విభజన జరిగిన ఏడాదికి సెక్షన్ 8 గురించి చర్చ, ఆపై రచ్చ జరుగుతున్నాయి. అమలు చేస్తే దీక్ష చేస్తానని కెసియార్ గవర్నరు వద్ద అన్నారట. ఢిల్లీకి వెళ్లి నిరాహార దీక్ష చేస్తామని తెలంగాణ ఉద్యోగసంఘాలంటున్నాయి. ఇదేదో కొత్తగా పెట్టినట్లు యింత హంగామా ఎందుకో అర్థం కావటం లేదు. ఇది విభజన చట్టంలోనే వుంది. ఆ చట్టాన్నే పార్లమెంటులో తెలంగాణ వీరులందరూ పాస్ చేయించుకున్నారు – అత్యంత భీకరమైన పరిస్థితులు సృష్టించి! ఇప్పుడు దానిలో కొంత భాగం పనికి రాదంటే ఒప్పుతుందా? ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు జనాభా నిష్పత్తిలో పంచి, విద్యుత్ మాత్రం గత ఐదేళ్ల వాడకం నిష్పత్తిలో పంచడం ఘోరమే, అయినా జయపాల్ రెడ్డిగారు అలా రాయించారు. టిడిపి తెలంగాణ ఎంపీలు సై అన్నారు, జై కొట్టారు. విభజన తర్వాత చంద్రబాబు యీ విషయంలో గగ్గోలు పెడితే ఎవరు విన్నారు? చట్టంలో వున్నది అమలు చేయాలి కదా అని సుద్దులు చెప్పారు. అదే లాజిక్ సెక్షన్ 8 విషయంలోనూ వర్తిస్తుంది. అసలప్పుడే దీని గురించి కెసియార్‌ను నిలదీశారు కొందరు – గవర్నరుకు విశేషాధికారాలు యిస్తే యిక రాష్ట్రప్రభుత్వం విలువేముంది? ఇతర రాష్ట్రాలలో యిలాటిది లేదు కదా అని. అప్పుడు కెసియార్ 'పదేళ్లు ఉమ్మడి రాజధాని పద్ధతి కూడా యితర రాష్ట్రాలలో లేదు కదా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన రాష్ట్రం ఏర్పడుతున్నపుడు కొన్నిటికి రాజీ పడాల్సిందే' అని చెప్పి అనుచరులను చల్లార్చారు. ఇప్పుడు ఆయన పార్టీయే యితర రాష్ట్రాలతో పోలిక తెచ్చి సెక్షన్ 8 ఒప్పుకోం అంటోంది.
అప్పటి ప్రత్యేక పరిస్థితులేమిటో కెసియార్‌కు తెలుసు. ఆంధ్రులకు వ్యతిరేకంగా ఎన్నో ఎన్నో నినాదాలు. ఆంధ్రులు తీసే సినిమా షూటింగులకు వెళ్లి ఆపేయడాలు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు కొత్త యూనిట్లు పెట్టబోతూ వుంటే బెదిరింపులు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రులను తరిమివేయవచ్చని వాళ్ల యిళ్లు స్థానికులు ఆక్రమించవచ్చునని గల్లీ నాయకుల వూరింపులు, ఆంధ్ర ఉద్యోగులను తరిమికొడితే ఆ ఉద్యోగాలు, ప్రమోషన్లు అన్నీ మనకే నని ఉద్యోగి సంఘాల నాయకుల హామీలు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సైతం యిక్కడ వుండాలంటే కర్రీ పాయింట్లు పెట్టుకుని బతుకు యీడ్వాల్సిందేనన్న సెటైర్లు. ఇలాటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో తమ గతేమిటని ఆంధ్రులు భయపడడం, దాన్ని కేంద్ర నాయకులు గుర్తించక తప్పని పరిస్థితి రావడం జరిగింది. అందుకే సెక్షన్ 8 పెట్టారు. ఏడాది పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలగలేదు కాబట్టి యిక సెక్షన్ 8 అవసరం లేదు, ఎత్తేయవచ్చు అని యిప్పుడు తెరాస నాయకులు అనవచ్చు. ఇప్పటిదాకా యాక్సిడెంటు జరగలేదు కాబట్టి బండికి బ్రేకులు తీసేద్దాం, ఎవరూ ఎత్తుకుపోలేదు కాబట్టి యిన్సూరెన్సు కట్టడం మానేద్దాం అన్నట్టే వుంది యిది. ఈ 'శాంతి' ఎన్నాళ్లో ఎవరికి తెలుసు. తెరాస అధికారంలోకి వచ్చింది కాబట్టి, గొడవలు జరగటం లేదు (?), అదే కాంగ్రెసు బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరచి వుంటే తెరాస ఎన్ని ఆందోళనలు చేపట్టేది? భద్రాచలం ఆర్డినెన్సు పేరు చెప్పుకునే రెండు మూడు నెలలు రాష్ట్రాన్ని స్తంభింపచేసేది. చేతకాని ప్రభుత్వమని, ఆంధ్రులకు అమ్ముడుపోయిందని రచ్చరచ్చ చేసేది. ఇప్పుడు వాళ్లే అధికారంలో వున్నారు కాబట్టి 'రాత్రికి రాత్రి పనులు అయిపోతాయా? 60 ఏళ్ల సమైక్యపాలనలో యీ ప్రాంతాన్ని దుంపనాశనం చేశారు, పునర్నిర్మాణానికి పుష్కరాలు పడతాయి' అని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
