స్వచ్ఛ భారత్ సరే.. ఈ ‘చెత్త’ మాటేమిటి.!

రాజకీయం అంటేనే చెత్త.. అనేంతగా దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. రాజకీయ నాయకులే ఆ మాట చెబుతారు. అందుకే చెత్తయందు.. రాజకీయ చెత్త వేరయా.. అనాల్సి వస్తోంది. నిజమే…

రాజకీయం అంటేనే చెత్త.. అనేంతగా దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. రాజకీయ నాయకులే ఆ మాట చెబుతారు. అందుకే చెత్తయందు.. రాజకీయ చెత్త వేరయా.. అనాల్సి వస్తోంది. నిజమే మరి, రాజకీయాల్లో పేరుకుపోయినంత చెత్త బహుశా ఇంకెక్కడా వుండదేమో.! అసలేంటీ రాజకీయ చెత్త.? స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలోని చెత్త ఏరేసే కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టినట్లుగా, రాజకీయ పార్టీలు రాజకీయాల్లో పేరుకుపోయిన చెత్త గురించి కూడా ఆలోచన చేయాల్సి వుందా.? అంటే, రాజకీయాల్లో చెత్త వున్న మాట వాస్తవం.. ఆ చెత్తను ఏరి పారేయడం అత్యవసరం.. అనే సమాధానమే ఎక్కువమంది ఇస్తారు.

ఆస్తులు కోట్లలో.. లెక్కలు చూపించేది లక్షల్లో…

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడ్తారు.. ఎంపీ టిక్కెట్ కోసం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యత్వం.. ఇలా దేని గురించి ప్రస్తావించినా లెక్కలు కోట్లలోనే వుంటాయి. ‘నాకు సొంత కారు లేదు..’ అని ఎన్నికల కమిషన్‌కి సమర్పించే అఫిడవిట్లలో పేర్కొనే నేతలు, ఖరీదైన కార్లలో ఎలా తిరగగలుగుతున్నారు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదుగాక దొరకదు. ఎన్నికల కమిషన్‌కి కళ్ళు లేవా.? లేదంటే, మాయ చేయడంలో రాజకీయ నాయకులు మాస్టర్ డిగ్రీ పొందారా.? ఎన్నికల అఫిడవిట్ అంటేనే అసత్యాలకు కేరాఫ్ అడ్రస్ అనుకోవాలా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.. దేనికీ సమాధానం వెతక్కూడదంతే. అధికారంలో వున్నపడో మాట, ప్రతిపక్షంలో వున్నపడు ఇంకో మాట. ఇదో రకం రాజకీయ చెత్త. ‘మేం అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తెల్లగా మార్చేస్తాం..’ అని విపక్షంలో వున్నపడు చెప్పే మాటల్ని, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం మన రాజకీయ నాయకులకు, పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటోళ్ళు లెక్కల్ని తారుమారు చేయడం, తిమ్మిని బమ్మిని చేయడంలో వింతేముంటుంది.!

ఫొటో సెషన్లు అదిరిపోతున్నాయ్

దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ ఇపడు హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది మొదలు, పత్రికల్లోనూ ఛానళ్ళలోనూ ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఇంటర్నెట్ మాధ్యమాల్లోనూ ఎటు చూసినా సెలబ్రిటీల సందడే. చీపుళ్ళు చేతబట్టి చెత్తను ఊడ్చి పారేస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. సెలబ్రిటీల ‘స్వచ్ఛ భారత్’ సందడి అంతా ఇంతా కాదు. సినీ స్వచ్ఛ భారత్, కార్పొరేట్ స్వచ్ఛ భారత్, పొలిటికల్ స్వచ్ఛ భారత్.. ఇలా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని వివిధ విభాగాల కింద విభజించాలేమో.. అనేంతలా ఎడా పెడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్ని నిర్వహించేస్తున్నారు. మామూలుగా అయితే, నెల రోజుల క్రితం స్వచ్ఛ భారత్ షురూ అయిన దరిమిలా, దేశంలో ఎంతోకొంత మార్పు వచ్చి వుండాలి పరిశుభ్రత పరంగా. మరీ ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలూ క్లీన్ అండ్ గ్రీన్‌గా తయారైపోవాలి. మురికి వాడలు అంత తేలిగ్గా క్లీన్ అయిపోతాయని ఊహించడం అత్యాశే అవుతుందనుకోండి.. అది వేరే సంగతి.

