తుగ్లక్ అని ఎవరినైనా అంటే వాళ్లకు కోపం వస్తుంది – నేను పిచ్చివాణ్నా? అని. దక్షిణాదిన కూడా అదే అభిప్రాయం. తమిళ రచయిత, కమెడియన్ చో రామస్వామి ''మహమ్మద్ బీన్ తుగ్లక్'' పేరుతో రాజకీయ వ్యంగ్య రచన నాటకంగా వేసి, సినిమాగా తీసి పేరు తెచ్చుకున్నాడు. ''తుగ్లక్'' పేరుతో వారపత్రిక కూడా నడుపుతూంటాడు. సినిమాను తెలుగులో నాగభూషణం హీరోగా పునర్నిర్మించారు. దానాదీనా తుగ్లక్ అంటే కమెడియన్ అనే అభిప్రాయం నా మనసులో పడిపోయింది. ఎమ్మెస్సీ ఆగ్రాలో చేసిన మా క్లాస్‌మేట్ ఓసారి ''తుగ్లక్ అంటే మనం అనుకునే రీతిలో నార్త్ యిండియన్స్ అనుకోరు.'' అన్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. ఢిల్లీకి దగ్గరలో తుగ్లకాబాద్ వుంది. ఢిల్లీలో తుగ్లక్ రోడ్ వుంది. తుగ్లక్ అంటే పిచ్చివాడు అనే అర్థం ప్రాచుర్యంలో వుంటే వాళ్లు ఆ పేర్లు మార్చేసేవారు కదా. పైగా చో తన వారపత్రిక ఇంగ్లీషు వెర్షన్ ప్రచురించే రోజుల్లో నార్త్ ఇండియాకు కూడా వెళుతుంది కాబట్టి దానికి ''తుగ్లక్'' అని కాకుండా చార్లెస్ డికెన్స్ సృష్టించిన హాస్యపాత్ర ''పిక్విక్'' పేరు పెట్టాడు. నిజంగా తుగ్లక్ ఎలాటివాడు? హాస్యగాడా? ఎవరైనా తలతిక్కగా ప్రవర్తిస్తే తుగ్లక్ అనవచ్చా?
కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చినవాడు తుగ్లకే !
తుగ్లక్ చో, నాగభూషణం వంటి కమెడియన్ అయితే కాడు. 1321లో ప్రతాపరుద్రుణ్ని ఓడించి, బంధించి ఘనత వహించిన కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చేసిన యోధుడు అతనే. అప్పట్లో అతని పేరు ఉలుఘ్ జునా ఖాన్. తండ్రి ఘియాసుద్దీన్ ఢిల్లీ చక్రవర్తి. ఖిల్జీ రాజ్యపతనానంతరం రాజ్యానికి వచ్చాడు. తుగ్లకాబాద్ కట్టాడు. బలమైన దక్షిణాది రాజ్యాలను మట్టుపెట్టమని కొడుకుని పంపితే యితను పని పూర్తి చేసి తండ్రిని మెప్పించాడు. తూర్పున తలెత్తిన తిరుగుబాటు అణచడానికి ఘియాసుద్దీన్ 1324లో బెంగాల్ వెళుతూ ఢిల్లీ సంరక్షణను ఉలుఘ్‌కి అప్పగించాడు. విజయులై తిరిగి వస్తూన్న తండ్రిని, తమ్ముణ్ని ఉలుఘ్ లక్కయిల్లు టైపు మాయోపాయంతో చంపించివేశాడు. రాత్రి వాళ్లు బసచేసిన చెక్కయిల్లు కుప్పకూలేట్లా తయారుచేయించాడు. పిడుగుపడి కూలిపోయిందనే పుకారు ప్రచారంలో పెట్టాడు. తండ్రి మరణంపై బహిరంగంగా శోకం అభినయించి గద్దె నెక్కి, తన పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్‌గా మార్చుకుని 26 ఏళ్లపాటు ఢిల్లీ నుంచి పాలించాడు. అన్నాళ్లు పాలించాడంటే ఘటికుడే అని ఒప్పుకోవాలి. ఏకంగా ఇరాన్, ఇరాక్, చైనాల మీద దండెత్తడానికి కూడా తయారై పోయిన సాహసి.