ఈ పరిస్థితి ఎంతకాలం వుంటుందో ఎవరు చెప్పగలరు? రాజకీయ పార్టీలు ఎప్పుడెలా చీలతాయో తెలియదు. టిడిపిలో ముసలం పుట్టి పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీయార్‌ను దింపేస్తారని ఎవరైనా వూహించారా? ఎమ్జీయార్, కరుణానిధి కలహించుకుని డిఎంకె విడిపోతుందని కలగన్నారా? కాంగ్రెసు అన్ని సార్లు చీలుతుందని ఎపుడైనా జోస్యం చెప్పారా? తెరాస యిప్పుడున్న రూపంలో రేపు వుంటుందని చెప్పలేం. తొలినుంచీ జండా మోసినవారిని పక్కనబెట్టి యితర పార్టీల్లోంచి వచ్చినవారిని వాటేసుకుంటూ వుంటే దాని ప్రకంపనలు వుండవా? ఇతర నాయకులు కెసియార్ కుటుంబం పెత్తనం ఎంతకాలం సహిస్తారు? కుటుంబంలోనే చీలికలు రావా? ఏదైనా ఎపుడైనా జరగవచ్చు. ఆ రోజు అలా విడిపోయినవారు ఎత్తుకునే పల్లవి ఏమిటి? 'ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రులతో కుమ్మక్కయింది. తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసమే మేము విడిగా వచ్చి పోరాడుతున్నాం, పదవుల కోసం కాదు' అని. ఆంధ్రులకు వ్యతిరేకంగా హింసాత్మకమైన ఆందోళనతోనే వారు ప్రజల దృష్టిని ఆకట్టుకుంటారు. తెలంగాణ వస్తే చాలు ఉద్యోగాలు, పదవులు, పదోన్నతులు, ఆస్తులు ఆకాశం నుంచి వూడిపడతాయని ఆశపడి భంగపడిన వారందరూ వారి వెంట నడుస్తారు. 'ఆంధ్ర పెత్తనం' అనే పదం తెలంగాణ నాయకుల ఉపన్యాసాల్లోంచి నిష్క్రమించడానికి ఒక థాబ్దం చాలుతుందో లేదో! 'ఆంధ్రుల కారణంగా తెలంగాణ వెనకబాటుతనం' అనే నినాదం మృతసంజీవిని. సొంత వైఫల్యం చేత ఏ నాయకుడైనా నీరసించి వుంటే దాన్ని అటక మీదనుంచి దింపి చేతి కందిస్తే చాలు, యిక దూసుకుపోతాడు. 65 ఏళ్లగా నడుస్తున్న కథ యిది. కనీసం యింకో 35 ఏళ్ల ఆయుర్దాయం వుంది దానికి. ఇలాటి పరిస్థితుల్లో ఏడాది పాలన చూసి, సెక్షన్ 8 రక్షణ అక్కరలేదు అనడం తొందరపాటే.
ఏడాదిపాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందా లేదా అన్న విషయం చర్చించేందుకు ముందు సెక్షన్ 8 సబబా, కాదా అన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఏ మాట కా మాట చెప్పాలంటే గవర్నరుకు యిలాటి విశేషాధికారాలు యివ్వడం ఏ మాత్రం అభిలషణీయం కాదు. రాష్ట్రప్రభుత్వం తన పౌరులలో ఒక వర్గాన్ని కాపాడదు, వాళ్ల ప్రాణ, మాన, ఆస్తి నష్టాలు జరుగుతూంటే కిమ్మనకుండా కూర్చుంటుంది అని అనుమానం వ్యక్తం చేసినట్లే! ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వుండే జవాబుదారీ గవర్నరుకు ఎందుకుంటుంది? ఈ రోజు సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నరు చేతిలో అధికారాలు పెట్టాలని ఉద్యమిస్తున్న టిడిపి రేపు నరసింహన్‌ను మార్చి మహారాష్ట్ర గవర్నరుగా వున్న విద్యాసాగరరావును తీసుకుని వచ్చి గవర్నరుగా పెడితే ఏం చేయగలదు? ఈ రోజు గవర్నరు తమ మాట వింటున్నాడన్న ఆనందంలో వున్న తెరాస రేపు మోత్కుపల్లి నరసింహులును గవర్నరును చేసి అక్కడ కూర్చోబెడితే ఏమంటుంది? మనం వ్యక్తుల గురించి కాకుండా వ్యవస్థ గురించి మాట్లాడాలి. గతంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి అంటూ కాంగ్రెసు నాయకుల మధ్య 'పెద్దమనుష్యుల ఒప్పందం', 'ముల్కీ రూల్స్' అంటూ పెట్టి గందరగోళ పరిచినట్లే యిప్పుడు హైదరాబాదులో 'ఆంధ్రుల రక్షణ కోసం' సెక్షన్ 8 అంటూ పెట్టి చికాకులు తెచ్చిపెట్టారు. 'అబ్బే, ఆంధ్రుల రక్షణ కోసం' అంటూ ప్రత్యేకంగా ఎక్కడా లేదు, యితర ప్రాంతాల వారందరికీ కలిపి అది. వారెవ్వరికీ లేని భయం ఆంధ్రుల కెందుకు?' అని తెలంగాణ నాయకులు వాదిస్తున్నారు. నిజమే, ఆంధ్రులకే ఎందుకు భయం వుండాలి? ఎందుకంటే తక్కినవారిని ఎవరినీ సెటిలర్లు అనటం లేదు కాబట్టి! గుజరాతీలు, మార్వాడీలు, ఇరానీయులు.. అంటున్నారు కానీ సెటిలర్లు అనటం లేదు.
