ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ మారు మూల గ్రామమది. మంత్రులు, కేంద్ర మంత్రులు ఇప్పటిదాకా పట్టించుకోని కుగ్రామం అది.
పేరు పుట్టంరాజు కండ్రిగ. షార్ట్ కట్లో పీఆర్ కండ్రిగ. ఆ గ్రామానికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వస్తారని గ్రామస్తులెవరూ ఊహించలేదు.
రావడం కాదు, ఆ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దత్తత తీసుకోవడమే కాదు, ఆ గ్రామంలో పనుల్ని పర్యవేక్షించడానికి సచిన్ వస్తాడనగానే ఆ గ్రామం మరింత పులకించిపోయింది.
ఆ రాక కూడా, తమతో మమేకం అవడం సచిన్ గొప్పతనానికి నిదర్శనం.. అని గ్రామస్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
పిల్లలతో సరదాగా మాట్లాడారు సచిన్. గ్రామస్తుల్ని, అధికారుల్ని అడిగి గ్రామంలో పరిస్థితుల్ని సచిన్ తెలుసుకున్నారు.
అధికారులు, పోలీసుల హంగామా ఎలా వున్నా, గ్రామస్తులైతే సచిన్‌ని చూడటానికి తమకు రెండు కళ్ళు చాలలేదని చెబుతుండడం గమనార్హం.
సుమారు 2 కోట్ల రూపాయల మేర ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాల్ని తన ఎంపీ నిధులతో (సచిన్ రాజ్యసభ సభ్యుడు కదా..) సచిన్ చేపడ్తున్నారు పీఆర్ కండ్రిగ గ్రామంలో.
మొత్తమ్మీద, సచిన్ కారణంగా పీఆర్ కండ్రిగ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది.
గ్రామానికి ఇరుగు పొరుగునున్న ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం చేరుకుని, సచిన్‌ని చూసేందుకు పోటీపడ్డారు.
ముందస్తుగా గ్రామస్తులకు అధికారులు ఐడీ కార్డులు ఇవ్వడంతో, వారిని మాత్రమే అనుమతించి తద్వారా సచిన్ పర్యటనను సజావుగా సాగేలా చేయగలిగారు.