ఏ రోజు పేపరు చూసినా కెసియార్‌ది ఏదో ఒక ప్రకటన వుంటోంది. అప్పుడప్పుడు బోనస్‌గా హరీశ్‌ది, కెటియార్‌ది వుంటుంది. తక్కినవాళ్లందరూ చుప్. ఆర్థికమంత్రి, హోం మంత్రి, డిప్యూటీ సిఎం వంటి పదవులు మామూలుగా అయితే ముఖ్యమైనవే కానీ గతంలో భంగపడిన సందర్భాలు గుర్తుండిపోయి వారెవరూ నోరు విప్పటం లేదు. ఇప్పితే మూసుకోమని పెద్దాయన చెపుతారన్న భయం కాబోలు. నిజానికి సమైక్యరాష్ట్రంలో వుండగా ఈటెల, నాయిని, జూపల్లి యిత్యాదులు నిత్యం మాట్లాడుతూండేవారు. కాంగ్రెసు ముఖ్యమంత్రిని ఏ ప్రాంతపు మంత్రీ లక్ష్యపెట్టేవారు కారు. తమ చిత్తం వచ్చినట్లు మాట్లాడేవారు. ఇప్పుడదంతా బంద్. నిజాంను కీర్తిస్తూనో, ఆంధ్ర సర్కారును తిడుతూనో మాట్లాడమంటే మాత్రం మాట్లాడతారు. విధాన ప్రకటనల జోలికి వెళ్లరు. విద్యామంత్రి జగదీశ్వరరెడ్డి మాత్రమే అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తూ వుంటారు. అది కూడా ఆంధ్రపై పేచీ పెట్టుకునేవే తప్ప తెలంగాణ విద్యార్థులకు మేలు చేసే ఫాస్ట్ పథకం ఎప్పణ్నుంచి అమలవుతుందో దాని గురించి మాట్లాడరు.
ఆంధ్ర రాష్ట్రంలో బాబు మాట్లాడతారు, ఆ తర్వాత నారాయణ, పుల్లారావు వంటి ఒకరిద్దరు మాట్లాడతారు. బస్. ముందు నుంచీ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, సర్వం తన కనుసన్నల్లో నడిచేట్లు చూసుకోవడమే బాబు అలవాటు. డెలిగేట్ చేయడం రాకనే ఆయన పార్టీ, ప్రభుత్వం రెండూ దెబ్బ తిన్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి పద్ధతి మార్చుకుంటారనుకున్నాం. మార్చుకోలేదు. టిడిపి హయాంలో మంత్రులతో చెప్పి పనులు చేయించుకోవడం జరిగేది కాదు. మంత్రిగారు ఎంత కన్విన్స్ అయినా తప్పకుండా చేస్తానని కమిట్ అయ్యేవారు కారు. ''పెద్దాయన ఏమంటారో చూడాలండి..'' అంటూ నాన్చేవారు. ఈయన చెప్పినదంతా విని బాబు తల నిలువుగా వూపుతారో, అడ్డంగా వూపుతారో తెలియదు. అలా ఎందుకు వూపారో అడిగే ధైర్యం సహచర మంత్రులకు వుండేది కాదు. 'నాకు తెలుసు కదా, ఏం చేయాలో ఎప్పుడు చేయాలో నేను చూసుకుంటా..' అనేదే బాబు నోటివెంట వచ్చే హామీ. తన వద్దకు వచ్చినవాడికి పని అయిందని చెప్పాలో, కాలేదని చెప్పాలో మంత్రికి తెలిసేది కాదు. ప్రజలు కూడా తక్కిన మంత్రులంతా సోంబేరులనీ, బాబు లేకపోతే పరిపాలనా రథం ఎప్పుడో క్రుంగిపోయేదనీ ఫీలయ్యేవారు. వాళ్లు అలా ఫీలయ్యేట్లా బిల్డప్ వుండేది. 'నేను ఊరుకోను, కమ్చీ పట్టుకుని మంత్రులను, అధికారులను తరుముతూంటా. నేను పడుక్కోను, యింకోణ్ని పడుక్కోనివ్వను. నేను కాస్సేపు కళ్లు మూసుకుంటే యింకేమైనా వుందా, కొంపలు మునిగిపోవూ…' అని బాబు తరచుగా అంటూంటారు.
