడారిలో లుప్తమై పోయిందని మహాభారతంలో, బ్రాహ్మణాలలో వుంది. ఆ ఎడారి రాజస్థాన్‌లోని థార్ అని కొందరు, అబ్బే గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ అని మరి కొందరు అంటారు. బ్రిటిషు వాళ్లు కూడా యీ నది ఎక్కణ్నుంచి ఎక్కడకు ప్రవహించిందో కనిపెడదామని తెగ ప్రయత్నించారు. ఇతమిత్థమని తేల్చలేకపోయారు. శాటిలైట్ ద్వారా చిత్రాలు తీయగలిగిన సామర్థ్యం వచ్చాక చూస్తే రాజస్థాన్ ఎడారుల కింద ఎండిపోయిన నది చారలు కనబడ్డాయి కానీ అవి సరస్వతీ నదివే అని చెప్పేందుకు వీలు లేకుండా వుంది. ఈలోగా గత ఏడాది సరస్వతీ పుష్కరాలు అంటూ చాలా రాష్ట్రాల్లో నిర్వహించి ఎవరికి వారే ఇదే సరస్వతీ నది అని ప్రచారం చేసేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలో జరిగే మార్పుల్లో ఎన్ని కొత్తగా ఉద్భవించాయో, ఎన్ని కనుమరుగై పోయాయో కనుక్కోవడం మహా కష్టం. చాలామంది అంగీకరించినదాని ప్రకారం – భారతదేశానికి పశ్చిమాన వుండే సరస్వతీ నదికి సట్లెజ్ నది, యమునా నది ఉపనదులుగా వుండేవి. అయితే కొంతకాలానికి సట్లెజ్ పశ్చిమంగా వున్న సింధునది వైపుకి, యమున తూర్పు వైపున వున్న గంగా నది వైపుకి తమ దిశలు మార్చుకోవడంతో సరస్వతి నదికి నీరు తగ్గిపోయి ఎండిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పంజాబ్, హరియాణాలలో ప్రవహించి రాజస్థాన్‌లో లుప్తమై పోయిన ఘగ్గర్ నది, దానికి అనుబంధంగా పాకిస్తాన్లో వుండే హాక్రా నదియే సరస్వతి అవశేషాలనుకోవచ్చు.
ఏది ఏమైనా ఆ నది, దాని జలాలు యిప్పుడు అందుబాటులో లేవు. కళ్ల ఎదురుగా ప్రవహిస్తున్న నదీజలాలను కలుషితం కాకుండా కాపాడుకోవడం, వాటిపై ప్రాజెక్టులు కట్టి సద్వినియోగం చేసుకోవడం, వీలైతే వాటిని అనుసంధానం చేసి కరువులు, వరదలు లేకుండా చూసుకోవడం యివి ముఖ్యం. అయితే వేదకాలం నాటి సరస్వతీ నది ఆనుపానులు ఎలాగైనా కనుక్కుని తరించాలని కొందరు మేధావులు పట్టుదలతో వున్నారు. ఋగ్వేదంలో ప్రస్తావించబడినా అది ఒక మతానికి సంబంధించినది కాదు. ఆ మాటకు వస్తే ప్రకృతిలో భాగమైన నదులు, పర్వతాలు, అరణ్యాలు, వృక్షాలు, జలపాతాలు, ఉష్ణకుండాలు – ఏవీ ఏ మతానికి చెందినవి కావు. సమస్త జీవులకూ ఉపయోగపడేవే అవి. కొందరు మతస్తులు వాటికి పవిత్రతను ఆపాదించి ఆరాధించి సంరక్షిస్తారు. ఇప్పుడున్న ప్రకృతి సంపదను కాపాడుకుంటే అదే పదివేలు. వేలాది సంవత్సరాల క్రితం ప్రకృతి చేసిన గారడీలో మాయమై పోయిన సరస్వతీ నది గురించి అన్వేషించడం ఒక అకడమిక్ కసరత్తే తప్ప వేరేమీ కాదు. కనుమరుగై పోయిన, భూమిలో కూరుకుపోయిన అనేక వస్తువులను, ప్రాంతాలను, నగరాలను వెలుగులోకి తీసుకురావడం పురాతత్త్వ శాఖ నిరంతరం చేస్తూనే వుంటుంది. వాటి విషయంలో ఎవరూ ఎక్సయిట్ అవరు. అయితే సరస్వతీ నది విషయంలో వేదాలతో లింకు వున్న కారణంగా హిందువుల్లో దాని గురించి ఆసక్తి, ఉత్సుకత అధికంగా వుంటోంది.
