‘మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను. ఇకపై ఇది నా ఊరు..’ అంటూ పుట్టంరాజు కండ్రిగ గ్రామస్తులకు చెప్పాడు రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. పీఆర్ కండ్రిగ గ్రామ అభివృద్ధికి తాను కట్టుబడి వున్నాననీ, గ్రామంలో సౌకర్యాల లేమిని తాను స్వయంగా చూశాననీ, అన్ని సమస్యలనూ పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నిస్తానని సచిన్ చెప్పాడు.
‘అందరికీ నమస్కారం..’ అంటూ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, తర్వాత ఇంగ్లీషులోనే సచిన్ మాట్లాడాడు. సచిన్ మాటల్ని అనువదించి, గ్రామస్తులకు వివరించారనుకోండి.. అది వేరే విషయం. మళ్ళీ తాను పీఆర్ కండ్రిగకు వస్తాననీ, అప్పటికల్లా చాలా అభివృద్ధి జరుగుతుందని సచిన్ గ్రామస్తులకు భరోసా ఇచ్చాడు.
చిన్న పిల్లలకు చదువు ముఖ్యమనీ, ఆటపాటలతో చదువుకోవాల్సిన చిన్న పిల్లల్ని స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులకు సచిన్ సూచించాడు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని స్వయం సహాయక సంఘాల సమావేశంలో చెప్పిన సచిన్, కాస్సేపట్లో గ్రామస్తులతో ముఖాముఖీ పాల్గొననున్నారు.