తమిళనాడులో తరతరాలుగా స్థిరపడిన తెలుగువారిని తెలుగువాళ్లు అంటారు తప్ప సెటిలర్లు అనరు, కర్ణాటకలో స్థిరపడిన తమిళులనూ అనరు, మహారాష్ట్రలో స్థిరపడిన తెలంగాణ వారినీ అనరు. ఆ పదం తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులకు మాత్రమే ప్రత్యేకంగా వాడుతున్నారు, జర్మన్ జనాభాలో యూదులను ప్రత్యేకంగా పేర్కొన్నట్లు. ఆంధ్ర పదం నిజానికి తెలుగువారందరికీ వర్తిస్తుంది. కానీ గత కొన్నేళ్లగా కోస్తా, సీమ వాళ్లకే దాన్ని వాడుతున్నారు. దాన్ని ఆమోదించి అక్కడ మూలాలున్నవారిని ఆంధ్రులు అనేస్తే పోతుంది. సెటిలర్లు అని ఎందుకనాలి? సెటిలర్లను కడుపులో పెట్టుకుంటాం, కాల్లో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాం.. వంటి నినాదాలు ఎందుకు? అలా హామీ యివ్వడంలోనే బెదరవల్సిన పరిస్థితి వుందని అర్థమవుతోంది కదా. భయపడేవాడికే అభయం యిస్తారు. అందరూ నిర్భయంగా జీవించవలసిన పరిస్థితులు ఏర్పరచవలసిన పాలకులు కొందరికి అభయం యిస్తున్నారంటేనే తెలుస్తోంది వాతావరణం ఎంత లక్షణంగా వుందో!
అందువలన సెక్షన్ 8 ఆంధ్రుల కోసమే అన్న మాట రూఢ్యర్థంలో వాడుతున్నారు. (ఈ పదం అర్థం తెలియనివారి కోసం రాస్తున్నాను – పంకజము అంటే తామరపువ్వు అని తెలుసు. బురదలో పురుగులతో సహా అనేకం పుడతాయి కానీ దానికి రూఢ్యర్థం తామరపువ్వే) తెలంగాణేతరులు అనగానే ఆంధ్రులే గుర్తుకు వస్తున్నారు. అదీ కాక తెలంగాణ పాలకులు తమ రాజకీయప్రత్యర్థి యైన చంద్రబాబును టిడిపి నాయకుడు అనటం లేదు, ఆంధ్రబాబు అని నిందార్థంలో వాడుతున్నారు. టి-టిడిపి వారిని ఆంధ్రభృత్యులు అని నిందిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు పైన నీటిని బిగబడుతున్నా అక్కడ మూలాలున్న తెలంగాణ పౌరులను ఏమీ అనడం లేదు, వెళ్లి మీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నీళ్లు యిప్పించండి అనటం లేదు. కానీ ఆంధ్రులకు మాత్రం అలాటి సవాళ్లు విసురుతున్నారు. ఆంధ్రులపై ప్రస్తుతం వివక్షత పెద్దగా లేదు, కాబట్టి సెక్షన్ 8 అనవసరం అంటున్నవారున్నారు. రేపు కార్పోరేషన్ ఎన్నికలలో ఆంధ్ర ఓటర్లు అధికంగా వున్న చోట తెరాస అభ్యర్థులు ఓడిపోతే అప్పుడు తెరాస నాయకులు ఎలాటి రంకెలు వేస్తారో తెలియదు. అప్పుడు హఠాత్తుగా అవసరం అంటే చట్టాన్ని మారుస్తారా? – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2015)