అతని పాలనలో రాజ్యం విస్తరించి దాదాపు భరతఖండమంతా వ్యాపించింది. అంత విశాలం కావడంతో ఒక థ దాటిన తర్వాత తిరుగుబాట్లు వచ్చి పడ్డాయి. 1347 ప్రాంతంలో దక్షిణాదిన బహమనీ సుల్తాన్ రాజ్యాలు పుట్టుకు వచ్చారు. యుద్ధవ్యయం పెరిగిన కొద్దీ పన్నులు పెంచుతూ పోయాడు. పాలకుడిగా చూడబోతే తండ్రిలాగే హిందూద్వేషి. ధనిక హిందువులపై పదేసి రెట్లు పన్నులు వేసి చట్టపరంగా వాళ్లను దోచాలని చూశాడు. పన్నులు కట్టలేక, కరువు తట్టుకోలేక, వ్యవసాయం చేయలేక రైతులు దోపిడీ దొంగలుగా మారినా తుగ్లక్ తన విధానం మార్చుకోలేదు సరికదా, వాళ్లని అతి క్రూరంగా శిక్షించేవాడు. హిందువులనే కాదు, తన తెగకు సంబంధించని ముస్లిములను కూడా యిదే రీతిగా హింసించాడు. అతని ఆస్థాన చరిత్రకారుడు జియావుద్దీన్ బార్నీ 'ముస్లిము రక్తం చిందించకుండా ఒక్క రోజు కూడా గడవలేదు' అని రాశాడు.
రాజధాని విషయంలో తప్పు జరిగినంత మాత్రాన పిచ్చివాడనవచ్చా?
ఇంత చేసినా ఎవరూ అతన్ని కూలదోయలేక పోయారు. స్వంత బంధువులు తిరుగుబాటు చేసినా వాళ్లని అణచివేయగలిగాడు. సమర్థత, వీరత్వం, క్రూరత్వం కలిసిన యిటువంటి తుగ్లక్‌ను పిచ్చివాడిగా మనం అనవచ్చా? అని పిచ్చివాళ్ల మవుతామా? రాజధాని మార్పు, వెండి బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు ప్రవేశపెట్టడం అనే రెండు విషయాల్లో అతను తిక్కగా ప్రవర్తించాడు. దేశానికి ఉత్తరభాగంలో వుండి, శత్రువుల దాడికి పదేపదే గురి కావడం కంటె దేశమధ్యంలో రాజధాని వుంటే అన్ని ప్రాంతాలపై పట్టు వుంటుందని తలపోశాడు. ఢిల్లీ పాలకుల్లో ఏ మాత్రం అంతఃకలహాలు చెలరేగినా దక్షిణాది రాజ్యాలు, తూర్పున బెంగాల్ తిరుగుబాటు చేసేవి. అణచడానికి యువరాజును పంపడం, అతడు జయించి ఢిల్లీ చేరుతూండగానే వీళ్లు మళ్లీ పిలక ఎగరేయడం జరిగేది. అందువలన రాజధాని దేవగిరి వంటి దేశమధ్యప్రాంతంలో వుంటే అన్ని ప్రాంతాలపై నిఘా వేయవచ్చు, సైన్యాన్ని వెంటనే పంపి తిరుగుబాటు తలెత్తకుండా చేయవచ్చు. వాయువ్యం నుంచి శత్రుసైనికులు రాజధాని చేరేలోపున ఎలర్ట్ కావచ్చు.
ఈ వాదనలో తప్పుందని భావించి అతన్ని పిచ్చి తుగ్లక్ అంటే – యిప్పుడు ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్నదేమిటి? రాష్ట్రం నడిబొడ్డున రాజధాని వుండాలి అనే కదా గుంటూరు జిల్లాలో రాజధాని పెడుతున్నారు. మరి యిప్పటి పాలకులను ఏమనాలి? దేశంలో అనేక రాష్ట్రాలలో రాజధాని మధ్యలో లేవని, ఈ-గవర్నెన్స్ నడిచే యీ రోజుల్లో దూరమనేది ఒక ఫ్యాక్టరే కాదని ఎన్ని ఉదాహరణలు చూపినా ఎవరైనా విన్నారా? పాలకపక్షం, ప్రతిపక్షాలు ఎవరూ దీని గురించి అభ్యంతర పెట్టటం లేదు కదా. అంటే ఏమిటి అందరూ తుగ్లక్ వారసులనేగా!
రాజధాని వున్నచోటకి జనాలు రారా?