బాబుకి సహచరుడైన కెసియార్ అదే ఫార్ములాను తన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఏ మంత్రిత్వశాఖకు చెందిన నిర్ణయమైనా సరే, ఆయన చేయాల్సిందే, మామూలుగా ఫార్మా సిటీ గురించి ఆరోగ్యశాఖ మంత్రి, ఫిల్మ్ సిటీ గురించి సినిమాటోగ్రఫీ మంత్రి, యాదగిరిని తిరుపతంత చేయడం గురించి దేవాదాయ శాఖ మంత్రి, దళిత భవన్ గురించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి… యిలా సంబంధిత మంత్రి మాట్లాడితే చేస్తే వాళ్లూ ఏదో పని చేస్తున్నారని, ఉత్తినే జీతం తీసుకోవడం లేదనీ మనం అనుకోవడానికి ఆస్కారం వుంటుంది. అలా అనుకునే హెల్త్ యూనివర్శిటీ గురించి రాజయ్య ప్రకటించి చివాట్లు తిన్నారు. ఏదో కథ చెప్తారు – ముష్టివాడొస్తే కోడలు పొమ్మందట. అది చూసిన అత్తగారు ముష్టివాణ్ని వెనక్కి పిలిచి, అప్పుడు పొమ్మందట. 'పిలిస్తే పెట్టడానికి అనుకున్నా, పొమ్మనడానికి మళ్లీ పిలవడం దేనికి?' అని ముష్టాడు అడిగితే 'పెట్టడానికైనా, పొమ్మనడానికైనా అత్తగారిని నాకు హక్కుంటుంది తప్ప కోడలెవత్తి స్వతంత్రించి పొమ్మనడానికి..' అని అత్తగారు అధికారం చాటుకుందట. ఫైనల్‌గా రాజయ్య చెప్పిన ప్రకారమే వరంగల్‌లో పెట్టినా, అది చెప్పాల్సింది తను మాత్రమే అని కెసియార్ అత్తరికం చాటుకున్నారు. ఇక అప్పణ్నుంచి మంత్రులు మౌనవ్రతం పట్టారు. బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా చేయడానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి సిఎం అధికారులతో చర్చిస్తున్న ఫోటో పేపర్లలో వచ్చింది. దానిలో ఆరోగ్యమంత్రి కనబడలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ సమస్య వుంది. ఆ వ్యాధితో 19 మంది మరణించారని మీడియాలో వార్త రాగానే కెసియార్ జూలు విదిల్చారు. ''ఆంధ్రభూమి'' ప్రకారం '…రాష్ట్ర యంత్రాంగాన్ని దడదడ లాడించారు, మంత్రులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తే తాను ఎంత తీవ్రంగా పరిగణిస్తానో పరోక్షంగా తెలిసి వచ్చేలా వ్యవహరించారు, ఇంతకాలం వైద్య, ఆరోగ్యశాఖ చాలా తేలికగా తీసుకుంది. బుధవారం మీడియా కథనాల పట్ల స్పందించిన ముఖ్యమంత్రి మోదీతో , కేంద్ర మంత్రులతో మాట్లాడారు, అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం జరగాలని ఆదేశించి ఆ లోపుగానే అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కాబినెట్ మీటింగులో ఉపముఖ్యమంత్రి డా|| రాజయ్యపై అసహనం వ్యక్తం చేశారు, ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టించారు…'! దీని తర్వాత మీడియాను పిలిచి ప్రజల నుద్దేశించి 'అది థర్డ్ క్లాస్ వైరస్. కలరా, మశూచి ల్లాటిది కాదు, అయినా యిక్కడ ఒక్కచోటనేనా ఏడు రాష్ట్రాల్లో వుంది' అని ధైర్యం చెప్పారు. (నలుగురితో చావు పెళ్లితో సమానం అని అనునయించేది యిలాటి సందర్భాల్లోనే కాబోలు, యిక్కడ నాలుగు కంటె మూడు ఎక్కువ!)
ఈ వార్తల వలన కెసియార్ యిమేజి పెరగడం బాగానే వుంది. 'కానీ యీ పనులన్నీ ముఖ్యమంత్రి చేయనేల? ఆరోగ్యశాఖామాత్యులు, ఉపముఖ్యమంత్రి అయిన రాజయ్యగారు ఏం చేస్తున్నారు? ఏమీ చేయటం లేదు కాబట్టే ముఖ్యమైన పనులన్నీ మానుకుని ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది' అన్న భావం ప్రజల్లో కల్పించ లేదా? ఉపముఖ్యమంత్రి పదవి ఆరోవేలు లాటిది, అందుకే ఎవరికీ యివ్వటం లేదు అంటూ సంజీవరెడ్డి దానికి సున్నా చుట్టిన సంగతి తెలంగాణ ఉద్యమంలో పదేపదే ప్రస్తావించారు. ఆ షరతును ఆంధ్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రులు యిద్దరూ ఉల్లంఘించారు. కానీ ఆంధ్రులే ఎక్కువగా ఆ నింద మోశారు. ఇప్పుడు రాజయ్యగారి సంగతి చూస్తే ఆయన పరిస్థితి ఆరో వేలా? ఏడో వేలా? అన్నట్టుంది. 'మీడియాలో చదివి స్వైన్ ఫ్లూ పెద్ద రోగమేమోనని కంగారు పడ్డాను. డాక్టర్లను పిలిచి మాట్లాడితే తెలిసింది, అది వ్యాధి కాదు, వట్టి థర్ట్ క్లాస్ వైరస్ అని..' కెసియార్ చెప్పారు. రాజయ్యగారు స్వయంగా డాక్టరు కాబట్టి వేరే ఎవర్నీ పిలవనక్కరలేకుండానే దాని సంగతేమిటో గ్రహిస్తారు కదా. గ్రహించారు కాబట్టే థర్డ్ క్లాస్ వైరస్ కోసం మన టైము వేస్టెందుకు అనుకున్నారేమో! ఏది ఏమైనా కాబినెట్లో చివాట్లు తిన్నారని, చేతిలో కాగితంపై పిచ్చిగీతలు గీస్తూ కూర్చున్నారన్న వార్తతో ఆయన యిమేజి డామేజి అయిపోయింది.