Click Here For Great Andra E-Paper

ఇంతకీ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు క్లీన్ అండ్ గ్రీన్ అయ్యాయా.? అంటే, లేదు.. అనే సమాధానమివ్వాల్సి వుంటుంది. ఏ ప్రభుత్వాసుపత్రి తీరు చూసినా పారిశుధ్యం అధ్వాన్నమే. ప్రభుత్వ కార్యాలయాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్రభుత్వ పాఠశాలల గురించి ఎంత చెపకున్నా తక్కువే. మరి, ఫొటో సెషన్ల మాటేమిటి.? అంటే, నీట్‌గా రెడీ అయిపోయి.. చేతికి గ్లవ్స్ వేసుకుని.. ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అనుచరులతో వచ్చి హడావిడి చేసి, ఫొటోలకు పోజులిచ్చేసి, ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారంతా. ఈ ఫొటోసెషన్ స్వచ్ఛ భారత్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్తున్నారు మరి.

ఆలోచన అత్యుత్తమమైనదే అయినా…

స్వచ్ఛ భారత్.. ఎంత గొప్ప ఆలోచన ఇది.? ఆలోచనలోని గొప్పతనాన్ని ఎవరూ కాదనలేరు. ఏ ఆలోచన అయినా అమల్లోకి రాగానే దాన్నుంచి అద్భుతాలు ఆశించకూడదు. కానీ, ఇపడు నడుస్తోన్నది పబ్లిసిటీ ప్రపంచం. పబ్లిసిటీ కోసం నానా గడ్డీ తినడానికి సిద్ధమయిపోతున్నారు కొందరు. కొందరు కాదు చాలామంది. ఈ క్రమంలోనే స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటోన్న వారిలో ఎక్కువమంది పబ్లిసిటీ ఆశించినవారే తప్ప, ఆ కార్యక్రమంపై చిత్తశుద్ధి కలిగినవారు కాదన్న వాదనలు అనేకం. ఒక్కరోజు స్వచ్ఛ భారత్ అని నినదించేసి, ఓ బుట్టడు చెత్త ఎత్తి పారేయడం ద్వారా తమ పనైపోయిందనీ, తాము దేశానికి సేవ చేసేశాం అనుకోవడం హాస్యాస్పదమే. రోజూ చీపురు పట్టుకుని తిరగాలనేం రూల్ లేదుగానీ.. చేసే పని అయినా చిత్తశుద్ధితో చేస్తేనే కదా.. ఆ పని వల్ల ఫలితం లభించేది. ఎవరన్నా సెలబ్రిటీ తాను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడంటే, ‘ఏడిశాడు.. ఫొటోలకు పోజులిచ్చి వెళ్ళిపోతాడు చూడు.. అక్కడ చెత్త అలానే వుంటుంది..’ అని జనం పెదవి విరుస్తున్న పరిస్థితి. ప్రతిదాన్నీ విమర్శించుకుంటూ పోవడమూ సమంజసం కాదుగానీ, ఈ పబ్లిసిటీ హడావిడి కారణంగా, అసలు ఆలోచన.. దాని పరమార్ధం అటెకక్కిపోతున్నాయ్ మరి.

రాజకీయమే అధ్వాన్నం…

మళ్ళీ రాజకీయంలోకి వద్దాం. సెలబ్రిటీలు కాస్తో కూస్తో చెత్తన్నా ఏరుతున్నారు.. చాలామంది రాజకీయ నాయకులు అదీ చేయడంలేదు. చీపురు పట్టుకునేంతదాకా ఫొటోలకు పోజులిచ్చి సర్దేసుకోవడమే వారు చేస్తోన్న పని. అదే వారికి స్వచ్ఛ భారత్. ప్రజా ప్రతినిథులు తమ తమ నియోజకవర్గాల్లోని ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలాంటివాటి వద్దకు వెళ్ళి, పరిశుభ్రతపై నిత్యం ఓ కన్నేసి వుంచితే.. వారేం స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాల్సిన పనేం లేదు. ఆటోమేటిగ్గా పరిశుభ్ర భారత్ ఆవిష్కృతమవుతుంది. గత కొన్నాళ్ళుగా మీడియాలో స్వచ్ఛ భారత్ ప్రకటనలు మార్మోగిపోతున్నాయి. చాలా ఇన్‌స్పయిరింగ్‌గా వుంటున్నాయవి. కానీ ఏం లాభం.? రాజకీయ నాయకుల పుణ్యమా అని, అంతటి గొప్ప ఆలోచన కూడా అభాసుపాలైపోతోంది. నీతులు చెప్పడం సులభం.. పాటించడమే కష్టం.. అన్నది రాజకీయ నాయకులకు అతికినట్టు సరిపోతుంది. చెప్పడానికేం, మీడియా మైకులెలాగూ వారికి అప్పనంగా దొరుకుతాయి కాబట్టి, నోటికొచ్చింది మాట్లాడేస్తారు.. పబ్లిసిటీకి పోజులిస్తారు. అదే చేస్తున్నారిపడు రాజకీయ నాయకులు.