'దేవగిరిని రాజధానిగా సెలక్టు చేయడం తప్పు కాదండి, అక్కడకి ఢిల్లీ నుంచి జనాలను తరలించడమే పిచ్చిపని అంటున్నాం' అని కొందరు వాదించవచ్చు. తుగ్లక్ జనాలను ఎందుకు తరలించాడు? కొత్తచోట రాజధాని పెడితే జనం వుండరు, బోసిపోతుంది అనే కదా! ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అంటున్నారు కదా. దొనకొండలో రాజధాని పెడితే జనాలు ఎవరూ రారు. కళ్లు చెదిరేలా రాజధాని కడితే చూడడానికి విదేశీయాత్రికులు వస్తారు తప్ప, స్వదేశస్తులెవరూ వచ్చి స్థిరపడరు అంటున్నారు కదా. ఏదైనా ప్రాజెక్టు కట్టడానికి ఉపక్రమించినప్పుడు ఖాళీ స్థలంలోనే కడతారు. కట్టడానికి వచ్చిన ఇంజనియర్ల కోసం వారంలోపుగా ఉడుపి హోటళ్లు, కూలీల కోసం పాక హోటళ్లు వెలుస్తాయి. ఇక అక్కణ్నుంచి ఒక్కొక్కటి వచ్చి చేరతాయి. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ మొదట్లో ఎలా వుండేవో, తర్వాత తర్వాత ఎంతమంది జనం వచ్చి చేరారో కళ్లతో చూశాం.
Click Here For Great Andra E-Paper
అంతెందుకు బాబు మాదాపూర్ కట్టడానికి ముందు అక్కడేముందో ఆయనకు తెలియదా? హైటెక్ సిటీ అక్కడ కడుతున్నాం అన్నారు. అంతే, ఐదేళ్లు తిరిగేసరికి అంగుళం స్థలం దొరక్కుండా అయిపోయింది. ఒక్క సైబర్ టవర్సే యింత మ్యాజిక్ చేయగా లేనిది, సువిశాల ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కడుతున్నాం అంటే ఆ చోటికి జనం రాకుండా పోతారా? ఏడు శతాబ్దాల క్రితం తుగ్లక్‌కి ఆ ఆలోచన రాలేదు. జనాలను తరలించి భంగపడ్డాడు. అధికారం వుంది కాబట్టి తరలిరాని వాళ్లను శిక్షిస్తానని బెదిరించాడు. ఇప్పుడు అలాటి బెదిరింపులు చెల్లవు కాబట్టి జనాలు వున్న చోటే కడతామని అంటున్నారు. రెండింటి వెనక్కాల మూలాభిప్రాయం ఒక్కటే – 'కొత్త రాజధానికి జనం రారు' అని.
భూములిస్తామంటున్నారట! టెర్మ్‌స్ తేలాయా?
రాజరికంలో రాజు పరమ క్రూరంగా వ్యవహరిస్తున్నా ప్రజలు ఓపికున్నంతవరకు సహించి ఆ పై తిరగబడ్డారు, శిక్షల పాలబడ్డారు. ఇప్పడున్నది ప్రజాస్వామ్యం. అందుకని రాజధాని కోసం భూములిమ్మని ప్రజల్ని అడగాల్సి వస్తోంది. ప్రభుత్వం తరఫున ఓ కమిటీ వూరూరూ తిరిగి తాయిలాలు ఆశ చూపుతుంటే ప్రజలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. ఆ డిమాండ్లు తీరుస్తామని కమిటీ వారు కాగితాల మీద కమిట్ కావటం లేదు కానీ ఫలానా గ్రామప్రజలు ఓకే అన్నారని ప్రెస్ రిలీజులు యిచ్చేస్తున్నారు. దస్తావేజుల దగ్గరకొచ్చేసరికి ఏమవుతుందో మరి! ఎకరానికి ప్రభుత్వం యివ్వచూపుతున్నది రూ.2.50 లక్షలు, అదీ పదేళ్లలో విడతలుగా యిస్తారట. ఇప్పుడు అక్కడున్న రేటులో యిది ఎన్నో వంతు? అందుకే గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తెస్తాం భూములిమ్మంటే అక్కడి జనం పోవోయ్ అన్నారుట.