జవహర్‌లాల్ నెహ్రూ కాబినెట్‌లో తన స్థానం గురించి చెపుతూ 'ఐ యామ్ ఫస్ట్ ఎమాంగ్ యీక్వల్స్' అని వర్ణించుకున్నారు. అందరూ సమానులే. లెక్కవేసినపుడు నా పేరు మొదటగా వస్తుందంతే, అంటూ సహచరులకు సమానస్థానం కల్పించి మాట్లాడారు. తర్వాతి ప్రధానుల్లో కొందరు మాత్రమే తమ సహచరులకు అలాటి గౌరవం యిచ్చారు. రాష్ట్రాలలో, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో అన్నీ ముఖ్యమంత్రుల చేతిలోనే వుండిపోతున్నాయి. లోపలి వ్యవహారం ఎలా వున్నా, పైకి వాళ్ల గురించి తేలికగా మాట్లాడకుండా వుంటే అంతే చాలు. లేకపోతే అధికారులు కూడా వాళ్లను పట్టించుకోవడం మానేస్తారు. కెసియార్ సహచరుల్లో ఎవరికీ విలువ నివ్వటం లేదని అనలేం. కొడుక్కీ, మేనల్లుడికీ బాగానే ప్రాముఖ్యత యిస్తున్నారు. ఇంటిపేరులో నీరు వున్న కారణంగా కాబోలు తన్నీరు హరీశ్‌రావుగారికి వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పనులు అప్పచెప్పారు. కాంట్రాక్టులు వ్యవహారాలు చూస్తూంటే యిది మరో జలయజ్ఞంగా మారుతుందాన్న భయం కలుగుతోంది. అందుకే ఆయనకు అప్పగించారా? ఆర్నెల్లు పోయేసరికి స్పష్టమైన రూపం వస్తుంది. అప్పటికి ఎన్ని చెఱువులు తవ్వారో, ఎన్ని ఆక్రమణలు తొలగించారో లెక్క తేలుతుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు నెలాఖరుకి చెఱువులు ఖాళీ చేయించాల్సి వుంది. భగవంతుడి దయ వలన, ఆ పని టైముకి జరగలేదు. వేసవికైనా జరుగుతుందో లేదో, వేచి చూడాలి.
ఇలా తనూ, కుటుంబసభ్యులు కలిసి మొత్తం కాబినెట్ భారాన్ని మోస్తూంటే బంగారు తెలంగాణ నిర్మాణాన్ని కెసియార్ ఎన్నాళ్లకు పూర్తి చేస్తారు? ఆయనకీ విషయం ఎందుకు తోచటం లేదో తెలియదు. ఎన్నికల హామీలే తట్టెడున్నాయి, అవి చాలనట్లు రోజుకో హామీ యిస్తున్నారు. భూములమ్మి డబ్బు సంపాదిద్దామనుకుంటే అది అంత సులభమైన పనేం కాదు. కేవలం హైదరాబాదు జిల్లాలోనే 3919 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి 1910 కోర్టు కేసులున్నాయట. వీటి విలువ 75 వేల కోట్లుట. ఇవి పరిష్కరిస్తే బోల్డు డబ్బు అని కెసియార్ చెప్తూ వచ్చారు. కానీ పరిష్కారం ఎక్కడవుతోంది? అసలు ఎప్పటికైనా అవుతుందా? క్రమబద్ధీకరణ ద్వారా సంపాదించాలని పెట్టుకున్న లక్ష్యం సుదూరంగా వుంది. గడువు పెంచారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై, కోర్టుల తిరస్కారానికి గురవుతున్నాయి. రిటైర్డ్ ఐయేయస్‌లతో సర్కారు పెట్టుకున్న సలహాబృందాలు ఏం చేస్తున్నాయా అని యిలాటి సందర్భాల్లో అనుమానం వస్తుంది. చేయవలసిన పని ఎంతో వుంది. టీము వర్క్ వుంటేనే కొంత మేరకైనా సాధించవచ్చు. మంత్రివర్గ సహచరులను నిర్లక్ష్యం చేసి, డీమోరలైజ్ చేసి, నోరెత్తనీయకుండా చేస్తే వాళ్లలో నిష్క్రియాపరత్వం పెరుగుతుంది. అప్పుడు బంగారు తెలంగాణ వట్టి నినాదంగానే మిగులుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)