రాజకీయ చెత్తను ఏరి పారెయ్యాలి…

అపరిశుభ్రత ప్రజారోగ్యానికి పెనుముప. మరి, రాజకీయాల్లో అపరి శుభ్రతో.. అది సమాజానికి అత్యంత ప్రమాదకరమైనది. కానీ ఏం లాభం.? రాజకీయాల్లో చెత్తను ఊడ్చేందుకు ఎవరూ ముందుకొస్తున్న పరిస్థితులే లేవు. ముందే చెపకున్నాం కదా.. అధికారంలో వున్నపడొకలా, అధికారంలో లేనపడు ఇంకోలా.. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయ నాయకులు ఊసరవెల్లుల్లా వ్యవహరిస్తున్నారు తప్ప.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది.. ఆ ప్రజాస్వామ్యానికి దిశ, దశ చూపించేది మనమే.. అని ఆలోచన చేస్తున్నారా.? లేనే లేదు. రాజకీయ వ్యవస్థలోనే చెత్త పేరుకుపోయినపడు, సమాజంలో చెత్తను ఊడ్చిపారేయడంలో పాలకులకు చిత్తశుద్ధి వుంటుందని ఎలా అనుకోగలం.!

చెత్తను కుళ్ళబెడ్తోన్న రాజకీయం

పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించం.. అని అధికారం లేనపడు చెప్పిన పార్టీలు, అధికారంలోకొచ్చాక పార్టీ ఫిరాయింపుల్ని ఎంచక్కా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకు దేశంలో అధికారం వెలగబెడ్తోన్న భారతీయ జనతా పార్టీ అతీతం కాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. దేశ ప్రజలు మోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రధాని అయ్యాక మోడీ సైతం సగటు రాజకీయ నాయకుడిగా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిరాయింపు అంటేనే చెత్త.. ఆ చెత్తను తాను, తమ పార్టీ ప్రోత్సహించడం ద్వారా నరేంద్ర మోడీ, దేశ ప్రజలకు ఏం సందేశమివ్వాలనుకుంటున్నట్టు.? ఫిరాయింపుల చెత్తకు సంబంధించి తెరపైకొస్తున్న ప్రశ్నలకు నరేంద్ర మోడీ సహా, ఆయా రాష్ట్రాల్లో అదికారం వెలగబెడ్తోన్న పార్టీలూ సమాధానమివ్వాల్సి వుంటుంది. ‘అపడు మమ్మల్ని నిర్వీర్యం చేశారు.. ఇపడు మీరా మమ్మల్ని ఫిరాయింపులపై నిలదీసేది..’ అని అంటోన్న పార్టీల నైతికత ఏంటో ప్రజలకు అర్థమవుతుంది.. అయినాసరే, రాజకీయమే ఇంత అన్న నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప, సమాజంలోని చెత్త కాదు, రాజకీయాల్లోని చెత్త ఏరేయాలి.. అని నిలదీసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.

Click Here For Great Andra E-Paper

చెత్త ఏ రూపంలో వున్నా చెత్తే.. ఆ విషయం అధికారంలో వున్నవారికి అర్థం కావాలి. రోడ్ల మీద చెత్త కాదు, వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేసే దిశగా పాలకుల ఆలోచనలు ముందుకు సాగితేనే.. పరిశుభ్ర భారత్.. పూర్తిస్థాయిలో ఆవిష్కృతమవుతుంది. అది అభివృద్ధి చెందిన భారత్.. అనే గొప్ప కల సాకారం చేసే దిశగా ముందడుగు వేయడానికి ఉపయోగపడ్తుంది. కానీ, ఆ చిత్తశుద్ధి ఇపడున్న మన వ్యవస్థలో, మన రాజకీయాల్లో ఆశించగలమా.? ఆశించడం అత్యాశే అయినా.. ఆశిద్దాం.. ఆ కల సాకారమవ్వాలని కోరుకుందాం.

 సింధు