చట్టప్రకారం లాండ్ ఎక్విజిషన్ వుంది. దానికి కొన్ని రూల్సున్నాయి. ప్రయివేటు ప్రాజెక్టయితే ప్రభావిత ప్రజలలో 80% మంది, పిపిపి అయితే 70% మంది ఒప్పుకోవాలని, సాగునీరు, ఎక్కువ పంటలు వున్న భూముల్ని సేకరించకూడదని, తప్పనిసరై సేకరించిన పక్షంలో మార్కెట్ రేటు కంటె నాలుగింతల నష్టపరిహారం యివ్వాలని యిలా సవాలక్ష షరతులు పెట్టారు. ఆ రూటులో వెళితే యిబ్బందులున్నాయని లాండ్ పూలింగ్ అనే పేరుతో తంతు మొదలుపెట్టారు. దీనికి చట్టం అంటూ ఏమీ లేదు. భూయజమానులు, ప్రభుత్వం ఎవరి ఓపిక కొద్దీ వారు బేరాలాడుకోవడమే. డెవలప్ చేసి దానిలో యింత పెర్శంటేజి భూమి మీకు తిరిగి యిస్తాం అంటోంది ప్రభుత్వం. భూయజమానులు ఆ పెర్శంటేజి చాలదంటున్నారు. బేరం కుదరకపోతే ఏం చేయాలి? ఒప్పుకోనివాడి కాలు రథానికి కట్టి యీడ్చుకెళ్లడానికి ఇది తుగ్లక్ జమానా కాదు. ఎంత యిచ్చినా రేటు చాల్లేదంటూ ప్రజల్ని విపక్షాలు రెచ్చగొట్టే రిస్కుంది. అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పార్టీల మాటకు కాస్తో కూస్తో విలువ యిస్తే సజావుగా సాగేదేమో. కానీ తెలంగాణలో కెసియార్ అప్పోజిషన్‌కు ఎంత విలువ యిస్తున్నారో ఆంధ్రలో బాబు కూడా అంతే యిస్తున్నారు. ఇద్దరికీ అఖిలపక్షం అంటే మంట.
ఇచ్చిన హామీలు నెరవేర్చే వ్యవధి వుందా?
అసలు ప్రభుత్వం చెప్తున్న హామీలను ఏ మేరకు నమ్మాలి? బాబు మాటలకు విశ్వసనీయత లేదని వైయస్ డప్పేసి చెప్తూ వచ్చారు. అయినా యీ ఎన్నికల్లో టిడిపి చేసిన మాఫీల హామీలను జనాలు నమ్మి ఓటేశారు. తీరా చూస్తే ఏమైంది? అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క డ్వాక్రా, ఒక్క రైతు ఋణ మాఫీ అయిందా? ఋణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బిఐ అంగీకరించిందంటూ మంత్రులు చెప్పినది అబద్ధమని తేలింది. రీషెడ్యూల్ కోరుకునేవాళ్లు హుదూద్ తుపాను తమ ప్రాంతాల్లో కూడా రావాలని మొక్కుకోవాలి. ఋణమాఫీ హామీలు నమ్మి బ్యాంకులకు అప్పు కట్టడం మానేసి కొత్త ఋణాలు లేకుండా, క్రాప్ ఇన్సూరెన్సు లేకుండా చేసుకున్నారు రైతులు. బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్తూ వచ్చి చివరకు షాపులుంచి బెల్టు పేరు మాత్రం తీసేశారు. థలవారీ మద్యనిషేధం అని చెప్పి, యిప్పుడు మద్యం అమ్మకాలు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇలాటి ప్రభుత్వం ఐదేళ్లలో రాజధాని కట్టేసి ఆ తర్వాత అదిస్తాం, యిదిస్తాం అంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా వుంటారు? రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని, ప్రభుత్వభూమి 1500 ఎకరాలు మాత్రమేనని సర్కారు అంటోంది. వ్యవసాయం నడిచే చోట సెజ్‌లకు భూమి సేకరించడం కష్టంగా వున్న యీ రోజుల్లో పంటలు పండే ప్రాంతంలో 28500 ఎకరాలు యీ లాండ్‌పూలింగ్ పద్ధతిలో ఏ వివాదం లేకుండా సేకరించడం జరిగే పనా? దేనికైనా కేంద్రం డబ్బులివ్వాలి కదా! హుదూద్ నష్టం 60 వేల కోట్లని రాష్ట్రం అంచనా వేస్తే కేంద్రం ప్రకటించిన సాయం వెయ్యి కోట్లు. ఇప్పటిదాకా దానిలో ఐదో వంతు వచ్చినట్లుంది. క్రాప్ ఇన్సూరెన్సు విషయంలో మోదీ యిచ్చిన హామీ అమలైందా? ఐ డౌట్. తెలంగాణ, ఆంధ్ర మధ్య పేచీలు సత్వరంగా పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి వున్నట్టు ఎక్కడా తోచటం లేదు. ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ, జలాల పంపిణీ అన్నీ పెండింగులోనే వున్నాయి. ఇద్దరి మధ్య సయోధ్య లేదని తెలిసి కూడా 'మీ యిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. తెమలకపోతే కోర్టుకి వెళ్లండి' అంటోంది కేంద్రం.