Click Here For Great Andra E-Paper
వాజపేయి ప్రధానిగా వుండగా 2002 జూన్‌లో టూరిజం, కల్చర్ మంత్రిగా వున్న జగ్మోహన్ మల్హోత్రా హరియాణాలోని యమునా నగర్‌లోని 'సరస్వతీ నదీ శోధ్ సంస్థాన్' వద్ద కేంద్రప్రభుత్వం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) చేత రూ. 4.98 కోట్ల ఖర్చుతో ''సరస్వతీ హెరిటేజ్ ప్లాన్'' పేర సరస్వతీ నది ప్రవహించిందని భావించిన 15 స్థలాలన్నిటిలో తవ్వకాలు జరిపిస్తుందని ప్రకటించారు. నలుగురు సభ్యుల కమిటీ వేసి, హరియాణాలోని యమునా నగర్, కురుక్షేత్ర, సిర్సా జిల్లాల నుండి రాజస్థాన్‌లోని కాలీబంగన్ వరకు సాగే తవ్వకాలను రెండు థలుగా విభజించి పర్యవేక్షించమన్నారు. ఈ 15టిలో 10 వాటిల్లో అప్పటికే కొంతమేరకు తవ్వకాలు జరిగాయి. వీటితో బాటు గుజరాత్లో కూడా తవ్వకాలు జరిపారు. దాంతో పాటు రీజనల్ రిమోట్ సెన్సింగ్ సర్వీస్ సెంటర్, ఇండియన్ స్పేస్ రిసెర్చి ఆర్గనైజేషన్లకు చెందిన సైంటిస్టులతో ఒక అధ్యయన సమితిని కూడా నియమించారు. 2004లో జోధ్‌పూర్‌లోని రాజస్థాన్ గ్రౌండ్‌వాటర్ డిపార్ట్మెంట్ వారు తమ ప్రాంతంలో సరస్వతీ నది కాలం నాటి డ్రైనేజి సిస్టమ్ వుండి వుండాలని సూచించారు. అది సరస్వతీ నదిదో, కాదో ఎవరూ చెప్పలేకపోయారు. ఈ పరిశోధన ఎటూ తేలటం లేదని 2004లో అధికారంలోకి వచ్చిన యుపిఏ ప్రభుత్వం భావించి దీన్ని కట్టిపెట్టింది. 2004 డిసెంబరులో కేంద్రమంత్రి జయపాల్ రెడ్డి సరస్వతీ నది ఉందని చెప్పడానికి ఆధారాలు దొరకలేదని పార్లమెంటులో ప్రకటించారు. సరస్వతీ హెరిటేజ్ ప్రాజెక్టు నియమాల ప్రకారం నిర్వహించబడిందా లేదా తేల్చమని 2006లో సీతారాం ఏచూరి నేతృత్వంలో ఒక పార్లమెంటరీ ప్యానెల్ నియమించారు. ఆ ప్యానెల్ ఎఎస్ఐ విధివిధానాలను తప్పుపట్టింది. ఫలానా చోట్ల తవ్వకాలు జరపాలని ఏదైనా సాంకేతిక సంస్థ సూచిస్తే తప్ప తవ్వకాలు చేపట్టరు కదా, యీ విషయంలో రాజకీయ నిర్ణయాల మేరకు ఎలా చేశారని నిలదీసింది. అయినా ఎఎస్ఐకు బుద్ధి రాలేదు. యుపిఏ హయాంలోనే కితం ఏడాది ఒక స్వామీజీకి కలలో లంకెబిందెలు కనబడ్డాయని ఉత్తర ప్రదేశ్‌లో తవ్వకాలు నిర్వహించింది. శాస్త్రజ్ఞుల కంటె రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువ కావడంతో యిలా జరుగుతోంది.
ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. సరస్వతీ నదికై మరోసారి అన్వేషణ మొదలైంది. నదీజలాల, గంగా పునరుద్ధరణ శాఖ మంత్రి ఉమాభారతి యీ మేరకు యీ ఆగస్టులో లోకసభలో ప్రకటన చేశారు. గత అనుభవాలతో బొప్పి కట్టిన ఎఎస్ఐ ఘగ్గర్-హక్రా నదీప్రాంతంలో 140 స్థలాల్లో తాము జరిపే తవ్వకాలు అప్పటి జనావాసాల గురించి తాము చేస్తున్న తవ్వకాలనే చెప్పుకుంటోంది తప్ప సరస్వతి కోసం వేట అని చెప్పడానికి భయపడుతోంది. దానికి కూడా సెంట్రల్ ఎడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీ (సిఎబిఎ) అనుమతి వచ్చాకనే మొదలెడతానంటోంది. సరస్వతీ నది మూలాలకై అలహాబాద్ (ప్రయాగ) కోటలోని ఒక బావిలోని నీటిని పరీక్షించమని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డును ఉమాభారతి ఆదేశించారు. సరస్వతి కథంతా పశ్చిమాన నడిస్తే తూర్పున వెతకడంలో పరమార్థం ఏమిటంటే – సరస్వతీ నదికి ఒకప్పుడు ఉపనదిగా వున్న యమున తర్వాతి కాలంలో తన ప్రవాహదిశను మార్చుకుని తూర్పువైపు వచ్చేసింది. అలా వచ్చేసినపుడు సరస్వతీ జలాలు కూడా తనలో యిముడ్చుకుని వుంటుందన్న భావనతో ప్రయాగలో త్రివేణీ సంగమం జరిగిందని నమ్ముతున్నాం. అంతమాత్రం చేత అలహాబాద్‌లో బావుల్లో నది యింకా దాగుని వుందని ఎలా అనుకోవాలి? శాస్త్రం కంటె నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత యిస్తే జరిగేది యిలాగే వుంటుంది!
ఎమ్బీయస్ ప్రసాద్