ఎమ్బీయస్‌:శిల్పాలూ సిగ్గు పడాల్సిందే..

ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్‌) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ  రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్‌ అలా సర్దుకోలేకపోయింది. ఆమె ‘‘మరాఠా ప్రతిష్ఠాన్‌’’…

ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్‌) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ  రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్‌ అలా సర్దుకోలేకపోయింది. ఆమె ‘‘మరాఠా ప్రతిష్ఠాన్‌’’ అనే సంస్థ నడుపుతుంది. ‘‘ఇది మన భారతీయ సంస్కృతి కానే కాదు. ఇళ్లల్లో ఆడవాళ్లు బట్టలు ఆరవేసినపుడు తమ లోదుస్తులు లోపలివైపున ఆరవేస్తారు, పరాయివాళ్లు వాటిని చూడకూడదని. అలాటిది యీ బట్టలషాపువాళ్లు యింత విశృంఖలంగా వాటిని ప్రదర్శనకు పెట్టడమే కాక, ఆ క్రమంలో స్త్రీ దేహంలో అంగాంగాన్ని చూపడమేమిటి? అయినా ఆ బమ్మలు ఎవరికోసం? నాతో సహా చాలామంది ఆడవాళ్లు వాటికేసి కన్నెత్తి కూడా చూడరు. తమ సైజు ఏమిటో ముందే తెలుసు కాబట్టి, లోపలికి వెళ్లి రంగు, గుడ్డ నాణ్యత, ధర – యిలాటివి దృష్టిలో పెట్టుకుని అవే చూపమని సేల్స్‌గర్ల్‌ని అడుగుతారు. అంటే యీ బమ్మల్ని పనీపాటా లేని మగాళ్ల కోసం పెట్టారన్నమాట. అవి చూసి వాళ్లల్లో వికారమైన ఆలోచనలు రావడం ఖాయం. ఒకసారి వచ్చాక అవి ఏ విధంగా రూపు దిద్దుకుంటాయో ఊహించలేం. అంతా వారివారి పెంపకంపై, సంస్కారంపై ఆధారపడి వుంటుంది.’’ అందామె. నటీమణి గుల్‌ పనాగ్‌ ఆ విషయంలో ఏకీభవించింది – ‘‘వాటి కేసి నా భర్త చూసే చూపులో, నా డ్రైవర్‌ చూసే చూపులో తేడా వుంటుంది. ఎందుకంటే మన మగవాళ్లు మహిళలను సాంప్రదాయకమైన దుస్తుల్లో చూడడానికే అలవాటు పడ్డారు. ఆధునికమైన దుస్తులు వేసుకున్నవారు కూడా కాస్త కాస్త కనబరుస్తారు. మరి యీ బమ్మలో! అవి దాచేది అంగుళాలలో వుంటుంది.’’  

ఈ వాదనల్లో బలం వుందని బృహత్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌కు తోచింది. మేనిక్విన్స్‌ను నిషేధించాలని 227 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక దానితో ఫ్యాషన్‌ డిజైనర్లు, యాడ్‌ కంపెనీల వాళ్లు రీతూపై విరుచుకుపడ్డారు – ‘సినిమాల్లో, ఇంటర్నెట్‌లో నగ్నవనితలు కనబడటం లేదా?’ అంటూ. ‘‘అలాటివి కావాలనుకున్న వాళ్లే వాటిని చూస్తున్నారు. కానీ యిదేమిటి? రోడ్డు మీద వెళ్లేవాడు కూడా వీటిని తప్పించుకోలేకపోతున్నాడు.’’ అని రీతూ వాదిస్తున్నారు. ఆమె బిజెపి పార్టీకి చెందినదైనా ముస్లిము మహిళాబృందాలు ఆమెకు అండగా నిలిచాయి. అంతేకాదు, రీతూ యింటికి దగ్గర్లో వున్న బట్టలషాపుల వాళ్లు ఎందుకైనా మంచిదని వాళ్ల షాపుల్లో వున్న అమ్మాయిల బమ్మలకు టీ-షర్టులు తొడిగారు! అన్ని నగరాల్లోనూ యిలాటి మార్పులు వస్తే నిర్భయ కేసులు కాస్త తగ్గే అవకాశం తప్పకుండా వుంటుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