ఇప్పటి ఒప్పందం అప్పటికి చెల్లుతుందా?
ఇలాటి కేంద్రం రాష్ట్రం పట్ల ఉదారంగా వుంటూ రాజధానికై లక్షల కోట్లు గుమ్మరిస్తూ మూడు నాలుగేళ్లలో నిర్మాణం పూర్తయేందుకు సహకరిస్తుందంటే ఎలా నమ్మగలరు? ఐదేళ్ల తర్వాత యిదే పార్టీ ప్రభుత్వం వుంటుందని, వున్నా రాబోయే అధినేత యీ హామీలు అమలు చేస్తారని గ్యారంటీ ఎక్కడుంది? ఎన్టీయార్ రూ.2 లకే బియ్యం అంటూ అధికారంలోకి వచ్చారు. ఆయన్ని దింపేసిన చంద్రబాబు కూడా టిడిపి ముఖ్యమంత్రే. రేటు మూడున్నరకు పెంచారు. సమైక్యరాష్ట్రంలో వుండగా మొదలుపెట్టిన పథకాలకు, యిచ్చిన హామీలకు తెలంగాణ ప్రభుత్వం పూచికపుల్ల విలువ యివ్వటం లేదు. అప్పటి రేషన్ కార్డులు కూడా పనికి రావంటున్నారు. ఒప్పందాలు తిరగరాస్తామంటున్నారు. ఈనాడు బాబు ప్రభుత్వంతో భూయజమానులు చేసుకునే ఒప్పందాలు 2019 లోపున పని పూర్తయితేనే చెల్లుతాయి. తర్వాతది దైవాధీనమే. పంటభూముల విషయంలో యింకో చిక్కు కూడా వుంది. భూములివ్వడానికి ముందుకు వస్తున్నారు అని ప్రభుత్వం చెప్తున్నవారు యజమానులో, కౌలుదారులో స్పష్టత లేదు. భూమి అమ్మడానికి యజమాని ఔనన్నా కౌలుదారులు అడ్డుపడవచ్చు. మామూలుగా భూమి అమ్మబోయినా కౌలుదారులకు కొంత భాగం యివ్వకపోతే వాళ్లు అమ్మనీయటం లేదు. ఇప్పుడు మీకు వచ్చే కమ్మర్షియల్ స్పేస్‌లో కొంత మా పేర రాయకపోతే మేం స్వాధీనం చేయం అని లిటిగేషన్‌లు పెడితే మాత్రం మరింత ఆలస్యం అవుతుంది. నాకు తెలిసి ఏ ప్రాజెక్టూ అన్న టైముకి పూర్తి కాలేదు. ఈ రాజధాని కూడా 2014లోపున అయిపోతుందని తోచదు.
Click Here For Great Andra E-Paper
తుగ్లక్‌ను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటే యీ రాజధాని తరలింపు వలన కలిగిన ఒక పరిణామం ఏమిటంటే – దేవగిరికి వచ్చిన ఉత్తరభారత ముస్లిములు మళ్లీ వెనక్కి వెళ్లకుండా దక్కన్‌లోనే స్థిరపడి, దక్షిణాదికి విస్తరించారు. దక్కన్‌మీద ప్రేమ కాదు, తుగ్లక్‌కు ఎంత దూరంగా వుంటే అంత మంచిదని. రాజధాని మాకు కావాలంటే మాకు కావాలని డిమాండ్ చేసిన తక్కిన ప్రాంతాల వాళ్లు యిప్పుడు 'హమ్మయ్య మనకు రాజధాని రాలేదు' అనుకునేట్లా తయారైంది పరిస్థితి. ఎందుకంటే కృష్ణా, గుంటూరు జిల్లాలలో సామాన్యుడి పరిస్థితి అధ్వాన్నమై పోయింది. ఇళ్ల అద్దెలు పెంచేశారు. గుడిసె వేసుకునే స్థలం కొనలేని పరిస్థితి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే స్థలాలున్నవాళ్లు ఎవరైనా బలవంతులు వచ్చి ఆక్రమిస్తారని భయపడుతున్నారు. బయటివాళ్లు యిబ్బడిముబ్బడిగా వచ్చిపడి తమను డామినేట్ చేస్తారనే భయం ఎలాగూ వుంటుంది.
పౌరుల్లో కొంతమందిని పరాయివాళ్లగా చూశాడు తుగ్లక్
తుగ్లక్ మేధావి. కవిత్వం కూడా తెలుసు. తన మంత్రులతో సహా ఎవర్నీ నమ్మేవాడు కాడు. ప్రతికకక్షుల పట్ల అతి నిర్దయగా వ్యవహరించేవాడు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి జంకేవాడు కాడు. ఇస్లాం వ్యాప్తికై యితర దేశాలపై దాడి చేసిన తర్వాత బొక్కసం ఖాళీ అవుతూంటే వెండి నాణాల బదులు రాగి నాణాలు వేయించాడు. ఉద్దేశం మంచిదే. నిజానికి తర్వాతి రోజుల్లో అలాటి నాణాలే చలామణీలోకి వచ్చాయి. అయితే తుగ్లక్ పొరబాటేమిటంటే రాంగ్ టైమింగ్. సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం. హిందువులపై పన్నులు విపరీతంగా పెంచిన సమయంలోనే యివి ప్రవేశపెట్టడంతో హిందువులు యిళ్లను టంకశాలలుగా మార్చేసి దొంగ కరెన్సీ సృష్టించారు. వాళ్లు కట్టాల్సిన పన్నులు, జిజియా, నజరానాలు అన్నీ రాగి నాణాలతో చెల్లించారు. ఖజానా వీటితో నిండిపోయింది. ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది.
దీనికంతా కారణం పౌరులందరినీ సమానంగా చూడాలన్న యింగితం లోపించడం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాంతం ఆధారంగా వివక్షత చూపిస్తున్నట్లు, అతను మతం ఆధారంగా కొందరిపై కక్ష సాధించినట్లు వ్యవహరించాడు. వాళ్లు అదను చూసి యిదిగో యీ నాణాల విషయంలో వాత పెట్టారు. రాబడి పోడంతో ఉద్యోగులకు జీతాలకు బదులు పన్నులు వసూలు చేసే అధికారం యిచ్చేశాడు. వాళ్లు జనాలను పిండేశారు. ప్రజల అసంతృప్తిని ఆధారం చేసుకుని ప్రాంతీయ పాలకులు తిరగబడ్డారు. క్రమక్రమంగా అతని రాజ్యం చిక్కిపోయింది. గుజరాత్, సింధు ప్రాంతాల్లో తిరుగుబాటు అణచే పనిలో వుండగానే చచ్చిపోయాడు. ఏదైనా అతి చేస్తే యిలాగే అవుతుంది. రాజధాని విషయంలో కూడా నిర్ణయం కరక్టయినా ఆచరణలో టూమచ్ చేయడం వలన దెబ్బ తిన్నాడు.
చెఱువులు నిండుగా వున్నపుడు ఖాళీ చేస్తారట
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెఱువులు పునరుద్ధరణ పథకం మొదలుపెట్టింది. దివ్యమైన ఆలోచన. గొలుసుకట్టు చెఱువులు అంటూ వాటిని అనుసంధానం చేసి, క్యాచ్‌మెంట్ ఏరియాల్లో అడ్డంకులు తొలగించి, వర్షజలాలను భద్రపరచుకోగలిగితే అంతకంటె ఏం కావాలి? మన నీళ్లు ఎత్తుకుపోతున్నారని ఎవరిమీదా పడి ఏడవనక్కర లేదు. ఊరూరా, గ్రామగ్రామానా చెఱువులు ఆక్రమించినది ఆంధ్రావాళ్లే అని ఉద్యమకాలంలో చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆక్రమణలు తొలగించినపుడు ఆక్రమణదారులెవరో తెలిసిపోతుంది. ఆంధ్రావాళ్లే అయితే పనిలో పనిగా వాళ్ల ఆస్తి క్షవరం చేసినట్లయి కసి కూడా తీరుతుంది. డబుల్ బెనిఫిట్. ఇంత మంచి పథకానికి కెసియార్ టైమ్ ఫ్రేమ్ పెట్టారు. పూడిక తీసే పనులు డిసెంబరులో మొదలుపెట్టి మార్చికల్లా పూర్తి చేయాలట. ఇక్కడే మనకు తుగ్లక్ పోకడ కనబడుతుంది. వేసవిలో చెఱువు ఎండిపోయినప్పుడు, లేదా నీళ్లు బాగా తక్కువగా వున్నపుడు తవ్వి లోతు చేస్తారు. ఇంట్లో బావి కైనా అంతే. అసలే నీటికొరతతో తెలంగాణ బాధపడుతూ వుంటే డిసెంబరులో చెఱువులు ఫుల్లుగా వున్నపుడు నీళ్లు తోడి అవతల పారబోయమంటున్నారు కెసియార్.
Click Here For Great Andra E-Paper
హిట్లర్ రష్యాపై దాడి చేయడం కరక్టుగానే ప్లాన్ చేశాడు. అయితే టైమింగ్ విషయంలో తప్పు చేశాడు. శీతాకాలంలో రష్యాకు సైన్యాన్ని పంపించాడు. అక్కడి భయంకరమైన చలి తట్టుకోలేక సైన్యం నాశనమై మొట్టమొదటి ఓటమి చవి చూశాడు. ఇక అక్కణ్నుంచి పతనమే. గతంలో నెపోలియన్ యిదే తప్పు చేశాడు. అయినా హిట్లర్ నేర్చుకోలేదు. 'నేను హిట్లర్‌నే కాదు, హిట్లర్ తాతను' అని కెసియార్ అనడంలో అర్థం యిదేనేమో నాకు తెలియదు. టైమింగ్ ఒకటే కాదు, ఏదీ అరకొరగా చేయకూడదు. అసలు చెఱువులు లోతు చేసినా ఆ నీరు పారడానికి కాలువలు కూడా రెడీ చేసుకోవాలి. మూసీ కాలువలు అర్జంటుగా పునరుద్ధరించకపోతే పూర్తి ప్రయోజనం సిద్ధించదట. కానీ ఆ పన్లకు బజెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదు.
కేవలం అంకెల కోసమే సమగ్ర సర్వేట
రాజధాని మార్చినపుడు తుగ్లక్ తనూ, తన అధికారులు కదలి వస్తే సరిపోయేది. జనాలంతా తరలి రావాలంటూ భారీ ఎత్తున ప్లాన్ చేసి దెబ్బ తిన్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాధినేతలూ యీ 'భారీ' జబ్బుతో బాధపడుతున్నారు. సింహావలోకనం చేసి చూస్తే సమగ్రసర్వేకు 'ప్రపంచంలోనే ఎక్కడా జరగనట్లుగా' అని చెప్పుకునేటంత హైప్ అవసరమా అనిపిస్తుంది. దాన్లో పాల్గొంటే చాలు, రేషన్ కార్డులతో సహా సమస్త కార్డులు యిస్తామని వూరించారు, అవేళ మిస్సవుతే యిక నిన్ను మనిషిగానే లెక్కవేయం అంతా హుళక్కే అని భయపెట్టి దేశవిదేశాల్లోని తెలంగాణ వారందరినీ హింస పెట్టేశారు. ఒక్కరోజులోనే ఎందుకంటే డూప్లికేషన్ లేకుండా అన్నారు. అది ఫన్నీగా అనిపించింది నాకు. మల్లాది నవల ఒకదానిలో హైదరాబాదులో వుండే ఒక యిల్లాలికి బెంగుళూరులో ఒక ధనికుడైన ప్రియుడు వుంటాడు. మొగుణ్ని ఆఫీసుకి పంపించి, పది గంటల ఫ్లయిట్‌లో బెంగుళూరు వెళ్లి, అతనితో సుఖించి, సాయంత్రం ఫ్లయిట్‌లో హైదరాబాదు వచ్చేసి మొగుడు యిల్లు చేరేలోపున యిల్లు చేరుతుంది. ఆ విమానం హైజాక్‌కు గురి కావడంతో ఆమె వ్యవహారం బయటపడుతుంది. చెప్పవచ్చేదేమిటంటే 12 గంటలనేది చాలా పెద్ద వ్యవధి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఆపేసినా సొంతకారు వుంటే హైదరాబాదులో నిజామాబాద్‌లో ఒకే రోజు నమోదు చేయించుకోగల సౌలభ్యం వుంది. ఆ నాటి సర్వేలో 80% జనాభా మాత్రమే కవర్ అయ్యారు. తక్కిన 20%కి మళ్లీ చేస్తారట, 'అయినా సర్వే అనేది నిరంతర ప్రక్రియ, సా..గుతూనే వుంటుంది' అంటున్నారు ఈటెల – యిప్పుడు. ఆ భాగ్యానికే ఒక్క రోజు మాత్రమే అంటూ స్టాఫ్‌తో సహా అందర్నీ వేధించడం దేనికి? డూప్లికేషన్ నివారించాలంటే బయోమెట్రిక్ విధానం వుపయోగించాల్సింది. ఇంత చేసి ఇప్పుడు అదంతా జస్ట్ గణాంకాల కోసమే, రేషన్ కార్డులు కావాలంటే మళ్లీ ఎమ్మార్వోల క్యూ కట్టాల్సిందే అన్నారు. మళ్లీ మూడు రోజులు దాటితే కాన్సిల్ అనే బెదిరింపు. రేషన్ కార్డుల జారీ నిరంతరం సాగేదే, ఎప్పుడైనా రావచ్చంటే ఆ రద్దీ, ఆ చావులు వుండేవి కావు. చావులయ్యాక గడువు పెంచారు. అప్పుడైనా అప్లికేషన్ ఫారాలకు ఫిక్సెడ్ ఫార్మాట్ లేదు. మళ్లీ యింకోసారి సరిగ్గా అప్లయి చేసుకోవాలని చెప్పినా విస్తుపోవద్దు.
సమగ్రసర్వే వలన ఒనగూడిన ప్రయోజనం ఏమిటంటే ఏ కులంవారు ఎంతమంది వున్నారో గణాంకాలు తెలిశాయి – ప్రభుత్వానికి, మనకు కాదు. పైకి చెప్పకూడదట. వాటి ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తే ఆ సర్వేకు చట్టబద్ధత లేదు కాబట్టి కోర్టులు ఒప్పుకోవు. 'కానీ ఆ సర్వేవలన చాలా మేలు కలిగింది. విడిపోయిన కుటుంబాలు కలిశాయి. విడాకులు తీసుకుందా మనుకున్నవాళ్లు రేషన్ కార్డు పోతుందన్న భయంతో ఓ పూట ఒకే చూరు కింద గడపడంతో మళ్లీ ఒక్కటయ్యారు' అంటున్నారు ఈటెల. రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం సాధించినది కాపురాలు నిలబట్టే యీ ఘనకార్యమా? ఓ పూటలోనే అంత మార్పు వచ్చేస్తే ఫ్యామిలీ కోర్టులు ఎత్తేయవచ్చు. ఆ 20 కోట్లు ప్రభుత్వానికైన స్టేషనరీ, భత్యాల ఖర్చు కావచ్చు. ఉద్యోగులు జేబులోంచి చాలా ఖర్చు పెట్టుకున్నారు. ఫ్యాక్టరీలకు, దుకాణాలకు ఒకరోజు ఆదాయం నష్టమైంది. పౌరులకైతే యింకా యింకా ఖర్చయింది. అడలగొట్టి దుబాయి వంటి విదేశాల నుంచి వచ్చిన వారి నష్టం లక్షల్లో వుంటుంది. ఇందర్ని యింత రొష్టు పెట్టి పాలకులు ఏం సాధించారు? రొటీన్ సమాచారమా? ఆస్తుల సంగతి అడిగి అప్పుల గురించి వదలేసిన అరకొరసమాచారంతో పౌరుడి ఆర్థికస్థితిని ఎలా లెక్కించగలరు? అతని మేలు కోసం పథకాలు ఎలా రచించగలరు?
'నేను చిరంజీవినే' అని అదృశ్యరూపంలో తుగ్లక్ పలుకుతున్నట్లు తోస్త్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)